7.1 తెలుగు జావళీలు – వర్ణనా సౌందర్యం (Part2)

Continued from Part 1

కేదార – త్రిపుట

ప॥ రమ్మనవే సుముఖాన రాయబారము లేవే

అ. ప.॥ కమ్మువిల్తుని గన్న చక్కని మువ్వ గోపాలుని

చ. 1. సొగసు జేసుక వచ్చి సుదతు లందరు జూడ
వగలు చేసి పతల వాకిట నిలిచి
తెగనాడే విధమేమో దినదినము క్రొత్తలాయ
చిగురు బోణిరో వచ్చి యెంత సేపాయెనో

చ. 2. ఇరవంద నిన్న మా యింటి వరకు వచ్చి
తిరుగ వేంచేసెనట సరి ప్రొద్దు వేళ
విరిబోణి యెవ్వరో వేళ గాదనిరట
తరుణిరో మేమంత దొరలమా బాగాదు

చ. 3. రానురో తానెన్నడు రాలేదో పోలేదో
కాముకేళిని నన్ను గలయలేదో
ఏమే నేనందాక యెదురుగా రావలెనో
మా మువ్వ గోపాలుడు మనసు శోధించెనేమో

కాంభోజి – త్రిపుట

ప॥ మేరగాదు రమ్మనవే నా సామిని

అ. ప.॥ మోర తోపు సేయక మువ్వ గోపాల సామిని

చ. 1. అలిగే వారలు లేరో అంతలోనే సమ్మతించి
కలిసే వారు లేరో కలికిరో యిపుడు
చలపట్టి యిందు రాడు చాల మ్రొక్కిన వినడు
వల రాజు బారి కోర్వ వశము గాదో యమ్మ

చ. 2. నెనరున నేనొక్కటంటే నెలత యందే నెపము చేసి
అనరాని మాటలాడి అలయించెనే
వనిత మోహాంబుధిలో మునిగి యెట్లోర్చు దాన
తనవంటి సామికిది తగవు కాదే కొమ్మా

చ. 3. మమతతో జిన్ననాడే మచ్చిక చేసి నన్ను
సమరతుల నేలినట్టి చనువుగ నను
గమకించి మోవి పంటగంటి జేసితినని
రమణి! మువ్వ గోపాలుడు రాక పరాకు జేసెనే

ఇంతగా ప్రాధేయ పడిన నాయికలో కినుక మితిమీరి నాయకునితో తెగతెంపులు చేసుకోవాలనే ఆలోచనను కూడా జావళీకర్తలు వర్ణించారు. నాయకుణ్ణి రావద్దంటోంది. చెలికి చెప్తోంది. ఆ మ్మాటలు, ఆ అలకలు, ఆ రోజులో అన్నీ పోయాయట. “అది యొక్క యుగము వేరే జన్మిపుడు” అంటూ తన విముఖతను కూడా ప్రదర్శిస్తోంది.

కాంభోజి – త్రిపుట

ప॥ వదరక పోపోవే వాదేల వచ్చీని వద్ద రావద్దనవే

అ. ప.॥ అది యొక్క యుగము వేరే జన్మ మిపుడు
అతడెవ్వరో నేనెవ్వరో ఓ చెలియా

చ.1. నిచ్చ నిచ్చలుడే వచ్చొని రేపైన వచ్చీననుచు మదిలో
నిచ్చగాబలు వేడి నిట్టూర్పుల చేత యింతిరో పెదవు తిండి
హెచ్చైన వెన్నెల చిచ్చుల రాత్రులు
యెన్నెన్నో గడిపితినిక నేట మాటలే

చ.2. వలపుకాడితే కదా వచ్చు ననుచు తెరువులు చూచి వేసారితి
వెల తెరిచి యలసితి నిలువరాని ప్రేమ నెమ్మిది నడచుకొంటి
కలకంఠ పిక నాదములు మించు మధు మాసములు
గడపితే వట్టి ముచ్చటలికనేతే

చ. 3. భామరో శకునము లడిగితి మువ్వ గోపాలుడు వచ్చుననుచు
కామించి నాథుని గలయు చెలిల చూచి కరగి చింత నొందితి
రామరామ యీ మేనితో వాని మేమి చూడవలెనా
మొదటి పొందే శాలు వదరక పోపోదే

“హెచ్చైన వెన్నెల చిచ్చు రాత్రులు” – ఈ పద ప్రయోగాన్ని చూడండి. శబ్దాలంకార ప్రీతితో ప్పాటుగా, అచ్చ తెనుగు పదాల్ని అందంగా ప్రయోగించడం ద్వారా రాత్రిని తియ్యనైన బాధాకరమైనదిగా ఆవిష్కరించారు. అలాగే కలకంఠ పిక నాదాలు, మధు మాసాలు, విరహాన్ని వర్ణించే సామగ్రిగా జావళీ కర్తల భావాలకి అందంగా సమకూరాయి.

అలాగే ఈ జావళీని చూడండి –

కాంభోజి – త్రిపుట

ప॥ ఇంత నా పొరుగింటనే తావు లేనట్లె

అ.ప.॥ ఇంతనా పొరుగింటనే ఇంత విజయ రాఘవేంద్రుని మింత

చ.1. ప్రొద్దు పోదు గాబోలు నమ్మ దాని
వద్ద నున్న సుద్దులే అందు చేత
నిద్దుర పట్టక నేనుంటా దానికి
ముద్దు మీద ముద్దులే అది
సద్దు వినలేక సఖియ యింట నుండి

చ. 2. వారిజ ముఖి ననావలె నంట
కేరడంపు నవ్వులె దానింట క
వారి కుంకుమ కస్తూరి గాక మితి
మేర లేని పువ్వులే
సారెకు నా యింటి వాసన లిందు వచ్చితె
ఓరువ జాలక యువిద యింటనుండిత

చ. 3. భావజు కేళి నా పడతి కూడే వేళ
పావురంపు పలుకులే
ఆ వేళ విడువుమని నమ్మిక లిమ్మని
ఆమెకెంత కులుకులే
నా వద్దకి రాడో నాతో మాటాడడో
విజయ రాఘవుడెల మీతో నుండేది

“కేరడంపు నవ్వులు”, “మేర లేని పువ్వులు”, “పావురంపు పలుకులు” ఇటువంటి కొత్త కొత్త పద చిత్రాలు కవిత్వానికి కొంగ్రొత్త తావిని తెచ్చి పెట్టాయి.

నాయిక పరిపరి విధాలుగా నాయకుని ప్రాధేయ పడింది. విరహాన్ని అనుభవించింది. చెలితో రాయబారాన్ని కూడా పంపించింది. ప్రాకృతికమైన అంశాల్ని చూసి ఎంతగానో బాధ పడింది. చివరకు నాయకుడు రాడనే నిర్ధారణకు వచ్చింది.

ఘంటారవ – ఆది

ప॥ ఈ మాట వలన ఫలమిక నేమి కద్దు

అ. ప॥ భామరో చాలు మువ గోపాలు పొందే మనకు వద్దు

చ. 1. వామాక్షిరో! వాడీడకు వచ్చే మనసు లేదు
రామ వాడు రాదలచితే రానిచ్చేది కాదు
ఏమో నాటి కాయా ఫల మింక బని లేదు
నా మేలు వానిపై నింక నాటి యండగ బోతు

చ. 2. వనజాక్షిరో! వాని కొరకై దిన దిన మీ పోరు
కని విని మీరెందరైన గాదనగ లేరు
చెనకి వానితో నను మోడి చేసుకొమ్మనేరు
చనువు లేని చోట యింత చలమెట్ల యీడేరు

చ. 3. ఎంత లాలించి కూడిన హితవు మాట నున్న
వింత మువ్వ గోపాలుని విధములు నేవిన్న
అంతరంగము శోధించి ఊలసిత నేవిన్న
రంతు సేయక చిత్తము రాయి చేసుకున్న

అంటూ ఆత్మ శోధన చేసుకొని నాయిక మనసును రాయి చేసుకుందట. ఎంత చక్కని తెలుగు నుడికారం. కోరుకున్నది దొరకనప్పుడు, విహ్వలమైన బాధను భరించ లేనపుడు, గతి లేక భరించే స్థితిని వర్ణించడానికి కవి ప్రయోగించిన అద్భుత నుడికారమిది.

నాయిక నోము పండి నాయకుడు వస్తే ఇలా అంటోంది.

మోహన – చాపు

ప॥ ఇంక నిన్ను బోనిత్తునా – యిభరాజ వరదా
శుక వాణి చేత నీ సుద్దు లెల్ల విన్నట్లాయె

చ. 1. నవ్వులంట యున్నావేమొ
నా పద్దు చూడు మీసారి
పువ్వు బోడుల చేత
రవ్వ సయించమాన

చ. 2. జవ్వన మెల్ల నీ పాలు చేసి
చాల నమ్మ యున్నందు
కెవ్వతి తోనో కూడి వచ్చి యిపుడు
లేదని బొంకేవు

చ. 3. పన్నుగ మువ్వ గోపాల
బాసలచ్చి నన్ను గూడి
వన్నెలాడికే లోనైన
వగలెల్ల విన్నార నేడు

యవ్వనాన్ని మొత్తం నాయకునికే అర్పించడానికి సిద్ధంగా ఉన్న నాయిక ఇంక నాయకుణ్ణి అన్యకాంత పాలు ఎలా చేస్తుంది! అని పర్ణించడంలో నాయికకు నాయకునిపై గల సమాగమ వాంఛ, దొరికిన అదృష్టాన్ని, యోగాన్ని చేజార్చు కోరాదన్న వివేకం అన్నీ ఈ వర్ణనలో స్పష్టమవుతున్నాయి.

భాషా లాలిత్యంతో పాటు, భావ లాలిత్యానికి జావళీకర్తలు పెద్ద పీట వేశారు. హృదయ రంజకమైన వర్ణనల్ని ఇంపు సొంపారు పద జాలంతో, రమ్యమైన భావాలతో అందంగా వర్ణించారు. జావళీకర్తల స్వీయానుభవాలు గానీ, వారి జీవన విధానాలు గానీ, జావళీలలో ప్రతిఫలిస్తుంటాయి.

క్షేత్రయ్య తాను అర్థాంగిగా భావించుకొనే అతని ప్రేయసి బహిరంగంగా అతనితో ఏకం కాని రోజుల్లో కలయిక తామసమైనందువల్ల, ఉభయులకూ కలిగిన మనో వ్యధను చక్కగా అక్షర బద్ధం గావించాడు. ఇందులో పురుషుని విరహాన్ని సఖి ప్రేయసికి వివరిస్తోంది. ఇందులోని భావనలు ఎంత లాలిత్యంతో అలరారుతున్నాయో చూడండి.

ధన్యాసి – చాపు

ప॥ ఇంతిరో వరదునికి నీపై నెంత మోహమే
సంతతంబని వెత జూడ జాలక యిందు వచ్చితిని

చ. 1. చెక్కిట చేయి చేర్చుకొనెను
చిరు నవ్వు నవ్వుకొనెను
అక్కట నే దలచినట్లే నైరాదనెను
మక్కువ మును చేసిన చెలిమి
మరపు రాదాయనెను
చక్కని ఈ చెలిని గూడని
జన్మమేటి జన్మమనెను

చ. 2. పడతి యుండుండి నేనేమి
పాపము జేసితి ననెను
తడవు నిన్నెడ బాసి
తాళ లేననెను
నడువ నోరాడదనెను
నొసట చేయించుకొనెను
అడిగితె మీరేమైన
నార్చేరో తీర్చేరో యనెను

చ. 3. పలవరించుచు మా మువ్వ
గోపాలుడైన వరదుడు
నళినాక్షి! యానాటి వింత
నడుచునో యనెను
తలచి యసురుసురు మనెను
దైవమిట్ల చేసెననెను
వలపనే పాపము పగ
వారికైన గారాదనెను (2)

ఎంత చక్కని భావం. తెలుగు భాషలోని మాధుర్యాన్నంతా ఇక్కడ నిక్షిప్తం చేశాడా అనిపిస్తుంది. తెలుగు పలుకుబడుల ప్రయోగం భావానికి అందం తెచ్చింది. లలిత లలిత పదాలు శబ్ద సౌకుమార్యాన్ని తెచ్చిపెట్టాయి.

నడువ నోరాడక పోవడం, పలవరించడం, యసు రుసురు మనడం, దైవ మిట్లా చేశాడని బాధ పడడం, దీనికి కారణం పూర్వ జన్మలలో చేసిన పాపమేనని చింతించడం వంటి నాయకుని చేష్టలు, హావ భావ విన్యాసాలు అతని మనో వ్యధను తెలియ జేస్తున్నాయి.

అడిగితె మీరేమైన నార్చేరో తీర్చేరో యనడంలో ఎంత అందం వచ్చిందో మాటల్లో చెప్పడానికి వీలు కాదు. అది తెలుగు భాషలోఉన్న అందం. పలుకుబడులలో సహజంగా అద్దిన సొగసు. ఆ సొగసుని ఎంతో అందంగా ఈ ప్రయోగం నేటికీ జన వ్యవహారంలో వ్యాప్తి లోనే ఉంది. ఇటువంటిదే ఇంకో జావళీ చూడండి.

కల్యాణి – మఠ్య

ప॥ నిన్ను నే మరతునా ఓ చెలియా

అ.ప॥ నిన్ను నే సొమ్ముగ జేసి వేంకట
నాథ రారాయనిన జాణవు

చ. 1. పొలతిరో నీ గుణ మరయ వలసి అలుక జేసి కన్నెర్ర జేసితె
పలుకక యూరకుండి నపుడె పణుతురో జేరి
కిలకిల నవ్వుచు సారెను చక్కిలి గింత లిడుచు నన్ను
తరుణి గుబ్బల రొమ్మున గుమ్మి దక్కించు కొన్న చలపాదిని

చ. 2 మొదల తరితీపు సేయ మాయ నిదుర దెచ్చున పవ్వళించితే
అది తెలిసి నీవు నా కెమ్మోవి ఆన వచ్చితే
పెదవులు రెండు గట్టిగ బట్టి వదన మిట్టట్టు ద్రిప్పనీయక
గదిమి యదిమి మోవి యాని విదలించి వేసిన హొంతకారివి

చ. 3. వెలయు మువ్వ గోపాలుడైన వేంకటేశ గోప భావమల
నలయక పదునారు వేల గూడి ఆవయిన గానిమ్మని
కలయ వేళ నేమో కొన్ను కథల చేత జాగు చేసి
సాలయన రతుల గూడి నన్ను జూడర నా మార్గమనిన జాణవు

ఈ జావళీలో కూడా భాషా సౌందర్యం, భావ సౌందర్యానికి మెరుగు దిద్దింది.

స్వామి నామాన్నే పలు మార్లు పలికేలా రచించడమే కాక, ఈ జావళీలో రకారాన్ని అనేక సార్లు ప్రయోగించడం కనిపిస్తుంది. సకల లోకాలనూ తన రమ్య గుణ పరంపరలతో అలరించి లోకాభిరాము డయిన రామ కీర్తన కనిపిస్తుంది.

యమునా కల్యాణి – దేశాది

ప॥ అది నీపై మరులు కొన్నదిరా

చ. 1. రామ రఘు రామే అభిరామ రామ
రామ నీ సమముని కానగలేరా

చ. 2. దాతలలో నెరదాతవౌ శ్రీ
ధర్మపురీశ తామస మేలనురా

సావేరి – చాపు

ప॥ ఎక్కడ తాళుదునే యేమని దూరుదునే

అ. ప॥ మ్రొక్కిన నాడు కేగిలీడు
మువ్వ గోపాలుడో చెలియ

చ. 1. దయ గోరింతైన లేదాయె
వట్టి తచ్చనలే ఘనమాయ
ప్రియముతో నను జూడడాయ
ప్రేమతో చేపట్టడా వచ్చో చెలియ

చ. 2. బతిమాలిన రాడాయ నన్ను
పగవాడై యల కంతుడేయ
హితవని నన్నేలడాయ
యెంతటి మాయయో చెలియ

చ. 3. కూడియున్నదే వెగటాయ
నేను విడెమిచ్చిన నీల్లుడాయ
మోడిచేసి మువ్వ గోపాలుడు
నా మోహ మెన్నడాయెనో చెలియ

అన్నమాచార్యుని జావళీలు:

తెలుగు సంకీర్తనా వాఙ్మయాన్ని సుసంపన్నం చేసి, పద కవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు సాయించిన వేలాది కీర్తనల్లో శృంగార పరమైన కీర్తనలూ, ఆధ్యామిక కీర్తనలూ ఉన్నాయి. ఈ శృంగార కీర్తనలలో నాయికా నాయకుల మధ్య శృంగారాన్ని అన్నమయ్య మధుర భక్తి హేతువుగా రచించాడు. శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ, ప్రకృతికి పురుషునికి ఉండే సంబంధాన్ని జీవాత్మ పరమాత్మలకు ఆపాదించి రసరమ్యమయిన కీర్తనల్ని రచించాడు.

ప్రతి కీర్తన లోనూ చివరి చరణంలో వేంకటేశ విభుని పేరున ముద్రా రూపాత్మకమైన రచన గావించడం అన్నమయ్య కీర్తనల్లో విశేషం. ఈ సంకీర్తనలలో కొన్నింటిని విరహ ప్రాధాన్యాన్ని నాయికా నాయకుల సమాగమం కోసం చెలి చేసే ప్రయత్నాలు, అనునయాలు, బుజ్జగింపులూ అన్నీ మనకు ఇక్కడ సాక్షాత్కరిస్తాయి.

ఆహిరి – ?

ప॥ అపుడేమనె నేమనుమను
తపమే విరహ తాపమనె

చ. 1. పవనజ ఏమనెనె పడతి మరేమనె
అవనిజ నిను నేమనుమనెను
రవి కులేంద్ర భారము ప్రాణంబనె
ఇవల నెట్లు ధరియించే ననె

చ. 2. యింకా యేమనె యింతి మరేమనె
కొంకక యేమని కొసరు మనె
బొంకుల దేహము పోదిది వేగనె
చింక వేట యిటు చేసెననె

చ. 3. నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మను కులేశ ప్రేమవు మన కూటమి
ఘన వేంకట గిరి గంటిననె (3)

నాయికతో చెలులు పరస్పరం నాయకుని గురించి చేసిన సంభాషణల్ని అన్నమయ్య హృద్యంగా ఆవిష్కరించారు.

అలాగే శైలీ విన్యాసంతో, మాటల సోయగాలలో అలరారే ఈ జావళీని చూడండి.

కేదారగౌళ – ?

ప॥ ఏమి చెలియా యేలాగే
వేమారును వెల్లి వెరిసీ (బ్రేమ)

చ. 1. తోడితేదొకో తొయ్యలి వాని
దోడితేదొకో తొయ్యలి
వాడడీ జిత్తమిదె వనితరొ మై
గాడి మదనుని కమ్మ విరులు

చ. 2. తానే రాజుకో దైవమా వాడు
తానే రాజుకో దైవమా
నేనోప నిలువంగ నింకను
నానేరువుల నానదు నా మనసూ

చ. 3. వీడే గదవే వేంకటేశుడూ వీడే
వీడే గదవే వేంకటేశుడూ
నాడే నమ్మించే నన్నును
నేడే కౌగిట నెలకొనె నాకు (4)

చక్కని అంత్య ప్రాసనల నడకతో అందమొప్పే ఈ సంకీర్తనలో భాషా సౌందర్యమే కాదు, నాయిక నాయకుని కోసం సిద్ధం చేసిన మదన సామగ్రిని, విరహావస్థనూ ఎంత చక్కగా రూపమిచ్చాడో చూడండి.

నాదనామక్రియ – ?

ప॥ మన్నించి నన్నేలుకోర మచ్చిక తోడ
యిన్నిటా జాణడవు నన్నిట్టె యీడ

చ. 1. మక్కువతో నీకు గొంటి మరులు
వెక్కసమై రాలీ గొప్పు విరులు
కక్కసంచీ మరునంపగరులు
యిక్కువ జేయు చాచరయివెకుచ గిరులు

చ. 2. పొదలెను మన లోని పొందులు
సదరాన నదరీ నీ సందులు
మదమెత్తించీ వీడెల మందులు
పెదవి పైనివె నీకు పెర తేని విందులు

చ. 3. ముందరనె మొక్కె నీకు మొక్కులు
అంది నీకు నా కూటమి నవె చొక్కులు
యిందరిలో గూడితివి యిట్టి శ్రీ వేంకటేశ
సందడించీ బాదముల సరసపు తొక్కులు (5)

నెక్కెసమై రాలీ గొప్పు విరులు, మొందరనె మొక్కె నీకు మొక్కులు వంటి చరణ పాదాల లోని రామణీయకత పాత్రను సజీవంగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.

తెలుగులో వెలసిన గేయ రూపాత్మకమైన సంకీర్తన వాఙ్మయానికి ఆద్యుడె కాకం తాళ్ళపాక అన్నమాచార్యులు సంకీర్తనకు లక్షణాన్ని, లక్ష్యాన్ని చూపించిన ఘనుడు.

చక్కని భాషను జన స్రవంతిలో నుండి యథాతథంగా స్వీకరించి, ప్రాచీన కవితా సంప్రదాయాన్ని అనుసరిస్తూనే, గేయ రూపాత్మకంగా సంగీత ప్రాధాన్యాన్ని ఇనుమడింప జేసిన ప్రతిభాశాలి.

ఈ సంకీర్తనను చూడండి. ప్రాస స్థానాన్ని ఎంత చక్కగా పాటించాడో! అలా పాటించడం వల్ల రచనకు ఎంతో అందం వస్తుంది. శాబ్దిక రామణీయకతతో కూడిన చక్కని భావాలు ఈ రచనను అందల మెక్కిస్తాయి.

హిందోళ – ?

ప॥ రమ్మనగా దనతో నే రానంటినా
చిమ్ముచు నింత ప్రియము చెప్పనేలె నాకు

చ. 1. వెల్ల విరి దన మాట విననైతినా నేను
చెల్లబో నాకేల సేవ సేసీనె తాను
యెల్ల వారి దానేలీ నెవ్వరి బోలుదు నేను
బల్లిదుడు నాకేల బాతిపడీ దానూ

చ. 2. చెప్పినట్లెల్లా నేను సేయకుండే దాననా
అప్పటి లేక లేటికి నంపీనె తాను
కప్పురపు పడిగల కాంతలు గాచుకుండవా
విప్పుచు నాకు గానేల వేగించేనె తానూ

చ. 3. గక్కున దాడూడగాను కాదు గూడ దంటినా
ముక్కు మోవ సాని లేల మొక్కినె తాను
యెక్కువ శ్రీ వెంకటేశుడెనసెదా నన్ను నిట్టి
పెక్కు సత్కలతో ననె పెద్ద దేసీ దాను

అన్నమయ్య సంభాషణల్ని సడపడంలో ఎంతో చాతుర్యం కలవాడు. ఉదాహరణకు –

శంకరాభరణం – ?

ప॥ తానెట్ల నున్నాడో తరుణి వినిపించవే
కానక నిను గన్న నతని గన్నట్లు నాయనే

చ. 1. కొంత వడి దన పేరు కోరి నాలుక దలతునే
కొంత వడి దన సుద్దులు కొమ్మలచే విందునే
కొంత వడి తానున్న కొలువు చిత్తరువు చూతం
కొంత యీరీతి బొద్దు గడువుదునే నేను

చ. 2. మది నీర్కవేళ దన మాట దలపోతునే
కదిసి యొక వేళ దన్ను గల లోన గందునే
పదములనె వొక వేళ యెదురు నడతునే దనకు
దుదనిట్ల దినదినము దొబ్బిదునే నేను

చ. 3. నగినములు చూచుచు నే జరుపుదునే వాడ గడియ
వగల దన దూరి లేఖలు వ్రాతు గొంత దడవు
ఏగి నింతలో గూడె శ్రీ వేంకటేశ్వరుడు
మగిది యల్లాడనపుడు మలగుపయి నిపుడూ (6)

సమాజాన్ని దర్శించి, సహజంగా పల్లె పడుచులు మాట్లాడుకునే తీరు, వారి అభినయాలు, బెట్టు చేయడాలు, కల్లా కపటం లేకుండా మాట్లాడడం, వారి హావభావ విన్యాసాలు, వారి వేష భాషలు, అలంకారాలు వంటి వాటిని యథాతథంగా అక్షరబద్ధం గావించిన కవితా దార్శినికుడు అన్నమయ్య.

“చెలి చింతాలత విలి చిక్కులాయ జీరలాయ” అంటూ స్వామిని స్వాగతిస్తున్నాడు.

లలిత – ?

ప॥ విచ్చేయవయ్య నీవు వేగమె యిందటనైన
తచ్చి యిన్నియును సరిదాకె గదవయ్యా

చ. 1. యింటి మనో రథములు యెంచరాదు పంచరాదు
కాంతుడ నీ కురులు లెక్కకు రానట్టు
పొంత నాకె తలపోత బుట్టిన విరహములు
వింతగా నీ శిరసున వెళ్ళె గదవయ్యా

చ. 2. చెలి చింతాలత విలి చిక్కులాయ జీరలాయ
కెలన రేకలు మైగరలినట్టు
అలరి యాకె మదనానలపు బొగలెల్లాను
మలికి నీ మేన జుట్టుకొనె గదవయ్యా

చ. 3. నతికరములు నీ సతు రతుల వెనగె
రతి నీ చూపులు మేన రానైనట్టు
యితవై శ్రీ వేంకటేశ యిన్నిట మీ యిద్దరికీ
సతమైన వలపులు జట్లాయనయ్యా (7)


లలిత – ?

ప॥ పోయినదెల్లా బొల్లు పూచిన దొక్కటె కాక
కాయజు కేళికి నింకగ దియ రమ్మనవే

చ. 1. అడిగి రావె విభుడెందుకే మనీనో
యెడయని దాస నీకిచ్చినాడు
నుడుగులు దప్పినాను నోము ఫలము దప్పదు
తడని యింతటి నైన దగ్గరి రమ్మనవే

చ. 2. పిలిచి రాగదె తన బిరుదెట్లు చెల్లీనో
పిలుచు మేనాహి నాకు బెట్టినాడు
వెలయ దినగనదె వేమైన దీపవును
తలగక యింకనైన దగ్గరి రమ్మనవే

చ. 3. యిచ్చి రావె యీ విడెము యిన్నిటా మెచ్చితినని
కొచ్చిన రతుల నన్ను గూడె నేడు
తచ్చిన పక్వాన నంటు తరువ దరువ వెన్న
యిచ్చట శ్రీ వేంకటేశునిట్టి రమ్మనవే (8)

  1. పోయినదెల్లా బొల్లు పూచిన దొక్కటె కాక
  2. నుడుగులు దప్పినాను నోము ఫలము దప్పదు
  3. వెలయ దినగనదె వేమైన దీపవు
  4. తచ్చిన పక్వాన నంటు తరువ దరువ వెన్న

ఈ నాలిగూ నాలుగు పాదాలలో చక్కగా భావానికి తగినట్లుగా అమరిపోయాయి. ఈ నాలుగు చక్కని సామెతలు. నాడు లోకంలో వ్యవహారంలో ఉండడం వల్లనే అన్నమయ్య ప్రయోగించాడు.

సామంతం – ?

ప॥ ఏమని భావింతు నిన్ను నెంతని సంతోషించు
శ్రీమంతుడు నన్ను దిద్దే చేతో యిది

చ. 1. కాంతుడనే నెంతాడినా గక్క దలవు నీవు
యెంత రాతి గుండె వాడవేమి చెప్పేది
శాంతుడవో గట్టు వాయి జాణ తనమో యిట్టి
మంతు కెక్కించే నా మీది మన్ననో యిది

చ. 2. దిట్టనై నేజంక్కిచితే తెమల వేయిటా నీవు
యెట్టి చలపాది వాడవేమి చెప్పేది
గుట్టు నీకింత గలదో గుణము చండిపడెనో
గట్టిగా నన్నీడేర్చో కరుణో యిది

చ. 3. బిగ్గెనే గాగలించితే బెగడ వేమిటా నీవు
యెగ్గుం తెంచనివాడ వేమి చెప్పేది
సిగ్గరి తనమో నేడు శ్రీ వేంకటేశ నీనహ్వ
కగ్గు లేకేలితివి నాకన్న వరమో యిద (9)

రాతి గుండె వాడు, ఈడేర్చడం, గట్టువాయి జాణం తనం వంటి ప్రయోగాలు భావ ప్రకటనకు గాఢత్వాన్ని తీస్తుకొచ్చేందుకు సహకరిస్తాయి. తెలుగు లోని జాతీయాల్ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకొని ప్రయోగించిన పద కర్త అన్నమయ్య.

ముఖారి – ?

ప॥ పొదలు నీ సొబగెల్ల పోదేల కొల్ల
తుదలేని నీ మేలు దొరకెరా నాకు

చ. 1. ఒడలిపై నీచెమట వూరు వాడెడు చెలమ
జడియు నీ తమకంబు సంత తగరు
కడగంటి నీచూపు కట్ట వదలిన క్రేపు
వడి నిన్ను గరగింప వశమా నాకు

చ. 2. చిరునవ్వు నీపలుకు జిగురు చుట్టిన కండె
తెరవలకు నీ మోవి తెరువు పెసరు
పరచు నీ నును జేత బట్టబాయిటి యీత
తఋఇ నిన్ను బైకొనగ దరమా నాకు

చ. 3. చెలువంపు నీ చెలిమి చెరకు వండిన పండు
కెలపు నీ యలుక తంగేటి జున్ను
చలివాపు నీ చనవు జాజులు ప్రసాదంబు
కలిగె నీ కరుణ వేంకట విభుడ నాకు (10)

ఇక్కడ ప్రయోగించిన ఊరు వాడెడి చెలమ, సన్నగరు, కట్టు వదలిన క్రేపు, జిగురు చుట్టిన కండె, తెరవు పెసరు, బట్టబాయిడి ఈత, చెరకు పండిన పండు, తంగేటి జున్ను, జాజులు ప్రసాదం మొ॥ పలుకుబడులు నాటి సమకాలీన వాగ్వ్యవహారం లోని భాషా వైచిత్రిని ప్రస్ఫుటం గావిస్తున్నాయి.

అన్నమయ్యకు పూర్వం తెలుగు కవిత్వ సంప్రదాయంలో దేశి చందో రీతులయిన తరువోజ, మధ్యాక్కరలు కనిపిస్తాయి.

నన్నెచోడుని కుమార సంభవంలో ఈశ్వరుని అంకమాలికలు, ఉవిదలింపు, మిగుల ఊయల పాటలు, అలతులు, గౌడు గీతాలు, రోకటి పాటల ప్రస్తావన ఉంది.

అలాగే అన్నమయ్య అనేక పాటల్ని ప్రస్తావించాడు. ఇక్కడ పేర్కొన్న “ఏల” పాటను చూడండి.

ముఖారి – ?

ప॥ ఏలే చలియ యీ యింతులకెల్ల
సోలగిలి నీ చనవు చూప వలెనా

చ. 1. మిక్కిలి యాతడు నీపై మేలు గలడంటానె
వెక్కసాన నిందరిలో విర్రవీగేవు
చక్కని విభుడు నీ జవ దాటకుండి తేనె
తక్కువ నీవొకతెవే దక్క గొంటివా

చ. 2. మనసిచ్చాడతడు నిన్ను మన్నించె నంటానె
యెనలేక యిందరి నీవేల జూచేవు
ఘనమైన మోహపు కాంత నవుదు నంటావె
గునియుచు సారె నాడు కొన వలెనా

చ. 3. అన్నిటా పట్టపు రాణివైతె నవుదువు గాక
వెన్నుడు శ్రీ వేంకటా విభునికిని
వన్నెలు చూప వలెనా వడి నీ సవతులకు
చిన్ని యాతడును నీవె బ్రతుకరమ్మా (11)

ఇదే కాక దేశి కవితా ప్రక్రియకు చెందిన మేలుకొలుపు, సువ్వి పాటలు, అల్లో నేరెళ్ళు, గొబ్బి, జాజర, సోది, తుమ్మెద, చిలక, తందాన, కోలాటం, చందమామ, శోభనం, హారతి, నివాళి, ధవళ, ఉయ్యాల, లాలి, జోల, మంగళ, సాగు ముఖాలు, కూగూగులు, తాత్త్వికాలు, చాంగు భాళాలు వంటి అనేక జానపద గేయ ఫణితుల్ని అన్నమయ్య పద వాఙ్మయంలో ప్రయోగించాడు. (12)

పై పేర్కొన్న వాటిలో కొన్ని విరహాత్మకంగా, శృంగార పరంగా సాగే జావళీలలో కూడా కనిపిస్తాయి.

అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్వంగా భావించి శృంగార భక్తి భావంతో ఎన్నో వేల కీర్తనల్ని సాయించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి ఆంధ్ర జాతికి అపురూప కానుకగా అందించాడు.

అశాశ్వతమైన లౌకిక విషయాల్ని విడిచి పెట్టి పరమార్థం నందే మనసు నిలిపు, సోపాన క్రమంగా పరమాత్మ యందు తన్మయీ భావాన్ని పొందడమే మధుర భక్తి లక్షణం. వైష్ణవంలో గోపికా భక్తి ఈ కోవకి చెందినదే.

ఆండాళ్ తల్లి తమిళంలో సాయించిన దివ్య ప్రబంధానికి సంబంధించిన “తిరుప్పావై” కూడా మధుర భక్త్యావేశానికి ఆవిర్భవించిందే.

“పుమానౌ విష్ణురితి ఖ్యాతః
స్త్రీ ప్రాయ మితరం జగత్”

అనే వైష్ణవ సంప్రదాయ సైద్ధాంతిక సూక్తిని అనుసరించి, జావళీ కర్తలు భగవత్ పాద లగ్న పరిపూర్ణ చిత్తులై, శృంగార రస బంధురంగా జావళీల్ని రచించారు. అందులో రకరకాల వర్ణనల్ని చొప్పించారు.

నాయిక నాయకుల సిగ్గులు, ఒయ్యారాలు, అలకలు, శృంగారాలు, సింగారాలు, హావభావ విన్యాసాలు, అభిప్రాయ ప్రకటనలు, సంతోషాలు, సంబరాలు, విరహాలు, నిరాశలు, నిట్టూర్పులు, చిలకలు, వెన్నెల రాత్రులు, బాధించే ప్రకృతి, ఓదార్చే చెలులు, మన్మథావస్థలు, ఉపశమన చర్యలు, ఉపశమన వాక్యాలు, నాయికా నాయక సమాగమం కోసం చేసే ప్రయత్నాలు తెలుగు జావళీలలో అధికంగా చోటు చేసుకొన్నాయి.

విప్రలంభ శృంగారం, సంభోగ శృంగారం, ముద్దులు, మూతి విరుపులు, రూప వర్ణనలు, కొప్పులు, పువ్వులు, అభిరుచులు, చుట్టు పక్కల ఉన్నవారి దెప్పి పొడుపులు, ఓదార్పులు, ఇలా – ఒకటేమిటి – నిత్యం మనం సమాజంలో చూసే ప్రతి ఆంశమూ జావళీ కర్తల వర్ణనలో సజీవంగా సాక్షాత్కరిస్తాయి.

దీనికి ఆద్యుడు, మార్గం చూపిన వాడు అన్నమయ్య. అన్నమయ్య చూపిన బాట లోనే జీవాత్మ పరమాత్మ సంయోగానికై పరితపించడం అనేక విధాలుగా ఉల్లేఖించడం జరిగింది.

“సామాన్య జనులు తత్త్వ దృష్టితో దైవమును చూచి కొలిచి తరించుట వలను గాని పని, వారి వారి అనుభవములకు తగిన శృంగార లీలలనైతే మధురముగా చేపట్టి పాడుకొనగలరు. అందుకనియే అన్నమయ్య శృంగార దృష్టితో నైన వేంకటేశ్వర నామాంకిత కీర్తన సాగించి కృతార్థు లగుదురు గాక యని గుడ జిహ్వికా న్యాయముతో ఈ శృంగార సంకీర్తనల రాశిని పెంచినట్లున్నది” (13) అన్న శ్రీ గౌరి పెద్ది రామ సుబ్బ శర్మ గారు అన్నమయ్య సంకీర్తనల్ని ఉద్దేశించిన మాటలు స్మరింపదగ్గవి. ఇవి జావళీలకు కూడా వర్తిస్తాయి.

జావళీ కర్తలు రచించిన శృంగారాత్మక రచనలలో కొన్ని చోట్ల సంయోగ శృంగారాన్ని సంయోగాంతంగా ముగించడమే కాక, విప్రలంభ శృంగారాన్ని కూడా సంయోగ శృంగారంతో ముగించడం కనిపిస్తుంది. దీనికి కారణమేమంటే భగవంతునితో దీర్ఘ కాలిక వియోగాన్ని సహించ లేక పోవడమే.

అందుకే తెలుగు జావళీలలో అష్ట విధ నాయికా భేదాలు, సంభోగ, విప్రలంభ శృంగారాల వర్ణనలు విశేషంగా చోటు చేసుకొన్నాయి.

“ఇది గాక సౌభాగ్య మిది గాక తపము మరి
యిది గాక వైభవం బిక నొకటి కలదా
అతివ జన్మము సఫలమై పరమ యోగి వలె
నితర మోహాపేక్ష లన్నియును విడిచె
సతి కోరికలు మహా శాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసన వోలె నుండె” (14)

అని అన్నమయ్య పేర్కొన్న విధంగా శృంగార పరమార్థాన్ని వివరించే మధురమైన జావళీల్లో నాయిక స్వామిలో తాదాత్మ్యం చెందడానికి చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంది.

జీవాత్మ పరమాత్మ విషయికమై పొందుతున్న ఆనందం అమేయమూ, అనంతమూ, దివ్యమూ అని భావించి, దానిని నాయికా పరంగా వెల్లడించడం ప్రధానాశయంగా జావళీ రచనలు సాగాయి. ఇటువంటి రసప్లావితాలయిన జావళీలను రచించి, మధుర మనోజ్ఞ భావ జాలంతో భగవంతుని దివ్య చరిత్రనీ, రూప లావణ్యాదుల్నీ, గుణ నామ సంకీర్తనల్ని గావించిన జావళీ కర్తలు తెలుగు వారందరికీ ప్రాతః స్మరణీయులు. సాహిత్యంలో జావళీల పరిపుష్టికి కారకులు కావడమే కాకుండా, సంగీత సాహిత్యాలను సమ్మేళనం గావించి, తెలుగు సాహిత్యం లోనూ, సంగీత సంప్రదాయాల లోనూ, తమకంటూ ప్రత్యేక ముద్రను వేసుకొన్న ధన్య జీవులు.