1.7 జావళీ – రగడ jAvaLI – ragaDa

నిఘంటుకారుల అర్థాలు, ప్రముఖుల అభిప్రాయాలు పరిశీలించిన మీదట జావళీ వ్యుత్పత్తి గానీ, పదార్థాన్ని గానీ, లక్షణాన్ని గానీ పూర్తిగా నిరూపించే విధానాలేవీ లభ్యం కాలేదు. సమస్య సమస్య గానే నిలిచిపోయింది. జావళీల నడకను బట్టి వాటి స్వరూప స్వభావాలను బట్టే పరిశీలించి అధ్యయనం చేస్తే అవి రగడలనే దేశీయ ఛందస్సు నుండి పుట్టినవే అని నిర్ధారించవచ్చు.

రగడలకు వాని గతుల్ని బట్టి లాక్షణికులు తాళాలను ఏర్పరచారు. జావళి, జావడములకు అశ్వగతి, తట్టు అని అర్థం. ఆ అర్థం ఈ నడక లక్షణాలు ఈ రగడలకు జావళీలకు గల సంబంధాలను సూచిస్తున్నాయి.

లక్షణ శిరోమణిలో రమణకవి:

సీ|| ప్రబలు హయప్రచారంబును దురగవ
ల్గనము విజయ మంగళ రగడలవి
రూపకంబున జెందు, రూఢిచే మధుర గతి
రగడ యొకతాళ దివిరి నడచు
రహిమించ గాంచు ద్విరదగతి జయభద్ర
రగడలు ఝంపె తాళమున మెలగు
హరిగతి రగడయు నట తాళమున బొందు
వృషభ హరిణ గతుల్ వెలయుద్రిపుట

ప్రసిధ్ధమైన గతులను బట్టి తాళాలను నాలుగు విధాలైన రగడలకు నాలుగు విధాలయిన తాళాలతో చెప్పినప్పటికీ, రగడలలో వలేకాక సంగీత శాస్త్రంలోని ఈ తాళాలకు మాత్రల సంఖ్య విశేషమై ఉంటుంది. ద్రువాలు నిర్ణీతాలు. లఘువు మాత్రం జాతిభేదం కలిగి ఉంటుంది.
ఇక రగడలు –

  1. హయప్రచార రగడ
  2. తురగవల్గన రగడ
  3. విజయ మంగళ రగడ
  4. మధురగతి రగడ
  5. హరిగతి రగడ
  6. ద్విరదగతి రగడ
  7. విజయభద్ర రగడ
  8. హరిణగతి రగడ
  9. వృషభగతి రగడ

అనే భేదాలున్నాయి.

మాత్రాగణాల భిన్నత్వాన్ని బట్టి త్రిమాత్రిక, చతుర్మాత్రిక, పంచమాత్రిక, సప్తమాత్రిక అని కాల సంపుటాలని బట్టి రగడ భేదాలు ఏర్పడతాయి.

పాదానికి గల మాత్రల మొత్తం సంఖ్య కూడా దీనితో మారుతుంటుంది. ఇటువంటి కాల సంపుటాలు పాదానికి ఉండవలసిన వాటిని రెట్టింపు చేయగా తురగవర్గన, హరిగతి, విజయభద్ర, వృషభగతులు ఏర్పడుతున్నాయి.
అప్పకవి, చిత్రకవి పెద్దనలు రగడలకు తాళాలను కూడా నిర్ధారించారు.

హయప్రచార రగడద్వితీయాక్షర ప్రాసతో అంత్యప్రాసతో త్రిమాత్రా గణాలు నాలుగు పాదాలలోనూ ఉంటాయి.
తురగవల్గన రగడ హయప్రచార రగడ పాద దైర్ఘ్యంలో ఇది రెట్టింపుగా ఉంటుంది. అంటే త్రిమాత్రా గణాలు ఎనిమిది ఉంటాయన్నమాట. యతి 4 గణాల తరువాత ఉంటుంది.
విజయమంగళ రగడ తురగవల్గన రగడ పాద దైర్ఘ్యంతో ఇది రెట్టింపు. హయ ప్రచారతో నాలుగు రెట్లు ఉంటుంది. అంటే త్రిమాత్రికా గణాలు 16 ఉంటాయి. యతి 4 గణాలకొకసారి మారుతూ ప్రయుక్తమవుతుంది.

హయప్రచార, తురగవల్గన, విజయమంగళాలు చతురస్రజాతి రూపకంలోనే కాక 1. త్ర్యస్రజాతి ఏక, 2. ఖండజాతి మఠ్య, 3. సంకీర్ణజాతి జంపె, 4. చతురస్రజాతి అటలలో కూడా సరిపోతాయి.

హయప్రచార, తురగవల్గన, విజయమంగళాలు రూపకం నడిచేది త్రిమాత్రికా గణ నిర్మితాలైన వీటిలో హయప్రచార 3+3+3+3 = 12 మాత్రల పాదం గలది. 6+6 విడగొట్టిన రూపక తాళంలో చతురస్రజాతిలో సరిపోతాయి.

సంగీత శాస్త్రంలోని తాళాల మాత్రల సంఖ్య విశేషమై ఉంది. తాళాలు సప్త విధాలు. తాళానికి అంగాలు మూడు. లఘువు ‘1’, ద్రుతం ‘0’, అనుద్రుతం ‘U’ గుర్తుతోనూ గుర్తిస్తాయి. త్రిపుటా తాళానికి లఘువు, రెండు ద్రుతాలుంటాయి. లఘువుకు జాతి భేదం అనగా త్ర్యస్రలో నడచిన లఘువుకు 3 మాత్రలుంటాయి.

ద్రుతానికి దెబ్బ, ఉసి, (1+1) = 2 మాత్రలు. అప్పుడు మాత్రా విధానం 1-0-0 అన్న గుర్తు = 3+2+2 = 7 మాత్రలు చతురస్ర అయినచో 4+2+2 = 8 మాత్రలు. దీనిని చతురస్ర జాతి త్రిపుట తాళమని అంటారు. ఆది తాళంగా ప్రసిద్ధం. ద్రుతం నిర్ణీతాలు. లఘువు మాత్రం జాతి భేదం కలిగి ఉంటుంది.

మాత్రాగణాలురగడలుతాళాలు
మూడు మాత్రలు కలవిహయప్రచార
తురగవల్గన
విజయమంగళ
రూపకం
నాలుగు మాత్రలు కలవిమధురగతి
హరిగతి
ఏక
అయిదు మాత్రలు కలవిద్విరదగతి
విజయభద్ర
జంపె
ఏడు మాత్రలు కలవిహరిణగతి
వృషభగతి
త్రిపుట

ఏయే రగడల నుండి ఏయే తాళాలకు సరిపడతాయో చెప్పి యక్షగానాలలో వాడుకోవాలని అప్పకవి స్పష్టంగా చెప్పాడు.

“వీన యక్ష గాన ప్రబంధము లతుకవచ్చు
రగడ భేదములవి యండ్రు రస గవీంద్రులు”
(అప్పకవీయం. IV 490)

మాత్రాగణాల వాడుకలో స్వేచ్చ ఉన్నా కొన్ని నిషేధ గణాల్ని లాక్షణికులు చేస్తారు. త్ర్యస్రగతిలో లగ గణం, చతురస్రగతిలో జగణం, ఖండగతిలో జల, యగణం, మిశ్రగతిలో లగ, జగ గణాలు నిషేధాలు.

రగడ పాదానికి గణాలు మొత్తం పాదానికి మాత్రల సంఖ్య గతి నిషేధ గణం
హయప్రచార త్రిమాత్రా గణాలు నాలుగు 12 త్రస్య లగ
తురగవల్గన త్రిమాత్రా గణాలు ఎనిమిది 12 త్రస్య లగ
విజయమంగళ త్రిమాత్రా గణాలు పదునారు 48 త్రస్య లగ
మధురగతి చతుర్మాత్రా గణాలు నాలుగు  16 చతురస్ర జ
హరిగతి చతుర్మాత్రా గణాలు ఎనిమిది 32 చతురస్ర జ
తాళరగడ (విషయం) చతుర్మాత్రా గణాలు పదహారు 64 చతురస్ర జ
ద్విరదగతి పంచమాత్రికా గణాలు నాలుగు 20 ఖండ జల, య
(వి)జయభద్ర పంచమాత్రికా గణాలు ఎనిమిది 40 ఖండ జల, య
హరిణగతి రెండు సప్తమాత్రికా గణాలు 14 మిశ్ర లగ, జగ
వృషభగతి నాలుగు సప్త మాత్రికా గణాలు 28 మిశ్ర లగ, జగ

కన్నడంలోని ఉత్సాహ రగళె – తెలుగు రగడ తురగవల్గనకు సరిపోతుంది. లాక్షణికులు చెప్పిన నిషేధ గణాలు, దేశిగణాలు తెలుగు కవులు కూడా ఉల్లంఘించారు.

వీటిని విమర్శకులు గణ వైలక్షణ్యమన్నారు. కానీ వీటిని గేయచ్ఛందంగా భావించిన వైలక్షణ్యమనకుండా స్వాభావికమని చెప్పడం సబబు.

ఆంధ్ర కవులు తమ కావ్యాలలో వీలును బట్టి దైవ ప్రార్థనకో, ప్రకృతి వర్ణలకో రగడలను వాడుకున్నారు.
జావళీకారులు దైవ ప్రార్థనకు ముఖ్యంగా ఆత్మార్పణ ప్రధానంగా జావళీలను రచించినట్లు చెప్పవచ్చు.

జావళీకారులు గుర్రపు నడక గల హయప్రచార, తురగవల్గన, విజయమంగళ రగడలను, గేయచ్ఛందస్సులను వాడి శ్రావ్యత జీవితంగా గల ఈ జావళీలను రచించడంలో నియమాల్ని పాటించారు.

దైవ ప్రార్థన ప్రాముఖ్యం గల, శ్రావ్యత గలిగి గుర్రపు నడక గలిగిన యీ గేయాలు జావళీలు. జావళము అనగా గుర్రపు నడక. ఆ నడక గలవి – జావళము కలవి జావళీలు.

కన్నడంలో జావడి – lewd poetry అసభ్య శ్రంగారపు పాటలు అని వ్యుత్పత్తి. ఆ వ్యుత్పత్తి బట్టి జావడి – జావళి అయ్యింది అనడం పొసగదు.

జావళీ అసభ్య శృంగారపు పాట కాదు. అశ్వగతి నడకగల ప్రత్యేక రచనలు. ఏ ప్రాంతం వారు రచించినా జావళీలు ఒకే మాదిరిగా ఉండడం సాధ్యం అయ్యింది. తేజోవంతంగానూ, ఆకర్షణీయంగానూ, అందరినీ ఆకట్టుకునే శక్తిగల ఈ ప్రక్రియ ‘జావళీ’.

రగడ అంటే ‘నైఘంటికార్థం ‘ శ్రావ్యత ‘ అని. శ్రావ్యత జావళీకి ప్రాణం. ఆ రగడలలో రాయబట్టే ఈ జావళీలు అత్యంత శ్రావ్యంగా రచించబడి అందరినీ ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు.

జయకీర్తి తన ‘ఛందోను శాసనం’ అనే లాక్షణిక గ్రంథంలో రగడ లక్షణంలో గేయ విధానం ఉన్నట్లు చెప్పాడు.


“స్వచ్ఛందః సంజ్ఙా రఘటా
మాత్రాక్షర సమోదితాః
పాదద్వంద్వ సమాకీర్ణా
సుశ్రావ్యాస్యైవ పద్ధతిః”

1. సచ్ఛంద లక్షణం

2. సమమాత్రాక్షరాలు కలిగి ఉండడం

3. సరిపాదాలు

4. పాదసంఖ్యా నియమ రాహిత్యం

5. సుశ్రావ్యత్వం 

అతడు చెప్పిన లక్షణాలు.

జావళము – అశ్వతట్టు, గుర్రపు నడక
రగడలకు గల పేర్లను పరిశీలించగా, ఇవి గతి వైవిధ్యాన్ని సూచించడానికి చిత్రమైన పేర్లతో సూచింపబడ్డాయి. త్ర్యస్యగతిలో నడచే హయప్రచార, తురగవల్గన, గుర్రపునడక అన్న అర్థాన్ని సూచించేట్టు పేర్లను పెట్టడం జరిగింది.
గతి, జాతి భేదాలల్తో గేయాలలో రగడలను ఎన్నైనా సాధించవచ్చు. జావళము – గుర్రపు నడకలో నడచిన ఈ గేయాలు జావళీలుగా రూపొందాయి. నిషిద్ధ గణాలు కొంతమంది జావళీకారులు వారి జావళీలలో వాడుకొన్నారు.

ఉదాహరణకు ఒక జావళీ –

నిరుపమాన సామిని – బేహాగ్ – రూపకం

ప. నిరుప మాన సామి నినా
నిలయ మునకు రమ్మ నవే (లగ)

అ. మరుపు లేక నా మన విని
మగువ వాని తో మనసు(ంచి) తెల్పి

చ.1. సదయు డగు నాసామికి సరి
సాటియ లే దనుచు చాల
ముదము తోను ముఖ విలాస
మును జూచిన ముంది చ్చటకు

చ. 2. మధురి పుడగు శ్రీ నివాసు (ని)
మనసు తెలిసి రేపు మాపు
నిదర లేక నా మనవిని
నిధువ నమును జేరుటకిటు ||నిరు||

ఇది తురగవల్గనలో నడచింది. 3 అక్షర గణాలు వచ్చాయి. ‘ లగ ‘ నిషిద్ధ గణాన్ని కూడా కవి వాడాడు. రెండు మూడు గణాలు కుదరలేదు. కవి రాసింది వేరుగా వుండి వుండవచ్చు. నాలుగవ గణం తరువాత యతి కూడా సరిపోయింది.

2. ఎంతటి కులుకే – కల్యాణి – రూపకం

ప. ఎంతటి కులుకే
ఇంతిరో, కాంతునికిపుడు

అ.ప. పంత ముగల పరాంభోజ (లగ)
ముఖిబె నగినందుకు

చ.1. హొయలు మీరి వీధి లోన
బయలు దేరి నన్ను జూచి
భయము లేక పాట పాడి
కన్ను సైగ జేయునెయిది

చ.2. మరపు లేక నిన్న రేయి
ధరపురీశు డైన సామి
మరుని కేళి లోన నాతొ
మాటా లాడ డేమిటెయిది ||ఎంతటి||

  1. అంతలోనె తెల్లవారె – బ్యాగ్ – రూపకం

ప. అంత లోనె తెల్ల వారె
అయ్యొ యేమి సేతు నే

అ.ప. కాంతు నిమన సెంత నొచ్చె (నొ)
ఇంతి యెట్లు సైతు నే

చ.1. కొదమ గుబ్బ లెదను గదియ
నదుము కొనుచు చాల
పెదవి తేనె లాన నాదు
మదిని దోచు వేళ

చ.2. పంతమున తటాల లేచి
పైట కొంగు జార గా
కొంత దొంత రవిడి మొసగి
కౌగిలింపు చుండ నా ||అంత||

జావళి అచ్చ తెలుగు మాట. సి.పి. బ్రౌన్ నిఘంటువులో తెలుగు మాటగా పేర్కొన్నబడింది. మొట్టమొదటి తెలుగు నిఘంటువుగా చెప్పబడుతున్న ‘ ఆంధ్ర దీపిక ‘ శ్రీ మామిడి వెంకటాచార్యులుచే విరచితమైన నిఘంటువులో తెనుగు మాటగానే ఉంది.

తెలుగు మాట ‘జావళీ’ దేశీయ ఛందస్సు రగడలలో, అశ్వగతిలో రచింపబడింది. ఈ గేయాత్మక ప్రక్రియ తెలుగు వారి సొత్తు. తెలుగు జావళీకారులు, ప్రార్థన ప్రధానంగా – శ్రావ్యత జీవంగా గల రగడ ఛందస్సులో వీటిని రచించారు.

కన్నడం వారు ‘ జావడి ‘ రూపంలో నుండి జావళి వచ్చిందని చెప్పడం అసమంజసం. ఈ పదానికి సంస్కృతం గానీ, మరాఠీ గానీ, తమిళం గానీ, ఉర్దూ గానీ, పర్షియన్ గానీ మూలం కాదని స్పష్టంగా చెప్పవచ్చు.

‘జావళీ’ తెలుగు దేశీయ పదం. ఇది తెలుగు వారి సొత్తు.


(to be continued… Last edited 17 Aug 2025)