‘జావళీ’ ప్రక్రియ తెలుగు సాహిత్యంలో విశిష్టమయినదీ, విస్తృతమైనది కూడా. దక్షిణ భారత దేశమంతటా తన ప్రాభవాన్ని విస్తరింపజేసి, సంగీత సాహిత్యాత్మకంగా సాగిన తెలుగు వారి సాహిత్య హృదయాన్ని సమ్యక్ మేళనం గావించిన అపురూప ప్రక్రియ.
కేవలం శబ్ద ప్రాధాన్యం, రాగ ప్రాధాన్యం గల రచన గానే కాక, భావ ప్రాధాన్యానికి, నాయికా నాయకుల అంతరంగ ఆవిష్కరణలకి, శృంగార రస పరిపుష్టికీ ఆలవాలమై, సంగీత సాహిత్య రంగాల్ని శోభాకరం చేసింది.
పైకి శృంగారంలా కనిపించినా, వేదాంత పరమైన లక్ష్య సాధనతో మహత్ప్రయోజనాన్ని ఆకాంక్షించే దిశగా ఆవిర్భవించింది. ఎన్నో గొప్ప కావ్యాలకు కూడా తెలియని మన సాహిత్యంలో జావళీ, జావళీ కర్తల వివరాల్ని చక్కగా ముద్రల రూపంలో కలిగిన జావళీలు సాహిత్యంలో జావళీల విషయాలలో వివాదాలకు తెర దించింది.
వివిధ కాలాలలో క్రమ పరిణామ వికాసాన్ని పొంది, నాయకుడు, నాయిక, చెలి ప్రధాన పాత్రల్ని భూమికలుగా చేసుకొని, నాటి సమాజం లోని స్త్రీ-పురుష సంబంధాన్ని స్థితి గతుల్ని, సామాజిక నేపథ్యంలో విశదం చేసింది. సజీవ మానవ స్వరూప స్వభావాల్ని చక్కగా ఆవిష్కరించి చూపింది.
ప్రాచీన కాలం లోనూ, ఆధునిక కాలం లోనూ వెలసిన జావళీలు కాలానుగుణ్యంగా మార్పును పొందాయి. ప్రాచీన కాలంలో సాంప్రదాయ సాహిత్యానికి గౌరవాన్ని కల్పిస్తూ, కవి సమయాన్ని పాటిస్తూ, వర్ణనల్ని తనలో పొందు పారుచుకోవడమే కాక, ఆధునిక కాలంలో సంభవించిన ఆంగ్ల భాషా ప్రవేశంతో ఏర్పడిన కాలానుగుణ పరిణామ పరిస్థితుల్లో ఆంగ్ల భాషా పదాల్ని కూడా తనలో పొదువుకొంది.
సంగీత ప్రాధాన్యంగా తెలుగు, తమిళ సినీ రంగాల్ని సైతం ప్రభావితం చేసింది. ఆయా సందర్భాలకు తగిన విధంగా మనోరంజకమైన చక్కని గీతాలు ఆవిర్భవించడానికి జావళీ ఉత్ప్రేరకంగా పని చేసింది. సంగీత సాహిత్యాలలో జనించే, శాబ్దిక ఆర్థిక పరమైన జనానందాన్ని సాధించే వారధిలా నిలిచిన జావళీ సంగీత రంగానికే కాక, సామాజిక రంగానికి కూడా మహత్ప్రయోజనకారి అయ్యింది.
సంగీత సాహిత్య రంగాలలో సమాన ప్రతిపత్తి కలిగిన జావళీలపై ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలను సమగ్రంగా పరిశీలించగా ‘జావళీ’ ప్రక్రియ స్వరూప స్వభావాల విషయంలో ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
కానీ కన్నడ జావళీలను పరిశీలించి విశేషంగా కృషి చేసిన శ్రీ కె.వి. ఆచారి గారు జావళీలపై ఈ కింది అభిప్రాయాలు ప్రకటించారు. వీరి అభిప్రాయాలను పరిశీలిస్తే అవి జావళీలకు, తెలుగుకు గల సంబంధాన్ని ఊహించడానికి దోహదం చేస్తాయి.
“జావళీలు తెలుగు నుండి కన్నడం లోనికి వచ్చి ఉంటాయనీ,
తెలుగు జావళీలు ముందే వచ్చాయని కొందరి విద్వాంసుల అభిప్రాయం.”
“వడి తెలుగు నుంచి 17వ శతాబ్దంలో లోకి వచ్చినట్లే జావళీలు తెలుగు నుంచి కన్నడం లోకి వచ్చి ఉంటాయి.”
“వడి-వళి ప్రధానంగా గల పాటలే ఈ జావళీలు, అందులో కూడా ముఖ్యమైన ఛందస్సుకు సంబంధించినదా అన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.”
“దేవదాసీలు అంగ భోగ సేవలో దేవుని లక్ష్యంగా చేసి పాడి ఉండవచ్చు.”
సంగీత ప్రపంచంలో ఇప్పటి వరకు జరీన పరిశోధనలలో అందరూ ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం ఏమిటంటే జావళీ పుట్టుక్క 19వ్స్ శతాబ్దంలోనే జరిగిందని. కానీ దీని పుట్టుక ఎలా 19వ శతాబ్దిలో హఠాత్తుగా సంభవిస్తుంది. అలా పుట్టి, పుట్టిన వెంటనే ఎలా వచ్చిందో అలాగే ఆశ్చర్యం అయిందంటే నమ్మశక్యం కాదు.
ఇప్పటి వరకు నా పరిశీలనలో నాకు లభించింత వరకూ ఉన్న జావళీలను పరిశీలించగా క్రీ. శ. 1450 ప్రాంతంలో లభించిన వల్లభరాయ ముద్ర గల జావళీ ఆధారంగానే జావళీ పుట్టుక 15వ శతాబ్దిగా నిర్ధారింపవచ్చు.
బేహాగ్ – ఆది
పదుగురిలో నను, మదనుని కేళికి
గదియ రమ్మనెదవు, పదరా నే
వడ్డారముననీ, వడ్డము జేసిన
చెడ్డది మా యత్త, చెడ్డదిరా నే
వల్లభుడొచ్చు శ్రీ వల్లభరాయ నీ
పిల్ల చేష్టలిందు చెల్లవురా నే
వినుకొండ వల్లభ రాయలు క్రీడాభిరామకర్త. ఇతడు క్రీ.శ. 1425-1500 ప్రాంతంలో జీవించినవాడు. వల్లభరాయ ముద్రతో గల ఆ జావళీ వల్లభ రాయలు రచన గానీ, వల్లభ రాయలకు అంతికమైనదై కానీ అయి ఉండవచ్చు. ఈ ఒక్క జావళీ లభించింది. అంటే ఆ కాలంలో అనేక జావళీలను కవులు రచించి ఉండవచ్చు. కానీ మన అదృష్టమో, దురదృష్టమో గానీ, మిగిలినవేవీ దొరకకుండా ఈ ఒక్క జావళీ మాత్రమే లభించి, జావళీ పుట్టుకకు ప్రాచీనాధారంగా నిలిచింది. తెలుగు సాహిత్యంలో ఆనాటి అనేక రచనలకు పట్టిన గతే దీనికీ పట్టటం వలన జావళీలు అదృశ్యం అయి ఉండవచ్చు.
వల్లభ రాయల ముద్ర తోనే కాక, తిరుమల రాయలకి అంకితంగా రచించబడిన ఇంకొక జావళీ కూడా లభించింది.
కమాచి – ఆది
రమణిరో సామి రాతి రేమననే ఓ
కమల నయనరొ నా కాంతుడు జూచి
తా సుముఖుడై వరియించెనే ఓ
కర్పూర వీటికా గంధ పుష్పాదుల
నర్పణ శాయ గైకొనెనే ఓ
తిరుమల దేవరాయ కరివీరకాదీయ
కరుణతో జూచి గైకొనెనే ఓ
ఈ జావళీ క్రీ.శ. 1565 సం॥ తరువాతదని చెప్పవచ్చు.
ఆ పిమ్మట 1623-1672 ప్రాంతాల్లో వసించిన క్షేత్రయ్య రచించిన ఒక జావళీ లభిస్తోంది.
సురటి – ఏక
ప॥ మాయలాడి బోధనలచే మైమరచితి వేమో
మాటలాడ రావదేమిరా యో సామి
అ॥ ప॥ కాయజుని బారికి తాళగ లేరా
కౌగిటి జేర్చి నను గారవించరా
న్యాయమటరా నీకిది తగదురా సరస గుణ
చ.1 ॥ కలకాలము నన్ను గాసి
పెట్టుటకురా కాంత నేచుడ
కార్యము గాదుర చెలువుడ వని
నిను నెర నమ్మినందు కిక
చ.2.॥ సరి వారిలో నను చౌక
సేయకురా చాల నమ్మితి రతి
కేళి కూడరా వరదుడ
మువ్వపురి నిలయుడ చనువున
పై రచనలో “మువ్వపురి నిలయుడ” అనే ప్రయోగాన్ని బట్టి ఈ ముద్ర క్షేత్రయ్యదే నని చెప్పవచ్చు. దీని ఆధారంగా క్షేత్రయ్య కూడా జావళీలు రచించాడనే విషయం సుస్పష్టం.
“రాజగోపాల” ముద్ర చరణాంతంలో గల ఒక జావళీలో ఉన్న ముద్రని పరిశీలిస్తే అది విజయ రాఘవ నాయకుడు రచించినట్లు తెలుస్తోంది. దక్షిణాంధ్ర యుగానికి చెందిన ఈ కవి జావళీ ప్రక్రియను ఆదరించాడనడానికి ఈ కింద పేర్కొన్న జావళీ సాక్ష్యంగా నిలుస్తోంది.
యమన్ – దేశాది
సమయము గాదుర సామి లేచి పోరా
సామి లేచి పోరా జాగువ చేసేవురా
చేయి పట్టి నా సిగ్గు చెరచకురా సామి
వేయి విధముల నే వేడుకున్న వినవు
అత్తింటి కోడలని ఆలోచింపక
చిత్తజు కేళి కాయత్తమై యున్నావు
ఇంటి వారందరు నిట్టట్టు తిరిగేరు
కనిటికి తెలియకుండ కదిలి పోరాయిని
రాజగోపాల రట్టు సేయుటేల
సాజముగ ఒక సారి వత్తువు గాని
“ఇది సమయము గాదురా సామి లేచి పోరా…
రాజగోపాల రట్టు సేయకురా
సహజముగా ఒకసారి వత్తువు గాని”
ఈ ముద్ర విజయ రాఘవ నాయకుని రచనలకు సంబంధించినది.
ఈ ముద్రతో లభించిన జావళీలు 15 వరకూ ఉన్నాయి. క్షేత్రయ్య విజయ రాఘవ నాయకుని ఆస్థానంలో ఉండడం వల్ల క్షేత్రయ్య చేత ప్రభావితుడై ప్రభువు కూడా జావళీలు రచించి ఉంటాడని ఊహించవచ్చు.
దేవుని ముద్రతో వారి వారి ఊళ్ళలో గల దైవతాలపై వర్ణనాత్మకంగా జావళీలను రాసినవారు ఎవరో, ఏ ప్రాంతం వారో, ఏ శతాబ్దపు వారో కూడా స్పష్టంగా తెలియడం లేదు. పేర్లు అసలే తెలియటం లేదు. నేను సేకరించినంత వరకూ జావళీల పుట్టుక క్రీ.శ. 1450 ప్రాంతమనీ అంటే 15వ శతాబ్దమనీ చెప్పవచ్చు.
ప్రస్తుతం లభిస్తున్న ఆధారాల ఆధారంగా జావళీ పుట్టుకను ఈ విధంగా నిర్ధారించవచ్చు. అయితే సాహిత్యాధ్యయనంలో ఇంకా గూఢంగా జరగవలసిన, పరిశోధించవలసిన అంశాలెన్నో ఉంటాయి. ఆ ప్రకారంగానే ఇంకా భావి పరిశోధనలలో క్రీ.శ. 1450 ప్రాంతానికంటే పూర్వం కూడా జావళీల స్థితి గతుల్ని పరిశోధించవలసిన అవసరం ఉంది. ఆధారాలయితే ప్రస్తుతానికి లభించడం లేదు. నూతనమైన పరిశోధనలలో ఏమైనా నూతనాంశాలు బహిర్గతం కావడానికి ఇంతవరకూ నే గాలించిన ఈ పరిశోధన అందుకు సహకరించ గలదని నా ఆకాంక్ష.
కానీ ఇంకా ముందు కాలానికే జావళీ వ్యాప్తిలో ఉండవచ్చు. భావి పరిశోధకులు ఈ దిశగా ప్రయత్నించి, సత్ఫలితాల్ని సాధించి, జావళీ చరిత్రను, ఔన్నత్యాన్ని ఇంకా ఇనుమడించ జేస్తారని నేను భావిస్తున్నాను. ఇంకా లోతుగా పరిశోధన జరిగితే జావళీ ఆవిర్భావం నిర్ధారించడమే కాక సాహిత్య చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన విశేషాంశాలు వెలుగు లోనికి రావడం సాధ్యమవుతుంది.
జావళీ ఏ భాషా పదం:
డాక్టర్ రాఘవన్ జావళీ గురించి ప్రస్తావిస్తూ – ‘జావళీ’ అనే పదం ఏ భాషా పదమో, ఏ భాష సృష్టో అని విచారించి అద్భుతమైన ఈ జావళీ మాటని గురించి ఆశ్చర్యాన్నీ, ఆవేదననీ కూడా వ్యక్తపరిచారు.
సంగీత సాహిత్యవేత్త లందరూ ఏకగ్రీవంగా ‘జావళీ’ కన్నడ మాటగా నిర్ధారించడం పూర్తిగా భావ్యం కాదన్నారు. కన్నడ మాటగా “జావడి” రూపాంతరంగా చెప్పడంలో Lewd Poetry అనే అర్థం గల “జావడీ”ని సమర్థిస్తూ అశ్లీల సాహిత్యమనీ, అశ్లీల శృంగారమనీ, రాత్రి పాడే రాగాలు గలవనీ, వేశ్యల కోసం రాసినవనీ, ఉదాత్తత లేనివనీ రకరకాలుగా చాలా మంది భావించారు. తెలుగులో ఉన్న నిఘంటువులను (వ్యుత్పత్తి కోశంతో సహా) పరిశీలించగా అవి శృంగార గీతం అనే అర్థాన్నే ఇచ్చాయి కానీ నిర్వచనం ఇవ్వలేదు.
గత పరిశోధనలను పరిశీలించగా గజల్స్ నుండి అభివృద్ధి పరిచారనీ, మహారాష్ట్రుల లావళీ వలెనే అభినయ యోగ్యమైందనీ, సంస్కృతంలో గల చపల (chapala) కన్నడంలో గల “జావళ” శబ్దంతోనూ జావళీని పొందుపరిచారనీ, రసికులు “జాహోడే” అని జావళీలు విన్నవారు అని ఉంటారనీ, అవే జావడీలు, జావళీలుగా మారి ఉంటాయనీ, కొందరు తమ అభిప్రాయాల్ని ప్రకటించారు.
మరాఠీలో జావళీ (JavaLi) అంటే ప్రేమ భావం చూపడం అనే అర్థం ఉందని, అవే జావళీలు అనీ, జవ అంటే వేగం కాబట్టి జావళీలు వేగవంతమైనవని చెప్పడం వల్ల, జవం కలిగి జావళీలు అయ్యాయని; అరబ్బీ పదం జలాలి (Jalali) నుండి జావళీ పుట్టి వుండవచ్చుననీ; జాగడి (Jagadi), జాగలి (Jagali), జావడి (Javadi), జావళీ రూపాంతరాలని, తెలుగులో జావడ దేశి పదమనీ, గీతంలో సగ భాగమనీ, జావడం అంటే పక్షి, గుర్రం, చిన్న పక్షి అనే అర్థాలుండడంలో జావళీ మిరుమిట్లు గొలుపుతూ గుర్రం లాగా వేగవంతంగా ఉండే ప్రక్రియ అనీ, ఉర్దూ కవాలి (Qawali) నుండి జావళీ పుట్టి ఉండవచ్చనీ రకరకాలుగా ‘జావళీ’ మాటను విరిచి, ముక్కలు చేసి అన్ని భాషలలో పొందుపరచే ప్రయత్నం చేశారు.
చివరకు కన్నడం వారికి పట్టం గట్టి జావడి కన్నడ భాషా పదమని పూర్వం నిర్ద్థారించారు.
కానీ ‘జావళీ’ అచ్చ తెనుగు మాటగా రూఢి అయ్యిందనడానికి ఆధారాలున్నాయి.
జావళీ తెనుగు భాషా పదమే. సి.పి.బ్రౌన్ తెనుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశాడు. ఆనాటి పండితుల సహాయ సహకారాలతో ఆయన నిఘంటు నిర్మాణం కూడా చేశారు. ఆయన తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో “జావళి” తెలుగు మాటగా స్మష్టంగా చెప్పారు. మొదటి తెలుగు నిఘంటువు “ఆంధ్ర దీపిక” లో కూడా అలాగే ఉంది. మన తెలుగు నిఘంటువులలో కూడా దేశి విశేషమే అని ఉంది.
జావళీలలో శృంగారం – తుచ్ఛమా? భక్తా?
ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలలో జావళీ శృంగార గీతమని నిర్ధారించారు. అందులో వర్ణితమైన శృంగారం నీచమా? తుచ్ఛమా? ఉదాత్తమా? భక్తా? అనే విషయంపై ఎన్నో తర్జన భర్జనలు జరిగాయి.
చివరకు జావళీలు తుచ్ఛ శృంగారం కలవనీ, ఐహిక సుఖాల కోసం రాసినవనీ, అశ్లీల సాహిత్యం గలవనీ, కేవలం వేశ్యల కోసం రాసిన గీతాలనీ, దేవుని అడ్డం పెట్టుకుని ముద్రలలో దేవుడి పేర్లు రచయితలు వాడుకున్నారనీ, భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
మధుర భక్తి భావన జావళీలలో గలదని కొందరు సూచనా ప్రాయంగా అన్నప్పటికీ దాన్ని సమర్ధించే ధైర్యం లేక పూర్వులు పోయిన మార్గాన్నే వాళ్ళు అనుసరించారు.
కానీ ఈ జావళీ రచనా కాలం నాటి ఆధారాలను పరిశీలిస్తే, పూర్తిగా భక్తి భావన కలిగినవని చెప్పవచ్చు.
సంగీతం భగవంతుడు. అట్టి సంగీతంలో బంధించిన సాహిత్యం భగవత్పరం కాక వేశ్యల పరంగా ఎలా అవుతుంది? ఆనాడు అచ్చయిన పుస్తకాల లోని వాక్యాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
- “శ్రీ కృష్ణ లీలా ప్రతిపాదకములు”
- “సంగీత సాహిత్యా విద్యా విశారదులు పెక్కండ్రుచే రచింపబడినవి”
- “స్త్రీల కత్యంతోపయోగంబుగ” ప్రాచీన కవి పుంగవులచే రచియింప బడినవి.
- “మిక్కిలి చక్కని ముద్దు లొలుకు పలుకులతో మంచి రసవంతముతో మృదు మధుర శైలితో జావళీలు”
- “They are much sung by both Nautch girls and all – especially women of the higher classes in domestic life”
- The words of Javalis are often very beautiful and those upon the loves of Krishna and Radha
ఈ వాక్యాలే దీనికి తార్కాణం. జావళీల రచనా కాలం నాటి ఆధారాలు ప్రమాణం కానీ, కేవలం రచన లోని సాహిత్యాన్ని బట్టి, సంగీతం లోని రాగాల్ని బట్టి, కెవల శృంగార అసహ్యకర రచనలుగా నిర్ధారించడం అత్యంత అసంజమసం.
జావళీలు అంతర్భక్తి, బహిః శృంగారం కలిగిన మధుర భక్తి భావన కలిగినవి, విప్రలంభ శృంగారాన్ని రచయితలు జావళీలలో వాడుకున్నారు. ఈనాడు నిర్ధారించినట్లుగా జావళీలలో ఉన్నది తుచ్ఛ, నీచ శృంగారం అనుటలో ఎంత మాత్రమూ ఔచిత్యం లేదు. ‘శృంగారం అర్ధ నారీశ్వరం’, రస రాజం, భగవత్ స్వరూపమైన రసం శృంగారం. దీని విషయంలో తుచ్ఛ, నీచాలకు ఆస్కారం లేదని స్పష్టంగా చెప్పవచ్చు.
జావళీ తెనుగు మాట కావడం చేత, తెలుగులో అప్పటికే అధిక ప్రాచుర్యంలో ఉన్న దేశీ విశేషాన్ని దేశీ ఛందస్సు రగడలను రచయితలు వారి వారి జావళీలలో వాడుకున్నారు.
కవులు తెలుగు సాహిత్యంలో రగడలను దైవ ప్రార్థనకో, ప్రకృతి వర్ణనలో వాడుకోవడం వలన, శ్రావ్యత ముఖ్య లక్షణం కలిగి ఉన్నాయి. అలాగే శ్రావ్యంగా ఉన్న, దైవ భక్తి పరమైన సాహిత్యం కలిగినవే జావళీలని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చును.
జావళీలు – రాగ తాళాలు:
ఈనాటి సంగీత వేత్తలు, పరిశోధకులు రాగ తాళాల విషయాలలో కూడా పొరబడ్డారు. ఎవరికి తోచింది వారు రాసేవారు. జావడి అంటే అశ్లీల సాహిత్యం కాబట్టి రసికులు ఆనంద పరవశులు అవ్వాలి కాబట్టి, ఆకర్షించే దేశ్య రాగాలైన ఫరజ్, చెంజురుటి, కాఫి, బేహాగ్, హమీర్ కల్యాణి లలో జావళీ లున్నాయనీ, హుస్సేని, సారంగ, మాంజి, దేశి కాఫి, దేశి తోడి, ఆహిరి, యమునా కల్యాణిలలో ఉన్నాయనీ, వసంత, దర్బార్, కేదార గౌళ, కల్యాణి, ముఖారిలలో ఉన్నాయని, అఠాణా, భైరవి, సురటి మొదలైన రాగాలలో జావళీ లున్నప్పటికీ, జావళీ కారులు కొన్ని రాగాలలో రాగచ్ఛాయలని అందం కోసం మార్చి వేయడమే కాకుండా, రాగాల నియమాలను సైతం ఉల్లంఘించారనే అపభావన ప్రబలంగా ఉంది.
వీటికి ఆధారాలు లేవు. లేని ఆధారాలతో ఊహించడం చేయకూడదు. కొన్ని రాగాలలో రాగచ్ఛాయలను కీర్తనలలో ప్రయోగించలేదని భావించిన వారు కొందరు ఉన్నారు. జావళీలలోని సాహిత్యం విలువని సంగీత విమర్శకులు జావళీని సాహిత్య ప్రక్రియ అనీ, సంగీతంతో అంతగా పరిచయం లేని సాహితీ కారులు అది సంగీత ప్రక్రియే అనీ జావళీ విషయంలో శ్రద్ధాసక్తులు కాలేక పోవడం జరిగింది.
జావళీలలోని రాగ తాళాలను పరిశీలించడం కోసం నేను జావళీ సేకరణ ప్రారంభించగా, నాకు లభించిన 471 జావళీలలో 63 రాగాలు లభించాయి. వాటిలో కదంబం, చామరం వంటి అరుదైన రాగాలు కూడా చోటు చేసుకున్నాయి.
జావళీలు మధ్యమ కాలంలో ఉంటాయనీ, సాధారణంగా ఆది, రూపకం, చాపు తాళాలలో ఉంటాయనీ, ఆది తాళంలో జావళీలు అసలే లేవనీ, కొన్ని వేగ గమనంతో, కొన్ని మంద గమనంతో, మధ్య గమనంతో, మధ్యమ కాల నడకతో, ఏక దేశాది తాళాలలో, దురిత కాలంలో ఉంటాయని రకరకాలుగా నిర్ధారణ చేశారు.
కాని, నా పరిశోధనలో 471 జావళీలలో 19 రకాల తాళాలు చోటు చేసుకున్నట్లు గుర్తించాను. జంపె, ధ్రువ, త్రిపుట, జుల్వా తాళాలు కూడా చోటు చేసుకున్నాయి. కర్ణాటక సంగీతంలో గల అన్ని తాళాలలో జావళీలున్నాయి. వై. సత్యనారాయణ గారు మ్యూజిక్ అకాడెమీ జర్నల్ లో ఆది తాళంలో జావళీలు లేవని చెప్పినప్పటికీ, ఆది తాళంలో 177 జావళీలు లభ్యమవడం విశేషం. రూపక తాళంలో ఎక్కువ జావళీలున్నాయని చెప్పినప్పటికీ 94 మాత్రమే ఉన్నాయి. లేదన్న ఆది తాళంలో కంటే, ఉన్నాయన్న రూపక తాళంలోనే తక్కువ ఉండడం గమనించ వలసిన విషయం.
జావళీ నాయిక:
జావళీ నాయిక తెలుగింటి ఆడపడుచు. మూర్తీభవించిన స్త్రీమూర్తి. తన విరహాన్ని చెలితో వెళ్ళబోసుకుంటుంది. నాయకుడైన భగవంతునితో మొర పెట్టుకుంటుంది. తన మనోవేదన తెలుపుకుంటుంది. నాయకుణ్ణి నిలదీస్తుంది, రమ్మంటుంది, అసహ్యించుకుని పొమ్మంటుంది. సవతి యింటిలో ఉన్న పతికి చీటి రాసి పంపిస్తుంది. అక్కడ ఏమైందోనని తహతహ లాడిపోతూ, ఆసక్తిగా ఎదురు చూసి విసిగి వేసారి పలు రకాలుగా తన హావభావాలతో ప్రకటిస్తూ, భగవంతుని ఎదుట నిలచిన ఉదాత్త భక్తుడే ఈ జావళీ నాయిక. జావళీ రచయితలందరూ పురుషులే అవడం ఇక్కడ విశేషం. స్త్రీ మనోభావాన్ని జావళీలలో పురుషులు వ్యక్తీకరించ గలగడం విడ్డూరంగా అనిపించి నప్పటికీ భక్తులందరూ స్త్రీలై పోయారు. ఆ పరమ పురుషుని పొందు కోసం తపించారు. రాకపోతే బాధ పడ్డారు. ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులోనే ఆనందాన్ని అనుభవించారు. ఆ ఆనందం అనుభవైక వేద్యం, రసప్లావితం.
భగవదైక్యత కోసం ఆరాటపడ్డారు. “మేరగాదు లేచిరారా” అని కూడా అన్నారు. అటువంటి ఉదాత్త భక్తుడే జావళీ నాయిక అనడంలో ఎమత మాత్రమూ సందేహం లేదు. నాయకుడు కేవలం సాక్షాత్తు పరమ పురుషుడైన ఆ భగవంతుడే. స్త్రీ సహజ లక్షణాలని సంతరించుకున్న వివిధావస్థలలో తమ స్థితిని, దైన్యాన్ని, వెళ్ళబోసుకున్న స్త్రీయైన భక్తుడే జావళీలలో కనిపిస్తాడు. ప్రతి పదం లోనూ పురుషునిపై స్త్రీ పెంచుకునే అవ్యాజమైన అనురక్తే జావళీకర్తలు భగవంతునిపై చూపారు.
జావళీ నాయిక, కావ్య నాయికా లక్షణాలన్నీ సంతరించుకున్నదైనా సందర్భాన్ని బట్టి ఒక్కోసారి ఖండిత అయ్యింది. మరోసారి విప్రలబ్ధ అయ్యింది. విరహోత్కంఠిత అయ్యింది. తెలుగు సాహిత్యంలో అష్టవిధ నాయికల నిరూపణ జరిగినప్పటికీ స్త్రీ సహజ భావాలు అన్నీ మూర్తీభవించిన స్త్రీ రూపమైన జావళీ నాయిక, (భక్తుడు) తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్త్థానాన్ని పొందే అర్హత కలిగి వుంది.
జావళీ రచయితలు ఎవరు?
అయిదు దశాబ్దాలుగా ఏకధాటిన యావత్ దక్షిణ భారత దేశాన్నే కాక అందర్నీ, విదేశీయుల్ని సైతం ఆకర్షించి అలరించిన ఈ జావళీలు మధుర భక్తి భావనలో దేవునిపై రచింపబడి, దేవదాసీలచే గర్భాలయంలో ప్రదర్శించబడ్డాయి. ఆ దేవదాసీ విధానం నిర్మూలన జరిగిన తరువాత జావళీ రచనలు కూడా అదృశ్యమయ్యాయి.
ఆ రచనలన్నీ భగవత్ ప్రేరితాలుగానే రచింపబడ్డాయి. జావళీ రచయిత లందరూ మహాకవి బిరుదాంకితు లయిన పండితులు, కావ్యాలు రచించి పేరుబడ్డ సాహిత్య వేత్తలు, రాజులు, జమీందార్లు – స్వయంగా జావళీలను రచించి, పోషించి, ఆదరించి సంగీత సాహిత్య రంగాలకు అశేష సేవలందించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయారు.
ఈ జావళీ రచయితలు శ్రీకాకుళం, వాడపల్లి, (పశ్చిమ గోదావరి జిల్లా) తోట్లవల్లూరు, (కృష్ణా జిల్లా) ఏలూరు, చిట్టివలస, కొదంగల్లు, దుర్గాడ, దంపూరు, ఏలూరుపాడు అగ్రహారం, వెలగదురు, టంగుటూరు, చోడవరం, గొబ్బూరు, పేరాల చీరాల, ఆత్మకూరు, తాటకేశ్వరం, మొదలగు తెలుగు ప్రాంతాలకు చెందిన వారే కావడంతో తెలుగు నాట ప్రసిద్ధంగా ఉన్న ఆలయాలలో గల అర్చామ్మూర్తుల మీద జావళీ రచనల్ని సాగించారు. అంతేకాక, తెలుగు ప్రాంతాంలో గల అనేక విశేషాల్ని ఈ సందర్భంగా గ్రంథస్థం గావించి ఘనత వహించారు.
ఆయా దైవతాలపై జావళీలు రచించి, విజయనగరం, బొబ్బిలి, ఆత్మకూరు సంస్థానాలలో మన్నన లందిన యశో భూషణులు కూడా జావళీ కర్తలలో ఉన్నారు. అంతే కాక మైసూరు, ఉదక మండలాల ప్రభువుల కోరికపై అచ్చట కూడా జావళీ రచనను పరిచయం చేసినవారు కూడా తెలుగువారే. ఈ విధంగా తెలుగు జావళీ ప్రాశస్త్యాన్ని ఆంధ్రేతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి గావించారు.
నవరత్న జావళీలలో (నవ భక్తి మార్గాలలో) దశావతార జావళీలు రచించిన వారూ తెలుగు వారే. జావళీ రచయితలందరూ తెలుగు వారే. ఇతర ప్రాంతాల వారు రాసినా వారు కూడా తెలుగు వారో, లేకపోతే బహు భాషా కోవిదులూ, ప్రతిభా సంపన్నులూ అయిన స్వాతి తిరునాళ్ వంటి వారో అయి ఉంటారు.
జావళీ తెలుగు ప్రక్రియ. రచయితలు తెలుగు వారే. తెలుగు ప్రాంతపు వాసులే. జావళీ తెలుగు దేశంలో పుట్టి, తెలుగు దేశంలో విస్తరించి, మైసూరులో ప్రవేశించి, దక్షిణ ప్రాంతం అంతా వ్యాపించిందనుటలో ఏ సందేహమూ లేదు.
జావళీలు తెలుగు లోనే ఎందుకు వచ్చాయి? అరవంలో లేవు. కన్నడంలో తరువాత కాలంలో ప్రవేశించాయి. మళయాళంలో కూడా లేవు అనే ప్రశ్నలు ఉదయించక మానవు.
కారణం చూస్తే ఆ భాషలకంటే సంగీతానికి అనుగుణంగా పాడడానికి అనువైన భాష తెలుగు భాషే. తెలుగు భాషలో తెనుగు వారి నోట తియ్యగా అజంతమైన భాషలో జావళీలు వచ్చిన వనడమో ఎంత మాత్రం వింత లేదు. సందేహం కూడా లేదు. భాషా సౌందర్యం, సంగీత మాధుర్యం రెండూ కలసి జావళీ రచనలకు మరింత శోభను చేకూర్చాయి.
పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ తెలుగు వాడైన త్యాగరాజు శిష్యుడు. తెలుగులో ఎన్నో కృతులను రచింపగల శక్తివంతుడు. తెలుగు సాహిత్య పరిజ్ఞానం గల సాహితీ మూర్తి అయిన ఆయన జావళీలు రాయడంలో ఆశ్చర్యం లేదు. సంగీత సాహిత్యాల మేలు కలయిక జావళీని అభివర్ణించ వచ్చు. అటువంటి పరిజ్ఞానం కలిగిన వారు రచించినవే జావళీలు. అందుకే జావళీ రచనకు అంతటి మాధుర్యం.
ఒక్క సంగీత జ్ఞానం చాలదు. అలాగే ఒక్క సాహిత్య జ్ఞానం కూడా చాలదు. ఏ ప్రాంతాల్లో జావళీలు వచ్చినా తెలుగు వారే రచించారు. అమెరికాలో ఉన్నా, ఇంగ్లండులో ఉన్నా, దేశంలో ఈ ప్రాంతాల్లో ఉన్నా, తెలుగు వాడు తెలుగు వాడే. జావళీ రచయిత ధర్మపురి సుబ్బారావు తెలుగువాడు. తెలుగు ప్రత్యేకత తెలుగుదే. అలాగే జావళీ ప్రత్యేకత జావళీదే.
ఆణిముత్యాల్లాంటి జావళీలు సంగీత సాహిత్య పరిపుష్టి గల వారి రచనలుగా ఆవిర్భవించడం, తెలుగు సంగీతానికి తగిన భాష కావడం వల్ల, ఏ ప్రాంతాల్లో ఎవరు రాసినా తెలుగులో గల అందాల్ని, సుగసుల్ని, నుడికారాల్ని, తెలుగు భాషకే సొంతమైన విశిష్టమైన పలుకుబడుల్ని, జాతీయాల్ని చూపించగలిగారు.
జావళీలు తమిళ, మలయాళ భాషల్లో లేవు. తెలుగు జావళీలే తమిళులు, మలయాళీలు భక్తితో పాడుకుంటారు.
జావళీ భాష:
ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో, జావళీలలో ప్రయోగించిన భాష చిల్లర శృంగారపు మాటలని, తేలికైన భాష అనీ, వ్యావహారిక భాషలో, అసభ్య పదజాలంలో ఉన్నవనీ, ఏవేవో అభిప్రాయాలు జావళీ భాషపై ఉన్నాయి.
నా పరిశోధనలో నేను గ్రహించిన అంశాల్ని బట్టి చూస్తే జావళీ సాహిత్యం ఉదాత్తమైనది. సంగీతం వచ్చిన విద్వాంసులకి సాహిత్య పరిజ్ఞానం తక్కువ. అవసరం లేదు కూడా. స్వరపరిచింది పాడడమే వారి ధ్యేయం కానీ, సాహిత్యం గురించి ఆలోచన వారికి అవసరం లేదు. ఇటు సాహితీవేత్తలు అదేదో తమ విషయం కాదని కేవలం సంగీతం వారిదనే భావనతో దాని విషయం ఆలోచించలేదు. అదేదో శృంగారపు పాటలుగా భావించడం వల్ల తెలిసిన కొద్ది మంది కూడా అది చర్చనీయాంశం కాదని తీసి పారేశారు.
జావళీలలో ప్రయోగించిన పదాలన్నీ మృదు మధురమైన ముద్దు లొలుకు తెలుగు మాటలే. తత్సమ ప్రయోగాలు చాలా తక్కువ. సొగసులీనే పద ప్రయోగాలు, సామెతలూ కోకొల్లలు. తెలుగు నుడికారం, తెనుగువారు ఆనాడు అలంకరించుకునే ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, గృహోపకరణాలు వంటి ఎన్నో పదాలు తెలుగు జావళీలలో అడుగడుగున దర్శనమిస్తాయి. మానవ సజీవ వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి.
“య”కార ప్రారంభం గల జావళీలు, “ఏల” ప్రయోగం “యాల” అనడంలో గల ఔచిత్యం, అనుప్రాసలు, అంత్యప్రాసలు, కావ్య శోభ కలిగించే వృత్యనుప్రాసాది అలంకారాలు – ఇవన్నీ పరిశీలిస్తే, తెలుగు భాష ఔన్నత్యం, సంప్రదాయ కవిత్వానుశీలనం సుస్పష్టంగా గోచరిస్తాయి. ఆనాటి అచ్చ తెనుగు మాటలు, వాడుక భాషా ప్రయోగాలు ఎన్నో జావళీలలో చోటు చేసుకొన్నాయి.
తెలుగూ ప్రాంతాన్ని ఏ ప్రభువు పరిపాలించినా తెలుగు భాషాభివృద్ధికి దోహదం చేసి ప్రోత్సహించారు. తెలుగు జావళీ కూడా రాజాదరణ పొందింది. ప్రభువులు, జమీందారులు కట్టించిన దేవాలయాలలో జావళీ రచయితలు, సంగీతవేత్తలు, నృత్యవేత్తలు ఎందరో చోటు చేసుకున్నారు.
జావళీలు భగవంతునిపై రచించిన భకి గీతాలు కాబట్టి ఏయే గ్రామాలలో, పట్టణాలలో ఏయే దైవతాలున్నా ఆ దేవుని అంకితంగా ఆ ముద్రతో జావళీలు రచించారు. ఏ ప్రాంతంలో జావళీలు లభ్యమైనా వారెప్పటివారో, ఏ ప్రాంతం వారో, వారివారి వివరాల కోసం ప్రయత్నిస్తే – జావళీలలో గల తెలుగు సాహిత్యం, దాని ఔన్నత్యం ఏమిటో సాహితీ వేత్తలకు, తెలుగు వారికి అర్థం అవుతుంది.
ప్రబంధాలపై, కావ్యాలపై సంస్కృత భాషా ప్రభావం పడినప్పటికీ, జావళీ మాత్రం యితర భాషా ప్రభావం లేని అచ్చమైన తెలుగు సంప్రదాయంతో తెలుగు తనముట్టిపడే విధంగా ప్రత్యేక వర్ణనలు కలిగి, అచ్చమైన తెలుగు పదజాలంతో ప్రత్యేకత ఉట్టిపడే ప్రక్రియ. ఈ జావళీ భాషా సాహిత్యం పరిశోధనకి విస్తృత పరిధి కలది కూడా.
జావళీ కన్నడ పదం కాదు, తెలుగు పదం. 19వ శతాబ్ది దాని పుట్టుక కాదు. 15వ శతాబ్ది నుండీ జావళీలు ఉన్నాయనీ, ఇందులోని శృంగారం ఇంద్రియ లోలత్వం కాదనీ, మధుర భక్తి భావమనీ భావించాలి. ఇంతటి సాహిత్య పరిపుష్టి కలిగిన జావళీ సంగీత సాహిత్యాల మేలు కలయిక అనీ, మోక్ష మార్గాన్ని సూచించే దివ్యమయిన ఆశయం కలదని, ఈ సందర్భంగా నిస్సందేహంగా నిర్ధారించవచ్చు.
అరవవారూ, కన్నడంవారూ “జావళీ” గురించి పరిశోధనలు జరిపారు. ఇంకా జరుపుతున్నారు కూడా. కన్నడంలో జావళీలపై పరిశోధన చేసిన శ్రీ కె.వి.ఆచార్ గారు తెనుగు నుండి జావళీలు కన్నడం లోకి వచ్చి వుండవచ్చనే సదభిప్రాయం నాకు చేయూత నిచ్చింది. ఏదైనా ప్రత్యేక ఛందో బద్ధమైన వేమో అన్న ఆయన మాటలు కూడా నా పరిశోధనకు దోహదం చేశాయి. నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపి ఈ పరిశోధానాంశాన్ని నిర్వహించ వచ్చనే హార్దిక ధైర్యాన్ని అందించాయి.
జావళీ ఒకరు రాసింది కాదు. ఒక సంవత్సరానికి చెందినది కాదు. కొన్ని వేల మంది ఎన్నో లెక్క లేనన్ని జావళీలు ఏయే ప్రాంతాలలో రాశారో తెలీదు. ప్రయత్నించి వెలికి తీసి పరిశోధనలోకి తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష.
తెలుగు వారిచే రచింపబడిన తెలుగులో గల అచ్చ తెనుగు పదజాలంతో, భాషా సౌందర్యం గల ఈ జావళీల పునరుద్ధరణ బాధ్యత తెలుగు వారిదే. తెలుగు సాహితీ వేత్తలదే.