ఈ విధంగా ‘ జావళీ ‘ సంగీత నృత్య మేళనం కల ప్రక్రియగా విలసిల్లుతున్న సాహితీ ప్రక్రియ. తెలుగు వారి శృంగార సాహిత్యంలో అపూర్వ సృష్టి జావళీ. ఒకప్పుడు సంగీత సాహిత్య నృత్య ప్రక్రియగా విశేష ప్రఖ్యాతి గాంచి ఆదరణలందుకుని విదేశీయులను సైతం సమ్మోహ పరచిన విశిష్ట ప్రక్రియ జావళీ.
అదృశ్యమవుతున్న ఈనాటి జావళీ తిరిగి వైభవం పొందాలంటే జావళీ ప్రారంభ దశ, ఆనాటి జావళీకారుల చరిత్రలు, ఆనాటి అచ్చు పుస్తకాలలో జావళీలపై రాసిన అభిప్రాయాలు, ఆనాటి సామాజిక స్థితిగతులు కూలంకషంగా పరిశీలించాలి. అప్పుడు గానీ జావళీ సాహిత్య వైభవం, ఔన్నత్యం అర్థం కాదు.
సాధారణంగా సంగీత కార్యక్రమాలలో చివరిగా పాడేది జావళీ.
నృత్య కార్యక్రమాలలో కూడా ఆఖరి అంశం జావళీయే. సంగీతం, నృత్యం నేర్చుకునే శిష్యులకు గురువులు ఆఖరి ఆంశంగా దీన్ని నేర్పుతారు. అంటే స్వరజతి, జతిస్వరం, వర్ణం, పదవర్ణం, కీర్తన, శబ్దం లాంటివి ఎన్నో నేర్చుకుంటే కాని నేర్వ శక్యం కానిది జావళీ.
స్వర, రాగ, తాళ, లయ పరిపక్వత వస్తే కానీ జావళీని నేర్పడం, నేర్చుకోవటం కూడా కష్టమే. అపూర్వ రాగచ్ఛాయలు కూడా ఈ జావళీలలో చోటు చేసుకున్నాయి. వాని సొగసులు అర్థం కాని గురువులు అవేవో అపస్వరాలుగా భావించటం జరుగుతుండడం వల్ల జావళీ నిర్లక్ష్యానికి గురైంది.
ఈ జావళీకారుల చరిత్రలను పరిశీలిస్తే వీరు అపూర్వ రాగచ్ఛాయలు చూపగలిగిన శక్తి కల సంగీత వేత్తలే కాక, సాహిత్య విశారదులు, మహాకవులుగా కనిపిస్తున్నారు. జావళీల ఆవిర్భావం జరిగిన తరువాత, అచ్చు యంత్రం వచ్చిన తరువాత వచ్చిన జావళీ పుస్తకాలపై గల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోవాలి గానీ, ఈనాటి మిడిమిడి జ్ఞానంతో చేసే పరిశీలన వలన జావళీ సహజ స్వరూపం అర్థం కాదని గుర్తుంచుకుంటే జావళీకి సంబంధించిన విషయాలను అవగతం చేసుకోవడానికి వీలు ఏర్పడుతుంది.
ఈనాటి వరకూ జరిగిన పరిశోధనలలో తెలుగువారూ, అరవవారూ, కన్నడంవారూ ఉన్నారు. ఇతర దేశీయులు కూడా ఆనాటి జావళీ గురించి వారి వారి అభిప్రాయాలను ప్రకటించారు. వీటిల్లో రెండు రకాల అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. జావళీలు ఆవిర్భవించి వికసించి అంతరించిపోయినప్పుడు జావళీలు స్త్రీలకి అత్యంత ఉపయోగకరమైనవి, సంగీత సాహిత్యాల మేలు కలయిక గలవి. రాధాకృష్ణ భక్తి కలిగిన ప్రేమ గీతాలు వంటి సదభిప్రాయాలు కల భక్తి భావం కలిగినవి. బహిఃశృంగారం, అంతర్భక్తి కలిగిన మధుర భక్తి భావన కలవి. విప్రలంభ శృంగారం చోటు చేసుకున్నవి.
జావళీకారులు, జావళీలు అంతరించిన తరువాత జావళీ అంటే సదభిప్రాయం పోయింది. అది ఒక నీచ శృంగారమనీ, భక్తికి అందులో అవకాశమే లేదనీ, అన్నీ వేగంగా పాడడం వలన విటుడు ఆనందించడానికి వేశ్యలు పాడేవిగా మాత్రమే ఆవిర్భవించాయనే ముద్ర జావళీలపై పడిపోయింది.
ఈ స్థితికి రావడానికి కారకులు ఎవరు? పరిస్థితులేమిటి?
జావళీ సాహిత్యం మళ్ళీ ఆవిర్భవిస్తుందా?
తెలుగులోనే జావళీలు రావడానికి కారణం ఏమిటి?
అరవవారూ, మళయాళంవాళ్ళూ వారి వారి భాషలలో జావళీ ప్రక్రియ లేదని స్పష్టంగా చెప్పారు. కన్నడం వారు మాత్రం చాలా స్పష్టంగా జావళీ ప్రక్రియ వారిదని, జావళీలు వారికున్నాయని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కన్నడ పదమని కూడా వారు సిద్ధాంతపరిచారు. ‘ జావడి ‘ ‘ జావళి ‘గా అయిందని కూడా చెప్పారు.
తెలుగు సంగీతవేత్తలకి ‘జావళీ’ పుట్టుపూర్వోత్తరాలతో సంబంధం లేదు కాబట్టి వారు జావళీలపై పరిశోధన చేపట్టలేక పోయారు. సాహితీవేత్తలేమో చదువుతుంటే జావళీ సాహిత్యం అంతా ఒకే మాదిరిగా కనిపించటం వలన, అది దేశి సాహిత్యం అవటం వలన వారు దీన్ని అంతగా పట్టించుకోలేదు.
‘జావళీ’ మాటను వినని వారు కూడా తెలుగు సాహితీ లోకంలో ఉన్నారంటే సాహితీ పరంగా జావళీ ఎంత నిరాదరణకు గురై ఈ దుస్థితికి వచ్చిందో అర్థం అవుతుంది. నృత్యం నేర్పే గురువులకు కూడా జావళీ గురించిన విశేషాంశాల్ని తెలుసుకోవాలనే ఆలోచన గానీ అవసరం గానీ లేదు.
అందుచేత ఇప్పటి వరకు తెలుగులో 15వ శతాబ్ది నుండీ ఆవిర్భవించి 20వ శతాబ్ది వరకూ కొనసాగుతూ ఉన్న తెలుగు జావళీ సాహిత్యం మరుగున పడిపోయింది. అచ్చు యంత్రం వచ్చిన తరువాత వచ్చిన పుస్తకాలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి. నూరు జావళీలు మాత్రం నేడు పుస్తక రూపంలో వచ్చాయి.
చాలా సంవత్సరాలు కష్టపడితే 500 జావళీ సాహిత్యాన్ని సంపదించ గలిగాను. నవరత్న జావళీలు, దశావతార జావళీలు లాంటి భక్తి ప్రతిపాదకాలయిన జావళీలు లభ్యం కాలేదు. తెలుగు ప్రాంతం వారు, తెలుగు వారు, తెలుగులో జావళీలు రాసినవారూ, వారిని పోషించినవారూ ఉన్నప్పటికీ అందరి జావళీలు, కొందరు జావళీకర్తల విషయాలు లభ్యం కాకపోవడం తెలుగువారి దురదృష్టమనే చెప్పాలి.
‘జావళీ’ వైభవాన్ని తిరిగి తీసుకు రావడమే నా ఈ పరిశోధన సదుద్దేశం.
తెలుగు సాహిత్యంలోనే జావళీలు ఎందుకు వచ్చాయి?
కన్నడంలో కొద్దిమంది రచయితలు ఉన్నప్పటికీ, మన జావళీకారులను పిలిపించి, పోషించి, అనుకరించినట్లు కనిపిస్తోంది. క్షేత్రయ్య జావళీలు, ధర్మపురి సుబ్బారావు, తాటితాపు పట్టాభిరామయ్య మొదలగు వారి తెలుగు జావళీలను కలుపుకుని కన్నడ జావళీలు అనే పుస్తకాన్ని కన్నడంలో ప్రచురించారు.
‘జావళీ’ తెలుగు మాట. కన్నడం మాట కాదు. తెలుగు ప్రక్రియను కన్నడంలో అనుకరించారే కానీ జావళీల ప్రారంభం తెలుగులోనే జరిగింది. కన్నడంలోంచి తెలుగు లోనికి రావడం జరగలేదని నిర్ధారించవచ్చు.
శ్రీకృష్ణ దేవరాయల యుగమున తెనుగు భాష ఉచ్ఛ స్థితిని పొంది, ‘దేశ భాషలందు తెలుగు లెస్స’యైనది.
“తెలుగు దేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు కొలువ నెరుగవేబాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స”
దేశ భాషలన్నిటిలోనూ తెలుగుకున్న ప్రత్యేకత స్పష్టమైంది. ఆ ఆకర్షణ వల్లనే అనాంధ్రులైన అనేకులు దాక్షిణాత్య వాగ్గేయకారులు కూడా తమ మాతృభాషలో కంటే తెలుగు లోనే అశేషమైన కృషి చేశారు.
పాశ్చాత్య విద్వాంసులు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని పేర్కొనడానికి కూడా ఇదే కారణమంటే చర్విత చరణం కాబోదు. ఈ సంగతి మొట్టమొదట గ్రహించిన ఘనత ఆంధ్రులై జన్మించిన వాగ్గేయకారులలో ఆది కవియైన తాళ్ళపాక అన్నమాచార్యులే. (12)
అన్నమాచార్య సంకీర్తన:
కేదారగౌళ –
ప. ఏమి చెలియా యేలాగే
వేమారును వెల్లివిరిసీ ప్రేమా ॥
చ.1. తోడి తేదొకో తొయ్యలివానిఁ
దోడితే దొకో తొయ్యలి
వాడీఁజిత్తమిదెవని తరొమై
గాఁడి మదనుని కమ్మవిరులు ॥ఏమి॥
చ.2. తానే రాడొకో దైవమావాడు
తానే రాడొకో దైవమా
నేనోప నిలువంగ నింకను
నానేరువుల నానదు నా మనసూ ॥ఏమి॥
చ.3. వీడే గదవే వెంకటేశుడూ వీడే
వీడె గదవే వెంకటేశుడూ
నాడే నమ్మించి నన్నును
నేడే కౌగిట నెలకొనెనాకు ॥ఏమి॥ (13)
(తా. అ. శృ. కీ. సం. 6-174)
క్షేత్రయ్య పదం:
ఆహిరి – చాపు
ఏమి సేతునే? ఓయమ్మ!
నేనేమి సేతునే?
ఏమి సేతునే? వెన్నెల కాకల-
కెట్లోర్తునమ్మ! నేను
కలకల రవములు చిలుకల పలుకులు
సొలపులు నా మీద ఝలుఝల్లు మనెనే |
అళులచే వళుకుచు సొలపుల వలచితి
తెలతెల్ల వారదే చిలుకల కొలికి! ॥ఏమి॥
మింటచందురు నన్నంటి గాయుగాక
యొంటి నుంటే రాదు కంటికి నిదుర
తుంట విల్తుడు నన్ను కంటగించి నాడు
వింటి వటే| కలకంఠిరో నేడు ॥ఏమి॥
అందమైన మా మువ్వ గోపాలుడైన రంగేశు
మందలించి వాని యిందు తోడి తెచ్చి
పొందు సేయ గదవే – చందన గంధినే ॥ఏమి॥
(క్షేత్రయ్య పదములు 123 – ద్వి.ము. విస్సా అప్పారావు, 1963)
దాసు శ్రీరాములు
ఫరజు – చాపు తాళం
ప॥ ఏమని తెల్పుదునే – కోమలి నా భాగ్య
మేనని తెల్పుదునే – నా ముద్దు సామికి
నా మీద ప్రేమ ॥ఏమని॥
చ॥ 1. చెక్కిలి ముద్దాడెనే – చక్కని నాసామి
చెక్కిలి ముద్దాడెనే
నిక్కముగా నిన్న రేయి – ప్రక్కనే పవ్వళించి
చక్కని కెమ్మోవి నొక్కెనే ॥ఏమని॥
చ॥ 2. బాళిచే నన్నేలెనే – కేళితో నాసామి
బాళిచే నన్నేలెనే
వేళగదే రారలీడాని – విలువగల సొమ్ములిచ్చి
చాలగా లాలించెనే – సోలెనేజాలనే ॥ఏమని॥
చ॥ 3. నాసాటి లేరనెనే – వేణుగోపాలుడు
నాసాటి లేరనెనే
ఆసదీర్చి రామదాస కవి చిత్త
వాసుడాయె పూసెనే గంధము – చేసెనే బాసనే ॥ఏమని॥
(దాసు శ్రీరాములు – జావళీలు పదములు)
అన్నమాచార్య సంకీర్తన, క్షేత్రయ్య పదం, దాసు శ్రీరాముల జావళీలను పరిశీలిస్తే, పై మూడింటిలో వస్తువు శృంగారమే. అది కూడా విప్రలంభ శ్రంగారమే. నాయిక చెవిలో చెప్పుకున్న విరహం. అన్నమాచార్యులు ఒక్కరే రాసిన సంకీర్తనలు, క్షేత్రయ్య ఒక్కడే రాసిన పదాలు, దాసు శ్రీరాములు రచించిన జావళీ వస్తుతః ఒకే విధంగా ఉండడాన్ని గమనించవచ్చు.
మరి జావళీలు – కొన్ని వందల మంది రచించినవి. వీటిలో జావళీలు ఎక్కువ భాగం ఆ కవులు నివసించిన ప్రాంతాల దైవం మీదనో, లేదా వారి యిష్ట దైవం మీదనో రచించినవి కాగా, మరి కొన్ని జావళీలు పోషకుల ముద్రాంకితంగా రచించినవిగా జావళీల పరిశోధన బట్టి నిర్ధారించవచ్చు.
పరిపాలకుడు దైవాంశ సంభూతునిగా భావించడం వల్ల, ఆ ప్రభువుకే అంకితం గావించడం కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా భగవద్భావన కలిగినవి శిష్ట రచనలుగా జావళీలను స్వీకరించవచ్చు.
తెలుగు వాగ్గేయకారుల్లో అన్నమాచార్యులు సంకీర్తనలకు ప్రసిద్ధి వహించాడు. కంచెర్ల గోపన్నగా ప్రసిద్ధి వహించిన భద్రాచల రామదాసు భజన కీర్తనల్ని రచించాడు. క్షేత్రయ్య రచించినవి పదాలయితే, త్యాగయ్య రచించినవి కృతులు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధమయిన పేరుతో వారి వారి రచన సాగించారు. వీరు రచించిన వాటిలో శృంగార పరమైనవీ ఉన్నాయి. వాటితో పాటుగా ఆధ్యాత్మికమైనవీ ఉన్నాయి.
కానీ జావళీ ప్రక్రియ బహు జనాదరణను పొందిన ప్రక్రియ మాత్రమే కాకుండా, అనేక కవుల ఆదరణను కూడా చూరగొంది. దానికి కారణం అందులో భక్తి తత్పరతతో కూడిన, మధుర భక్తికి సంబంధించిన భావజాలం ఉండడమే కాక, భగవంతుని పరంగా చేసిన విరహాత్మకమైన సన్నివేశాల్ని రసమయ్యగా (??) ఆవిష్కరించే వీలు కలిగి ఉండడమే దీనికి కారణం.
అంగుకే క్రీ. శ. 15వ శతాబ్దం నుండీ పరిఢవిల్లిన ఈ జావళీ ప్రక్రియ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ, అశేష మానసోల్లాసియై, సంగీత, సాహిత్యాలకు ప్రయోజనకారియై భాసిల్లింది.
అథోజ్ఞాపికలు
- అన్నమాచార్య చరిత్ర – ద్విపద – పుటలు 45, 46
- సంకీర్తన లక్షణం – పద్య సంఖ్య – పుట 3
- శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర – పుట 36
- కుమార సంభవం – 4-89
- కుమార సంభవం – 4-112
- కుమార సంభవం – 6-85
- శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర – పు 56
- శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర – పు 56
- శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర – పు 37
- క్షేత్రయ్య పదాలు – పీఠిక
- ఆస్థాన నర్తకాలు – పుట 18
- ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము – పుట 1
- అన్నమయ్య ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనలు – సంపుటం – 4, సంకీర్తన 174
- క్షేత్రయ్య పదములు – పుట 123