3.2 లాక్షణికుల విశ్లేషణ lAkshaNikula viSlEshaNa (WIP)

సంగీత ప్రపంచంలో జావళి – కన్నడ పదమయిన జావడి నుండి వచ్చిందనే భావన ఉంది. జావడి అంటే lewd poetry అనే అర్థమని నమ్మడంతో జావళీ స్థాయి దిగజారి పోయింది.

పవిత్రమైన, ఉదాత్తమైన, భావ భరితమైన జావళీ సాహిత్యంపై 1914లో శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి గారు తమ “కవిత్వ తత్త్వ విచారము” అనే విమర్శ గ్రంథంలో జావళీల శృంగారంపై వ్యతిరేకాభిప్రాయాలను వెలువరించారు. వారి అభిప్రాయాలను సాహిత్య విద్యా ప్రకాండులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు బలపరచారు.
దానితో విమర్శ లోకమెల్ల గతాను గతికంగా స్వయంగా చదవకుండా, ఆలోచించకుండా వారి అభిప్రాయాలనే సమాదరించి జావళీలపై చిన్న చూపును ఏర్పరచుకొన్నారు. కట్టమంచి రామలింగా రెడ్డి గారు తమ గ్రంథం అయిన “కవిత్వ తత్త్వ విచారము”లో వివిధ సందర్భాలలో కళా పూర్ణోదయం, ప్రభావతి ప్రద్యుమ్నములలో గల శృంగారాన్ని విమర్శిస్తూ జావళీ శృంగారంతో పోలుస్తూ ఈ విధంగా వారి అభిప్రాయాల్ని ప్రకటించారు.

ఇందులోని శృంగారమనునది జావళీలకు తోడు పోయినది (6)

ఇది గరువ తనము. మిత భాష లేని జావళీ సరసము. (7)

జావళీల కన్న నికృష్టమైన పాళెయగాండ్ర శృంగారము. (8)

మానము మరుగు, సామరస్యము గల శృంగారమెక్కడిది, శృంగారమునకు బదులు జావళీలు వచ్చి చేరును. (9)

జావళీ శృంగారము తప్ప ఇంకే రీతియు వారెరుగరు. అందరి శృంగారము ఒక రుచి కలిగిందే. (10)

కళా పూర్ణోదయమున ఐదునకు తక్కువ గాని విధముల శృంగారము వర్ణింప బడియున్నది. ఇందు జావళీలకు చేరినది ఒకటి మాత్రమే. (11)

కవిత్వ తత్త్వ విచారము లోని రెడ్డిగారి అభిప్రాయాలను కూలంకషంగా పరిశీలించకుండా పలువురు విమర్శకులు ఆ అభిప్రాయాలను శిరోధార్యం చేయడంతో జావళీల పవిత్రత మరుగున పడి పోయింది. అంతే కాక దాని గౌరవం కోల్పోవడం, అక్కడితో ఆ ప్రక్రియ అంతరించి పోవడానికి కూడా రెడ్డిగారి విమర్శే కారణమయింది.

కానీ స్థిరంగా, నిష్పక్షపాతంగా బుద్ధి నిలిపి ఈ జావళీ సాహిత్యాన్ని పరిశీలిస్తే ఈ విషయంలో విమర్శకుల దృష్టిలో జావళీలకు జరిగిన అన్యాయం జరిగి ఉండేది కాదని చెప్పవచ్చు. కట్టమంచి వారి అభిప్రాయాలు లోకంలో వ్యాప్తిలోకి వచ్చిన తరువాత జావళీలపై పలువురి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.

వింజమూరి వరాహ నరసింహా చార్యులు తమ కర్ణాటక సంగీత పరిణామ గ్రంథంలో ఇలా చెప్పారు.
“జావళ్ళు సంభోగ శృంగారమున నాయకుని కట్టెదుట అనుభవించు రీతులు చెప్పునవిగా రసజ్ఞతతో నుంచును.”

“జావళీలు రస భావ అభినయాలకు ప్రాముఖ్యత వహిస్తాయి. భగవంతుని పూజించి తమకు తాము అర్పించుకోవడం నృత్యం ద్వారా సాధ్య పడుతుందని భరత నాట్య శాస్త్రం చెబుతోంది.” అని పద్మినీ రావు అభిప్రాయం.

రామలింగ శాస్త్రి – మంగిపూడి వారి భావన
“ప్రసిద్ధ వారాంగనలు – అభినేత్రులే గాక కర్ణాటక గానమును, శాస్త్రీయముగా అభ్యసించుటయే గాక, అమర కోశమును క్షుణ్ణముగా చదివి, తాము పాడే పదాలు, జావళీల లోని అర్థ భావానుగుణ్యముగా అభినయించి హావ భావాలను ప్రకటించేవారు.

భరత నాట్యంలో వీటికి అగ్ర స్థానం ఉంది. అరియకుడి రామానుజయ్యంగారి వంటిరసిక గాయకులు ప్రత్యేకంగా తమ కచేరీలలో జావళీలకు స్థానమిచ్చారు. మహా వైద్యనాథయ్యర్, కోయంబత్తూరు రాఘవయ్య వంటి వారు గాన సభలలో వీటి జోలికి పోలేదు. కేవలం భగవన్నామ తత్పరులగు వీరు ఐహిక భోగాలకు తావిచ్చే నీచ శృంగారపు జావళీలను, చివరకు మువ్వగోపాల పదాలను కూడా బహిష్కరించారు.
ఆ కోవకు చెందిన వారిలో శ్రీ హరి నాగ భూషణ మహాశయుదు ఒకడు. ఆహారానికి షడ్రుచులు ఎలా అవసరమో సంగీత కచేరికి కూడా నవరసాలలో చేరిన శృంగార రసం పరమావశ్యకమని తలచి కొందరు విద్వాన్సులు పామర రంజనార్థం జావళీలను పాడదొడగారు.

“జావళీ కేవలం అమంగళం, అపవిత్రం కాదు, దీన్ని పాడి మెప్పించడం అందరికీ వలను పడదు. జావళీని నేడు గాయకుల కచేరి ముగిసే ముందు పాడి మంగళ మిచ్చుట ఆచారముగా ప్రబలినది” (12) అని పేర్కొన్నారు.

శ్రీ జానకిరాం ఎస్. ఆర్. గారు “సంగీత శాస్త్ర సారము” అనే తన గ్రంథంలో ఇలా పేర్కొన్నారు. క్రీ. శ. 19వ శతాబ్దంలోనే జావళీ పుట్టింది. కన్నడ పదం “జావడి”, “జావళి” అయింది. అనగా ఒక విధమైన అసభ్యకర రచన. పదాలలో నాయిక గౌరవమైన పాత్రగా ఉండగా జావళీలలో నాయిక ఆ విధంగా లేదు. జావళీలలో సాహిత్యం ద్వంద్వార్ధంతో కూడుకుని ఉండదు. పదాలలో నాయికా నాయకులు అంతర్గతమైన భావంతో బహిర్గతమైన అర్ధంతో నిండియుండి గౌరవమైన పాత్రలుగా నుందురు. కానీ జావళీ నాయకుడు విశ్వాసం లేని పాత్రగా కనిపించును.

సంపత్‌కుమారాచార్య వి.ఎస్. కర్ణాటక పారిభాషిక శబ్ద పద కోశాన్ని రూపొందించారు. అందులో –
“జావళి కన్నడ ‘ జావడి ‘ పదానికి రూపాంతరం. శృంగార రస ప్రధానమైనది. జావళీ సాహిత్యం ఐహికం. పదాలలో సాహిత్యం దైవికం. జావళి అరబ్బీలో Jalali నుండి వచ్చి వుంటుంది. Jalali అంటే ఉత్తేజ పరచునది అని అర్ధం. మానవ హృదయంలోని అంతరాంతరాలలోని మౌలిక భావాలను స్పందింపచేసి ఉత్తేజ పరిచేది. ఇది శృంగార గీతము. స్వచ్ఛమైన ప్రేమ గీతము. పంచేంద్రియములకు లోబడి ఉండేది. భావము లోనూ అంతర్భావము లోనూ ఇది ప్రాపంచికము. ఇది లౌకికము.” అనే అభిప్రాయాన్ని ప్రకటించారు.

చెన్నకేశవయ్య గారు
“జావళీలు తేలిక శైలి కలిగినవి. శృంగారాత్మకంగా ఉన్నటువంటి ఈ గీతాల్లో ఉండే శృంగార వర్ణన అంత ఉదాత్తంగా కనిపించదు. శ్రోతలకు ఈ రకం గీతాలు నిషిద్ధం. అయినా అవి ప్రసిద్ధమైనవి. ఈ గీత రచయితలు చాలా మంది వారి వారి ఊళ్ళలో ఉన్న అభిమాన దేవునికి అంకితం చేశారు. కొంతమంది వారిని పోషించిన పోషకులకు అంకితం చేశారు. వీటిని దేవదాసీలు దేవాలయాలలో పాడుతూ నాట్యం చేశారు. నృత్యం చేస్తూ ఏకాంతంగా పాడారు. వారి పోషకుల ముందు కూడా నృత్యం చేస్తూ పాడారు.
కచేరీలు ముగించే ముందర ప్రసిద్ధ గాయకులు శ్రోతల కోరికపై ఒకటి రెండు గీతాలు పాడుతారు. మధుర నాయికగా భగవంతుని అనుగ్రహాన్ని భక్తుడు పొందినట్లుగా నాయిక, నాయకుని అభిమానాన్ని చూరగొంటుంది. జావళీ సాహిత్యం గౌరవప్రదమైంది కాదు. నీచ స్థాయికి చేరుకుంటుంది.” (13) అని పేర్కొన్నారు.

శాస్త్రి బి.వి.కె గారి అభిప్రాయం:
“జావళీలలో భాష అసభ్యంగా ఉంటుంది. జావళీ వినోదం కల్గిస్తుంది. కన్నడంలో గల అతి ప్రాచీన జావళీలు ‘ శ్రంగార పదాలు ‘ వ్రాత ప్రతుల్లో ఉన్నాయి. మైసూరులో గల కన్నడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఇది లభ్యం అవుతుంది. అందులో కప్పానిచే రచింపబడియిన జావళీలున్నాయి. అవి మైసూరు యొద్ద గల నంజంగడ్ నందు గల నంజుడేశ్వరునికి అంకిత మీయబడ్డాయి. వీటిని వైరాగ్య జావళీలుగా పేర్కొన్నారు. జావళీకి గల అపఖ్యాతి పోయేట్లుంది ఈ పేరు.
ఈ కప్పాని క్రీ.శ. 1800కి చెందినవాడని కీ.శే. డా॥ ఆర్. నరసింహాచారి గారి అభిప్రాయం. ఈ కాలం జావళీల పంట పుష్కలంగా ఉందని చెప్పాలి. ఈ జావళీలన్నీ పురాతన దేవాలయాల్లో గల దేవునికే అంకితమియ్య బడినవి.” (14)

సత్యనారాయణ వై. గారి అభిప్రాయం ఇలా ఉంది:
“జావళికి ఒక అపఖ్యాతి ఉంది. అసభ్య పదజాలంతో, నీచ శృంగార సాహిత్యంతో కూడినదని. జావళీకారులు తమ తమ ఇష్ట దేవతలకు మొర పెట్టుకున్నట్లున్నాయి. అందులో ప్రేమను రాధాకృష్ణ, శివపార్వతుల మధ్య కలదిగా శృంగార కావ్య పధ్ధతిలో ఉన్నట్లు కనిపిస్తుంది.
పదాలలో కనిపించే నాయికా నాయకుల భావం జావళీలలో కూడా చోటు చేసుకుంది.
రసమంజరిలో అష్టవిధ శృంగార నాయికలు జావళీలలో చోటు చేసుకున్నారు. పదాలలో వలెనే ఆహ్లాదం కలిగించే, ఆసక్తిని రేకెత్తించే, గౌరవ ప్రదమైన ప్రేమ జావళీలలో ఉంది. పదానికి, జావళీకి గల తేడా కేవలం సంగీత రచనా విధానంలోనే.” (15)

రీతూ రాజన్ – “ధర్మపురి జావళీ ‘సామి రాడాయనే’ భక్తి అంతర్లీనంగా ఉంది” అన్నారు.

అలిపిరాల సత్యనారాయణ మూర్తి గారు:
“సంగీత శబ్దార్ధ చంద్రిక. జావళీ ముఖ్యముగా వినోదము కొరకు రచింప బడిన సంగీత రచనకు గల పేరు. శృంగార రస ప్రధానమగు నాయికా నాయక లక్షణము ననుసరించి ఉండును” అని చెప్పారు.

దాసు శ్రీరాములు – “శ్రీ కృష్ణలీలా ప్రతిపాదకాలయినవే – జావళీ”లన్నారు.

ప్రొ॥ పి. సాంబమూర్తి:
“జావళీలు ఐహికములు. శృంగార సాహిత్యం కలవి. అందుగల ప్రేమ తుచ్చము. అల్పము. ఇంద్రియ లోలత్వం జావళీలలో కనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు అసభ్య శృంగారం కనిపిస్తుంది. జావళీ సాహిత్యానికి రెండర్ధాలు లేవు. వీటిలో మానవ సహజమైన కోర్కెలు బలీయంగా ఉండి వాటిచే ప్రేరేపితులవుతుంటారు. నమ్మించి మోసం చేసే నాయకులు జావళీలలో కనిపిస్తారు.” (16) అని పేర్కొన్నారు.

నటరాజ రామకృష్ణ గారి భావం:
“పదము వలె శృంగార రస ప్రధానమైనది. రసభావము లందు తక్కువ బడి మధ్య లయలో పాడు శృంగార రచనలు జావళీలు. జావళీ సంగీత ప్రక్రియే కాక నృత్య ప్రక్రియని” కూడా రామకృష్ణ గారి అభిప్రాయం. “‘జావళీ’ పదము వలె శృంగార రస ప్రధానమై నృత్యమునకు అనువగు విధాన మధ్యమ కాల సాహిత్యము కలిగినట్టి రచన.”(17)
“పదాభినయము తరువాత ‘ జావళీలు ‘ అభినయింపబడును. రస భావములందు తక్కువ బడి మధ్య లయలో పాడబడే శృంగార రచనలు జావళీలనబడును. పదములు విలంబిత లయలో నుండుటచే సాత్విక సంచారాలు అభినయించుట కవకాశముండును. జావళీలు త్వరిత గతిలో నుండుటచే యిందు సాధారణముగ రెండు మూడు భావములు ప్రదర్శించి ముగింతురు.

వనజాక్షిరో ఈ విరహ మోర్వనే
వాసుదేవుని తోడి తేవే…

‘వనజాక్షిరో’ అని ప్రారంభములో ఆ విరహోత్కంఠిత నాయిక యొక్క విరహ వేదన, ఆత్రుత, ప్రియుడు ఇంకను రాలేదను విసుగు, రాడేమేనన్న శంక, విచారం, దుఃఖము, నిస్పృహ, నిస్సహాయత, నిరాశా యిట్టి భావములు.”(18)

నటరాజ రామకృష్ణ గారి వలె జావళీ నృత్య ప్రక్రియగా సంభావించిన మరికొందరి అభిప్రాయాలు:

వింజమూరి వారాహ నరసింహాచార్యులు – కర్ణాటక సంగీత పరిణామము:
“పదములు నాట్యాభినయమునకు అక్కరకు వచ్చుతరి జావళ్ళు, దరువులు, జతి స్వరములు, తిల్లానాలు, నృత్య నృత్తములకు ఉపయుక్తములగు చున్నవి. అనుభవ వేద్యముగ రాగరసము చిప్పరిల్ల చేయుచు మధ్యమ కాల తాళ వృత్తములతో నృత్య వేత్తలకు అనువగునవిగ నున్నవి.”

కె.పి. కిట్టప్ప:
“జావళీలు రస భావ అభినయాలకు ప్రాముఖ్యత వహిస్తున్నాయి. నృత్య కార్యక్రమాలలో జావళీల నభినయిస్తారు. సంగీత కచేరీలలో జావళీలను చివరగా పాడుతారు. భగవంతుని పూజించి తమను తాము అర్పించుకొనడానికి నృత్యం ద్వారా సాధ్యపడుతుందని భరత నాట్య శాస్త్రం చెపుతోంది.”

సంగీతం అభినయం – నాట్యంలో కలిసి ఉంటాయి. ‘ జావళీలు ‘ Pub పద్మినీ రావు.

చెన్నకేశవయ్య:
“జావళీలు దేవదాసీలు దేవాలయాల్లో పాడుతూ నాట్యం చేశారు. నృత్యం చేస్తూ ఏకాంతంగా పాడారు. వారి పోషకుల ముందు కూడా నృత్యం చేస్తూ పాడారు.”

మంగిపూడి రామలింగ శాస్త్రి:
“మహారాష్ట్ర లోని ‘ లావణి ‘ వలెనే అభినయ యోగ్యమగు జావళీలను పదాల వలెనే అభినేత్రులు తాలింఖానా లేక మేజువాణిలలో అభినయించుట నేనెరుగుదును.
ఈ జావళీలకు నట్టువనార్లు అనగ భరతాచార్యులగు వడివేలు, పొన్నయ్య, శివానానందం సోదరులు, స్వాతి తిరుణాళ్ ఆస్థాన విద్వాంసులే మూల పురుషులు అని నిర్ధారించడానికి వారి తొలి రచనలగు జావళీలే సాక్ష్యమిచ్చుచున్నవి. భరతాచార్యులు రాసిన జావళీలు కావున నాట్యానికి ఉద్దేశించి రాసినవని స్పష్టమవుతోంది.”

గోస్వామి – “భావాలను అనేక భంగిమలతో చూపే అవకాశం అనుకూలం కలిగిన జావళీ నృత్య ప్రక్రియగా విలసిల్లుతోంది.”

C.R. Day: “Javalis are much sung by both nautch girls and all especially women of higher classes in domestic life. They are of two kinds, ordinary ballads and songs of a more or less indelicate nature, sung during the performance of a peculiar dance called karwer.
Many of the songs bear a resemblance to a ‘waltz’ only they are taken at a slightly slower pace” (19)

డా॥ ఆచార్య యస్వీ రామారావు:
“తెలుగులో ‘ సాహిత్య విమర్శ అవతరణ – వికాసములు ‘ అను గ్రంథంలో “కవిత్వ తత్త్వ విచారము 1914 లో రూపొందినది. కట్టమంచి రామలింగా రెడ్డి గారు పాశ్చాత్య సంస్కారమును జీర్ణించు కొనుటయే కాక భారతీయ సంప్రదాయములన్ను తీవ్రముగా నిరసించెను. పాశ్చాత్య సులోచనములతో భారతీయ వాఙ్మయము నవలోకించెను. (20)
పాశ్చాత్య సంస్కారమును జీర్ణించుకొనిన వాడగుటచే రామలింగా రెడ్డిపై పాశ్చాత్య సంస్కృతీ సాహిత్య ప్రభావము అధికముగా కన్పట్టును. అందుచేతనే భారతీయ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, విశ్వాసములను అతడు తీవ్రముగ గర్హించెను. ఈ సాంఘిక విమర్శయే కట్టమంచి సాహితీ విమర్శకు హేతుభూతమైనది.” (21)

“అంగాంగ వర్ణనతో కూడిన భారతీయుల శృంగార వర్ణన అసభ్యమైనదనీ, పాశ్చాత్య శృంగార వర్ణన ప్రశస్తమైనదనీ ఆయన అభిప్రాయం. స్త్రీ పురుష సంబంధంపై భారతీయుల దృష్టి హైందవ వ్యవస్థ వారి దుర్దశకు దారి తీసినవని ఉగ్గడించెను”.

“కవిత్వ తత్త్వ విచారము పలువురి విమర్శలకు గురి యైనది. అలంకారములపై అతని నిరసనమునకు సమాధానముగా కురుగంటి సీతారామయ్య “అలంకార తత్త్వ విచారము”ను 1915లో ప్రకటించెను.

తన “నవ్యాంధ్ర సాహిత్య వీధులు”లో ఈ గ్రంథమున తీవ్రముగ ఖండించెను. కాళూరి వ్యాసమూర్తి “కవిత్వ తత్త్వ విచార విమర్శనము”ను వెలువరించెను. జి.వి. కృష్ణా రావు గారు తమ ఆంగ్ల సిద్ధాంత గ్రంథములో పింగళి సూరనపై కట్టమంచి ఆరోపణలను ఖండించిరి. అక్కిరాజు ఉమాకాంతం, నోరి నరసింహ శాస్త్రి ప్రభ్రుతులు కూడా ఈ గ్రంథమును నిరసించితిరి”. (22)

“పాశ్చాత్య సంస్కారమును బాగుగా జీర్ణించుకొని జాతి జీవితములో పరివర్తనను కాంక్షించిన వారగుటచే ఆయన దేనినైనను గాఢముగ చెప్పుట జరిగినది. సాహిత్యములో నియమ బద్ధతనే కాని విశృంఖలతను ఆతడు అంగీరికించలేదు.”(23) అని ప్రకటించారు.

కట్టమంచి వారు ప్రబంధాలను నిరసించడం తర్వాతి విమర్శకులకు నచ్చలేదు. “రామలింగా రెడ్డి గారు చిన్న లోపము చేయుటచే కవిత్వ తత్త్వ విచారము నందు చంద్రునిలో మచ్చ వలె కొన్ని వెగటు భావములు ప్రకటింబడినవి.” (24) అని ఖండవల్లి లక్ష్మీ నిరంజనం గారు తన “లక్ష్మీ రంజన వ్యాసావళి”లో ప్రకటించారు.

ఆ విధంగా రామలింగా రెడ్డి గారు చిన్న లోపం చేయడం కారణంగా అత్యద్భుత సృష్టి, సంగీత సాహిత్య, నృత్య ప్రక్రియలకు పరాకాష్ట అయిన ‘జావళీ’ కాంతి విహీనమై ఈనాడు హేయమైనదిగా చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది.

దానికి తోడు సంగీత సాహిత్య ప్రజ్ఞాధురీణులు శ్రీ రాళ్ళపల్లి వారి దృష్టిలో కూడా ‘ చిల్లర శృంగారపు మాటలు కలది ‘ అని భావించడంలో జావళి అపఖ్యాతి పాలయ్యింది. ప్రజాదరణకు, సాహిత్యంలో స్థానానికి నోచుకోక అజ్ఞాత కోణాలకు పరిమితమైపోయి, అనాదరణకు గురైంది.

శ్రీ కట్టమంచి వారు తమ “కవిత్వ తత్త్వ విచారము”లో కళా పూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము మొ॥ కావ్య విమర్శ చేస్తూ రస రాజమైన శృంగార రసాన్ని ఎంత అసహ్యకరంగా చిత్రీకరించ గలరో అంత అసహ్యకరం గానూ ఆ కావ్యాలలోని శృంగారాన్ని భావిస్తూ, జావళీ ప్రస్తావన తీసుకు రావడం జావళీకి ఆయన చేసిన తీవ్రమైన అన్యాయం. జావళీ ముందర శృంగార సాహిత్యం ఎంత ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా జావళీల శృంగారంతో ఆ కావ్యాలను విమర్శించడాన్ని బట్టీ, ఆనాడు లోకంలో జావళీ ఎంతగా ప్రాచుర్యం పొంది ఉండి ఉండేదో, అందరి నోళ్ళలో ఎలా నానిందో ఆయన చెప్పకనే చెప్పారు.

కట్టమంచి వారి ‘జావళీ’ అభిప్రాయాన్ని చూస్తే “ఒకే రకం శృంగారం, రుచి లేని శృంగారం, మిత భాష లేని జావళీ సరసం, జావళీల కన్న నికృష్టమైన పాళెయ గాండ్ర శృంగారం, మానము, మరుగూ, సామరస్యం లేని శృంగారం” వంటి పద ప్రయోగాలను పరిశీలిస్తే, జావళీపై గల నిర్లక్ష్యం, అనాదరణ, అసదభిప్రాయం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

దీనిని బట్టి ఆయన జావళీని సరిగా అర్థం చేసుకోలేదని నిష్కర్షగా చెప్పొచ్చు. అంటే అనుభవైక వేద్యం కానిది – కేవలం విరహం, నచ్చేదేమో? జావళీలలో శృంగారం ఉంది. కాదనలేం. కానీ నాయికా నాయకుల మధ్య వర్ణించిన శృంగారం భగవత్పరంగా ఉంది.

మధుర భక్తి తత్త్వానికి ప్రతీకగా ఉండి, జీవాత్మ ప్రాపంచికమైన విషయ వాంఛలతో కూడి పరమాత్మలో విలీనం కావాలనే అవ్యాజమైన తపన ఈ కీర్తనలలో కనిపిస్తుంది. పరస్పరం నాయికా నాయకులు ఐక్యమవ్వాలనే ఆశయంతో ఉండడం వల్ల లోక వ్యవహారంలో ఉన్న, అంతకు ముందు సాహిత్యంలో వర్ణించిన శృంగారపు ఛాయలకు సంబంధించిన ప్రభావాల వల్ల ఈ జావళీలలో కూడా శృంగారం పాళ్ళు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఏర్పడింది. ఉదాహరణకు కొన్ని జావళీలను పరిశీలిస్తే –

ఇందుస్తాని – మధ్యాది

చెలియా కాంతుడు నన్నెడ బాసి
చాల నన్నిటు చేసెనె గాని ॥చెలి॥

మారుడు వాయురమున సుశరము వేయ
మందమగు మారుతము డాయ
విరహము నేనెటు సైతునె సఖియా
ఒంటిగా నేనుండ నాయె ॥చెలి॥

వెన్నెల గాయగ మిగుల తాపమాయనే
అన్నమని సైచదాయనే
కన్నులకు నిదుర రాదే
ఓ మగువా కామిని బోధన లాయానే ॥చెలి॥

మరుని కేళిలో నన్ను గూడెనే
మానినిరో దానితో గూడెనే
ధనగిరి స్వామికి న్యాయమటవే
తాళను వానికి రమ్మనెవేవో ॥చెలి॥

ఈ జావళీలో చెలియ ద్వారా తన నిర్భరమైన విరహార్తిని నాయకునికి తెలియజేస్తూ కామ క్రీడాసక్తురాలైన నాయిక నాయకుని తీసుకు రమ్మని తన బాధను వివరిస్తోంది.

మరొక జావళీని చూడండి

జంఝూటి – ఆది తాళం

మనసేమో సైచదే మానినీ మణి నా వారిజముఖి సరి
వారిలో నన్నిటు దూరి దాని ఇలు చేరగనా ॥మన॥

మరు శరములు అతి దురుసుగ నిరతము
గురు కుచములపై గురి యగునా ॥మన॥

గోపాలుడనను రాపు చేసి పరి
తాపములకు నేనెటులోపునె, నా ॥మన॥

అంటూ గోపాలుడు చేసిన పనుల్ని తలచుకుని మధుర స్మృతులతో నాయిక విరహావస్థను అనుభవిస్తుంది.

కాంభోది – ఆది తాళం

పిల్ల మనసు గిల్ల రాకుడా – నల్లని సామి చిన్న
భూపల్ల మగసిగపించి చూడగ ॥పిల్ల॥

పిల్లజల్ల చెల్లరాయ – వల్లగాదు మళ్ళి పోర
ఇందు రమ్మని చంద్ర హారములివ్వ వచ్చేవు ॥పిల్ల॥

సాటి యారండ్లు జూచితే నిందెలకు
మూలమౌ యెందు దాచుకొందు సామికి ॥పిల్ల॥

చంటిపై చెయి వేసి మోవి పంట నొక్కేవు
మా యింటి మగని తమ్ముడెంతో
కంట కాముడెంతో
సూరుడంట రంట దంట కాదు ॥పిల్ల॥

వీర రాఘవ పోతులూరి – వీరరాఘవులు
మోరుదా శ్రీ మోతుకూరు
హాస మందహాస
చిద్విలాస చెన్న కేశవా ॥పిల్ల॥

అంటూ సంభోగ శృంగారం, విప్రలంభ శృంగారం రెంటినీ యధేచ్ఛగా వాడిన వైనం తెలుగులో వచ్చిన జావళీలలో కనిపిస్తుంది.

జావళీలలోని కొన్ని మాటలు ఈ విధంగా శృంగారాన్ని ప్రదర్శిస్తున్నాయి.

ఉదా:
రమ్మనవే
అది నీపై మరులు కొన్నదిరా
అపుడు మనసు నిలుచునటే
ఎంతటి కులుకే
నీ మృదు అంగ సంగముతో కౌగలించెనని
ఏరా తగునటరా సరి కాదురా
ఏల రాడాయనే కామిని
వేగ తోడి తేవే సామిని
తీసుకు రావే
చెలి నేనెట్లు సహియింతునే
తారుమారులాడే వేమే బజారి

అలాగే కొన్ని వాక్యాలు కూడా శృంగార భరిత వాక్యాలుగా కనిపిస్తాయి.
ఉదా:

  1. అంబుజాక్షిరో నే సంభ్రమున
    నీదు బింబాధర చుంబనంబు లివ్వమంటే
  2. మోడి సేయక నాతోడ బల్కి కడు వేడుకన్
    కర్పూర విడెమివ్వమంటే
  3. ప్రీతి మీరగ నే సాదరంబుతో నీదు
    లేత గుబ్బల నా చేతి కివ్వమంటే
  4. తాళలేనే బాలికా మణి నీ
    తాళవనేశుని యేలుకోమంటే!

ఇటువంటి శృంగారం ప్రాచీన కావ్యాలలో ఎంతగానో ఉంది. వాటితో పాటుగా జావళీలను కూడా చేర్చి విమర్శించడం వల్ల జావళీ ఔన్నత్యం దిగజార్చినట్లయ్యింది.
ఆనాడు ఎంత శృంగార సాహిత్యం ప్రాచుర్యం వహించినా కేవలం జావళీలను మాత్రం విమర్శించడం జరిగింది. జావళీలలో గల ఆత్మీయత, మధుర భావన విరహంలో ఉండే ఆ తీపి భావం అర్థం చేసుకోగల భారతీయ సంస్కృతిని పోగొట్టుకోవడంతోనే జావళీకి తీరని ద్రోహం జరిగింది.
పరమ భక్తులు భగవదైక్యం కోసం పడిన ఆరాటం జావళీలలోని మధుర భక్తి. అది ఎలా అర్థం అవుతుంది? అన్నీ ఒకే రకంగా ఉన్నాయని అనటం లోనే అవి మధుర భక్తి భావన గలవని అర్థం అవుతోంది.
19వ శతాబ్దంలో ఆవిర్భవించిన Anti-Nautch Movement జావళీ స్థాయి దిగజారడానికి, పతనానికి దోహదం చేసింది. దక్షిణాదిలో గల దేవాలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలలో దేవదాసీలు తమ నృత్యాదులతో భగవదారాధన జరిపేవారు.
జావళీలు ఆ ఆరాధనలో చోటు చేసుకోవడం వలన దక్షిణ దేశంలో కుప్పలు తిప్పలుగా దేవాలయాలుండడం వలన జావళీలు విరివిగా విలసిల్లాయి. దేవదాసీలను రద్ధు చేయడంలో జావళీ పతనం ప్రారంభమయింది. రాసేవారు భయపడ్డారు. పాడేవారూ, ఆడేవారూ అంతరించిపోయారు. జావళీ ప్రక్రియే అంతరించే దశకు రావడానికి కారణం విమర్శకుల పాక్షిక దృష్టి.
ప్రముఖులే ఈ విధంగా భావించడంతో వారి అభిప్రాయాన్ని ఎవరూ కాదనే సాహసం లేక, ‘జావళీ’ మాట కన్నడ పదం అన్నా తెలుగువారు కూడా ఆలోచించకుండానే ఒప్పుకున్నారు. తెలుగులో జావళీలు ఎందుకు, ఎలా వచ్చాయి అని ఆలోచించే శక్తి కోల్పోయారు. జావళీ ఉనికినే కోల్పోయేట్టు చేశారు.
దేవదాసీలు అనేక కారణాల వల్ల పోషకుల దేవదాసీలయ్యారు. మధుర భక్తి గల ఈ జావళీలందలి సాహిత్యాన్ని తమకు అన్వయించుకొని ఆనంద పడిపోయారు ఆ రసిక ప్రభువులు. దేవదాసీలు కూడా అంతరించి పోయి మామూలు వేశ్యలుగా మారిపోయారు.
అటువంటి స్థితిలో జావళీ సినిమా పాటలలో ప్రవేశించింది. నేడు అక్కడ కూడా సముచిత స్థానాన్ని పొందలేక ఆక్రోశిస్తూ గత వైభవాన్ని పొందటం కోసం ఎదురు చూస్తోంది.

అథోజ్ఞాపికలు

  1. The Music of Southern India – Captain C.R. Day, 1891, Page 8-87
  2. జావళీలు – పదములు – పుట 15
  3. సాహిత్య శిల్ప సమీక్ష – పుట 148
  4. సాహిత్య శిల్ప సమీక్ష – పుట 164, 165
  5. శ్వేతాశ్వతర ప్రతిః శ్రీ చైతన్య శిక్షామృతం – పుట 380
  6. కవిత్వ తత్త్వ విచారము – పుట 80
  7. కవిత్వ తత్త్వ విచారము – పుట 93
  8. కవిత్వ తత్త్వ విచారము – పుట 94
  9. కవిత్వ తత్త్వ విచారము – పుట 110
  10. కవిత్వ తత్త్వ విచారము – పుట 140
  11. కవిత్వ తత్త్వ విచారము – పుట 140
  12. భారత సంగీత ఇతిహాసము – పుట 105
  13. The Music Academy Journal – 1. Vol. XIV
  14. The Music Academy Journal – 1. Vol. 35
  15. The Music Academy Journal – 1. Vol. 46
  16. South Indian Music Book – p.3
  17. దాక్షిణాత్యుల నాట్య కళా చరిత్ర – పు. 182
  18. దాక్షిణాత్యుల నాట్య కళా చరిత్ర – పు. 255
  19. The Music of South India 1891 – page 79
  20. సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు – 2వ సంపుటం, పు. 140
  21. సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు – 2వ సంపుటం, పు. 143
  22. సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు – 2వ సంపుటం, పు. 146
  23. సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు – 2వ సంపుటం, పు. 148
  24. లక్ష్మీ రంజన వ్యాసావళి – పుట 112
  25. శృంగార జావళ్ళు – పుట 13
  26. శృంగార జావళ్ళు – పుట 11
  27. శృంగార జావళ్ళు – పుట 18