2 జావళీ ఆవిర్భావ వికాసాలు – క్రమ పరిణామం jAvaLI AvirbhAva vikAsAlu – krama pariNAmam

జావళీ పద వ్యుత్పత్తి విషయంలో బహు భాషావేత్తల, సంగీతజ్ఞుల అభిప్రాయాలు పరిశీలించిన మీదట ‘జావళీ’ అచ్చ తెనుగు పదమని నిర్ధారించవచ్చు.

అయితే ఈ జావళీలు ఎప్పటి నుండి రచింపబడి వ్యాప్తిలోకి వచ్చాయన్న విషయాల్ని కూడా పరిశోధింపవలసిన అవసరం ఉంది.

జావళీ ఆవిర్భావానికి గల నేపథ్యం ఎటువంటిది?
పద రచనలు జావళీలకు మూలమా?
పదకర్తలు జావళీలు రచించారా?
పదాలకు, జావళీలకు గల భేద సాదృశ్యాలేవిధంగా ఉన్నాయి?
ఈ విధంగా ఉదయించే అనేకానేక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది.

ఈ విషయంపై కూడా పరిశోధక లోకం పలు అభిప్రాయాలు వెల్లడించింది. ఆయా అభిప్రాయాలను క్రోడీకరించి, విశ్లేషించి, వాస్తవాల్ని నిగ్గు తేల్చడం కోసం పలువురు పరిశోధకులు ప్రకటించిన అభిప్రాయాల్ని ఇక్కడ పేర్కొంటున్నాను. ఈ విధంగానైనా సాహితీ లోకం పెద్దగా పట్టించుకోని జావళీ గురించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోనికి రాగలవని ఆశిస్తున్నాను.

వై. సత్యనారాయణ
“క్రీ. శ. 14, 15 శతాబ్దాలలో రచించిన అన్నమాచార్య శృంగార పదాలు జావళీ పుట్టుకకు మూలం. ఆనాటి ఆ శృంగార పదాలకూ ఈనాటి జావళికీ పోలిక ఉంది. 18, 19 శతాబ్దాలలో తంజావూరిని పరిపాలించిన మహారాష్ట్ర రాజుల కాలంలో జావళీ సంగీత నృత్య కార్యక్రమాలలో చోటు సంపాదించుకుంది. ప్రాచుర్యం గాంచింది. 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో రచయితలు రకరకాల రాగాలలో జావళీలు రచించారు.”

ఆరుద్ర
“అవధులు లేని రసానందాన్ని కలిగించే జావళీ 19వ శతాబ్దంలో ఆవిర్భవించి, సంగీత నృత్య కార్యక్రమాలలో చోటుచేసుకుంది. జావళీ 19వ శతాబ్దంలో పుట్టినా 20వ శతాబ్ది పూర్వ భాగంలో కూడా జావళీలు రాశారు. తిరువాన్కోరులో పుట్టి, మైసూరులో పెరిగి, మద్రాసులో పరిణతి చెందింది.”

రీతా రాజన
ఈ మధ్యనే ఆవిర్భవించిన జావళీ ప్రక్రియ 19వ శతాబ్దంలో కర్ణాటక సంగీతంలో స్థానం పొందింది.

పి. సాంబమూర్తి
జావళీ 19వ శతాబ్దంలో పుట్టింది.

బి.వి.కె. శాస్త్రి
కన్నడంలో అతి ప్రాచీన జావళీలు శ్రంగార రాతప్రతిలో ఉన్నాయి. అవి కప్పానిచే రచింపబడ్డాయి. కప్పాని క్రీ.శ. 1800కి చెందినవాడు. వాటిని ఆయన వైరాగ్య జావళీలుగా పేర్కొన్నారు. ఈ జావళీలను నంజన్‌గడ్ లోని నంజున్‌డేశ్వరునికి అంకితమిచ్చినట్లు తెలుస్తోంది.

చెన్న కేశవయ్య
19వ శతాబ్ది మొదటి భాగాలుగా చాలామంది ఆంధ్ర, తమిళ, కేరళలో గల సంగీత విద్వాంసులు, మూడవ కృష్ణరాజ వుడయార్, అతని తరువాత పోషకులు జావళీలు రచించారు. కర్ణాటకలో సంగీత విద్వాంసులు కూడా కన్నడంలో జావళీలు రాశారు. నాలుగు దక్షిణాత్య భాషలలోనూ జావళీలున్నప్పటికీ మైసూరును జావళీలకు పుట్టుక స్థానంగా చెప్పడం పరిపాటి.

రాఘవన్
తెలుగులో 19వ శతాబ్ది చిట్ట చివరలో ముద్రితమైన తెలుగు నిఘంటువులలో ఈ జావళి మాట కనిపిస్తోంది. తెలుగు జావళీకారులు కూడా ఈ సమయంలోనే జావళీలు రాశారు.

మంగిపూడి రామలింగ శాస్త్రి
ఈ జావళీలకు నట్టువార్లు అనగా భరతాచార్యులయిన వడివేలు, పొన్నయ్య, శివానందం సోదరులు స్వాతి తిరునాళ్ ఆస్థాన విద్వాంసులే మూల పురుషులని నిర్థారించడానికి వారి తొలి రచనలగు జావళీలే సాక్ష్యం.
అనగా 19వ శతాబ్దం ద్వితీయ భాగంల్లో వీనికి ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పటికి 150 సంవత్సరాల నుండి బయలుదేరిన గాయకులు, వాగ్గేయకారులు కొందరు వీటిని ప్రచారం చేశారు.

ఎస్. ఆర్. జానకిరాం
జావళీ 19వ శతాబ్దిలో పుట్టింది.

డా|| వి. ఎస్. సంపత్ కుమారాచార్య
జాఅళీ కన్నడంలో 15వ శతాబ్ది నుండి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది కన్నడ జావడికి రూపాంతరం.

విజ్ఞాన సర్వస్వం
ఈ జావళీ ప్రక్రియ 19వ్స్ శతాబ్ది నుంచి మాత్రమే కనిపిస్తోంది. (సుశి)

నటరాజ రామకృష్ణ
కాశీనాథ కవి, వీరభద్ర కవి వీరిరువులు ప్రతాప సింహుని ఆస్థానంలోని వారు. (1714-1764) అప్పటికి పదాలు ఉన్నప్పటికీ కొత్తగా జావళీలు రచించారు.