2.2 జావళీల పుట్టుక – నేపథ్యం jAvaLIla puTTuka – nEpathyam

జావళీల కంటే పూర్వం పదాల రచన వ్యాప్తిలో ఉంది. అన్నమాచార్యులు పదానికి లక్షణాలు చెప్పి కొన్ని వేల పదాలు రచించి పదకవితా పితామహుడయ్యాడు.

స్థూలంగా చూస్తే కొన్ని పదాలు కూడా జావళీలుగా భాసిస్తాయి. అలా భాసించడానికి పద లక్షణాలు కొన్ని జావళీలలో కూడా ఉండడమే కారణం. కాబట్టి ముందుగా ఆ పద లక్షణాన్ని చూద్దాం.

పదం = చిహ్నం (గురుతు) వంచన, కళాస్థాన భేదం, పాదం (అడుగు, కాలు) – (పదన్యాసం – అడుగు తీసి అడుగు వేయడం) – వ్యాజం (నెపం), స్థలం, రక్షణ, కిరణం, ప్రయత్నం, ఉద్యోగం, సుబన్త శబ్దాలు, బాణం, పదార్థం (వస్తువు), పీటకోడు, వాక్యం, కాలి అడుగుజాడ – పాట అనునవి నిఘంటుకార్థాలు.

పదం అంటే పాదం – కాలి అడుగు అన్న అర్థదృష్టితో – పద శబ్దాన్నే పురస్కరించుకుని నృత్యపరమైన “అడుగు” (కాలి చిందు) అన్న అర్థాన్ని మేళవించి పాటలు నృత్య సంబంధమైనవి కాబట్టి ‘పదం’ అనే శబ్దానికి – పాట, గీతం, గేయం, కీర్తన అన్ని అర్థం చెప్పుకున్నారు. పదం అంటే శబ్దం అని కూడా అర్థం ఉంది.

“ఛందస్సు లేకుండా శబ్దం లేదు. శబ్దము లేకుండా ఛందస్సు లేదు.” అని భరతుడు నాట్య శాస్త్రంలో చెప్పాడు.

“పద సంకలితమైనది పదం”

క్రీ. శ. 13వ శతాబ్దంలో శార్ఙదేవుడు సంగీతంలో అనూహ్యమైన కృషి చేసి ‘సంగీత రత్నాకరం’ అనే పుస్తకం రాశాడు. భరతుడు నాట్య శాస్త్రంలో చెప్పిన కవిత గురించి ప్రత్యేకించి పదం గురించి చెప్పి దానిని శార్ఙదేవుడు గుర్తించినట్లు కనిపిస్తోంది.

శార్ఙదేవుని కాలంలో మార్గ-దేశి పరమైన అభిప్రాయ భేదాలూ, అభిమాన నిరభిమానాలూ బాగా తలెత్తాయి. గేయాలన్నవి సామాన్యంగా దేశి పదాలౌతాయి. మార్గ-దేశి సంఘర్షణలో సంగీతజ్ఞులకత్యంత ఆవశ్యకమైన గేయ వాఙ్గ్మయం కూడా హేళన పాత్రమై మార్గ-మార్గగాముల చేత చిన్న చూపు చూడబడినట్లు స్పష్టమౌతోంది.

దేశి పదాలనబడిన అనేక పదరచనా ప్రబంధాలనూ, ప్రత్యేకించి మార్గత్వాన్ని రచనా పరంగా పేర్కొనక పోయినా మార్గ రచనా ప్రబంధాలను కూడా శార్ఙదేవుడు వివరించాడు.

తెలుగులో సంకీర్తనాచార్యుడుగా గేయ కవితా రచనకు మార్గదర్శిగా ఆరాధించబడుతున్న శ్రీ అన్నమాచార్యులు ‘ సంగీత లక్షణము ‘ అనే లక్షణ గ్రంథాన్ని లక్ష్య సహితంగా సంస్కృతంలో రచించాడు. ఈయన క్రీ. శ. 1410-1500 మధ్యకాలంలో జీవించినవాడు.

“యోగ మార్గంబున నొక కొన్ని బుధులు
రాగిల్ల శృంగార రసగీతిఁగొన్ని
వైరాగ్య రచనతో వాసింపఁగొన్ని
సారసనేత్రుపై సంకీర్తనములు

సరసత్వమున దాళ సముఖముల్‌గాఁగ
పరమ తంత్రములు ముప్పడి రెండు వేలు
ప్రవిమల ద్విపద ప్రబంధ రూపముగ
నవముగా రామాయణము దివ్య భాష

నా వేంకటాద్రి మాహాత్మమంతయును
గావించి, రుచుల శృంగార మంజరియును
శతకముల్ పది రెండు సకల భాషలకును
ప్రతిలేని నానా ప్రబంధముల్ చేసి”

ఆ శ్రీపతిని మెప్పించాడు. 32,000 కీర్తనల్ని రచించి పదకవితా పితామహుడై వెలుగొందినా అన్నమాచార్య రచించిన కీర్తనలు మనకు దాదాపు 14,000 మాత్రమే నేడు లభిస్తున్నాయి. వీటితో పాటుగా శ్రంగారమంజరి, శ్రీ వేంకటేశ్వర శతకం అనే కృతులు కూడా లభిస్తున్నాయి. మిగిలిన రచనలు, ద్విపద రామాయణం, సంస్కృత వేంకటాద్రి మాహాత్మ్యం, పదకొండు శతకాలు, ప్రబంధాలు లభించకుండా కాలగర్భంలోనే కలసిపోవడం ఆంధ్రుల దురదృష్టం.

అన్నమయ్య సంకీర్తనలలో అధికంగా శృంగార ప్రధానమైనవే ఉన్నాయి. కొన్ని అధ్యాత్మికమైనవి. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనల గురించి, చినతిరుమలయ్య ఈ విధంగా చెప్పాడు.

“పావనములు హరిభక్తి వి
భావనములు సర్వ మంత్ర రహస్యో
ద్భావనములు గాయక నిక
రావనములు తాళ్ళపాక యన్నయ పదముల్” 2

విష్ణుభక్తి మయమయినవీ, పవిత్రమయినవీ, గాయకుల పాలిట కల్పతరువుల వంటివీ అయిన్న సంకీర్తనల్ని రచించిన పరమ లాక్షణికుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు సంకీర్తనా వాఙ్మయ లక్షణాన్ని నిర్దేశించాడు.

“ఘనత మీరంగ జయదేవ కవి వరేణ్యు
డందమైనట్టి గీత గోవిందమందు
అంచితాష్టపదులు పల్కె నట్ల పదము
పరగు నెనిమిది పదములు పల్లవియును!”
అని పేర్కొన్నట్లు మనుమడు చిన్నన్న ఆంధ్రీకరణలో ఉంది.

ఇందులో జయదేవుని అష్టపదులు విషయం చెప్పిన తరువాత “ఎనిమిది పదాలు”ని ప్రయోగించడం వలన అన్నప్పుడు ‘పదం’ శబ్దం చరణాలు అనే అర్థంలోనే ఈ సందర్భంగా ప్రయోగింపబడిందని గ్రహించవచ్చు.

అన్నమయ్య పేర్కొన్న పద్ధతిని బట్టి చూసినా ‘ పదాలు ‘ అనేక రకాలున్నాయనీ, వాటిలో ‘సంకీర్తన నామకం’గా పేర్కొన్న దగిన ప్రసిద్ధ పద సంప్రదాయం గురించి తాను చెప్తున్నట్లు ఆయన భావంగా మనకు అవగతమవుతుంది.

రమణీయ రత్నాకర ప్రబం
దాధ్యాయమున నుక్తమయ్యె పదము
సముచిత సంగీత చంద్రికాదేశైశ
యందు మిక్కిలి తేటమయ్యె పదము
అతులతత్సమ వాదమైనట్టి సంగీత
చూడామణికి పల్కుచోటు పదము
ధన్య సంగీత సుధాకర గ్రంథంబు
నందు మిక్కిలి చెలువొందు పదము
తానె యిన్నింటికిని మూలమైన భరత
మందు పంచ దశాధ్యాయమందు విమల
వృత్తచూర్ణ నిబంధ కవి విధనామ
భవ్య లక్షణములకు నాస్పదము పదము ||

అంటూ వివిధ రీతులలో ప్రయోగింపబడి ప్రసిద్ధి వహించిన పద ప్రాచీనత గురించి అన్నమయ్య రాశాడు.

తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా భరతుని అడుగుజాడలోనే నడచి ఈ కింది భావాలను వ్యక్తీకరించాడు.

పదము సంస్కృతమున ప్రాకృతమున దేశ
భాషయైన పొసంగ పలుకవలయు
ప్రాసములును యతులు పద్య భంగి చెల్లు
ననిరి భరతదత్తిలాది మునులు||

బంధుర వృత్త పదంబుని
బంధ పదము చూర్ణ పదము భారతాగమసం
బంధంబున పద విజ్ఞా
నాంధులకును తాళ్ళపాక అన్నమ తెలిపెన్||

అందముపై షడ్వింశ
ఛ్ఛందో గణ యుక్త వృత్త జాతుల పదముల్
కుందనమునకు బరిమళ
మందిన క్రియ వృత్త పదము లమరుచు నుండున్||

పదం సంస్కృత ప్రాకృతాలలోనే కాదు దేశ భాషల్లోనైనా రాయొచ్చు.
పదమంటే శృంగార పదం మాత్రమేనా?
పదమంటే కేవలం పాట మాత్రమేనని కొందరు అభిప్రాయపడ్డారు.

ఈ శబ్దం చేత ఏ పాటైనా గ్రాహ్యమవుతుందని తెలిసిన పెద్దలు కూడా ఏ కారణం వల్లనో పదమంటే కేవలం శృంగార పదమేనన్న భావాన్ని రూఢి చేశారు.

కాని యీవల శృంగార రసమయమై రాగ తాళ నిబద్ధమైన రచనకు పదం అనే సంకేత నామం వాడటం సంగీత రసికుల సంప్రదాయమైంది. క్షేత్రయ్య కాలానికే యీ వాడుక వ్యవహారం లోనికి వచ్చినట్లుంది.

పాతల పరంగా ‘ పద ‘ శబ్దం చేత లక్ష్యమైన అనేక విధాలైన పాటలు ఉన్నాయి. ఛందో పరంగా, రసాల పరంగా, రాగతాళాల పరంగా ఎన్ని విధాల పాటలున్నాయో అన్నీ గ్రాహ్యాలే అవుతాయి.

ఈ రకరకాల పదాలలోనికి ఈ కింది పేర్కొన్న పదాలు వస్తాయి.

సంసార పదాలు – మాయా మదాలు – తుమ్మెద పదాలు – బ్రహ్మ పదాలు – అద్భుత పదాలు – హాస్య పదాలు – చెంచు పదాలు – కూనలమ్మ పదాలు – అప్పగింత పాటలు – తిమ్మన పాటలు – జోల పాటలు – లాలి పాటలు – మేలుకొలుపులు – మంగళ హారతులు – ధవళాలు – దరువులు మొదలైనవి.

ఎన్నెన్ని పాటలున్నాయో అన్నింటికీ అన్నన్ని మాత్రా ఛందస్సులే ఉన్నా అవి అన్నీ ఏకైక ఛందోబద్ధాలు మాత్రం కావు. “తాళ పద్ధతుల్లో భిన్నభిన్నాలుగా వుంటాయి.” – శృంగార పదములు పీఠిక – వడ్లమూడి గోపాలకృష్ణయ్య (కళాప్రపూర్ణ) (ప్రాచీన అజ్ఞాత కవికృతం)

“తెలుగు భాషలో గేయ రచన యొక్క ప్రారంభం గానీ, నన్నయకు పూర్వపు పద కవిత్వపు స్వరూపం గానీ, వాటి కాలాన్ని గానీ నిర్ణయించడం సాధ్యం కాదు.
జయదేవుని అష్టపదులు నేటికీ నిలిచిన గేయాలలో ప్రాచీనమైనవిగా చెప్పవచ్చు. తెలుగులో ఉన్న పూర్వ గేయ రచనలను ప్రప్రథమంగా ఎత్తి చూపినవాడు పాల్కురికి సోమనాథుడు. ఇతడు తుమ్మెద పదాలు, ప్రభాత పదాలు, గొబ్బి పదాలు, వెన్నెల పదాలు, వాలేశు పదాలు మొదలగు వాటిని పేర్కొన్నాడు. అంతకు ముందే ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలో దేశిచ్ఛందోరీతులయిన తరువోజలు, మధ్యాక్కరలు వంటి భేదాలుండేవి” (4)

నన్నెచోడుని కుమార సంభవంలో ఈశ్వరుని అంకమాలికలు, ఉవిదలింపు మిగుల ఊయల పాటలు (5), ఆలతులు (6), గౌడుగీతాలు (7), రోకటి పాటల ప్రస్తావనలు ఆయా ఆశ్వాసాల్లో కనిపిస్తూండడం వల్ల దేశి కవితా ప్రక్రియకు గల ప్రాచీనత, ప్రాధాన్యత ప్రాచీన కాలంలో కూడా ఉండేదని తెలుస్తోంది.

అలాగే బసవ పురాణం అనే కావ్యంలో కోలాటం, చాంగుబళా, జోల పదాలను పేర్కొన్నాడు (9) పాల్కురికి సోమనాథుడు.

కృష్ణమాచార్యుడు దేశిరీతికి చెందిన అనిబద్ధ పదాలను రచించినవాడు. అతని రచనలయిన వచన సంకీర్తనం, తులసీ మాహాత్మ్యం, నృసింహవచనాలు, రామనామ సంకీర్తనలు, తర్వాత వాగ్గేయకారులకు మార్గదర్శకాలై నిలిచాయని చెప్పవచ్చు.

క్రీ. శ. 14వ శతాబ్దానికి చెందిన నాచన సోముడు వసంత విలాసంలో జాజర పాటలను ప్రస్తావించాడు. (10). పోతన, శ్రీనాథుడు కూడా జానపద గేయాల్ని ప్రస్తావించారు.

అన్నమయ్య కంటే పూర్వ కాలానికి సంబంధించినంత వరకూ కనిపించే లిఖిత పూర్వక జానపద వాఙ్మయం ఇదే.

దేశి కవితా ప్రక్రియకు చెందిన మేలుకొలుపు, సువ్వి, అల్లో నేరెళ్ళు, గొబ్బి, జాజర, సోది, తుమ్మెద, చిలక, తందాన, ఏల, కోలాటం, చందమామ, శోభనం, హారతి, నివాళి, ధవళ, ఉయ్యాల, లాలి, జోల, మంగళ, సాసముఖ, కూగూగు, తాత్త్విక, చాంగుబళా వంటి అనేక జానపద బాణీల్ని అన్నమయ్య ప్రస్తావించాడు.

అన్నమయ్య వలెనే వాగ్గేయకారుడైన పురందర దాసు కర్ణాటక భాషలో లెక్క లేనన్ని సంకీర్తనలు చేసిన మహా భక్తుడు. కీర్తనలను శ్రీ పాండురంగ విఠ్ఠలునికి అంకితంగా పాడాడు. ఇతడు చిన్నతనంలో అన్నమాచార్యుల వారిని దర్శించి వారి కీర్తనలు విని సన్నుతించాడు.

ఇతడు కూడా అన్నమాచార్యులు వారి వలెనే నైరాగ్యాన్ని (?వైరాగ్యాన్ని?), నీతిని బోధించే సంకీర్తనల్ని శ్రీకృష్ణుని శృంగార లీలల్ని కీర్తనల్ని చెప్పాడు. వీరిద్దరూ భజన పద్ధతికి అనుకూలమైన కీర్తనలను రచించి భజన కూటాలకు ప్రాతిపదిక ఏర్పరచిన మహానుభావులుగా కీర్తి వహించారు. పురందర దాసు కీర్తనలలో తాళం పేరు చెప్పబడడమే కాక, పల్లవి, అనుపల్లవి ఈ రెండింటినీ విడివిడిగా పేర్కొనబడడం కూడా రచనా వైలక్షణ్యంగా కనిపిస్తుంది.

అన్నమాచార్యుల కీర్తనలకు పైన రాగం పేరు మాత్రమే ఉంటుంది. తాళం పేరు ఉండదు. చివరిలో ముద్ర ఉంటుంది.

ఈ కీర్తనలో రెండు పాదాలు కల పల్లవి, తరువాత నాలుగేసి పాదాలు కల మూడు చరణాలు ఉంటాయి. పల్లవి, అనుపల్లవి, చరణం అను క్రమం జావళీలలో పాటించడనికి ఈయన రచనలే ప్రభావితం చేశాయని చెప్పవచ్చు.

పురందర దాసు, అన్నమాచార్యుల వారి సంకీర్తనల తరువాత పేర్కొనదగినవి క్షేత్రయ్య పదాలు. పదాలంటే శ్రంగార రస ప్రధానమైన రచనలు. సంకీర్తనలని మొదటి నుండి వాడుక ఉన్నప్పటికీ ఈ నాటికి కేవలం శ్రంగార రస ప్రధాన గేయాలకు పదాలని పేరు వచ్చింది. ఈ క్షేత్రయ్య పద రచనలు మేటివైనవని అనేక కారణాల చేత చెప్పవచ్చు. ఇతని భాష రసపుష్టి గలది. కల్పనా విశేషం, శాస్త్ర జ్ఞానం, సంగీత విశేషం మేలు తరగతికి చెందినది. (క్షేత్రయ్య పదములు – విస్సా అప్పారవు).

సంగీత శాస్త్ర ప్రవీణుడైన క్షేత్రయ్య పదాలలోని శాస్త్ర గాంభీర్యాన్ని కొంత సడలించి అభినాయానుకూలంగా సరళ సంగీత జ్ఞానంతో ఒప్పే జావళీలను రచించినట్లు కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రధానమైన ఆధారమేమంటే ఆ జావళీలలో ‘ వరదుడ మువ్వపురి నిలయుడ ‘ అను ముద్ర ఉండడమేనని చెప్పవచ్చు.

మువ్వపురి అంటే క్షేత్రయ్యకు సంబంధించిన ఊరి పేరు. వరదుడు అనేది క్షేత్రయ్య పేరు.

క్షేత్రయ్య జావళీ – సురటి రాగం – ఏక తాళం

ప|| మాయలాడి బోధనలచే మయి మరచితివేమో
మాటలాడ రావదేమిరా యో సామి ||మా||

అ.ప.|| కాయజుని బారికి తాళగలేరా (జాలనురా)
కౌగిట జేర్చి నన్ను గారవించరా (కరగించరా)
న్యాయమటరా – నీకిది
తగదుర – సరస గుణ ||మా||

చ||1. కలకాలము నన్ను గాసి పెట్టబోకురా
కాంతల నేచుట కార్యము గాదుర
చెలువుడవని నిను నెరనమ్మి నందుకిక ||మా||

చ||2. సరివారిలో నను చౌక సేయకురా
చాల నమ్మితిరా – రతి కేళి గూడరా
వరదుడ మువ్వపురి నిలయుడ సరగున ||మా||

ఈ జావళీలో నాయిక నాయకునితో పెట్టుకున్న మొర అభివ్యక్తమవుతోంది. ఎన్ని విధాలుగా నాయిక మాట్లాడినా నాయకుడు ఏమీ మాట్లాడడు. ఏదో తన్మయత్వంలో ఉండడాన్ని నాయిక అవలోకించింది.

‘మాయలాడి బోధనలే మైమరచావా?’ అని ఎత్తి పొడిచింది. “మాటలాడరా! సామీ!” అని బ్రతిమాలింది. అంతే కాదు తాను కాయజుని తాపానికి తాళలేకున్నానని, కౌగిట జేర్చి కరిగించమని ప్రార్థించింది. ‘న్యాయమటరా?’ అని ప్రశ్నించింది.

‘సరసగుణ! నీకిది తగదురా!’ అని తనకు అన్యాయం చేయవద్దని బ్రతిమలాడింది. ‘ కలకాలమూ తనని గాసి పెట్ట తగదని ‘ చెప్పింది. ‘ చెలువుడవని ‘ నమ్మిన తనకు అన్యాయం చేయవద్దని ప్రాధేయపడింది.

‘ సరివారిలో తనను చౌక చేయవలదని ‘ ప్రార్థించింది. తనతో రతికేళి కూడడం సమంజసమని ‘ వరదుడ మువ్వపురి నిలయుడ ‘ అని సంబోధిస్తూ ఏ మాయలాడి దగ్గరో ఉండక తన వద్దనే ఉండి, తనతోనే మాట్లాడి, పూర్తిగా తాను నమ్మినందుకు అన్యాయం చేయవద్దని మొరపెట్టుకుంది.

భక్తుడు – భగవంతుని తన సమీపాన ఉండాలనుకోవడం సహజం. ఇది కూడా అటువంటిదే.

ఈ భావాలన్నీ పూర్తిగా ఒక నాయిక హృదయాంతరాళం నుండి పొంగి పొరలిన భావాలు. ప్రియుని పదే పదే ప్రాధేయపడుతూ తపించే ఈ స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించింది ఒక పురుషుడైన జావళీ కర్త. రచయిత జన్మచేత పురుషుడే. కానీ ఈ రచనాకాలంలో తానొక స్త్రీయై, వలచిన స్త్రీయై నాయకుని శత విధాలుగా బ్రతిమలాడుతూ తన గుండెను కదిలించి కుప్పపోయడాన్ని చూస్తే రచయిత లోని స్త్రీమూర్తి సాక్షాత్కరిస్తుంది. ఇటువంటి స్థితి స్వతః పురుష జన్మనెత్తిన రచయితకు ఎలా కలిగింది – అని ప్రశ్న.

జావళీ రచయితలు అందరూ పురుషులే. రచయిత్రులెవ్వరూ లేరు. జావళీ విషయంలో ఇదొక చిత్రమైన విశేషం. ఎందుకు లేరు – అను సందేహం కలగడం సహజం. జావళీలో విషయం నాయిక భావాలు వ్యక్తీకరించడమే. స్త్రీ మనోభావలను జీర్ణించుకుని జావళీ ముఖంలో పురుష వ్యక్తీకరణకు కారణమేమిటి? కొంచెం లోతుగా ఆలోచిస్తే జావళీ స్వరూపాన్ని, పద నిరూపణనీ ఇంకో రకంగా నిర్ధారింపవచ్చు.

ఆనాడు శృంగార పదాలు ఎన్నో ఉండగా ప్రత్యేకంగా జావళీ అను పేరుతో ప్రక్రియ రావడానికి కారణం ఏమిటి?

నిశితంగా పరిశీలిస్తే విజయరాఘవ నాయకుని ఆస్థానంలో గల క్షేత్రయ్య అనేక పర్యాయాలు ఎన్నో క్షేత్రాలు దర్శించాడు. అదే సమయంలో క్షేత్రయ్య జావళీలను కూడ రచించాడు.

జావళీలలో గల సాహిత్యాన్ని పరిశీలిస్తే జావళీ పదానికి అర్థం కొత్త రీతిలో ప్రస్ఫుటమవుతుంది.

సి.పి. బ్రౌన్ తన తెలుగు – ఇంగ్లీషు నిఘంటువులో జావడి అనే పదాన్ని నిర్వచిస్తూ జావడి = అన్మేన్‌లినెస్ (unmanliness), అపౌరుషం అని కూడా అర్థం చెప్పారు. సి.పి.బ్రౌన్ ఇంగ్లీషు – తెలుగు నిఘంటువులో ఆ పదానికి (unmanliness) ఇచ్చిన అర్థాన్ని చూస్తే –

“unmanfullu, Unmanlike; మనుష్యుని వంటి కాని, ముఖ్యంగా మహిళా స్వభావోచితమైన, పౌరుషం లేని Unmanliness అని ఉంది.

Unmanliness అంటే, ముఖ్యంగా మహిళా స్వభావోచితమైన అనే అర్థం తీసుకుంటే జావళీ స్వరూపం పూర్తిగా మధుర భక్తి ప్రాతిపదికగా ఏర్పడిందని నిశ్చయించవచ్చు.

నడకను బట్టి దేశి చ్ఛందస్సులో గల రగడలకు జావడం – జావళం – జావడి – అశ్వతట్టు అనే అర్థంలో జావళి అయ్యింది. ఇది జావళీ బాహ్య లక్షణం. అందులో గల విషయాన్ని గ్రహించిన బ్రౌన్ చెప్పిన అర్థం ప్రకారం – జావళీలలో గల నాయకుడు ఒక్కడే. ఆ పరమ పురుషుడు. నాయికలందరూ జీవులే, గోపికలే అనే అర్థం స్పష్టమైంది.

జావడి – ఛందోబద్ధమైనది, శ్రావ్యమైనది, దైవ ప్రార్థన కోసం రచించేదీ అనే నిర్వచనం ప్రకారం చూసినా, అర్థాన్ని బట్టీ అనగా జావళీలలో గల భావాన్ని పరిశీలించినా – ఈ రెండు విధాలా జావళీలు కేవలం మధుర భక్తి భావన కలవిగానే తెలుస్తున్నాయి. అంతరమయిన స్వరూపాన్ని భావన చేస్తే జావళీ మధుర భక్తి పరిపూర్ణమైనదని స్పష్టమవుతుంది. ‘ ముఖ్యంగా మహిళా స్వభావోచితమైన ‘ అనే అర్థం స్పష్టంగా అర్థం కావాలంటే ఆనాటి పరిస్థితులు అవగతం చేసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈనాటి పరిస్థితులను, ఊహలను బట్టి ఆనాటి కావ్యాలను విమర్శించడంలో ప్రమాదం కలుగుతుంది. సత్యభామను, రాధను నాయికలుగా, శ్రీకృష్ణుని నాయకునిగా చేసి పచ్చిగా అనేక శృంగార కావ్యాలను, నాటకాలను రచించిన కాలమది. భగవంతుని నాయకునిగా చేసి శ్రీమహాలక్ష్మిని నాయికగా చేసి శృంగార కథలను కల్పించిన కాలమది.

తండ్రి భగవంతుడనీ, తల్లి శ్రీమహాలక్ష్మి అనీ భావించి పవిత్రోద్దేశంతో ఆది దంపతుల లీలల వలే తల్లిదండ్రుల వివాహ విలాసాది లీలలను కావ్యరూపంలో లిఖించి ఆనందించాలని భావించే కాలమది. శ్రీనాథుడు నైషధంలో గావించిన దమయంతీ వర్ణన చూసి అసహ్యం చెందే కాలమిది.

“కావ్యాలను విమర్శించడంలో దేశ కాల వ్యతాసాన్ని గమనించడం విమర్శకుల ధర్మం”. ఆనాటి జావళీ స్థితిని ఈనాటి విమర్శకులు దేశ కాల వ్యత్యాసాలను గమనింపక చేసినట్లు స్పష్టమవుతోంది.

క్షేత్రయ్య పదావళి స్వరూప స్వభావాలను గూర్చి శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ గారి విశ్లేషణ ఈ సందర్భంలో అనుసంధింప దగింది.

“వివిధ నాయికల అనుభవాలను నిరూపించు మువ్వ పదావళి నాయికా ప్రధానం. నాయకుడొక్కడు. అతడే వరదుడు. అతడే వేంకటేశుడు. అతడే అన్నీ. ఒకడైనా అనంతుడు. అనంత రూప చక్రవర్తి.

మువ్వకాముకుని ప్రేమ చేత వివశులైన నానా నాయికలిందున్నారు.

వేశ్యలు విద్యా విజ్ఞాన సంపదుపేతులు. దేవదాసీత్వం పొంది మధుర భక్తలై దేవళంలో అభినయించారు. వారు సర్వ విధ నాయికలయ్యారు. సర్వ విధ శృంగారానుభవాలను ప్రకటించారు. మువ్వ గోపాలుడే స్వామిభవిత అనే అభినయంలో వారు నిరూపించారు.

తమ అనుభవితకు ఏ తృప్తి ఎటువంటి ఆనందం కావాలో వారికి తెలియక కాదు. సర్వానుభవ కాముడైన శ్రీకృష్ణ గోపాలునకు ఆనందం కలుగజేయడమే తమకు సంతోషం.”

దేవదాసీ చిరకన్యకలను క్షేత్రేశుడు సర్వ నేత్రాలతో చూసి వారలను గోపికలుగా చిత్రించాడు. సర్వావయవ సుందరులయిన దేవదాసీల చతురభినయాలు చూసి, భావించి నాట్య రసజ్ఞుడైన సాహిత్యక క్షేత్రయ్య తనయందే నాయికత్వం ఆపాదించుకొన్నాడు.

అబలాయితమైన పురుష చిత్తవృత్తి ఇలాగే ఉంటుంది. కేవలం నాయికత్వం భావించడంతో తృప్తి పడక దేవదాసీత్వం ఆపాదించుకొని కృష్ణ ప్రియత్వం భావించుకొని ఆత్మ నివేదనాత్మకమయిన పరమ భక్తిని పదాలలో సరూపం చేసిన క్షేత్రయ్య, క్షేత్రయ్య అవుతాడు.

భావనలో పూర్ణ సాక్షాత్కారం పొంది క్షేత్రయ్య పదరచన చేసి ఉండవచ్చు. క్షేత్రయ్య పదాల రచన మొత్తం కొన్ని వత్సరాల భావనా బలమై ఉండి ఉంటుంది. ఆత్మ యోగ సాధకులకు అంతటి భావన అపేక్షితం. రసమయమైన ప్రేమ భక్తికి ఆ పద సముదాయం నిదర్శనం.

గోపీ విరహంలో కృష్ణ వేదనలకన్నా కృష్ణ విరహంలో గోపీ వేదనలు అత్యంతం సుకుమారాలు స్వభావరమ్యాలు.

ఎన్ని దేవుళ్ళని చూసినా క్షేత్రయ్య నాయికకు మువ్వ గోపాల దృష్టి మారలేదు. గోపాల దేవుడు వీర పురుషుడు. క్షేత్రయ్య నాయిక వీర నారి. లోకంలోని స్త్రీ పురుషులలో వీరనారీత్వం గానీ, వీర పురుషత్వం గానీ ఉండదు. కేవల స్త్రీత్వం, కేవల పుంస్త్వం ఉంటేనే వీరభావ మంటుతుంది.

లోక మానవులు స్త్రీ పుంస ధర్మములతో మిశ్రితాలై ఉంటారు. అలౌకికమయిన ప్రేమ భక్తి పరిపాక ముదయించినపుడు ధ్యేయం దేవి అయితే వీరనారి అవుతుంది. దేవుడు అయితే వీరపురుషుడవుతాడు. మానవ శృంగారం, భక్తి శృంగారం రెండూ పదాలలో ఇమిడి ఉన్నాయి.

భక్తి శృంగారాలలో భక్తుల ఆత్మలు భగవానునితో ప్రతిభావాన్ని అనుసరించి భక్తి ప్రదర్శిస్తాయి. భగవానుడు భోక్త. చరాచరం భోగ్యం. తనలో భోగ్య దృష్టి ఉంటేనే భగవంతుని యెడల భోక్తృత్వం సిద్ధమవుతుంది. ఈ భక్తిలో జీవాత్మకు సంభోగమే ధ్యేయం. చిర సంభోగానకై ప్రేమ మార్గం సహకరిస్తుంది. క్షణకాలమేని విరహ సహనముండదు. అద్వైతమసహ్యం. క్షేత్రయ్య విరహం సహించలేని నాయిక అయ్యాడు.

క్షేత్రయ్య మువ్వ గోపాల సముదాయంలో మాధుర్య ముఖ్యమైన ఆత్మ నివేదన ప్రేమ భక్తి పర్యవసాన స్వాధ్యయమయిన తత్వం. ఇలాగే క్షేత్రయ్యను చూడాలి.

భక్తులయిన వారు గోపీభక్తిని భావించి వివశులు కావడం ఉంది.

“గోవింద ఏవ పురుషో
బ్రహ్మాద్వాః స్త్రీయ ఏవచ”

వాసుదేవః పుమానేకః
నార్యస్చ సకలం జగత్”

యువతీనాం యధాయూని
యూనాంచ యువతౌ యధా”

“మనోభి రమతే తద్వత్
మనోభి రమతాంత్వయి”

అని భావించే వారికిది యుక్తమే. ఇటువంటి వారియందు అశ్లీలమనే మాట లేదు. కృష్ణ విషయమయిన గోపీ రాగం భాగవత రాసలీలలో మధుర భావమయ్యింది. అది శృంగార ప్రారంభం భక్త్యంతమైన భావం. మువ్వగోపాల కృష్ణ సమ్యోగానికి కాంక్ష పడే క్షేత్రజ్ఞుడు విరహ పరితప్తాత్మ. ఇలా మంజుల మధుర భావాలు గలవాడవడం చేత సాహిత్య ప్రేమ యోగుల కందరికీ లలిత మృదుల మార్గం లభించింది.

క్షేత్రయ్య పదాలను ‘ పదావళి ‘ అంటారు. పదావళి రాసిన క్షేత్రయ్య ‘ జావళి ‘ ప్రక్రియను చేపట్టడంలో ఏ సందేహం లేడు. క్షేత్రయ్య క్షేత్రజ్ఞుడవడానికి ఆ పరిస్థితులలో స్త్రీ విరహ భావన ఎక్కువ గల జావళీలు రాయడంలో ఆశ్చర్యం లేదు. జావళీల లోని శృంగారం మధురభక్తి సంబంధితమని స్పష్టం.

నాయకరాజగు విజయ రాఘవ నాయకుడు స్వయంగా జావళీకర్త.

తోడి – మిశ్ర తాళం

సరసకు రారా సామి మ్రొక్కేరా ||సర||
మరులు కొన్న నాకు మనసియ్యవేరా

తరుణి బెట్టిన మందు తలకెక్కే గదరా
నిరతము నిన్నే నెరనమ్మి యున్నారా
కరుణతో నన్నేల రాగాడయ్యే ||సర||

పూజ సేయుదు నీకు పొందిక తోను
రాజసమ్మేలర రాజగోపాల ||సర||

నాయిక నాయకునికి పెట్టుకొన్న మొర ఈ విధంగా ఉంది. తన ‘ సరసకు రారా సామీ ‘ అని మ్రొక్కింది. తాను ‘ మరులు కొన్నాననీ ‘, ‘ మనసియ్యమనీ ‘ వేడింది. ‘ నిరతం నెరనమ్మిన ‘ తనను నిర్లక్ష్యం చేయడం సహించలేక ‘ తరుణి బెట్టిన మందు తలకెక్కే గదరా! ‘ అని నిందించింది. తాను ‘ పూజ చేస్తాననీ ‘ తనను ‘ పొందికగా రాజసమ్మేలర రాజగోపాలా ‘ అని మరీ మరీ ప్రార్థించింది. భక్తుడయిన విజయరాఘవ నాయకుడు తన కుల దైవమయిన రాజగోపాలుని వేడుకోవడం దీనిలోని పరమార్థం. ఈ పరమార్థాన్ని గ్రహించక పోతే ఆంతర్యం బోధపడదు.

జావళీ రచన భగవంతునిపై కాదని, మానవుడయిన ప్రభువులపై రచించబడిందనే వాదన కూడా విమర్శక లోకంలో ఉంది.

ప్రభువయిన విజయరాఘవ నాయకుడు జావళీ ఏ ప్రభువుపై రాశాడు? తానే ప్రభువు గదా! ఇక్కడ ప్రభువు భగవంతుడే – రాజగోపాలుడు.

నాయకరాజుల కాలంలోనే విజయరాఘవ నాయక, క్షేత్రయ్యల మనోవీధిలో సాక్షాత్కరించిన నాయికానుభూతే జావళీగా అవతరించిందనడంలో అతిశయోక్తి లేదు. క్షేత్రయ్య మార్గానుయూయులయిన జావళీ రచయితలు ఏయే ప్రదేశాలలో రాసినా వారి జావళీలలో కనిపించేవి భగవంతుని లీలలే. సాక్షాత్కరించేది భగవంతుని స్వరూపమే. ఆకాంక్షించేది భగవదైక్యమే.

నాయక రాజుల తరువాత మహారాష్ట్ర ప్రభువులు తంజావూరును పరిపాలించారు. వీరి మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు భాషను ఆదరించి అభ్యసించి అనేక నృత్య సంగీత రచనలు చేశారు.

వీరి కాలంలోనే ‘ పద వర్ణాలు ‘ నృత్య కేళికల్లో నూతనంగా ప్రవేశించాయి. అంతకు ముందుండిన పదకేళికల స్థానాన్ని ఇవి ఆక్రమించుకున్నాయి.

వీరి కాలంలోనే కాశీనాథ కవి, వీరభద్ర కవి మొదలయిన వారు ‘ సలాంజదుల ‘ను, ‘ శబ్దాల ‘ను క్రొత్తగా రచించారు. పదాలు అప్పటికి ఉన్నప్పటికి, వీరు క్రొత్తగా జావళీలను రచించారు. (11)

దీనిని బట్టి కాశీనాథ కవి, వీరభద్ర కవి కొత్తగా జావళీలు రచించినట్లు తెలుస్తోంది. పదాలున్నప్పటికీ ఈ నృత్య ప్రక్రియగా జావళీలు వారే కొత్తగా రచించినట్లు నటరాజ రామకృష్ణ గారు తమ ఆస్థాన నర్తనలో పేర్కొన్నారు. ఈ కవులు ప్రతాపసింహుని ఆస్థానంలో ఉన్నారు. వీరి కాలం క్రీ.శ. 1741-1764.

శ్రీ వై. సత్యనారాయణ జావళీ 18, 19 శతాబ్దాల నాటిదనీ, శ్రీ ఆరుద్ర 19వ శతాబ్దంలో ఆవిర్భవించిందనీ తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఈ పరిశీలనలో క్షేత్రయ్య జావళీకారుడిగా గుర్తింపబడడం వలన 17వ శతాబ్ది నాటికే జావళీ రచన జరిగినట్లు స్పష్టమయ్యింది. అంతే కాక ‘ ప్రాచీన నవీన జావళీలు ‘ అనే పుస్తకం లోని జావళీలు పరిశీలించగా, వల్లభ రాయల ముద్రతో కొన్ని జావళీలు, తిరుమల రాయల ముద్రతో కొన్ని జావళీలు లభించాయి. దీనిని బట్టి జావళీలు 15వ శతాబ్ది నాటికే రచింపబడినట్లు నిర్ణయించవలసి ఉంటుంది.

19వ శతాబ్దిలోనే జావళీల ఆవిర్భావం జరిగిందని భావించే ఆరుద్రగారి అభిప్రాయం ఎంత మాత్రమూ సరైనది కాదని లభించిన ఆధారాలను బట్టి నిస్సందేహంగా చెప్పవచ్చు.

పై పరిశీలన ఆధారంగా జావళీ ఆవిర్భావ కాలాన్ని 15వ శతాబ్దిగా పేర్కొనవచ్చు. అటు సంగీతానికి, ఇటు సాహిత్యానికి సమానంగా ప్రాధాన్యమిచ్చిన ఈ విశిష్ట ప్రక్రియపై ఇంకా పరిశోధనలు జరిగి, సంగీత, సాహిత్య, చారిత్రక సామాజికాది వివిధ రంగాల నేపథ్యాల ఆధారంగా పరిశీలిస్తే జావళికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమయిన విశేషాంశాలు వెలుగు లోనికి వచ్చే అవకాశం ఉంది.