శ్రీ రాఘవన్ గారు:
వీరి పరిశీలనలో సంగీత గ్రంథాలలో గల దేశ ప్రక్రియలలో యీ మాట ఎక్కడా కనిపించడం లేదు.
జావళీ మాటను చపల (chapala) సంస్కృత మాటతోను, కన్నడంలో గల ‘ జావళ ‘ శబ్దంతోనూ పొందుపర్చటం కూడా విఫలయత్నం అయ్యింది.
ఇన్ని ప్రయత్నాలు చేసినా జావళీ ఏ భాషా పదమో తెలుసుకోవడం కష్టం అవుతోంది. కారణం – జావళి అంత విస్తృతం కలది.
తెలుగులో 19వ శతాబ్ది చిట్ట చివరలో ముద్రితమైన తెలుగు నిఘంటువులలో ఈ ‘జావళీ’ మాట కనిపిస్తోంది. తెలుగు జావళీకారులు కూడా ఈ సమయంలోనే జావళీలు రాశారు.
విద్వాన్ చెన్నకేశవయ్య:
“జావళ” సామాన్యార్థంలో వున్నది. వ్యావహారికమైనది.
“జావళి” “జావళ” నుండి వచ్చి వుంటుంది.
ఆ రోజులలో రసికులు ‘జాహోడే’ అని అనివుంటారు. ఆ తరువాత జావడీలుగా మారి వుంటాయి. ఇదంతా ఊహా మాత్రమే.
Capt. C.R. Day
బ్రిటిష్ ఆఫీసర్ జావళీల ప్రదర్శనను గురించి వారి అవగాహన మేరకు అందించిన సమాచారం.
“జావడీలు శ్రవణానంద కరంగా ఉంటాయి.
అందరికీ అర్థం అయ్యేలా ఉంటాయి.
ఇవి కూడా జోల పాటలు, ప్రేమ గీతాల లాంటివే.
ఆకర్షణీయంగా ఉంటాయి.
క్లిష్టత ఉండదు.
నృత్యం చేసే స్త్రీలు, మిగతావారు, ముఖ్యంగా కులీన స్త్రీలు తమ గృహ జీవితంలో పాడుకునేవారు.
ఇవి రెండు రకాలుగా ఉండేవి.
- నృత్యానికి అనుగుణమైనవి.
- ఇంచుమించు అసభ్యంగా అనిపించేవి. (కార్వార్ నృత్యంలో ఈ పాటలుండేవి.) ఈ జావళీలలో సాహిత్యాన్ని అనుసరించి సంగీతం నడక ఉంటుంది. పద ప్రకటనకి ఎంత సమయమో అంతే కాని, మరీ వేగం కాదు.
సాధారణంగా రూపక తాళంలో ఉంటాయి.
పాశ్చాత్య నృత్యం కున్న వేగం దీనికి లేదు. సర్వసాధారణంగా జావళీలలో ప్రయోగించిన పదాలు చాలా అందంగా సొగసుగా ఉంటాయి.”
రాధాకృష్ణుల ప్రేమ యితివృత్తంగా గలవి చాలా ప్రసిద్ధి గాంచాయి. సంగీత విద్వాంసులు జావళీలను ఎక్కువ వడుపులు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా (సహజంగా) పాడేవారు. చరణాలన్నీ ఒకే మాదిరిగా పాడేవారు.
ఈ జావడీలు యీమధ్య వచ్చినవే.
హంపి శిథిలాల దగ్గర గల సురపురి కోర్టులో మొదటగా కన్నడ సంగీత విద్వాంసులు పాడారు. ఈ జావడీలు చాలా త్వరగా ప్రాచుర్యం పొంది దక్షిణాది అంతా వ్యాపించాయి.
హిందూస్థానీ సంగీతంలో టప్పాలు ఎలా ప్రాచుర్యం వహించాయో కర్ణాటక సంగీతంలో జావడీలు అంత ప్రసిద్ధి గాంచాయి. (The Music of Southern India)
“Javadis are songs of a light and pleasing nature, such as love songs, cradle songs, etc. They are much sung by both nautch girls and all, especially women of the higher classes in domestic life. The words of Javadis are often very beautiful and those of Krishna and Radha are always popular. Musicians, as a rule, sing these songs more in their naked form and with less grace than is their usual custom.
These songs are of comparatively recent introduction, being first sung by the Karanese musicians of the court of Surapuri, a petty state near the celebrated Humpe ruins. The popularity of songs of this kind increased rapidly, and they are now to be heard throughout almost the whole of Southern India, where they take the place of the Tappa of Hindusthan.”
(The Music of Southern India Captain C.R. Day, Special Reference Action D27 pub. 1891 P.N 78 to 87)
ప్రొఫెసర్ శ్రీ పి. సాంబమూర్తి
జావళీ 19వ శతాబ్దిలో ఆవిర్భవించినది. ‘ జావడి ‘ అనే పదం లోంచి ‘ జావళి ‘ రూపం వచ్చింది. ‘ జావడి ‘ అనగా ఒక రకమైన అశ్లీల సాహిత్యం గలది.
శ్రీ రీతారాజన్
‘జావళీ’ అనే పదాన్ని ఎవరూ స్థిరీకరించలేరు. ‘ జావడి ‘ అని కన్నడంలో అంటారు.
శ్రీ వై. సత్యనారాయణ
‘ జావళి ‘ కన్నడ మాట నుండి పుట్టి వుండవచ్చు. కన్నడంలో జావడి, జావళి రూపాంతరాలు. మరాఠి భాషలో (jhavali) అంటే ప్రేమ భావం చూపటమని అర్థం. అందుచేత జావళి నృత్యంలో ప్రేమ గీతంగా సంబంధం కలిగి ఉంది. తెలుగులో చూసినట్లయితే ‘ జవ ‘ అంటే వేగం అనే అర్థం ఉంది.
శ్రీ వి. ఎస్. సంపత్‌కుమారాచార్య
‘ జావడ ‘ దేశ్య పదం. మధ్య యుగం నాటి గీతంలో రెండో భాగం సూచిస్తుంది. రాగాంగ రాగలక్షణ గీతాలలో సూత్ర ఖండం లేదా ప్రథమ భాగం తరువాత వచ్చే భాగం.
‘ జావడి ‘ – కన్నడ ప్రేమ గీతం. కనక దాసరు ‘ మోహన తరంగిణి ‘ అనే పాటలో ఒక రకమైన పాడే పద్ధతి అని చెప్పారు. శృంగార ప్రధానమైన పాట. జావళి కన్నడంలో 15వ శతాబ్ది నుండి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కన్నడ జావడికి రూపాంతరం.
శ్రీ ఎన్. ఆర్. జానకిరాం
క్రీ. శ. 19వ శతాబ్దిలోనే జావళి పుట్టింది. కన్నడ పదం ‘ జావడి ‘ జావళి అయ్యింది.
డాక్టర్ ఎస్. సీత
జావళి – జావడి అను కన్నడ మాట నుండి వచ్చింది. ఒక ఆశ్లీల గీతం. మరాఠీలో జావళి (jhavali) అనగా కళ్ళతో ప్రేమ వ్యక్తీకరించటం.
(Tanjore as a Seat of Music 17th 18th 19th Centuries)
ప్రొఫెసర్ టి. దొణప్ప
జావళి పద స్వరూపం గూర్చి లేఖ రాస్తూ – జావళి, జావళీ అన్న రెండు రూపాలూ గీత భేదాలుగా సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉదాహృతాలు. కన్నడంలో జావడి/జావళి అన్న రూపాలు రెండూ అత్యాశనూ, రత్యాశనూ ప్రకటించే రచనా రీతులుగా వ్యవహృతాలు.
కన్నడ జావడి a kind of lewd poetry (P.649) అని కిట్టెల్ దొరగారి కన్నడ – ఇంగ్లీషు నిఘంటువున మైసూరు ప్రాంతపు మాండలీక పదంగా పేర్కొనబడింది. దీని రూప నిర్మాణం గూర్చి Kittel ఏమీ చెప్పలేదు.
సంస్కృతంలోని ‘ జయపాలి ‘ శబ్దానికి ప్రశంసా సూచకం, విజయ సూచకం అని అర్థాలు. ఇదే వికృతినొంది
జయపాలి – జాయవాలి – జావలి – జావళి గా మారి ఉండవచ్చు.
- సంస్కృతంలో జంటగా ఆలపించునది అనే అర్థంలోని ‘ యామలి ‘ శబ్దమే ప్రాకృతంలో ‘ జామల ‘గా మారి తెలుగున జావళి అయు ఉండవచ్చు.
- సంస్కృతంలోని చర్మ వాద్యం అనే అర్థంలో ‘ యమలిక ‘ ప్రాకృతంలో ‘ జమలిగ ‘గా మారి, ప్రాకృత భవంగా తెలుగున ‘ జవాళిక ‘ అయి ఉండవచ్చు. ఈ జవాళిక తోడ్పాటున ఆలాపించే గీత భేదం ‘ జావళి ‘గా రూపొంది ఉండవచ్చు.
- సంస్కృతం యమలిక, యమలికా, జంటగా పాడే గీతం
- నిర్ణీత యామం – జాములో పాడే యామాలాపన జావళికి పూర్వ రూపమై ఉండవచ్చు.
ఇవన్నీ ఊహలే కాని నిర్థారక వ్యుత్పత్తులు కావచ్చు, కాకపోవచ్చు.
జావళీలను ఆలాపించే రాగతాళాతి భేదాలను ప్రకటించే రూపాలు ఏవైనా జావళీ శబ్ద వ్యుత్పత్తికి మూలమై ఉండవచ్చునేమో? సంగీత విద్వాంసులు ఆలోచించి నిర్థారించ వలసి ఉంటుంది.
సంగీత ప్రపంచంలోనూ జానపద కళా క్షేత్రంలోనూ కృషి చేసిన పెద్దలెవరూ జావళీ పద వ్యుత్పత్తి గూర్చి చర్చించినట్లు గుర్తులేదు.
యమలము, యమలి అన్న సంస్కృత పదాలకు జత, జోడు అన్న అర్థాలున్నాయి. ‘ యమల ‘ శబ్దమే తెలుగున ‘ అమడాల ‘ అమడపిల్లలు (కవలలు) అన్న అర్థంలో వాడుకలో ఉంది. అమడపిల్లలు (కుశ లవులు) గూర్చి పాడిన జోల పాటలు జావళీగా మారడానికి అవకాశం లేదు.
సంస్కృతంలో యౌవన / యువ శబ్దాలు ప్రాకృతాది భాషలో జొవ్వణ, జోవణ, జవ గా కనిపిస్తాయి. యువపాళి – జోవాళి. యువకులు / యువతులు / యువతీ యువకులు బృందం ఆలాపించే గీతభేదం జావళిగా రూపొంది ఉండవచ్చునన్నదే పైవాటికన్నిటికంటే సమీపంగా సమీచానంగా కనిపిస్తోందని నిర్థారించవచ్చు.
శ్రీ సామవేదం జానకిరామ శర్మ (ఏలూరు)
జావళి అను తత్సమ శబ్దం ‘జావళీ’ అను సంసృత పదం నుండి పుట్టింది. దీనిని రెండుగా విభజించినపుడు జా + ఆవళి అని ఏర్పడుతుంది.
‘ ఆవళి ‘ అను మాటకు సమూహం అని అర్థం. ‘ జా ‘ అను పదానికి ‘జయం’ అని నిఘంటువులో ఉంది. కనుక ‘జా’ అంటే జయం అని చెప్పుకోవచ్చు.
జయంతో కూడిన పదాల సమూహమని చెప్పవచ్చు. ‘ జయ ‘ శబ్దానికి ‘శుభం’ అనే అర్థం కూడా ఉంది. దీనివల్ల శృంగార రసం ధ్వనిస్తోంది. కాబట్టి శుభంతో కూడిన శృంగార రస పదాలతో చేరిన పదాలుగల రచన అని చెప్పవచ్చు.
శ్రీ రేగిళ్ళ సుబ్బారావు (పిఠాపురం)
జావళీ, జావ + వళి = జావళి
జావళీలు, జావళ్ళు
జావ = వై.వి.
జావళి – జావ + వళి – రెండు పదాల కలయిక వల్ల జావళి ఏర్పడింది. ‘ జవ ‘ అనగా వేగం అని అర్థం. ఈ వేగానికి సంబంధించినది కావడం చేత ‘ జావ ‘ అయ్యింది. అనగా వేగం కలది అని అర్థం.
వళి = అనగా యతి. యతిలో హల్లుల సముదాయంతో ఆవృత్తమవుతుంది. కాగా గానంలో వేగాన్ని, వళి ఆవృత్తి అవడాన్ని జావళి అంటారు.
శ్రీ వి. ఏ. కే. రంగారావు
వారితో వారి ఇంట్లో జరిపిన ముఖాముఖి (18-7-1993)
- ‘ జావళి ‘ పదాన్ని మీరు ఎలా సాధిస్తారు? అంటే ఆ మాట రూపం ఎలా వచ్చిందని మీ అభిప్రాయం?
జ. ఈ పదం అచ్చ తెనుగు పదమే. ఇందులో అనుమానం లేదు. ఇక ఆ పేరు ఎవరు పెట్టారు అన్నది కూడ అప్రస్తుతమే. ఈ పదం సాధించడానికొస్తే, ఒక నిర్దుష్టమైన జవాబివ్వలేను. - జావళీపై ప్రచారంలో ఉన్నట్టి భావం – సి. ఆర్. రెడ్డి గారి భావంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది కేవలం పచ్చి శృంగార గీతం అన్నదానితో మీరు ఏకీభవిస్తారా? లేదా?
జ. అంగీకరించను. ఏకీభవించను కూడా. ఎందుకంటే శృంగార గీతాలుగా పేరు తెచ్చుకున్న ‘గీత గోవిందం’ కన్నా, అన్నమయ్య కొన్ని కృతులకన్నా, క్షేత్రయ్య, సారంగపాణి వంటి రచయితల రచనల కన్నా జావళీ పచ్చిదేమీ కాదని నా భావం.
శ్రీ గోస్వామి
అరబ్బీలో జాలాలి (Jalali) అంటే ఉత్తేజ పరిచేది అని అర్థం. జావళి ‘ జాలాలి ‘ మాట నుండి పుట్టి వుండవచ్చు.
శ్రీ బి. వి. కె. శాస్త్రి
జాగడి (jAgadi), జాగలి (Jagali), జావడి (Javadi) జావళి రూపాంతరాలు.
శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
సుబ్బరాయ దీక్షితర్ గ్రంథాన్ని పునఃముద్రిస్తూ కింద ఫుట్‌నోట్‌లో విశదంగా చెప్పారు. జావడ – దేశి పదం. 1/2 గీతం.
శ్రీ ఆరుద్ర
వడివేలుకు ‘ జావడ ‘ మాట పరిచయం ఉండి వుంటుంది. ఆయన ముత్తుస్వామి దీక్షితర్ శిష్యుడు.
జావడము : జావళము = తెలుగులో పక్షి, గుర్రం, చిన్న పక్షి.
జావళీ మిరుమిట్లు గొలిపే పక్షిలాగా ఎగిరి గుర్రంలాగా వేగవంతంగా వెంటాడుతూ ఉండే ప్రక్రియ. (శృతి సంచిక 1986 జూన్ – జూలై)