సంగీత శాస్త్రవేత్తలు కొద్దిమంది గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కీర్తనలు మొ॥ వివిధ ప్రక్రియలతో బాటు జావళీల్ని కూడా రచించారు. సాహిత్య పరిపుష్టి గలిగిన ఈ జావళీలను రచించిన మహామహులూ, వాగ్గేయకారులూ అయిన రాగ తాళ సాహిత్య పరిజ్ఞానం కలవారు వారి చేతుల్లో జావళీలు ఆవిర్భవించి వికసించాయి.
ఈ స్థితిలో జావళీ అమర్యాద కరమైన, అగౌరవ ప్రదమైన ప్రక్రియే అయినట్లయితే ఈ రచయితలెవ్వరూ వీటి జోలికి పోయేవారు కారు. ఈ మహానుభావులెవ్వరూ తుచ్ఛ శృంగారానికి పట్టం గట్టే ప్రవృత్తి గలవారు కారు. దీనిని బట్టి జావళీ రచనలపై సంగీతజ్ఞులకు సదభిప్రాయం ఉందని తెలుస్తోంది.
సంగీతజ్ఞులు, సాహిత్యకారులు అయిన సుప్రసిద్ధ ప్రాచీన జావళీకర్తలు –
- వల్లభ రాయలు
- అచ్యుత దేవరాయలు
- తిరుమల దేవరాయలు
- విజయ రాఘవ నాయకుడు
- క్షేత్రయ్య
- కాశీనాథ కవి
- వీరభద్ర కవి
లభించినంతలో వల్లభ రాయలు, అచ్యుత రాయలు, తిరుమల రాయలు ముద్ర గల జావళీలు ప్రాచీనాలు. ఈ జావళీ రచయితలు వల్లభ రాయలు, అచ్యుత రాయలు, తిరుమల రాయలు కావచ్చు, కాకపోవచ్చు. ఆ ప్రభువుల ముద్రతో అన్య కవులెవరో కూడా రచించినవి కావచ్చు. ఈ విషయమై ఇంకా పరిశీలించవలసిన అవసరం ఉంది.