పదమంటే పాట మాత్రమే కాదు. క్షేత్రయ్య దృష్టిలో కూడా “పద”మంటే కేవలం శ్రంగార పదం మాత్రమేనన్న భావం లేదు. “గోపాలుడు గానలోలుడు” కాబట్టి పదాలకై ప్రలోభపడవచ్చు. ఆ ప్రలోభత్వం గానపరమైనది గాని నవరసాల్లో ఒకే ఒక శ్రంగార రస పరమైనది మాత్రమే కాదు. ఏ రసమైన పదానికైనా గోపాలుడు ప్రలోభుడవుతాడు.
నవరస పదాలలో శ్రంగారేతర పదాలకంటే శ్రంగార పదాలకు ఎవరైనా మరింతగా ప్రలోభులవుతారంటే అది వేరుమాట. ఒకవేళ “ఏమనే వానతీరా” అన్న పదంలో “పదము పాడగా వినేవో” అనడంలో కేవల శ్రంగార పదాన్ని ఉద్దేశించి “పద”శబ్దమే (శృంగార పదాన్నైనా పదమనవచ్చు కాబట్టి) వాడినా అప్పుడది విశేష నిర్దష్టమై శృంగార పదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయోగితమైనదే అవుతుంది గానీ “పద”మంటే కేవలం “శృంగార పదమే”నన్న భావానికి తావీయదు. శృంగార పదాన్ని పదమని పేర్కొనడం వేరు. శృంగార పదం మాత్రమే “పద”మనడం వేరు గదా!
పాటల పరంగా “పద” శబ్దం చేత అనేక విధాలైన పాటలు – ఛందోపరంగా – రసాల పరంగా – భావాల పరంగా – రాగ తాళాల పరంగా – ఎన్ని విధాల పాటలున్నాయో అన్నీ గ్రాహ్యాలే అవుతాయి.
ఈ రకరకాల పదాలలో సంసార పదాలు – మాయా పదాలు – స్తవ పదాలు – తుమ్మెద పదాలు – ప్రకృతి పదాలు – పర్వత పదాలు – ఆనంద పదాలు – శంకర పదాలు – నారాయణ పదాలు – బ్రహ్మ పదాలు – శూన్య పదాలు – తత్త్వ పదాలు – కస్తూరి రంగ పదాలు – నివాళి పదాలు – వాలేశు పదాలు – గొబ్బి పదాలు – వెన్నెల పదాలు – సంజ వర్ణన పదాలు – గుణ వర్ణన పదాలు – శృంగార పదాలు – వీర పదాలు – కరుణ పదాలు – అద్భుత పదాలు – హాస్య పదాలు – భీభత్స పదాలు – భయానక పదాలు – రౌద్ర పదాలు – శాంత పదాలు – నామ పదాలు – (క్షేత్రయ్య పదాలు – విజయ రాఘవ పదాలు వంటివి) కథా పదాలు – సమ పదాలు – జాళ పదాలు – సారంగ పదాలు – పాళి పదాలు – గొల్ల పదాలు – చెంచు పదాలు – మొక్కుబడి పదాలు – పోలేరమ్మ పదాలు – కూనలమ్మ పదాలు – సాంగత్య పదాలు – చాన పదాలు – అనువు పదాలు – అలుక పాటలు – అప్పగింత పాటలు – చెండ్లాట పాటలు – అల్లో నేరేళ్ళ పదాలు – కోతి ఆట పదం – తలంటు పాట – తిల్లాన పాట – దండె ఆడింపు పాట – నలుగు పాట – బందులాట పాట – సంవాద పదాలు – కదురు పదాలు – దూదేకు పదాలు – ఊయెల పాటలు – జోల పాటలు – లాలి పాటలు – మేలుకొలుపులు – మంగళ హారతులు – పెళ్ళి పాటలు – తలుపు దగ్గర పాటలు – గర్భా దానపు పాటలు – వివిధ క్రీడా పదాలు – రోకటి పాటలు – ఊడుపు పాటలు – కోలాటపు పాటలు – భజన పదాలు – గౌడు గీతాలు – జాజర పాటలు – బండి పాటలు – ఊత పదాలు (కష్టమైన పనులు చేసేడప్పుడు పాడే పాటలు) – ఏల పదాలు – ఈల పాటలు – చిలుక పదాలు – గోరువంక పదాలు – సువ్వి (సువ్వాల) పాటలు – ధవళాలు – దరువులు – బ్రతుకమ్మ పాటలు – చందమామ పాటలు – లేలే పాటలు – నీతి పదాలు – బూతు పాటలు – వేదాంత పదాలు మొదలైన పదాలు రకరకాలు గ్రాహ్యాలవుతాయి.
కోట్లాది దేవతలున్నారు. ఆయా దేవతలందరి పైనా విడివిడిగా పాడబడే పాటలు – శంకర పదాలు – నారాయణ పదాల వలె వేరువేరుగా ఆయా దేవ నామాల తోటి పదాలుగా వ్యవహృతాలవుతాయి.
ఇంద్ర పదాలు – కుమార పదాలు – వీరభద్ర పదాలు ఇత్యాదిగా పదాల పేర్లు రూపొందుతాయి. యీ విధంగానే వివిధ వర్ణలకు సంబంధించిన పదాలు ఆయా వర్ణన నామక పదాలుగా పేర్కొనబడతాయి.
ఎన్నెన్ని విధాలుగా ఉన్న యీ పదాలలో కొన్నిటిని పాల్కురికి సోమనాథుడే పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు. ప్రజల్లో ప్రత్యేకించి – పాటక జనుల్లోనూ – కష్ట జీవుల్లోనూ – వివిధ ప్రాంతాల్లో ఏ పాటలో చెప్పలేని – పేర్లు తెలియని పాటలు యింకా అనేకం ఉన్నాయి. అయితే ఎన్నెన్ని పాటలు ఉన్నాయో అన్నింటికీ మాత్రా ఛ్ఛందస్సులే ఉన్నా అన్నీ ఏకైక ఛందోబద్ధాలు కావు. వీటిని ఛందఃపరంగా వివిధ వర్గాలుగా విభజించడానికి వీలున్నా పాడే వరుసలల్లో – తాళ పద్ధతుల్లో భిన్న భిన్నాలుగా ఉంటాయి.
మరీ విచిత్రమేమంటే మాత్రలు సమానంగా వున్న పాటలు కూడా పద బంధాల కూర్పుతో – విరుపులతో – రాగ తాళాలలో మార్పు చెందుతాయి. మాత్రా ఛ్ఛందాలలో వున్న ప్రత్యేకతే ఇది. చివరికి ప్రథమాక్షరం దీర్ఘమై సాగే పాటకు – ద్వితీయాక్షరం దీర్ఘమై సాగే పాటకు మాత్రా సమకత్వం వున్నా రాగ తాళ లయల్లో భిన్నత్వం ఉంటుంది.
అనంతమైన భేద నాదాలతో విలసిల్లే యీ పదాలన్నీ “పద” శబ్ద వాచ్యాలే – కాగా “పద”మంటే కేవలం శృంగార పదం మాత్రమేనన్న భావం పరివ్యాప్తి చెందడం విస్తృతార్థం కల పద శబ్దానికి అవ్యాప్తిత్వార్థాన్ని రూపొందించడమే కాగలదు.
ఒక్క క్షేత్రయ్య కాలం లోనే కాదు – ఆ తరువాతి తంజావూరు రాజుల కాలంలో అవతరించిన పద సాహిత్యం కూడా కేవలం శృంగార పరమై మాత్రమే లేదు. త్యాగేశ పదాలు – వేంకటేశ పదాలు – నాన విధ పదాలు – నీతి పదాలు – హాస్య పదాలు మొదలైన భేదాలతోనే అవతరించింది. కాగా తంజావూరు నేలిన మహారాష్ట్ర రాజుల కాలంలో కూడా “పద”మంటే కేవలం శృంగార పదం మాత్రమేనన్న భావం యేర్పడి ఉన్నట్లు కనపడదు.
అయితే “పద”మంటే “శృంగార పదమే”నన్న భావం సంఘంలో ఒక విధంగా కొంతకు కొంతైనా కలిగిన మాట కాదనలేం. ఈ భావోత్పత్తి అకారణంగా జరిగింది కాదు. ఏదో ఒక విశిష్ట కారణం లేకుండా యే భావమూ ఉత్పన్నం కాదు.
ఏదైనా పొరపాటు జరిగితే అది జరగడం అకారణంగా ఎప్పుడూ జరుగదు. భ్రమో – ప్రమాదమో – అలసత్వమో – అభిమాన – నిరభిమానాలో ఇత్యాదిగా యేదో ఒకటి కారణం మూలమై జరుగుతుంది. అలాగే జావళీ పద వ్యుత్పత్తి విషయంలో వలెనే లక్షణ విషయంలో కూడా విమర్శక లోకంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
నేటి లోకంలో జావళీ చౌకబారు శృంగార సంగీతమనే అభిప్రాయం రూఢియై పోయింది. కానీ జావళీల రచనారంభ కాలంలో ఇవి భగవన్నుతికి సంబంధించినవిగా వెలుగు చూశాయి. భగవంతునితో ఐక్యానికి (జీవేశ్వర పరమేశ్వర ఐక్యానికి) కల గీతాలుగా పుట్టుక నొందాయి. జావళీకారులు ప్రసిద్ధ సంగీతజ్ఞులు, పండిత వర్యులు, భక్తి తత్పరులు. వారే కాక మహారాజులు పరమ భక్తితో తమ ఆస్థాన పండితులచే రాయించడమే గాక, తాముకూడా రచించి భగవదర్పణం గావించిన భక్తి తత్పరులు.
జావళీకారులు వాగ్గేయకారులు కూడా. సామాన్యులు కారు. పుట్టుకలో పరమేశ్వర ప్రీతికై రచింపబడిన ఈ జావళీ కాలక్రమంలో లౌకిక శృంగార ప్రీతికై పాడబడే స్థాయికి దిగజారింది. ఈ విషయంలో ప్రసిద్ధ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ తమ దాక్షిణ్యాత్యుల నాట్య కళా చరిత్ర అనే గ్రంథంలో ఇలా వివరిస్తున్నారు.
“ప్రారంభమున నృత్యకళ ప్రత్యేకముగా ఆరాధనకై వినియోగింపబడినను, క్రమ క్రమేణ గర్భాలయములను విడిచి, కల్యాణ మండపము యొద్ద ఉత్సవ మూర్తుల కెదురుగా ప్రదర్శింపబడు రీతి ప్రారంభించెను. నాటి నుండి వారికి తెలియకనే కళలలోని పవిత్రతను కోల్పోవుట ప్రారంభమయ్యెను.
ఆలయమందు మాత్రము శాస్త్రీయ సంప్రదాయాలను అనుసరించి, ఉత్సవ మూర్తులు ఆలయము దాటి తిరు వీధులందు ఊరేగింపులలో బయలుదేరునప్పుడు ఆలయ సంగీత విద్వాంసులు, నాట్యాచార్యులు నర్తకీ మణులు కూడా ఆలయమును విడిచి రాచ బాటల యందు తమ విద్యా ప్రదర్శనము గావించిరి.
బాట యందు ప్రదర్శింపబడిన నృత్యం చాలా వరకు ప్రజా రంజకపు కళగా మారి పూర్వపు పవిత్రతను గోల్పోయెను.
ఇట్లు ఆరాధనా నృత్య కళ కేవల వినోద కళగా రూపొందెను. ఇట్టి నృత్య కళ గణికల (రాజ నర్తకీ మణుల) ద్వారా రాజ దర్బారులందు ప్రవేశించి స్వామికి బదులుగా ప్రభువుల స్తోత్రములతో నిండి ఆస్థానమందు చేరిన పండితుల, రసిక జనుల రంజింప చేయు వినోద విద్యగా పెంపొందినది.
ఈ విధముగ ఆరాధన నృత్యము ఆలయమును వీడి, ఆలయ ప్రాంగణము దాటి, రాచబాటను నడచి, ప్రభువుల దర్బారు ప్రవేశించి, వారి అభిరుచులను అనుసరించి వన్నెల చిన్నెల నలవరచుకొని తన ఆదర్శమును మరచి, తన పూర్వ ప్రతిభను గోల్పోవుట మొదలిడినది. దేవదాసీ సాంప్రదాయము – త్యాగముతో గూడిన, నియమ బద్ధమైన జీవితము. ఆలయములందు స్వామిని తమ నృత్య కళచే ఆరాధించి, ఆలయము యొక్క ఆదాయములపై ఆధారపడి జీవించేవారు దేవదాసీలు. కనుకనే వారికి సంఘములో గౌరవము ఎక్కువగా ఉండినను వారి జీవితములు అతి నిరాడంబరముగా నుండినవి.
పవిత్ర గంగా జలము వలె నిష్కళంకమైనట్టి దేవ నర్తకి జీవితము నానాటికి దిగజారి అధఃపతనము పొందినది.”
దేవదాసీల నృత్య విషయంలో లాగే జావళీల విషయం లోనూ పతనావస్థ ప్రాప్తించింది.
ఆదిలో ముద్రింపబడిన జావళీల పుస్తకాల మీద ఆయా ప్రచురణ కర్తలు, రచయితలు వెలువరించిన అభిప్రాయాలు పరిశీలించినట్లయితే జావళీలపై వారికి గల భావాలు ప్రస్ఫుటాలవుతాయి.
“శ్రీకృష్ణ లీలా ప్రతిపాదకములగు పదములు, కృతులు, జావళీలు” –
“1887వ నందగాన విద్యా వినోద రసిక జనానందకరముగ
వేలూరి గ్రామ నివాసియగు ఫస్టు గ్రేడు ప్లీడరుగారగు
శ్రీ దాసు శ్రీరాములు గారిచే రచియించబడిన జావళీలు
ముద్రితము 1893″
“సంగీత సాహిత్య విద్యా విశారదులగు
పెక్కండ్రుచే రచింపబడిన శృంగార జావళ్ళు” –
“మైలవరపు వెంకయ్య శాస్త్రుల వారిచే
రామానంద ముద్రాక్షరశాల యందు
ముద్రింపించి ప్రచురింపబడియె. 1900″
“స్త్రీల కత్యంతోపయోగంబుగ ప్రాచీన
కవి పుంగవులచే రచియించబడిన జావళీలు”
“కాకినాడ కమలా ముద్రాక్షరశాల యందు
ముద్రించి ప్రకటింపబడియె. 1911″
“శ్రీరామవరం కాపురస్తులు గబ్బిట యజ్ఞన్న శాస్త్రి గారిచే రచియినంపబడిన కృతులు, జావళీలు, భజన కీర్తనలు గల ఈ పుస్తకము మిక్కిలి చక్కని ముద్దులొలుకు పలుకులతో మంచి రసవంతముతో మృదుమధుర శైలితో గలవి, 1912”
కృతులకూ, భజన కీర్తనలకూ నడుమ జేర్చిన జావళీలు కూడా భక్తి సంబంధమైన వేగాన్ని కలవి. కేవల శృంగార సంబంధమైనవి కావు.
ముద్రణ పొందిన జావళీ పుస్తకంపై గల అభిప్రాయాలతో సరిపోయే అభిప్రాయాలు గల Capt. C.R. Day వాక్యాలు ఇక్కడ ఉదహరించదగ్గవి.
“Javadis are songs of a light and pleasing nature, such as love songs, cradle songs, etc. They are much sung by both Nautch Girls and all, especially women of the Higher classes in domestic life.
The Words of Javadis are often very beautiful and those upon the loves of Krishna and Radha are always popular. Musicians as a rule sing these songs more in their naked form and with less grace than is their usual custom.
These songs are of comparatively recent introduction, being first sung by the Kanarese musicians of the court of Surapuri, a petty state near the celebrated Hempe ruins. The popularity of songs of this kind increased rapidly and they are now to be heard throughout almost the whole of South India, where they take the place of the Tappa of Hindusthan.”
(The Music of Southern India, Captain C.R. Day, 1891 p.p. 8-87)
C.R. Day “అంతలోనె తెల్లవారె” అనే జావళీకి పాశ్చాత్య పద్ధతిలో స్వరపరచి తన గ్రంథంలో ఉట్టంకించడం జావళీపై ఆయనకు గల గౌరవానికి సదభిప్రాయానికి నిదర్శనం. (చూడు అనుబంధం 1).
జావళీల ఆవిర్భావ వికాసాలను పూర్తిగా గమనించినట్లయితే – ఇవి భక్తుడు ప్రేమ భావనతో పరమేశ్వరైక్యాన్ని పొందడానికి ఆర్తిపూర్వకంగా చేసిన విన్నపాలే కానీ వేరే కావని స్పష్టమవుతుంది.
ఈ సృష్టిలో పరమేశ్వరుడొక్కడే పురుషుడు. ఆ పరమ పురుషుని సంయోగానికై జీవులు స్త్రీభావంతో ఐక్యతను ఆపేక్షించారు. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ ప్రణయ మార్గంలోని సౌలభ్యాన్ని గ్రహించి సరస సంభోగ భావ మాలికలను జావళీలుగా గూర్చి పరమేశ్వరునికి అంకితం చేశాడు.
తాను విరహి, ఖండిత విరహోత్కంఠిత అయ్యాడు. విప్రలంభ శృంగారంలోని మాధుర్యమనే పరమేశ్వరోద్దిష్ట మార్గంలో పుష్కలంగా అనుభవించాడు. ఆ అనుభూతి నుండి సర్వాత్మనా స్త్రీయై స్త్రీ మనో భావాలను జావళీలుగా వ్యక్తం చేశాడు. ఇట్టి పరమ పవిత్ర శృంగార భావననే భారతీయులు తత్త్వంగా గౌరవించారు.
ఉదాహరణకు –
బేహాగ్ – ఆది తాళం
ప॥ మనసిచ్చి నాతో – మాటాడవేమిరా ॥మనసు॥
చ॥ 1. మనవి వినరాదా – మమతింత లేదా
మునుపటి చెలిమి కాదా – మోదము కాదా ॥మనసు॥
చ॥ 2. విను నేను చాల – విడనాడ మేలా
చనువుంచుమీ చాల – జాలమీదేలా ॥మనసు॥
చ॥ 3. వరదాసు శ్రీరామా – వన సుగుణ ధామా
శరణు నన్నేలు ప్రేమ – శ్యామాభిరామా ॥మనసు॥
ఇక్కడ నాయిక హృదయైక్య భావాతిశయంతో నాయకుని మీద గల విరహానికి రాళలేక నాయకునితో సమైక్యాన్ని కోరుకుంటోంది. భగవంతుని కేవలం దేవునిగా మాత్రమే చూడక, తన హృదయానికి దగ్గరైన వానిగా భావించి, భక్తితో రమించి, తాదాత్మ్యం చెందడం మధుర భక్తి కోవకు సంబంధించినదే.
మధుర భక్తిని గూర్చి ఆచార్య శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారి అభిప్రాయాలను పరిశీలిస్తే ఈ విషయం సుబోధమవుతుంది.
“ప్రజాపతి ఈ ప్రపంచమును సృష్టించుటకు తనను రెండుగా చేసి పడవేసినట్లు ఉపనిషత్తులు చెప్పుచున్నవి. ఒకటి పత్నిగ, రెండవది పతిగను అయినవి. ఆ యిరువురను అనంతముగనైరి. ఒకటి అనంతమైనట్లు, అనంతము ఒకటి కూడనగును.
బాహ్యార్థములో స్త్రీ తనకిష్టుడైన వానితో కలయును. తన భావనతో కలవని వానిని తిరస్కరించును. అట్లా జీవాత్మ పరమాత్మతో విడిపోయినను తన నిజ స్వరూపమును తెలుసుకొని పరమాత్మలో ఐక్యమగుటకు తహతహలాడును.
‘సర్వపాణి సమైక్యమునకు పూలబాట లనదగిన అనురాగ, భక్తి, ప్రేమ, ప్రణయ, వాత్సల్యాది హృదయ భావములన్నియు శ్రంగార గర్భితములై జీవునకు స్వర్గ సుఖము నిచ్చుచున్నవి. ఆ దివ్య సుఖమే జీవేశ్వరైక్య భావనకును, సర్వ ప్రాణి సమానత్వ భావనకును, అనుభవమునకును సాధన మగుచున్నది.
మానవుని జీవిత పరమావధి, జీవేశ్వరైక్యము. శ్రంగార రసము ఆధ్యాత్మిక సిద్ధికి ఛాయ అగుటయే కాక దానిని ప్రతిఫలింప జేయు ముకురము కూడ అగుచున్నది. శృంగార రసానుభవశాలి, తన ఆత్మను పరమాత్మలో సుకరముగా లీనము చేయగలడు. హృదయము ప్రేమ పూరితమైనప్పుడు ఆత్మ భగవంతుని పదముల వ్రాలియుండును.’
మానవ సృష్టికి ఆది కారణమైన కామవాసన సర్వ మానవ సామాన్యము. ఇది మానవ సాధారణమే కాక, సర్వ ప్రాణి సాధారణము కూడ. స్థావర ప్రకృతి యందును ఈ వాంఛ కలదని కొన్ని శాస్త్రములు చెప్పుచున్నవి. కావున మానవేతర స్థావర జంగమాత్మకమైన ప్రపంచ మంతయు ఈ కామవాసనా పూర్వకము గనే ప్రవర్తించు చున్నది. అందుచే శృంగారమునకు కారణమైన కామవాసన కున్న విశ్వ వ్యాప్తి తక్కిన వాటికి లేదు”. (3)
అందువల్లనే శృంగారానికి గల స్థాయీ భావమే భక్తికి కూడా ఉంది. అది రతి. అంటే ఆసక్తి. భగవంతుని ఎడల భక్తునికి గల ప్రేమ భావం పైనే సర్వ సుఖాలూ ఆధారపడి ఉన్నాయి. అవ్యాజమయిన భక్తి లభించాలంటే అపారమైన ప్రేమ కావాలి.
‘సాపరా అనురక్తిరీశ్వరే’ అనే శాండిల్య సూత్రం ఆధారంగా భగవంతునిపై గల ప్రేమ ఆధారం గానే భక్తి సాయుజ్య ముఖంగా సాగుతుంది. ఈ విషయాన్నే పింగళి వారు తమ సాహిత్య విమర్శనా గ్రంథమైన సాహిత్య శిల్ప సమీక్షలో ఈ విధంగా అభిప్రాయాన్ని ప్రకటించారు.
“ఈ రతిలో ప్రేమ భావము యిమిడి యున్నది. ప్రేమ లేని భక్తి సాయుజ్య సుఖము నీయజాలదు. ప్రేమ రహితుడైన భక్తుడు భగవంతునకు దూరుడగును. ప్రేమతో నిండిన భక్తుడు భగవంతుని పాదములు ముద్దిడు కొనుచు, ఆయనచే ముద్దిడు కొనగోరుచు తమ యిరువురకు హృదయైక్యమును భావించుకొనును. ప్రేమ భక్తికి సజాతీయము.
ఈ ప్రేమ మిళిత భక్తియే మధురాతి మధురమైన ప్రణయముగా పరిణమించును. ఆ భక్తుడు తాను ప్రేయసిగా, భగవంతుడు ప్రియుడుగా విరహ బాధ ననుభవించును. ఆ క్షణములో అతనికి సాయుజ్య సుఖము కలుగును. జీవన్ముక్తుడగును.
అట్టి భక్తుడు చేసెడి చేష్టలు, పలికెడి మాటలు, లోకమునకు విపరీత కృత్యములుగా తోచినను భగవంతునికి మాత్రము మురిపెంపు చెయ్వులేయగును. ఒక్కొక్క భక్తుని మనస్తత్వమును బట్టి భక్తితో ప్రేమ కలిసి యుండుననియు, అది ప్రణయముగా మారి శృంగారముగా పర్యవసించుననియు రత్యాలింగితమైన ఈ భక్తినే వైష్ణవ సంప్రదాయమున మధుర భక్తి అనియు నందురు.”(4)
జీవుని నిత్య దేహంలో లింగభేదం లేదు. సాధకుడి రసంలో తన గోపీ దేహాన్నే భావిస్తూ శ్రీ రాధికా యూధంలో ప్రవేశ లాభాన్ని పొందుతాడు. సాధన దేహంలో పురుషత్వం ద్యోతకమౌతున్నప్పటికి భావ దేహంలో తాను గోపికే అవుతాడు. ఇది అసంభవమని యెన్నడూ అనుకోరాదు. జీవుడు కేవలం కృష్ణుని తటస్థ, స్థూల దేహంలో వలెను పురుషత్వమూ, స్త్రీత్వమూ కల్పితాలవుతూ ఉంటాయి.
లింగ దేహంలో కూడా స్త్రీ పురుష ప్రాగ్భావముదయించే ఉంటుంది. జీవుని నిత్య దేహం చిన్మయమైనది. దానిలో స్త్రీ పురుష భేదం లేదు. చిన్మయాత్మకమైన శరీరం స్వతంత్రమూ, శుద్ధ కామ మయమూ. అపుడే భావం పొందాలను కోర్కె కలిగినట్లయితే ఆ భావాన్నే శుద్ధ జీవుడు పొందుచు తానే స్త్రీయునూ, పురుషుడుకూలవుతున్నాడు.
మధురోజ్వల రసంలో సకల జీవులూ శుద్ధ స్త్రీ రూపులే అయి పరమ పురుషుడయిన శ్రీ కృష్ణుణ్ణి సేవిస్తారు.
“వాలాగ్రశత భాగస్య
శతధా కల్పితస్యచ
భాగోజీవస్య విజ్ఞేయః
సచనంత్యాయ కల్పతే ॥”
నైవస్త్రీ నపుమానేష
ననైవాయం నపుంసనః
యధచ్చ రారమాదత్తే
తేన తేన సరక్ష్యతా॥” (5)
ఇదీ జావళీ ప్రాభవం.