వల్లభ రాయలు:
ఇతని కృతి క్రీడాభిరామం. శ్రీ రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృత భాషలో రచించిన “ప్రేమాభిరామ” నాటకాన్ని అనుసరించి రచించిన గ్రంథం. తండ్రి త్రిపురాంతకుని గురించి “మూడు గ్రామ గ్రాసముల తోడ గూడంగ మోపూరు ఆలించె ముల్కినాట” అని క్రీడాభిరామంలో ఉండడాన్ని బట్టీ, వల్లభమాత్యుడు మోపూరి గ్రామంలో నివసించి ఉండవచ్చునని భావించవచ్చు.
“ముదమున ముల్కి నాటి పుర మోహన శైల సువర్ణ కందరా
సదనుడు కాలభైరవుడు శంభుని పట్టి సమగ్ర వైభవా
భ్యుదవ పరంపరా విభవముల్ గృప సేయుఁగవీంద్రకాంక్షిత
త్రి దశ మహీరుహంబు నకుఁదిప్పయవల్లభ రాయ మంత్రికి”(1)
అని క్రీడాభిరామంలో ఉన్న ఈ పద్యాన్ని బట్టి కాలభైరవుడు మోపూరు నందు ఉన్నాడని తెలుస్తోంది.
“ములికినాటి మోపూరు లోని కాలభైరవుడు వినుకొండ లోని వల్లభ రాయునికి కృప సేయుట కృతకము మోపూరులోని వల్లభ రాయనికి కృప సేయుట సహజము”. (2) దీనిని బట్టి వల్లభ రాయుడు మోపూరులో ఉన్నాడని చెప్పవచ్చు.
క్రీడాభిరామం శ్రవ్య కావ్యం. శృతి మించిన శృంగారానికి నిలయం. శృంగార నాటకం. కాకతీయుల రాజధాని ఏకశిలా నగరానికి క్రీడాభిరామంలో రేఖా చిత్రం ఒకటి ఉంది. ఈ విషయమై ఉన్న భిన్నాభిప్రాయాల్ని సమన్వయ పరచి వినుకొండ వల్లభామాత్యుని కాలాన్ని ఆచార్య కొర్లపాటి శ్రీ రామమూర్తి గారు ఈ విధంగా పేర్కొన్నారు.
“మోపూరు కడప జిల్లాలోని పులివెందుల తాలూకా లోనిది. మోపూరు పాలకుడన మోపూరి కరణమగును. మోపూరు కరణమైన రెండవ తిప్పన ఏకైక పుత్రుడు వల్లభామాత్యుడు. ఇతడు మోపూరు కరణమగును. కవి కూడ. వల్లభామాత్య్ని జీవిత కాలము 1425 – 1500 కావలయును. కాబట్టి క్రీడాభిరామము రచనా కాలము స్థూలముగ 1475వ సంవత్సరము. 1450 తరువాత కావచ్చును.” (3)
వల్లభరాయల ముద్రతో గల జావళీ:
బేహాగ్ – ఆది తాళం
మగనాల తాళర ॥మగ॥
పదుగురిలో నను మదనుని కేళికి
గదియ రమ్మనెదవురా నే ॥మగ॥
వడ్డారమున నీ వడ్డము జేసిన
చెడ్డది మా యత్త చెడ్డదిర నే ॥మగ॥
వల్లభుడొచ్చు శ్రీ వల్లభరాయ నీ
పిల్ల చేష్ట లిందు చెల్లవురా నే ॥మగ॥
నాయకి నాయకుని ఇలా బ్రతిమలాడుతోంది.
“తాను తాళలేకున్నాననీ, మగని ఆలిననీ, తనను అల్లరి పెట్టవద్దనీ వేడుకుంటోంది. పదుగురిలో అందరూ చూస్తూండగా తనను మదనుని కేళిని రమ్మనడం సమంజసమా?” అని పంతం పట్టి, “నీవు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మా అత్త చాల చెడ్డదిరా! పరిస్థితులు విషమించవచ్చు. తన వల్లభుడు వచ్చే సమయం కూడా అయింది. వల్లభ రాయా, సామీ, నీ పిల్ల చేష్టలు కట్టిపెట్టి దయచేసి వెళ్ళిపోరా!” అంటూ ప్రాధేయపడింది.
అచ్యుత దేవరాయలు:
అచ్యుత దేవరాయలు శ్రీ కృష్ణ దేవరాయల మరణానంతరం 1530లో రాజ్యాధికారం చేపట్టారు. రాజనర్తకి ఆస్థాన నర్తకి తిరుమలమ్మ రాజానుజ్ఞతో తన కోసం సిద్ధంగా ఉన్న ముత్యాల పల్లకి నెక్కి గృహోన్ముఖురాలవుతూ దారిలో విఠలేశ్వరుని దర్శించినది.
రంజకం శ్రీ రంగరాజు ఠీవిగా నడుస్తూ జతులు పలుకుతుండగా సభకు నమస్కరించి, పుష్పాంజలి ఘటించి, వటవాట వటవ, శిరబిర, హలాచితాది పద విన్యాసాలు ప్రదర్శించింది. ఆలీఢ, పత్యాలీఢ, స్థానరేచక విన్యాసాలు చేసింది. ఐదు తాళ జతులతో ముక్తాయి ప్రదర్శనం నర్తించింది.
అనంతరం జావళికి అభినయం ప్రారంభించింది.
స్వామికి ఎవరే సరి సఖియా
ఈ విరహ మోర్వనే
భువిని శ్రీ అచ్యుత రాయ భూపతి
నామీది ప్రేమ మరిచెనెందుకో
తజ్జం – తకజం, తకతరి తాజం
తద్ధీం గణత తద్ధీం గణత కిణజం కిణకిణ
నగచు, జం తిరుగుడుజు
ఈ విధంగా అభినయం చేస్తూ తన నృత్య విద్యను ప్రదర్శించింది.
తిరుమల దేవరాయలు:
శ్రీకృష్ణ దేవరాయల అల్లుడైన అళియ రామరాయల సోదరుడు తిరుమల రాయలు. రామరాజ భూషణుని వసుచరిత్రము తిరుమల దేవరాయలుకు అంకితం. తిరుమల దేవరాయలు విజయ నగర సామ్రాజ్యాధిపతి. ఇతని రాజ్య కాలం 1570-72 లేదా 1571-72 అని చారిత్రకుల అభిప్రాయం. సంగీత సాహిత్య విద్యాద్వయ పాండితీ ప్రకర్షకల కావ్యం వసుచరిత్రం. ఈ గ్రంథకృతి భర్త అయిన తిరుమల దేవరాయ ముద్రతో గల జావళీ –
కమాచి రాగ – ఆది తాళం
రమణీరో సామి రాతి రేమనెనే ఓ ॥రమ॥
కమల నయనరొ నా కాంతుడు జూచితా
సుముఖుడై వరియించెనే ఓ ॥రమ॥
కర్పూర వీటికా గంధ పుష్పాదుల
నర్పణ శాయగై కొనెనే ఓ ॥రమ॥
తిరుమల దేవరాయ కరివీర కాదీయ
కరుణతో జూచి గైకొనెనే ఓ ॥రమ॥
నాయిక తన చెలికత్తెను నాయకుని వద్దకు రాయబారం పంపింది. తిరిగి వచ్చిన చెలిని ప్రశ్నిస్తూ అక్కడ జరిగిన విషయాన్ని తెలుసు కోవడానికి చాలా ఆసక్తిగా ఉత్సుకత చూపిస్తోంది. “రాత్రి తన సామి ఏమన్నాడే” అని ప్రశ్నించింది.
“సుముఖంగా ఉన్నాడా? తనను వరించడానికి సిద్ధంగా ఉన్నాడా? నే పంపిన కర్పూర తాంబూలాన్ని గంధ పుష్పాదుల్ని గైకొన్నాడా? తిరుమల దేవరాయడు తన సామి సాక్షాత్తూ తన మీద దయతో నున్నాడా” అని అచ్చట జరిగిన వృత్తాంతం విననాసక్తి చూపుతూ ప్రశ్నించింది.
క్షేత్రయ్య (1600 – 1673)
క్షేత్రయ్యను గురించి సుబ్బరామ దీక్షితుల వారు ఈ విధంగా పేర్కొన్నారు.
“ఇతడు బాల దశలో నొక మహా యోగి వలన గోపాల మూల మంత్రాన్ని ఉపదేశం పొంది మువ్వపురిలో వెలిసిన గోపాలాలయంలో బహుకాలం భక్తితో మంత్రావృత్తి చేసుకొని ఉన్నప్పుడు శృంగార రసాధి దేవత యైన గోపాలుడు దర్శనమిచ్చి అనుగ్రహించిన తోడనే –
శ్రీపతి సుతుంబారికి నేనోపలేక నిను వేడితె
గోపాలా మువ్వ గోపాలా ॥
అని వాగ్గేయ రూపంగా పదాలు చెప్పనారంభించారు”.
తరువాత తంజావూరు వెళ్ళి విజయరాఘవ నాయకుని కొలువులో గౌరవింప బడినట్లు, విజయ రాఘవుని మీద పంచ రత్నాలు చెప్పినట్లు, అనేక క్షేత్రములకు పోయి ఆయా దేవుళ్ళ మీద పదాలు చెప్పినట్లు సుబ్బరామ దీక్షితులు పేర్కొన్నారు.
మొవ్వ వరదయ్య అనే పేరుతో క్షేత్రయ్య మొదట పిలువబడే వాడనీ, గోపాల దేవుని కృప చేత తటాలున కవితా ధోరణి కలిగి, అదే పద రూపంగా ఆవిర్భవించిందనీ, ఆ సన్నివేశం వల్ల వరదయ్య భక్తాగ్రేసరుడై కొన్నాళ్ళకు తంజావూరు వెళ్ళి, అక్కడ నుండి అనేక క్షేత్రాలు తిరిగి పదం పాడడం వల్ల క్షేత్రయ్య అనే పేరు కలిగిందనీ వారి కుటుంబీకులు చెప్పారు.
క్షేత్రయ్య కాలం:
- మధుర తిరుమల నాయకుడు – క్రీ.శ. 1623-59 మధ్య కాలం
- అచ్యుత విజయ రాఘవుడు – క్రీ.శ. 1633-73 మధ్య కాలం
- గోలకొండ నవాబగు అబ్దుల్లా కుతుబ్ షా – క్రీ.శ. 1622-72 మధ్య కాలం
లోనూ రాజ్యాలు పాలించారు. రఘునాధ నాయకుని దర్బారుకే క్షేత్రయ్య ప్రథమంగా వచ్చి ఉండడం ద్వారా 1630 ప్రాంతాలలో క్షేత్రయ్య తంజావూరు ప్రవేశించి ఉండాలి. దీనిని బట్టి ఇతడు 1600 ప్రాంతంలో జన్మించాడని చెప్పవచ్చు. గొప్ప వాగ్గేయ కారులు సుబ్బరామ దీక్షితులు వారిచ్చిన పాఠాన్ని బట్టి క్షేత్రయ్య 4500 లేక 4100 పదాలు చెప్పినట్లు తెలుస్తోంది.
“మువ్వ గోపాల నామాంకితమైన జావాళీలు రాసిన క్షేత్రయ్య రంగాజమ్మ సమకాలికుడు”. లభ్యమైన వరదుడ, మువ్వపురి నిలయుడ అను ముద్ర గలిగిన జావళీ క్షేత్రయ్యదే అనుట స్పష్టం.
సురటి – ఏక తాళం
ప॥ మాయలాడి బోధనలచే మైమరచితివేమో
మాటలాడ రావదేమిరా యె సామి
అ॥ కాయజుని బారికి తాళగలేరా
కౌగితి జేర్చినను గారవించరా
న్యాయమటరా నీకిది తగదుర సరస గుణ
చ॥ 1. కలకాలము నన్ను గాసి పెట్టుటకురా – కాంతనేచుట
కార్యము గాదుర చెలువుడవని నిను నెర నమ్మినందు కిక ॥మా॥
చ॥ 2. సరివారిలో నను చౌక సేయకురా చాల నమ్మితి రతి
కేళి కూడరా – వరదుడ మువ్వపురి నిలయడ చనువున ॥మా॥
మువ్వపురంలో నిలయమై ఉన్నవాడా! వరాలను ఇచ్చేవాడా! అని సంబోధిస్తూ నాయిక స్వామి విరహాన్ని భరించలేక, స్వామి సమాగమం కోసం తపిస్తూ, స్వామి లేని జీవనాన్ని దుర్భరమని భావిస్తూ, స్వామి తనను నిర్లక్ష్యం చేశాడనే ఆవేదనతో, దానికి గల కారణాల్ని అన్వేషిస్తూ ఇలా అంటోంది.
“ఎవరో మాయలాడి చేసిన దుర్బోధల్ని విని మైమరచి పోయావా ఏమి? ఎందుకు నీవు వచ్చి నాతో మాట్లాడవు? మన్మథ ప్రతాపానికి తాళ లేకున్నాను. నన్ను కౌగిట జేర్చి గౌరవించకుండా నిర్లక్ష్యం చేఏయడం నీకు తగునా? నీకిది న్యాయమేనా?
చిర కాలం నన్ను బాధించకు. కాంతను బాధించడం కార్యం కాదు. నువ్వే నా ప్రియ సఖుడవని సంపూర్ణంగా నిన్నే నమ్మినందుకు ప్రతిఫలంగా నాతోటి వారిలో నన్ను చులకన చేసేందుకే నన్ను విస్మరించావు.
నిన్నే నమ్మి నీపై చాలా ఆశలు పెట్టుకున్నాను. శీఘ్రం వచ్చి నన్ని చేరి సమాగమించు” అంటూ తన విరహ వేదనను, సహించలేని మన్మథ తాపాన్ని ప్రదర్శించింది.
విజయ రాఘవ నాయకుడు (1633 – 1673):
తండ్రియగు రఘునాథ నాయకుని వలే ఇతడు కూడా కవే. కానీ రఘునాథ నాయకుడు అన్నీ యక్ష గానాలే రచించాడు. ఆ కాలంలో పుట్టినవన్నీ ఇంచుమించుగా యక్షగానాలే. కీర్తనకు యక్షగానానికి ఇతని ఆస్థానం సుక్షేత్రమై పరిణమించింది. కృష్ణదేవ రాయల వలే రఘునాథ నాయకుడు కూడా రాజకీయ సారస్వత రంగాలలో సమానంగా సమర్థుడు. కానీ విజయ రాఘవ నాయకుడు తన జీవితాన్ని, ఆస్థానాన్ని కూడా కళామయం చేసిన కళాదరణ కలవాడు. తంజావూరిలో కళకళల్ని వెదజల్లిన ఘనుడు.
రఘునాథాభ్యుదయం, ప్రహ్లాద చరిత్ర, విప్రనారాయణ చరిత్ర, పార్వతీ పరిణయం మొ॥ యక్ష గానాల్ని ఇతడు రచించాడు. ఇవన్నీ గద్య పద్యాత్మకమైన గేయాలు. పద్యం చాలా విరళం. ద్విపద ప్రాచుర్య మెక్కువ. గేయ భాగాలన్నీ చాలావరకూ ద్విపదలే. వీటిలో చారిత్రక ప్రాముఖ్యత కలది రఘునాథాభ్యుదయం.
“ఉషా పరిణయాది కావ్యాలను రచించిన పసుపులేటి రంగాజమ్మ ఇతని ఆస్థాన కవయిత్రి. ఈ విజయ రాఘవ గోపాలుడు మన్నారు గుడిలోని రాజగోపాల స్వామి ఆలయ గోపురాన్ని పునరుద్ధరించడం మొదలుగా అనేక ధర్మ కార్యాలు చేశాడు. రాఘవాభ్యుదయమనే పేరు గల నాటకం లోని మొదటి పద్యమిలా ఉంటుంది.
సీ. భోజ కన్యా ముఖాంభోజ రాజ మరాళ
కేలు మోడ్చెద రాజగోపాల నీకు
“రాజగోపాల” అనే ముద్ర గల జావళీలు విజయ రాఘవ నాయకుని రచనలని తెలుస్తోంది. రాజగోపాల ముద్రతో గల జావళీ విజయ రాఘవ నాయకునిదిగా రూఢిగా చెప్పడానికి కారణం సాహిత్యంలో లభించిన పై ఆధారాలే.
తోడి – మిశ్ర తాళం
సరసకు రారా సామి మ్రొక్కేరా
మరులు కొన్న నాకు – మనసియ్య వేరా
తరుణి బెట్టిన మందు దలకెక్కే గదరా ॥సర॥
నిరతము నిన్ను నెరనమ్మి యున్నారా
కరుణతో నన్నేలరా గారడమ్యేల ॥సర॥
పూజ సేయుదు నీకు పొందిన తోను
రాజసమ్యేలర రాజగోపాల ॥సర॥
జావళీ ప్రక్రియకు ఆద్యుడైన క్షేత్రయ్య విజయ రాఘవుని ఆస్థానంలో ఉండడం వల్ల రాఘవ నాయకుడు కూడా క్షేత్రయ్య ప్రభావానికి లోనై జావళీలు రాసి ఉండవచ్చు అనడంలో ఏ సందేహమూ లేదు.
కాశీనాథ కవి – వీరభద్ర కవి:
వీరిరువరూ ప్రతాపసింహుని ఆస్థానంలో ఉన్న కవులు (1741-1764). వీరి కాలం నాటికే పద సాహిత్యం బహుళ ప్రాచుర్యంలో ఉన్న్నప్పటికీ పదాలు రచించకుండా కొత్తగా జావళీలు రచించినట్లు శ్రీ నటరాజ రామకృష్ణ గారు తమ ఆస్థాన నర్తనాలు అను పుస్తకంలో పేర్కొన్నారు. (5)
చిన్నయ్య పిళ్ళై (1803):
చెన్నై పిళ్ళై తంజావూరు క్వార్టెట్టులో పెద్దవాడు. చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం – తంజావూరు సోదరులు. కొంత కాలం చిన్నయ స్వాతి తిరుణాళ్ ఆస్థానంలో కేరళలో ఉన్నాడు. చిన్నయ్య శిష్యురాలు కనకమాల. ఈమె స్వాతి తిరునాళ్ ఆస్థానంలో ఉండేదని, చిన్నయ్యదో, స్వాతి తిరునాళ్‌దో ఒక జావళీకి అనుగుణంగా ఆమె నృత్యం చేసేదని పేలెస్ రికార్డుల వల్ల తెలుస్తోంది. లభించిన చిన్నయ్య ఒక జావళీల పుస్తకాన్ని ‘కె.పి. కిట్టప్ప పిళ్ళై’ పుస్తక రూపంలో తీర్చి దిద్దాడు. అందులో గల 22 జావళీలను స్వర పరిచాడు. మొదటిది చివరిది బృహదీశ్వరుడిని సంబోధిస్తున్నాయి. మిగిలిన 20 జావళీలు మైసూరు మహారాజా చామరాజ వుడయార్‌కి అంకితం చేస్తున్నట్లు ముద్రా చరణం ఆధారంగా తెలుస్తోంది.
స్వాతి తిరునాళ్ మహారాజు (1813-1846):
హెచ్. హెచ్. శ్రీ పద్మనాభ దాస, వంచిపాల శ్రీరామవర్మ కులశేఖర తిరునాళ్ స్వాతి తిరునాళ్ మార్చి 16న 1813వ సంవత్సరంలో జన్మించారు. ఆగర్భ శ్రీమాన్ అనే పేరు కూడా వీరికి ఉంది. కేరళ రాజ్యాన్ని ఏలుతున్న శ్రీ గౌరీ లక్ష్మీబాయి చేసిన దాన ధర్మాలు, పద్మనాభ స్వామికి చేసిన సేవల ఫలితంగా స్వాతి నక్షత్రంలో పుట్టిన మగ శిశువుకు స్వాతి తిరునాళ్ అని పేరు పెట్టారు.
వీరు సకల శాస్త్ర పారంగతులు. రాజతంత్ర నిపుణులు. పిన్న వయసు నందే మళయాళం, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు, కన్నడం, మరాఠీ, హిందూస్థానీ మొదలయిన 13 భాషలను నేర్చి విద్వాంసులయ్యారు.
16వ ఏటనే రాజ్యమేలడం ప్రారంభించి దైవ భక్తి గలవారై సకల ధర్మాలను పాటించారు. సకల భాషా ప్రవీణులనూ, సకల కళా నిపుణులనూ తన రాజ్యానికి రప్పించి, తన ఆస్థాన విద్వాంసులుగా వారిని నియమించి, గౌరవించి తన సభను గాంధర్వ సభతో సమంగా విలసిల్లేట్లు తీర్చిదిద్దిన కళాతపస్వి.
శ్రీ తంజావూరు సహోదరులు – చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం, వైణిక విద్వాంసులు శ్రీ వేంకటాద్రి భాగవతార్, పరమేశ్వర భాగవతార్, గణపతి భాగవతార్, క్షీరాబ్ధి శాస్త్రి మొదలగువారు వీరి సభనలంకరించారు.
పలు భాషలలో అనేక దేవతలపై చాలా కృతుల్ని, స్వరజతుల్ని, తానవర్ణాల్ని, పదాల్ని, జావళీల్ని, తిల్లానాల్ని అనేకంగా రచించారు. హిందూస్థానీ సంగీతంలో ద్రుపద్‌లు, టప్పాలు, టుమ్రీలు చాలా రచించారు. “ఇటు సాహసం ఏల నాపై” అనే సైంధవి రాగంలో గల జావళీ మొదటి జావళీగా చెపుతున్నారు. ఇదేకాక హరికథా కాలక్షేపాలనూ, కావ్యాలనూ రచించారు. వీరు తమ 30వ సంవత్సరంలో ఏప్రిల్ 26, 1847లో పరమపదించారు.
వీరి ముద్రలు – పద్మనాభ, అబ్జనాభ, అంభోరుహనాభ, పంకజనాభ, పుండరీకనాభ, జలరుహనాభ మొదలగు ఇరవై ముద్రలు ఉన్నాయి.
మాడుగుల వీరభద్ర సీతారామం:
వీరు 19వ శతాబ్దం ఉత్తరార్థంలో జన్మించారు. జన్మ స్థలం శ్రీకాకుళం (శ్రీకాకుళం జిల్లా). తండ్రి శ్రీ విజయ బాలయ్య.
రచనలు:1. గీతాద్యక్షర నిర్మిత తారావళి (ప.కా. 1909), 2. ముద్దుల రామాయణము, 3. సుందరీ మణి చరిత్రపు కమలతో రసిక వినోదము, 4. చంద్రశేఖర చరిత్రము, 5. సోమ సుందరీనాథ కంద శతకము, 6. సోమ సుందరీ తారావళి, 7. మణి నాగలింగ సీస శతకము, 8. నవరస కథా సుధారస తరంగిణి, 9. స్ద్వర్తన చంద్రిక, 10. శృంగారరస తరంగిణి పద్యకావ్యం (ప.కా.), 11. సోమ సుందరాష్టకము
వీరు నవలలు, శతకాలు, అష్టకాలు, కీర్తనలు, జావళీలు చాలా రచిహంచారు. గీతాద్యక్షర నిర్మిత నామ తారావళిలో 27 గీత పద్యాలున్నాయి. వీటి మొదటి అక్షరాలను వరుసగా చేరిస్తే “శ్రీ మాడుగుల విజయ బాలయ్య గారి కృతి నొసగితి, జయమగు గాక!” అన్న వాక్యం వస్తుంది. ఇది ఒక బంధ కవితా ప్రక్రియ. వీరి రచనలన్నీ ప్రౌఢమైన శైలిలో శబ్దాలంకార యుతంగా ఉన్నాయి.
నేతి సుబ్బరామ శాస్త్రి (1880 – 1950):
పశ్చిమ గోదావరి జిల్లాలోని వాడపల్లి గ్రామానికి చెందిన ప్రఖ్యాత జావళీ రచయిత. ఆ ఊరిలోని ప్రసిద్ధ దేవాలయాన్ని అంటి పెట్టుకొని 40-50 కుటుంబాల వారు, కళావంతులు ఉండేవారు. ఈ దేవదాసీలు దేవాలయ నృత్యం చేసేవారు.
సుబ్బరామ శాస్త్రి గారు వీరికి ‘అభినయ దర్పణం’ వంటి అనేక నృత్యాలకి సంబందించిన గ్రంథాలను నేర్పేవారు. సిద్ధాంత కౌముది అనే సంస్కృత వ్యాకరణాన్ని బ్రాహ్మణ బాలురకు నేర్పేవారు.
అనేక పదాలు, జావళీలు రాసిన శాస్త్రిగారు శిష్యులకు అభినయం కూడా నేర్పేవారు. సరిదె పద్మం, సరిదె సత్యనారాయణ వీరి శిష్యులలో ప్రసిద్ధులు. భైరవి రాగంలోని “రేపు వత్తువు గాని”, కల్యాణి రాగంలోని “చెరగు మాసే” అను జావళీలు వీరి ప్రసిద్ధ జావళీలు.
వాడపల్లిని “నౌపురి” అని సంస్కృతీకరించి తన జావళీలలో ముద్రగా వాడారు. ఈ జావళీలు 40 ఉన్నాయి.
రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ (1860-1919)
పూచి శ్రీనివాస ఆయ్యంగార్ ప్రసిద్ధుడు. పట్నం సుబ్రమణ్యయ్యర్ ముఖ్య శిష్యుడు. కచేరీలు చేయడంలో దిట్ట. రామనాథపురం ఆస్థానంలో ఆస్థాన విద్వాంసుడు, సంగీత కచేరీని క్రమబద్ధం చేసినవాడు.
వర్ణాలు, కృతులు రచించడమే కాక, ప్రసిద్ధమైన, ఉదాత్తమైన జావళీలు రచించాడు. సురటి రాగంలో గల ‘వేగ నీవు వాని రమ్మనవే’ జావళీకి చిట్ట స్వరాలు కూడా ఉండడం విశేషం.
1860 ఆగస్టు 16వ తేదీన రామనాథపురం జిల్లా లోని ‘ముత్తనేందులే’ అనే గ్రామానికి సమీపంలో ఉన్న ‘పాప్యాకుళం’ అనే చిన్న పల్లెలో జన్మించారు. తండ్రి అనంత నారాయణ అయ్యంగారు, తల్లి శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్. రాగాలాపన, పల్లవి పాడడంలో అఖండ పరిపూర్ణతను పొందినవారు. వీరు తానవర్ణాలు, కృతులు, జావళీలు, తిల్లానలు రచించారు. వీరు గాయకులు మాత్రమే కాదు, సంగీత శాస్త్రంలోనూ ప్రవీణులే.
వీరి శిష్యులలో ముఖ్యులు శ్రీ అరియకుడి రామానుజ అయ్యంగారు, కండనూర్ శ్రీనివాస అయ్యంగార్, సేలం దొరస్వామి అయ్యంగార్, కారైకుడి రాజమణి అయ్యంగార్, కుట్రాలం శ్రీనివాస అయ్యర్, కారైకుడి శ్రీనివాస అయ్యంగాఉ మొ॥ వారు.
దాసు శ్రీరాములు:
మార్గ సాహిత్య నిష్ణాతుడై, పత్రికా సంపాదకుడై, ప్రౌఢ రచనా సమర్థుడై, పురాణ ప్రధానమైన దేవీ భాగవత దురంధరుడై విలసిల్లిన దాసు శ్రీనివాసులు గారు తేనెసోనల అలతి అలతి తెలుగు పదాలతో రస భంగం గాని వాక్య విన్యాసాలతో చరణాలు కదలికలు సరస్వతీ చరణాల కదలికలు అనిపించేలా పల్లవి, అనుపల్లవిలలో రసం పల్లవించేలా రచనలు చేశారు. ముద్రలో తోట్ల వల్లూరి వేణు గోపాల దైవాంకితంగా జావళీలు రాశారు. రామ నామం గల దాసు శ్రీరాములు కృష్ణ నామం పేరు గల వేణు గోపాలుని ముద్రతో రాయడం ఒక వైచిత్రాంశం. ఈయన జావళీలను పరిశీలిస్తే నృత్య, గాన, రచన దురీనత్వం చూపటం వల్ల దాసు శ్రీరాములు గారు ఉగ్గడించ దగిన వాగ్గేయ కారుడనిపిస్తోంది.
జావళీ అనే ప్రక్రియ తెలుగు వారికి ఒక వరం. వివరం తెలియకుండా జావళీ గొప్ప రచన అని చాలా మంది గుర్తించారు. జావళీలలో వివిధ రసాల ఆంశాలు ఆంగికంగా ఉన్నా, శృంగార రసమే ప్రధాన రసం అయింది. భావ లాలిత్యం గల ప్రేమ అనే పదార్ధం రుచిని పంచి పెట్టిన ప్రక్రియ జావళీ. నాయికా నాయకుల విరహాల భావాల పంటలు జావళీలంటే.
సాహిత్యం ప్రధానంగా మార్గదేశి శాఖలలో విలసల్లి ఉన్నాయి. దేశీ సాహిత్య శాఖలలో పాతల బాటలో పల్లవించి పుష్పించి సౌరభం వెదజల్లిన ప్రక్రియ జావళీ. నిర్వచనాలు వేరయినా నిర్దేశ మొక్కటే. రచనలు చేసిన కవులు ఎవరయినా చేసిన రచనలు వెలువరించే కవుల భావాలు ఏకోన్ముఖ శృంగార శాఖాఫలాలే.
భావ రాగ తాళ భరితమైన భరతంలో గాని, మరి ఏ ప్రక్రియా సంబంధమైన నృత్యంతో నయినా జావళీని ప్రదర్శించవచ్చు. భాషా విలాసానికి భావ స్వారస్యానికి జావళీ ఒక ప్రక్రియ.
మానవ జీవితంలో ప్రేమ అనేది ఒక్క అమృత ప్రాయమైన సంగతి. ప్రేమతో ప్రేమించినా, ప్రేమింపబడినా ఎత్తుల జీవన పరిమళాలలో అది ఉద్భవించి, వికసించి సేద తీరుస్తుంది. అట్టి విశిష్ట ప్రక్రియ జావళీ. దేశీయమైన జావళీ రచన జానపద పాటలకు దగ్గరగా ఉంటాయి. నైసర్గికమైన జానపద లాలిత్యం జావళీలలో ఉంటుంది. కనుకనే జావళీ రచన మార్గ సాహిత్య సంబంధమైన రచయితలకు కొరుకు పడనిదిగా ఉంటుంది. ఏ ప్రక్రియలో ఎవరి ఆత్మావిష్కారమవుతుందో అది చేయడమే రచయితల ధర్మం.
గ్రాంథిక వాసనలకు దూరంగా ఉండే జావళీలు దేశీయమైన తెలుగుకు దగ్గరగా ఉండి ప్రజా స్రవంతికి చేరువయ్యే లక్షణం కలిగి ఉంటాయి. అందువలనే జావళీలు మార్గ సాహిత్య సృజన కర్తకకు కొంత కష్టమే. అయితే కొందరి విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది. అట్టి విశిష్ట కవి దాసు శ్రీరాములు.
దాసు శ్రీరాములు జీవన పరిమళం:
ప్రతిభా విద్వత్ వైలక్షణ్యం ఉన్న కవి, కవి సార్వభౌముడు శ్రీనాథుడు తరువాత వివిధ రకాల ప్రజల గుణగణాలను అభివర్ణించిన మహాకవి దాసు శ్రీరాములు. తెలుగునాడు వంటి ఖండ కావ్యాలు రాసి, ఎన్నెన్నో వ్యాస రచనలు చేసి మార్గ సాహిత్యాన్ని ఒక వైపు సుసంపన్నం చేసిన శ్రీ దాసు నిజానికి జావళీల దాసు అయ్యారా అనిపిస్తుంది.
పత్రికా సంపాదకుడిగా శ్రీ దాసు చాలా ప్రత్యేకతలు కలిగినవారు. ఆయనకు మొట్ట మొదటిలో సంఘ సంస్కరణ పడేది కాదు. వీరేశలింగం గారి సమకాలీకులైన శ్రీ దాసు వారికి వ్యతిరేకులు. ఆయన ఒక పత్రికా సంపాదకుడు. వీరేశలింగం గారి కాలంలోనే శ్రీ దాసు శ్రీరాములు “అనల్ప జల్పితా కల్ప కల్పవల్లి” అనే ఒక పత్రిక నడిపారు. వీరేశలింగం గారు స్త్రీ విద్యాభ్యుదయానికి దోహదం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ప్రచురణ చేసిన వ్యక్తి శ్రీ దాసు. వీరేశలింగం గారు మహిళలకు విద్య అవసరం అన్నారు. అయితే దాసు శ్రీరాములు గారు దాన్ని ఖండిస్తూ తన పత్రికలో రాస్తూ ఎండ బారిన స్త్రీలు పడకుండా ఇళ్ళలోనే ఉండి హాయిగా గడపాలని తమ పత్రికలో రాశారు. ఇది ఒక పేలవమైన సమర్ధన. దార్ఘికంగా నిలబడేది కాదు. అయితే తమలో దాచుకోకుండా సామాజిక పరంగా వ్యక్తం చేయడం తమ ధర్మంగా భావించారు. చిత్రమేమిటంటే దాసు శ్రీరాములు గారు తమ కడపటి జీవితంలో వీరేశలింగం గారి సంఘ సంస్కరణా విశేషాలను నమ్మి వాటిని బలపరుస్తూ, వారి అనుచరులయ్యారు.
దాసు శ్రీరాములు గారి బహుముఖ రచనా ధురీణత్వం:
ఒక వైపు ఖండ కావ్యాలు, మరొక వైపు ఖండికల రచనలు, యింకొక వైపు పత్రికా నిర్వహణ బాధ్యతలు, ఈ విధంగా నవనవోన్మేషంగా ఆయన రచనా సరస్వతి వికసించి దర్శనమిచ్చింది. ఇటువంటి విశిష్ట కవి దాసు శ్రీరాములు మార్గేతర రచన అయిన జావళీని స్వీకరించడం ఆశ్చర్యకరం. అంతకు మించి ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆ ప్రక్రియను అదే ప్రక్రియ రచనలో మునికి తేలిన రచయితాలా రచించ గలగడం.
దాసు శ్రీరాములు గారి జావళీలు:
దాసు శ్రీరాములు గారు రాసి జావళీలలో లభ్యమైనవి 44. వివిధ రాగ తాళాలు గమనిస్తే ఈ కింది విషయాలు తెలుస్తున్నాయి.
ఫరజు, కానడ, కాఫి, హిందుస్థానీ, భైరవి, ఆనంద భైరవి, ఖమాసు, సురటి, జంఝురటి, బేహాగ్, ముఖారి, తోడి, అసావేరి, సావేరి, దర్బారు, ద్విజావంతి, శంకరాభరణం, అఠాణా, బేగడ, కాంభోజి, యదుకుల కాంభోజి ఈయన రాసిన జావళీలకు ప్రధాన రాగాలు. ఈ ఏవంవిధ రాగ తాళ సంబంధమైన జావళీలను ఆయన రాశారు. గాన జ్ఞానం, తాళ జ్ఞానం, వీటిని మించి సాహిత్య పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న కవి శేఖరులు దాసు శ్రీరాములు.
ఈ జావళీలలో ప్రధానాంశాలు ఇవి. 1. ప్రేమ 2. సుముఖత్వం, 3. విముఖత్వం, 4. విరహం, 5. విరహంతో ప్రధమ స్థాయీఖంపం 6. విరహంతో తురీయ స్థాయీ భావం, 7. శృంగార ప్రదర్శనం అందుకు విరహోత్కంట విజ్ఞాపనం, 8. తాళజాలని పరిస్థితులు చెప్పుట, 9. నాయకుని ఎడల నిందాస్తుతి, 10. నిందలో అపనిందలు వేయటం, 11. విముఖత ప్రదర్శన, 12. తిరస్కార గుణ ప్రకటన, 13. కోరికను తీర్చమని లాలించి అడగడం, 14. కోరికను తీర్చమని నిందిస్తూ అడగడం, 15. భావ వైముఖ్య ప్రదర్శన, 16. శృంగార రస స్థాయీ భావ ప్రకటన వంటి గుణాలు ఈ రచననలో కనబడతాయి.
దాసు శ్రీరాములు గారు ఈ అంశాలను పరిపోషిస్తూ రచనలు సారించారు.
వైచిత్ర్య అంశాలు:
ఏదైనా ఒక అంశంలో దానిని స్పృశించడం వేరు. దానిలో మమేకత్వం చెందడం వేరు. దాసు శ్రీరాములు గారికి రాగ తాళ జ్ఞానమే కాకుండా దృశ్య జ్ఞానం కూడా ఉందేమో అని అనిపించేలా ఆయన జావళీ రచనలు ఉంటాయి.
“వద్దు వద్దురా ఇక వదలరా సామీ” అనే జావళీలో విరహోత్కంట అయిన ప్రియురాలి బాధను లలిత సుకుమార పద భరితంగా అనుభూతిని నొక్కి చెప్పారు.
“ఏమనెనే కోమలి తెలుపవే” అనే జావళీలో “అంగజు బారికి నిలువ తరమటే వార్తలు మరియేమి నీతో యేమనెనే” అని పల్లవిని కలుపుతారు. ఇక్కడ ఒక ధ్వని ఉంది. మన్మథుని బాధకు నిలవడం కష్టమనే భావం వ్యక్తీకరిస్తూ మంగళ వార్తలు నీతో ఏమైనా అన్నాడా అని అనడంలో మంగళ వార్తలలో ధ్వని ఉంది. ఇక్కడ మంగళ వార్తలంటే వివాహాది శుభవార్తలు కావు. మన్మథుడి బారి నుండి నేను ఓర్చుకోలేక పోతున్నాను అని అంటున్న సందర్భంలో మంగళ వార్తలు నీతో చెప్పాడా అని అనడంలో ప్రియుడు నీ కోరిక తీర్చుటకు పిలిచాడా అని అనడమే ఆంతరంగిక ధ్వని విశేషం. ఈమంగళ వార్తలు పద ప్రయోగం ఏ అన్నమాచార్యుని స్థాయి లోనో దాసు చేశారు అనిపిస్తుంది.
“రమణిరో సముఖానా రాయబార మేటికో” అనే జావళీలో శృంగార రస స్థాయీ భావం లేదు. కలిసే సంసిద్ధత వృధా కారాదు అనే వ్యక్తీకరణ ఉంది.
“పోవోయి పోవోయి పలతులతో ఇంత పోటా పోటీ లేమోయి” అనేఏ జావళీలో ఎక్కువ మంది స్త్రీలతో స్త్రీ సంపర్కం గురించి వెటకారాలు ఉన్నాయి.
“నను విడనాడుట న్యాయమా సామి” అనే జావళీలో నన్ను దూరం చేసుకోవడంలో కారణం ఏమిటి అని బ్రతిమాలి అడగడం ఉంది.
“వనితరో ఈ వన్నెలేలనే ఈ వేళ నాకు” అనే పాటలో ప్రియుడుతో కూడిన లభించని సందర్భాలలో వన్నెచిన్నెలు, నగలూ నట్రా గంధం వంటి పరిమళ ద్రవ్యాలు అనవసరమని సహజ భావ వ్యక్తీకరణ ఉంది. పాట బాటలో సున్నితమైన, లలితమైన పదాలు అందుకు ఉపయోగిస్తే భావ వ్యక్తీకరణ ఎంత రమ్యంగా ఉంటుందో ఈ పాట ఒక దాఖలా. అసలైన శృంగార సంగతి లేని సందర్భంలో –
వెన్నెలేల
ధనమేల
ధామమేల
ఆకులేల
పోకలేల
అన్నమేల
పానమేల
సొగసేల
సొమ్ములేల
అగరేల
గంధమేల
తోటలేల
బాటలేల
ఇన్ని గొప్పవీ ఎందుకు, వలసిన పొందు లేకపోతే అను చక్కని లలితమైన జావళీ ఇది.
“తెలియదే తెలియదే” అనే జావళీలో విరహిణి అమాయకత్వం, బేలతనం, జాలితనం వ్యక్తమై నాకు తెలియని పనిని అతడు చేసి వెళ్ళినాడని నిందించడం జరిగింది.
సాధారణంగా కొన్ని పాటలలో జావళీల్లో non-sense rhymes ఉంటూ ఉంటాయి. అనంతం, పంతం, బలవంతం, అత్యంతం – ఇలా ఎన్నో పదాలు కొన్ని అర్థ సహితాలుగానూ, అర్థ రహితాలుగానూ ఉంటాయి.
“వగకాడా తగదిక రారా” అనే జావళీలో ప్రేయసి తాను రకరకాలుగా భర్తను ఆనందింప చేస్తాను అని చెప్తూ ఉపరతి సుఖమున ఓలలాడించెద అన్నంత వరకూ వెళ్తుంది.
ఒక్కొక్క జావళీలో రెండే చరణాలు ఉండి ఆ రెండే మహోన్నతంగా ఉంటాయి. “ఆ నలినముఖి” పాటలో తంతరగత్తెలు అనే ప్రయోగం గమనార్హం.
“మనసిచ్చి నాతో మాటాడవేమిరా” అనే జావళీ వంటివి “ఏమని తెలుపుదునే” అనే జావళీలో సామాన్య పద ప్రయోగాలు ఉన్నాయి. అర్హత లేని వారిని పొందావు అని విమర్శిస్తూ “అడివి ముషిణికాయ అది నీకు ప్రియమాయె అయ్యో నేనేమందురా” అని అనడం ప్రౌఢ భావ ప్రకరణకు దర్పణంగా ఉంది.
“ముంజేతి కంకణానికి అద్దమేల” అనే సామెతలు అక్కడక్కడ ఉన్నాయి.
“వలచితిరా నిను” అనే జావళీలో నీ పొందు లేకపోయినా నీ దర్శనం ఇయ్యి. నువ్వు నాతో మాట్లాడు – అదే చాలు.
ఈ విధంగా దాసు శ్రీరాములు గారు రాసిన జావళీలలో ప్రౌఢ ప్రయోగాలు మాత్రమే కాక భావ వ్యక్తీకరణలు కూడా ఉన్నాయి. ప్రియుని గురించి రాసేడప్పుడు దాసు శ్రీరాములు గారు ప్రేయసి అయిపోయారు. ప్రేయసి గురించి రాసేడప్పుడు ఆయనే ప్రియుడై పోయాడు. జీవాత్మ పరమాత్మల కలయికే అద్వైత స్థితి. ఈ సర్వ ప్రపంచంలో అద్వైత స్థితి అంతర్లీనంగా ప్రకృతి లోనే ఉంది. ప్రాకృతికంగా ఈ జావళీలు రాసిన శ్రీ దాసు శ్రీరాములు గారు ఒక వాగ్గేయకారుడే.
అసావేరి – త్రిపుట
ప॥ అంత గీర్వాణము నేనే రారా స్వామి
అచ్చ తెనుగు జెప్పరా ॥అంత॥
అ.ప.॥ వింతగా నను జూచి విరిబోణియ రూపు
బంతులాయేమని పక పక నగియెదవు ॥అంత॥
చ॥ 1. చాలగా మదన ప్రచారములనునే
జాణ గాను గదర
మేలు వేలుపు ప్రోడ మిద్దిటింటికి జేర
వీలు దెలుపు మని వేవేగ ననియెదవు ॥అంత॥
చ॥ 2. వీరాసనము వైచి పెదవి పంటను గరచి
తీరుగా కను గీటుచు
వారిజ ముఖి మంచి పగడము ముత్యాల
చేరులోనికి దయ సేయుమీ అనియెదవు ॥అంత॥
చ॥ 3. వాలాయముగ తోట్ల వల్లూరి వేణు గో
పాల నిన్నే నమ్మి ఆ
శీలమొప్పగ దాసు శ్రీరాము కవి కృతి
లీలాంశ్రుడు మహిళే అని పల్కెదవు ॥అంత॥
భావాన్ని తెలియ జేయడానికి ఉద్భవించిన భాష ఏ భాషైనా దేనికదే గొప్పది. కాని స్వకీయ పర ఆంశాలు ఉంటూనే ఉంటాయి. సంస్కృతం భారత దేశీయ సంస్కృతికి ప్రతిబింబమైన భాష. తెలుగు కోట్ల కొలది జనుల మాతృభాష. ద్రావిడ భాషానుశీలనం చేశాక తెలుగు మాధుర్యం, ప్రాచీనతా మనకు స్పష్టం అవుతుంది. ప్రస్తుతం దాసు శ్రీరాములు గారు రాసిన ఈ జావళీ –
“అంత గీర్వాణము నేరరా సామి
అచ్చ తెనుగున జెప్పరా”
అను పల్లవితో ప్రారంభమైనది. ఇవి రెండు వాక్యాలుగా కనబడుతున్నాయి గాని దీని వెనుక నేపథ్యం చాలా ఉంది. అందరు పండితులూ కాకపోయినా కొందరు పండితులు సంస్కృతమే గొప్ప భాషయని అంటూ తెనుగును కించపరిచేవారు అక్కడక్కడా ఉంటుంటారు. ఇక్కడ సందర్భం భాషా నామ సందర్భం కాదు. భాషా భావనా సందర్భం కూడా. గీర్వాణం, అచ్చ తెనుగు అను రెండు మాటలు కవి ఇక్కడ వాడాడు. “అంత గీర్వాణము నే నేర్వరా!” అనడంలో నాకు సంస్కృతం రాదు అనే అర్థం ఒకటి. అంత గర్వాన్ని నేను ఒప్ప్పుకోలేనని రెండో అర్థం. ఇక్కడ గర్వం దేనికంటే తాను నాయకుడు గనుక ప్రియుడే ప్రేయసి పట్ల అలక్ష్యం చూపడంలో గర్వం. అంతేగాక జన సామాన్యంలో ఏదైనా తెలియనిది చెప్పినప్పుడు “సంస్కృతం ఎందుకు? తెనిగించి చెప్పు!” అనే వాడుక కొంతగా ఉంది. ఇక్కడ తెనిగించి అనే దానిలో మళ్ళీ రెండర్థాలున్నాయి. ‘అర్థం’ అని సంస్కృతం వదలి అర్థం అయ్యేలా తెనిగించి చెప్పమనే భావంలో ఒకటి. తెనిగించడం అంటే తెలుగులోనే రాయమని కాకుండా భాషాంతరీకరించి చెప్పమని.
దాసు శ్రీరాములు గారు సంస్కృతాంధ్ర అసాధారణ పండితులు. పండితుడైనవాడు సంస్కృతాన్ని కించబరచడం ఉండదు. దాసు శ్రీరాములు గారి గొప్పదనం ఏమిటంటే అవసరమయితే ఏ ప్రక్రియలో రాస్తున్నామో ఆ ప్రక్రియ కనుగుణమైన ఆంతరంగిక భావజాలంలో ఇమడగలగడం. పండితేతరులు ఎక్కువగా పాటలు రాయడం ఉంది. దాసు శ్రీరాములు గారు కేవలం పండిత పక్షపాతిగా కాక ప్రాకృతిక ప్రేయసీ ప్రియుల లేదా నాయికా నాయకుల చిత్తాలను వ్యక్తం చేసే భాషను వాడారు.
ఈ జావళీలో “అంత గీర్వాణము నే నేర్వరా” అంటే ప్రేయసి అడుగుతోంది గదాని అలుసుగా చూడొద్దు అని అంటూ – “అచ్చ తెనుగు చెప్పరా” అడగడం ఉంది. ఇక్కడ భాషా నామ చర్చ సందర్భంలో ఒక అంశాన్ని గమనించాలి. సామాన్యులైన జనుల్లో అశ్లీల పద ప్రయోగాలతో మాట్లాడినప్పుడు ‘ఏం, సంస్కృతం మాట్లాడుతున్నావా’ అని అడగడం ఉంది. ఇక్కడ బహిరంగ పాత్రలు ప్రేయసీ ప్రియులు లేక నాయికా నాయకులు. అంతరంగిక పాత్ర దాసు శ్రీరాములు.
అంతరంగిక సూత్రధారి ప్రధాన పాత్రలో మమేకమై చెప్పడంతో తాను సంస్కృత పండితుడని పరచి పోవడం జరిగింది. జావళీ అంద చందాలను సొగసులను భాషింప జేయడంలో సంస్కృత పాత్ర ఉన్నప్పటికీ తెనుగు పాత్ర ప్రధానమైనది. అచ్చ తెనుగు పదాలు ఎక్కువ ఉండడం కూడా కొంచెం దూరాన్వయంగా కనబడినప్పడికీ – “అంత గీర్వాణం కాకుండా అచ్చ తెనుగులో చెప్పాలని” కవి భావన. జావళీ లక్షణంలో ప్రధాన విషయం. వస్తుతః ప్రేయసీ ప్రియుల పాత్రల లోకి ప్రవేశించడం న్యాయం అవుతుంది. ఈ జావళీ పల్లవిలో “అచ్చ తెనుగు చెప్పమని” అంటూ అను పల్లవిలో అచ్చ తెనుగు చెప్పడం జరిగింది.
“విరిబోణి”, “పూవు బంతులు” అనే ఆ పదాల ప్రయోగం జాను తెనుగు మాధుర్యం ఉట్టి పడేట్టుగా ఉన్నాయి. జాను తెనుగు అచ్చ తెనుగును స్వంతం చేసుకున్న తెలుగు. భాషా విషయం అలా ఉంచితే ఈ అనుపల్లవిలో భావం ఏదో చెప్పటం వంటిది కాక కవిత్వ సంబంధిగా మారింది. వాచ్యం కానప్పుడే అది కవిత్వం అవుతుంది. ప్రియుడు ప్రేయసిని వింతగా చూస్తూ “విరిబోణి” అని అంటూ పూల బంతులు ఏమాయెనని అడిగాడు. వాచ్యంలో పూల బంతులు గర్భితమైన అర్థం పాలిండ్లు. ధ్వనిగా పూల బంతులు ఏమయ్యాయి అని అడగడంలో శృంగార సంబంధ భావాన్ని కవిత్వ పరంగా అడిగినట్లయింది. కనుక ఈ జావళీ భాషాపరంగా, భావపరంగా, కవిత్వపరంగా కవి అంతస్తును తెలిపేటంత ఉదాత్తతతో కూడా ఉంది. ఇక చరణంలో –
“చాలుగా మదన – ప్రచారములును నే
జాణ గాను గదర!”
అని ఉంది. ఇక్కడ నాయిక ప్రౌఢ.అంతశ్చైతన్యాన్ని బహిర్గతం చేయకుండా తెలియనట్లు నటించడం ప్రౌఢ నాయకి లక్షణం. ఈ నాయకికి కోరిక ఉన్నా ఆ కోరిక ఉన్నట్లు తెలుపకుండా తెలపడం లక్షణం. కావాలనుకున్నది చెప్పక పోవడం, ప్రియుడిచే చెప్పించడానికే ప్రియుడు ఏవేవో మన్మథ సంబంధ ప్రచారాలను చేసేశాడని ఒక నెపం వేస్తూ నీవి “అవేవో నాకు తెలియనివి తెలియ జేస్తున్నావ్! కానీ నేనే అన్ని విషయాలూ తెలుసుకో గలగడానికి నే జాణను కాను” అని అంటోంది. ఇలా అనడంలోనే ఆమె జాణతనం తెలుస్తోంది.
“మిద్దె యింటికి చేరడానికి వీలు తెలుపు”మని అంటోంది ప్రేయసి. మిద్దెయిల్లు – బయట గదులు, వెనుక గదులు ఉండేది కాదు. నిద్రించే స్థానం మిద్దెయిల్లు. ఇది కూడా కవిత్వ సంబంధమైన ధ్వని ప్రాయమైన అంశమే. అంటే నాయికా నాయకుల లేదా ప్రేయసీ ప్రియులు కూడడానికి అనువైన ప్రాంతాన్ని ఎక్కడో తెలుపమని అడగడం కోరికను మరో విధంగా తెలుపడమే. మొత్తంపై ఈ జావళీ అసలు సిసలైన తెలుగు జావళీ. సర్వ కోణ సంపూర్ణంగా భాసిస్తోంది.
జావళీలోని ప్రధమ చరణంలో ఛందోబద్ధమైన సీసపద్య వాక్యాలు కూడా మిళితమై ఉండడం ఒక విశేషం.
“వేలు వేలుపు ప్రోడ
మిద్దటింటికి జేర”
ఇక్కడ ఈ నాలుగు గణాలు సీస పద్య ప్రధాన వాక్యంగా గురులఘు మేళవింపులలో సరిగా ఉంది. అయితే యతి స్థాన విషయం – సీస పద్యంలో మొదటి గణ ప్రధమాక్షరం, మూడో గణ ప్రధమాక్షరానికి యతి ఉంటుంది. లేదా ప్రాస యతి ఉంటుంది. ఈ వాక్యంలో ప్రాస యతి కాదు. యతి సరిపోయింది. మొదటి గణంలో “మే” అక్ష్హరానికి, నూడవ గణంలోని “యి” అక్షరానికి యతి స్థానం చక్కగా కుదిరింది. సీస పద్య ప్రధమ వాక్యం యిలా ఒదగడమే కాక సీస పద్యంలో కింది వరుస వాక్యం కూడా –
“వీలు దెలుపు మని”
పాట లోని రగడల లోంచి సీస పద్యం వచ్చిందని లాక్షణికులు అంటూంటారు.
ప్రాచీన కాలంలోనే కాకుండా ఆధునికమైన పాటలలో కూడా సీస పద్య వాక్యాలుండడం సహజంగా ఉంది. వేటురి రాసిన –
“ఆరేసు కోబోయి పారేసు కున్నాను
కోకెత్తు కెళ్ళింది కొండ గాలి”
యిది సీస పద్యం – మొదటి వాక్యాలకు సరిగ్గా అన్ని లక్షణాలు సరిపోయాయి.
రగడలు – పాతల నుంచే దేశీయ వృత్తాలు వచ్చాయని చెప్పినది అత్యంత సహజమని నాటికీ నేటికీ తెలుస్తోంది. మూడవ చరణంలో కూడా –
“వాలయముగ తోట్ల వల్లూరి వేణు గో
పాలుని నేనమ్మి (ఆ) శీలమొప్ప”
“తి” అనే అక్షరం అధికంగా ఉందని సర్దుకుంటే ఇక్కడ సీస పద్యం వాక్యమే. సీసానికి శ్రీనాథుని నానుడి. శ్రీనాథుడి ప్రభావంలో ఆధునిక శ్రీనాథుడిగా పేరు గాంచిన దాసు శ్రీరాములు గారి జావళీలలో సీసపద్య వాక్యాలుండటం పరోక్ష సత్యాలను ప్రత్యక్షం చేసేట్లుగా ఉన్నాయి.
ఈ జావళీ ఉత్తమ కవిత్వం గల విస్తృతార్థాలు గల విశేషాలు గలది.
కాఫి రాగం – ఆది తాళం
ప॥ పోవోయి పోవోయి పొలతులతో నింత
పోటా పోటీ లేమోయి ॥పోవోయి॥
అ॥ ప॥ వానిని ఈవాడ వనితలెల్ల నీకు
వావారే వావారే వదిన మరదళ్ళైరి ॥ పోవోయి॥
చ॥ 1. తల తడిది తగని బాసలు జేసిని నమ్మ
దగిన కాలము గాదురా
చెలువుడ మన యూరి వెలయాండ్రతో నీకు
భళి భళి భళి భళి బహారీ ఖాతాలాయె ॥ పోవోయి॥
చ॥ 2. వేష భాషలు జూసి విషమ చక్కర జేసి
విడుతురోయి పురుషులు
ఆషా మాషీ చెలియల సయ్యాటలు నీకు
భేషు భేషు విజయ బరుదములాదు ॥ పోవోయి॥
చ॥ 3. బహురూప ధర తోట్ల వల్లూరి వేణు గోపాలా
యెంత జాణవు
దహియించు దాసు శ్రీరాముని పలుకులు
ఆహా హాహా ఆహా ఆహా అమృత బిందువులాయె ॥ పోవోయి॥
కాఫీ రాగంలో అట తాళంలో ఒదిలిన ఈ కవి జావళీ – దాసుగారి రచనా వైవిధ్యానికి ఒక పరాకాష్ట. కారణం ఈ జావళీ అంతా ఒక అనుభూతి పరమైనది కావడం. అనుభూతికి మాటలు తక్కువ, వ్యక్తం చేసేది ఎక్కువగా ఉంటుంది. అనుభూతికి మాటలే అక్కరలేదు. సాగదీస్తూ చెప్పిన ఒక అక్షరం గానీ, కుంజపరిచి చెప్పిన ఒక అక్షరం గానీ, ఎంతో పెద్ద భావాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది. అనుభూతి ప్రధానంగా రాయాడంలో మన భాష గొప్పతనం కూడా వ్యక్తమవుతుంది. మన భాష ఎంత గొప్ప మధురమైన భాషంటే – అక్షర సంపుటిలో “ఉ” అనేది అక్షరం – ఏకాక్షరానికి అర్థం, అది పదం కాకపోయినా, అలాగే అన్న భావాన్ని స్ఫురింప జేస్తోంది. దానికి ముందర వున్న “ఉ” అనే అక్షరం కొంచెం అనునాసిక పరంగా ప్రయోగించి రెండు సార్లు అంటే “ఉ ఊ” అయి, అనడంలో – సాగదీసి అనడంలో “ఉ ఊ” అయిష్టాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక్కడ పదాలు – భావాలు వ్యక్తం చేయడం కాదు. అక్షరాలే భావాన్ని వ్యక్తం చేయడం విశేషం.
ఈ జావళీలో “వావారే”, “భళి భళి భళి”, “భేషు భేషు భేషు” వంటి మాటలు భావపరంగా అల్పాక్షర పదాలతో చెప్పటం అవుతుంది. ఈ జావళీలోని పల్లవిలో –
“పోవోయి పోవోయి పొలతులతో
యింత పోటా పోటీ లేమని”
అనడంలో, “వెళ్ళమని” అర్థం కాదు. “యింక నువ్వు ఏమీ చెప్పనక్కర లేదులే, విషయం అర్థం అయిందని” చెప్పడం ఉద్దేశం.
“స్త్రీలలో ఇంత పోటా పొటీగా, అధికంగా ఎక్కువ మందితో ప్రవర్తిస్తున్నావు నీవు” అని మందలించడం – ఈ జావళీ తాత్పర్యం భావం గుప్తంగా ఉండేది. ఈ జావళీలో “ఓ వేణుగోపాలా” లేదా “ఓ నాయకుడా” లేదా “ఓ ప్రియుడా” అని సంబోధిస్తూ “ఇంతమందితో చెలిమి చేస్తున్నావు, ఇది నీకు తగదనే” భావాన్ని చెపుతోంది.
“ఈ వాడ వనితలెల్ల నీకు వదిన మరదళ్ళు అయిపోయారు” అని చెప్పడంలో సంచానీకులైన స్త్రీలతో అతని సమీప సాన్నిహిత్యాలను ప్రశ్నించడం జరుగుతోంది.
పైగా “తల తడిమి తగని బాసలు చేసిన నమ్మ కూడని రోజు” అయ్యాయి అనడంలో నాయకి ప్రౌఢ కాక సామాన్య నాయిక అయి సామాన్య మానవ మహిళ వ్యక్తం చేసే భావ్వాలలో తన భావాన్ని వ్యక్తం చేసింది. మహాకవి ఒక్క పద ప్రయోగాన్ని చూస్తేనే దానిలో మన సంస్కృతికి సంబంధించిన ఆచార వ్యవహారాలుంటాయి.
చరణంలో “తల తడమటమనేది” ఒక ఆచార సంబంధమైన సంస్కృతి అని తెలుపుతుంది. “ఊరి వెలియాండ్రతో నీకు బహారా ఖాతాలా” యని అంటోంది. 1846-1908 మధ్య జీవించిన కవి తన రచనలను బేరీజు వేసేటప్పుడు సమకాలీన చారిత్రక అంశాలను పరిగణన చేయవలసిన అవసరం ఉంది. మహమ్మదీయ పరిపాలన కారణంగా మనకు ఉర్దూ పదాలు ప్రయోగం అత్యంత సహజమైంది. న్యాయ పరమైన శాసనాల విషయంలో ఆర్ధికాది అంశాలలో ఉర్దూ పదాల ప్రయోగం బహుముఖమై ఈ నాటికీ నిలిచిపోయాయి. కోర్టు పరిభాషలో ఈ నాటికీ ఉర్దూ పదాలు ఉండనే ఉన్నాయి. “అసలే ఫాయిదాలు” వంటి ఎన్నో మాటలు చలామణిలో ఉన్నా, ఈ కాలంలో ఉన్న ఈ కవి ఉర్దూ పదం వాడటంలో సహజత్వం కనిపిస్తోంది.
“బహారీ ఖాతాలు” అనేవి ఉర్దూ పదాలు, ఇప్పటికీ “ఖాతా” అనే మాటను మనం వాడుతూనే ఉన్నాం. “బాహరీ” అంటే బయట. ఊరి మహిళలతో నీకు చాలా అనుబంధం ఉందంటూ, అనేక మంది సంసర్గం నీకు బయట ఖాతాలై పోయయి అనే చమత్కారం వ్యక్తమవుతోంది.
సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతుడైన కవి దాసు శ్రీరాములు గారు సమకాలీన భాషా ప్రయోగాల బారి నుండి దూరం కాలేదు. బయట విషయాలు ఎక్కువై పోయాయంటే ప్రేయసీ అంతరంగిక భావం తనను పట్టించుకోమని. తన పురుషుడితో తగవాడుతూ అర్థోక్తిగా వెటకారలు పలికే ఈ పలుకే సందర్భానుసారంగా ఆడవారి విషయంలో మగవారి పాత్రను కూడా ప్రశ్నిస్తోంది. ఏవో వేష భాషలు చూపించి చేదును కూడా తీపిగా భాషింపచేస్తూ పలచినట్లు ప్రవర్తిస్తూ విడిచి పెట్టేస్తాననే భావం వ్యక్తం చేస్తోంది.
“చెలులతో నీకు ఈ సయ్యాటలు ఆషామాషీ అయిపోయాయా” అని ప్రశ్నిస్తోంది. “ఆషామాషీ” కూడా అన్యభాషా పదమే.
ఇక్కడ చివరి చరణంలో వేణుగోపాలుని గురించి రాస్తూ “బహు రూపధరా” పద ప్రయోగం సాభిప్రాయ పదప్రయోగ సౌశీల్యంతో కూడుకున్నది. ఎందుకంటే శ్రీకృష్ణుడు బహు రూపధరి, అనేక మంది గోపికా స్త్రీలతో రాసక్రీడలాడిన విలాసవంతుడు.
ఈ జావళీలో నాయిక ప్రియుణ్ణి చాలా మందితో చెలిమి చేస్తున్నావని ప్రశ్నించి వెటకారం చేసే సంఘటన సందర్భం – ఒక అభిప్రాయాన్ని ఒక మహాకవి వాడినప్పుడు అభిప్రాయానికి తగిన పదాలను వాడటం ఔచిత్యవంత మయినదని లాక్షణికులు చెప్పారు.
“బహు రూపధర” అనేది అటువంటి పద ప్రయోగమే. “భేషు భేషు” అనే పదం కూడా ఒక యితర భాషా పదం. “ఆషామాషీ, బహారీ ఖాతాలు, భేషు భేషు” వంటి యితర భాషా పదాలు కూడా ఈ జావళీలో ప్రయోగించ బడ్డాయి. ఇతర భాషా పదాలు ప్రయోగించకుండా దృక్పధం సాంప్రదాయిక కవులలో కొంత మందికి ఉంది. అయితే పాటలు రాసినపుడు కాలప్రభావనుగుణంగా సాగడం దాసు శ్రీరాములు గారి మార్పు కోరే మనసుకి ఒక దాఖలా. భాషనేది ప్రవాహ శీలమైనది. ప్రవాహ శీల భాషలో దేశీయ భాషా పదాలే ఉండలనుకోవడం కుదరని సంగతి. దానికి అనుగుణంగా సాగిందీ జావళీ. ఈ జావళీ భాషాపరంగా, అనుభూతి పరంగా గొప్ప జావళీ.
కాంభోజి – త్రిపుట
ప॥ కట్టివైతువా పడకటింటిలో వాని
బట్టి పైట కొంగున ॥కట్టి॥
అ॥ప॥ ఇట్టి వాడు వంట యింటి కుందేలాయె
ఎక్కడ బోయే ననుకోరాదమా ॥కట్టి॥
చ॥ 1. విడచితివా సామి – వీధి వీధి తిరిగి
వేగత్తెల గుడ్డునే
తడబాటు లేక చేతను జిక్కినప్పుడే
చెడనీక పదిలము చేసుకో వలెనమ్మ ॥కట్టి॥
చ॥ 2. ఏమరి నే నూరకుంటినా ఈ రాత్రి
ఏవేళ నే బుద్ధి యో
కోమలమున నింత గోవగొన్న వాడు
కామాక్షి మనవాడ నమ్మరాదమా ॥కట్టి॥
చ॥ 3. మోసపోతిని వేణు గోపాల దేవుని
బాస నిజము గాదే
దాసు శ్రీరామదాసుని హృదయము
బాసిగదియ యైన నిలువ నొల్లడమ్మా ॥కట్టి॥
దాసుగారి జావళీలలో – ఒక్కొక్క జావళీలో ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. ఒక విమర్శకుడు ఈ రచయిత గురించి రాస్తూ ఈయన ఎవరినీ అనుకరించలేదు అని ప్రశంసించాడు. అప్పుడు ప్రక్క వ్యక్తి, అయితే ఈయన అంత ప్రతిభావంతుడా అని అడిగాడు. అప్పుడతడు అబ్బే అదేం కాదనీ, ఇతడు ఎవరినీ అనుసరించడనీ, తరచు తనను తానే అనుసరిస్తాడనీ అన్నాడట. చాలా మంది చిన్న పెద్ద కవులలో కూడా తెలిసో తెలియకో తనను తాను అనుసరించుకునే స్థితి ఉంటూ ఉంటుంది. దాసు శ్రీరాములు గారిలో ఈ రకమైన స్వీయానుసరణ ఉండదు. అలాగని ఆయన ప్రతి జావళీ ప్రత్యేక ముద్రతో కవితా భద్ర స్థితిన్ని కల్పించి రాస్తూంటారు. అందుకే ఒక్కొక్క జావళీ ఒక్కొక్క ప్రత్యేకతతో సాగింది.
“కట్టి వైతునా” అనే పల్లవి గల ఈ జావళీలో ప్రియుణ్ణి వేరే స్త్రీలతో సంబంధం లేకుండా రక్షించుకుంటూ స్వకీయుణ్ణి చేసుకోవడం కనిపిస్తుంది.
కట్టివైతునా పడకటింటిలో వాని
బట్టి పయట కొంగున
అని పల్లవి అనడంలోనే విశేషం ఉంది. సంబంధిత వ్యక్తిని ఎక్కడో ముందు గదులలో గాని, వసారాలో గాని అనలేదు. పడకటింటి లోనే వానిని కట్టి వేస్తానని అనుకోవడంలో నాయకి మనో వాంఛ అంతశ్చేతనగా వ్యక్తమయింది. కొంగున ముడి వేసుకోవడం అనేది ఒక నానుడి ఉండనే ఉంది. సాధారణంగా భారతీయ సమాజానికి చెందిన ఆర్ష పద్ధతిని అనుసరించే మహిళా లోకంలో ఒక మానసిక స్థితి ప్రతి మహిళకూ వుంటుంది. భర్త కాని చూసుకోవడం ఉంటూ ఉంటుంది. ఇది ఒక సాధారణ స్త్రీకి ఉండే స్వాభావిక అంశం. పురాణ గ్రంథాలలో దమయంతికి ద్రౌపదికి ఎంతో తేడా ఉంది. ద్రౌపది కష్టాలు వేరు, దమయంతి కష్టాలు వేరు. తాను ఎవరిని భర్తగా పొందాలో ఆ ప్రియుడే వచ్చి దిక్పాలురను వివాహం చేసుకోమని అడిగే దౌర్భాగ్యకర మానసిక వేదన దమయంతిది. కాని ఆమె ప్రౌఢ నాయిక అవడం వల్ల బేలతనం కాకుండా చాకచక్యంతో తన సమస్యలను తానే పరిష్కరించుకుంది. అయితే రాజ్యం పోగొట్టుకోవడం, పర పురుషుల చేత భంగ పడినపుడు ద్రౌపది ఒక సాధారణ స్త్రీలా భర్తల్ని దుమ్మెత్తి పోసిన విధంగా అంటుంది. ద్రౌపది గొప్ప నాయికే కాని ప్రౌఢ నాయిక కాదు. ఆమె వస్తుతః సామాన్య నాయకి. సామాన్య నాయకి లక్షణం – ఉన్నది ఉన్నట్లు అనడం, వాచ్యంగా లేకపోవడం. ఆ ద్రౌపది వంటి సామాన్య గుణాలు గల నాయిక ఈ జావళీ నాయిక.
“నా ప్రియుడు ఎక్కడికో వెళ్ళిపోయాడని అనుకోకండి. వంట యింటి కుందేలుగానే ఉన్నాడని” అంటుంది. అందులో “ఎక్కడికి పోయాడని అనుకోకండి” అంటుంది. కొంగున ముడేసుకు, వంటింట్లోనే ప్రియుణ్ణి పడేయడానికి కారణం ఏమిటంటే ఈ ప్రియుడు అన్య స్త్రీలోలుడు. ఆ బలహీనత గలవాడు, అందుచేతనే ప్రథమ చరణంలో –
“విడిచితినా సామి – వీధి వీధి తిరిగె
వేగత్తెల గూడెనే…”
అంది. అంచేత ఎవరితోనో పోకుండా తనతోనే ఉండడాన్నే వంట యింటి కుందేలుగా చేసింది.
లోకంలో పురుషుల కంటే స్త్రీలు కష్ట సుఖాలు చెప్పుకునే ఒక మానసిక బలహీనత ఉంది. ఎవ్వరూ లేకపోతే ఏ తడికి తోనో చెప్పే సందర్భాలు ఉన్నాయి. తన బాధలను యితరులతో చెప్పుకొని స్వాంతన పడేటప్పుడు యిలాగమ్మా, అలాగమ్మా అని తోటి మహిళలతో చెప్పుకోవడం స్త్రీకి ఉంది.
పడకటింటిలో తన ప్రియుణ్ణి కట్టేయటమేమిటని ఎవరూ అడగకుండా –
“తడబాటు లేక చేతను చిక్కినపుడే
చెడనీక పదిలము చేసుకోవలెనమ్మా”
అని అంటుంది. అంచేత నా ప్రియుడి విషయంలో శ్రద్ధ తీసుకోవ్వాలని అంటుంది. ఈ విధంగా ఈ జావళీ ఒక సామాన్య నాయకి మానసిక స్థితికి ప్రాకృతిక ఆంశాలకు దర్పణం.
కల్యాణి – మిశ్ర చాపు
ప॥ తత్తర పడనేల – తాళు తాళురా సామి
అత్తింటి కోడలరా ॥
అ॥ప॥ కొత్తగానే వచ్చి కొన్ని నాళ్ళాయెరా
పొద్దు గడియ మరచి పోరు మావారు
చిత్తమున నేరమెంచకురా చీకటి వేళ గాదురా
అత్తగారింట లేకున్నపుడైనా రావైతివిరా సామి ॥తత్తర॥
చ॥ 1. మక్కువ చెక్కిలి నొక్కకురా సామి
నొక్కులెక్కడ దాతురా
అక్కడ నున్నది అదిగో యాడుబిడ్డ
ఇక్కడ తిరిగిన నెగిరి పైబడు సామి
నిక్కముగ నీకే దక్కితిరా నేటి మాపటికి రా పోరా
పక్కనే పంచాది గది వెలపటి తలుపు మూయ కుంచెదరా ॥తత్తర॥
చ॥ 2. కౌగిటి కిది వేళ గాదురా నీకింత
కక్కుర్తి పని యేమిరా
బాగు బాగు రవిక బట్టి నీ గోళ్ళతో
లాగిన పిగిలి నేలాగు బొంకెదరా
కాగలదురా నీవు కోరిన కార్యమది యొక జాము లోపన
రాగదరా మాపటికి మా లోగిటికి పడమటికి ఒక దారిని ॥త్తత్తర॥
చ॥ 3. వల్ల గాదుర తోట్ల వల్లూరి వేణు గో
పాల తగదు తగదురా
చల్లని పన్నీరు చల్లి యత్తరు దేహా
వల్లి బూసెద మూయ వశమా వాసనలు
సల్లలిత దాసు రాముని కృతి – నుల్లసిల్లితివిరా మది మన
మెల్ల గుంతలెవ్వరు చూచిన అల్లరికి మూలమగు సామి ॥తత్తర॥
“తత్తర పడనేల” అనే పల్లవి రాసాగిన ఈ జావళీ అంతటా శృంగార అనుభవాలకూ వలపు తలపులకూ తాను కొత్త అని చెప్పుకోవడం కనబడుతూ ఉంటుంది.
సాధారణంగా మహిళలో ఒక మానసిక స్థితి ఉంటూ వస్తోంది. తనది తక్కువ వయసు అని చెప్పుకోవాలనే తపన అందరిలోనూ ఉన్నా మహిళలలో పోషణ ఉంటూ ఉంటుంది.ఇక్కడ అనుపల్లవిలో
“కొత్తగా నే వచ్చి కొన్నాళ్ళయెరా
పొత్తు గడియ మరచి పోరు మావారు
చిత్తమున నేరమెంచకురా చీకటి వేళ గాదురా
అత్తగారింట లేకున్నప్పుడైన రావైతివిరా సామి॥”
రెండు అంశాలు వ్యక్తమవుతాయి. ఒకటి వలపు కత్తియగా తన కొత్తదనం, ఎక్కువ అనుభవం తనకు లేకపోయినా భర్తకు ఇచ్చిన శృంగారానుభూతితో అతడు గడియ పెట్టి తనను మరచి పోయి, ఎప్పుడూ తననే గుర్తుంచుకుంటాడనే విషయంలో సహజ స్నిగ్ధ సాకుమార్యం ఉంది. ఈ జావళీలో కొత్తగా వలపులో నాయకీ నాయకులు మనోగుణాలు కనబడుతున్నాయి. ప్రథమ కాల ప్రారంభ శృంగారంలో తటపటాయింపు లుంటాయి. కోరికలు అణచుకోలేక పోవడాలు ఉంటాయి. తీర్చుకోవడానికి చిరు చిరు ప్రయత్నాలు వెల్లడవుతుంటాయి. భార్యా భర్తలయినప్పటికీ ప్రేయసీ ప్రియులయినప్పటికీ వారిద్దరూ ఎందులోనూ బరి తెగించలేదనే సామాజిక దృష్టి అవసరం అవుతూంటుంది.
అందుచేతనే – “చెక్కిలి పై ఎక్కువ నొక్కులు” వద్దంటుంది. బుగ్గలపై నొక్కులు పడితే అవేమిటని అడుగుతారని. అలాగే కొత్త రోజులలో వలపు గురించి కొన్ని కక్కుర్తి పనులుంటాయి – అది దాసు శ్రీరాములు గారు –
“కౌగిటికిది వేళ గాదురా నీకింత
కక్కుర్తి పని యేమిరా”
అని అడిగేస్తుంది. ప్రేయసీ ప్రియుల తహతహలూ, వారి ప్రయత్నాలూ ఈ గీతంలో వ్యక్తమయింది. ఈ జావళీలో ఏ విధమైన దైవ సంబంధాంశాలూ లేవు. సర్వం మానవ సంబంధమైన అంశాలే ఉన్నాయి. దాసు శ్రీరాములు గారు ఈ జావళీ రాసినప్పటికీ దేని ప్రత్యేకత దానిదే. అమానుష విశేషాలు లేకుండా మానుష విశేషాలే ఉండటం చాలా జావళీలలో ఇతివృత్తంగా పొదిగించు కున్నప్పటికీ చివరలో భగవత్పరంగా ఉండడం ఉంటూ ఉంటుంది. ఇక్కడ మాత్రం అలా కాకుండా ముద్రేతర అంశాలు తప్ప అన్యధా భగవత్ప్రసక్తి లేదు. భక్తి ఉన్ముఖత వుండదు. ఈ జావళీ కేవల మానవీయ సంబంధమైన ప్రాకృతిక అంశాలు గల జావళీ.
మంగళం (శృంగార రసం)
సురటి – ఆది
ప ॥ నా మనోధనము జూరగొన్న
విన్నాణపు దొంగకు మంగళం నా
సామికిదే శుభ మంగళం
ముద్దు సామికిదే జయ మంగళం ॥
అ॥ ప॥ ప్రేమతో నా కౌగిట జిక్కి కులుకు
పిసాళి గుబ్బల పోటుల నలసి
పిరిపిరిగా ననగి పెనగి ॥
చ 1.॥ క్రొవిన్న కోవెలలే మావి చిగురు కొరికిన క్రియ
నావా తెర నొక్కి నవ్వు మొగంబున లంకరింప గానన
విలతుని బారికి మది సొక్కి దవ్వు దవ్వులనె యురికి
మెల్లన దరి దరికి దగ్గర
చివ్వు నను బట్టిన మైఝల్లని
చిటుకున వీడిన నీవితో నిక్కిన
చిన్ని చన్నుగవ ఠీవితో
మొవ్వపుట రగను మ్మూతతో
మోహపు చెమటల పూతతో
పువ్వుల పాన్పున పొందుగన్నని
పొరి పొరి గాముని పోరున నీరున ॥
చ 2.॥ పదరి మదపు టేనుగు తన కరమున
బంగరు టనటుల బట్టిన లీల
వలక నా పెందొడల వలి పావడపై కొత్తి
సరిగదన కేల పొదవి పట్టి కులికీ
పొక్కిలి వెదకి వెదకి చిలికి వెలికి
కదలి సిగ్గుచే కన్నులు మూసుక
బెదరించిన నొక యోరగా నొత్తిలి
సదపడి కోరిక లూరగా
మదనుడు ములుకులు నూరగా
మదిని వలపు మితి మీరగా
కుదురుగ నా యొడి కుచ్చెలపై నిడి
చెదరక బట్టిన చేతికి మ్రొక్కుచు ॥
చ. 3॥ మరి మరి సరసపు మాటల నను
బతిమాలి యెట్టకేలకు జయమంది
తరచుగ రతి కూజితములచే దన
తమ్మ రసము పైయెద పై జింది
ద్విరచేంద్ర పాలుడు వల్లూరి
వేణు గోపాలుడు కరుణను దాసు
శ్రీరాముని బ్రోచిన ఘనుడు
కళలు మైదేరగా నను కలసి మెలసి
తమి దీరగా నఖ విరచిత రేఖలు మీరగా
సుఖ వీచులు పైపై బారగా
సుర సుర సొక్కుచు సోలుచు లేచిన తరి
బయ్యెర నిరువురమును నిలువగ ॥
ఎదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కాని, ఒక భజన కాని, తత్సంబంధిత కార్యక్రమం జరిగినపుడు చివరలో పాడేది మంగళం. మంగళం పాడితే సమాప్తం చేసినట్లే. తెలుగు నుడికారంలో “అతడు మంగళం పాడాడు” అనే నానుడికి కొనసాగింపని అర్థం. ఇందులో పల్లవీ, అనుపల్లవీ, చరణాలు అన్నిటా అధిక భాగం శృంగార సంబంధితమై యున్న ఉన్ముఖత్వం అంతరంగికంగా దైవ సంబంధమే. అసలు మంగళ వాచికాలూ, స్వస్తి వాచకాలూ అధికంగా దైవానికి సంబంధించి పలికేవే. మాటి మాటికీ మదనుడు బాణాలు వేశాడు అనడంలో మానవ ప్రమేయం కన్నా దైవ ప్రమేయమే కనబడుతుంది. మన్మథ బాణాలు అన్నప్పుడు అతడు మానవ మన్మథుడు కాదు. మన్మథుడే దైవం – అంచేత దైవ ప్రశస్తి పరోక్షంగా ఈ జావళీలో ఉంది.
“నా మనోరథము జొరగొన్న విన్నాణపు దొంగకు మంగళం”
అన్నపుడు విజ్ఞానపు దొంగ భగవత్సంబంధంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే విజ్ఞానం, జ్ఞానం అర్ధరీత్యా వేరే అయినా ఒకటే. జ్ఞానం దైవమే. ఎందుకంటే జ్ఞానానంద మయం దైవం నిర్మల స్ఫటికాకృతియే అన్నారు కదా. మంగళాత్మకమైన ఈ జావళీ ఎక్కువ భాగం శృంగార సంబంధ పదాలు అహికంగా ఉన్నా, దానికి రారణం జావళీ అవడమే.
“క్రొవ్విన కోవెలలే మావి చివురు” వంటి పద ప్రయోగాలు ప్రకృతి స్మరణార్వాలుగా ఉన్నాయి. ప్రకృతి అంటే అమ్మవారి స్వరూపం. ప్రకృతిని స్మరించడం అంటే ఆదిదైవ స్మరణే. ఈ విధంగా దైవదత్త కవిత్వంలో దైవచిత్త స్మరణం కూడా అంతరంగికంగా ఉంది.
దాసు శ్రీరాములు గారు ఆంధ్ర సాహిత్యాన్ని తమ అమూల్యమైన రచనలతో అలంకరించారు. శతకాలు, ప్రబంధాలు, పురాణాలు, నాటకాలు, శాస్త్ర గ్రంథాలు, కృతులు, జావళీలు ఇలా ఎన్నో ప్రక్రియలలో రచనలు చేశారు. చక్కని పాండిత్యం, కల్పనా చాతుర్యాలతో అన్నిటా తనదైన ముద్ర వేశారు.
అనన్య ప్రాశస్త్యం పొందిన “శ్రీ దేవీ భాగవతము” అనే వీరి రచన వీరికి “మహాకవి” అనే బిరుదాన్ని సంపాదించి పెట్టింది. “సంగీత రస తరంగిణి”, “అభినయ దర్పణం” ఆయన రచనలలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీరు వాగ్గేయకారులే కాక, అభినయించి చూపగల సమర్థులట. వృత్తిరీత్యా న్యాయవాది.
1887 సంవత్సరంలో “గానవిద్యా వినోద రసిక జనానంద కరముగ నుండు నటుల పదములు, కృతులు, జావళీలు వ్రాసితి”నని పేర్కొన్నారు. దాసు శ్రీరాములు గారు సంగీత సాహిత్యాలకు చేసిన సేవ అసామాన్యం.
1858లో తమ పన్నెండవ యేటనే వల్లూరు సంస్థానంలో అష్టావధానం, ఆ జమీందారుచే ఉత్తమ పురస్కారాల్ని బహుమతుల్ని పొందిన సర్వంకష ప్రతిభా సంపన్నులు.
పంతుల బ్రహ్మదేవ కవి (బ్రహ్మన్న కవి) – 19వ శతాబ్ది:
వీరి జన్మ స్థానం చిట్టివలస, నివాస స్థలం గజపతి నగరం. ఆండ్ర సంస్థానం, ఉర్లాం సంస్థానాలలో వీరు సన్మానాల్ని పొందారు. వీరి రచనలు ధనంజయ మహారాజ శతకము, ఇందుమతీ పరిణయము, కృతి సర్వస్వము, దేవీస్తవము, శృంగార గీతములు, భాగవత కలాపము, మృగయా వర్ణనము, నక్షత్ర మాల (సంస్కృతము) మొ॥
వీరు ఆశుకవి, బహుళ గ్రంథకర్త. పార్వతీపురం లోనూ, ఉర్లాం లోనూ గండపెండేరం వేయించుకున్నవారు. వీరు పద కవిత్వం కూడా రాశారు. ఉర్లాం సంస్థానాధిపతి కందుకూరి బసవరాజు (-1878) వీరి గురించి ఇలా చమత్కరిస్తారు. “పండిత బ్రహ్మన్న సాటి పండితుడేడి!”
ధనంజయ మహారాజు శతకం – హరితేజా – శ్రీ ధనంజయ మహారాజా! అనే మకుటంతో కూడిన కందపద్య రచనతో సాగ్గింది. ఇందుమతీ పరిణయం కావ్య రచనలో వీరికి ముద్దు సీతారామస్వామి కవి సహాయ పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రబంధాన్ని ధనంజయ దాట్రాజుకి అంకితం ఇచ్చారు.
‘కృతి సర్వస్వం’లో ధనంజయ దాట్రాజును ప్రశంసిస్తూ రాసిన కీర్తనలు, జావళీలు, చాటువులు అనేకం ఉన్నాయి. వీరు 1890లో మరణించారు.
బెంగుళూరు చంద్రశేఖరయ్య (19వ శతాబ్ది)
వీరినే కోలార్ చంద్రశేఖరయ్య అని కూడా పిలుస్తారు. క్రితం శతాబ్దికి చెందిన జావళీకర్తలలో ఒకరు. బాలచంద్ర, బాల సుధాకర ముద్రలతో జావళీలను రచించాడు. వీటినే మైసూరు జావళీలని కూడా అంటారు.
శివరామయ్య (19వ శతాబ్ది)
ఇతడు కరూరుకి చెందినవాడు. 19వ శతాబ్దికి చెందిన జావళీకర్త. జనన మరణాలు గూర్చి తెలియడం లేదు. ఆంగ్ల విద్యను బాగా అభ్యసించినవాడు. మణిప్రవాళంలో కూడా జావళీలు ఉన్నాయి. సంప్రదాయ రీతిలో జావళీలు రాశాడు. ఖరహరప్రియ రాగంలో గల జావళీలో తెలుగు, ఇంగ్లీషు మాటలున్నాయి.
ఉదా॥ ఆంధ్రాంగ్ల భాషా పదాలతో సమ్మిళితమైన శివరామయ్య గారి జావళీ (Link to lyrics post)-
Oh! my lovely లలనా!
ఏలనే పొమ్మంటి
ఏమోయని యంటి – కామిని నిన్ను
ఇటువంటి Step – is it fit to take?
Sit a while here – let me convince you,
ఎవరి యొద్దను dont be angry
శివరాముని పదములు పాడు
పూసపాటి ఆనంద గజపతిరాజు (1850 – 1897)
వీరు విజయ నగర సంస్థానికి సంబంధించిన రాజ కుటుంబంలో జన్మించారు. తల్లి అలక రాజేశ్వరి, తండ్రి విజయ రామ గజపతి (1826 – 1879). 1879 లో జమీ పాలన స్వీకరించారు. కవి, కృతిపతి, సాహిత్య పోషకులు, విమర్శకులుగా సుప్రసిద్ధులు పూసపాటి ఆనంద గజపతి మహారాజు.
తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, లాటిను, ఫ్రెంచి, ఉర్దూలలో మిక్కిలి పాండిత్యాన్ని సంపాదించారు. వీరు అనర్గళంగా కవిత్వం చెప్పేవారు. సంస్కృతం, తెలుగు భాషలలో చాటువులు రచించారు. వరదరాజ కృత కౌముది అనే ప్రబంధాన్ని కొంత వరకు తెనిగించారు. విజయ నగర ట్రీటీ అనే ఆంగ్ల గ్రంథాన్ని కూడా రాశారు.
జావళీలు రాసి వర్ణ స్వర గతులను కూర్చారు. వీరి సభా మంటపం శాస్త్ర చర్చలతో, సంగీత సదస్సులతో, సాహిత్య గోష్ఠులతో లలిత కళలకు నిలయంగా ఉండేది. వీరికి విద్యాభోజుడనే బిరుదు ఉంది. ఆదిభట్ల నారాయణ దాసు వీరి ఆస్థానంలోనే ఉండేవారు. వీణ సంగమేశ్వర శాస్త్రి, గురు రాయాచార్యుల రమణ దాసు వీరికి వీణ గురువులు. వీరు 23 మే, 1897న స్వర్గస్తులయ్యారు.
కరూరు దక్షిణామూర్తి (1861)
కరూరు దక్షిణామూర్తి, కరూరు దేవుడయ్య అనే ఇద్దరు జంటగా రచించిన రచనలలో వారిరువురూ “గర్భపురి” అనే ముద్రను తమ జావళీలకు సంకేతంగా వినియోగించుకొని చక్కని రచనలను చేశారు.
దక్షిణామూర్తి గారు కరూరు గ్రామంలోని హైస్కూలులో ఉపాధ్యాయులుగా పని చేస్తూ సాహిత్య కృషి చేశారు. కరూరు దేవుడయ్య ఆ సాహిత్యాన్ని ప్రోత్సహించి వెలుగు లోనికి తెచ్చారు. కరూరు ఒక శైవ క్షేత్రం.
గర్భపురి వారు వర్ణాలు, కృతులు, జావళీలు రచించారు. వీరి రచనలు ఆ క్షేత్రాలలో నెలకొన్న పశుపతీశ్వరుని మీదా, సౌందర్య నాయకి మీదా రచియింప బడ్డాయి.
ధర్మవరం రామకృష్ణాచార్యులు (1858-1912)
వీరు తెలుగు సాహిత్యంలో గొప్ప పండితులు. న్యాయవాద వృత్తిలో ఉండేవారు. రంగస్థల నాటకానికి “Father of Modern Telugu Classical Plays for the Stage”, ఆంధ్ర నాటక పితామహులు అనే బిరుదును పొందారు. ఆయన రాసిన పాటలకు తానే రాగాలు కట్టి తన నాటక బృందం వారికి నేర్పేవారు. ఈయన ప్రసిద్ధి గాంచిన మంచి జావళీలు రాశారు.
కోట్రీక పుల్లయ సెట్టి (1864)
జన్మ స్థలం, నివాస స్థలం, కొడంగల్లు, మహబూబ్ నగర్ జిల్లా. తల్లి రామాంబిక, తండ్రి రామయ్య. వీరి రచనలు రసిక మనో రంజనం, గేయ సంపుటం గయోపాఖ్యానము (అర్జున, శ్రీకృష్ణ వివాదము). వీరు సాహిత్య నిర్మాతలుగా, సాహిత్య పోషకులుగా ప్రసిద్ధులు. వీరి రసిక జన మనో రంజనం, శృంగార రస ప్రధానాలైన జావళీలు, మంగళ హారతులు సుమారు నలభై ఆరు వరకు ఉన్నాయి. ప్రతి జావళీ లోనూ చివరిలో కర్త పేరు సూచితమైంది.
తెలుగులో ప్రత్యేకంగా లభిస్తున్న జావళీలలో ఇవి విశిష్టమైనవని విమర్శకుల అభిప్రాయం. దోమా వేంకట స్వామి గుప్త గారు రాసిన బ్రహ్మేశ్వర పురాణంలో వీరి ప్రస్తావన కనిపిస్తోంది.
ద్విభాష్యం పుల్లకవి (1872)
వీరి జన్మ స్థానం దుర్గాడ, పిఠాపురం తాలూకా. తల్లి వేంకమాంబ, తండ్రి జగన్నాథం. సకలేశ్వరైకాంత సేవ (1921), సూర్య రాయ విలాసం, బభ్రువాహన విజయం (నాటకం), చాటు పద్య మాలగా ముక్తావళీ, నీతి గీతి శతకం, వేణీ కలాపం (పద్య కావ్యం), దండకా మండలం, శ్రీ కృష్ణ గోపికా క్రీడా భాగవతం (యక్ష గానం) మొ॥ వీరి రచనలు.
వీరు విద్వత్కవి, నాటక కర్తగా ఖ్యాతి వహించి అనేక నాటకాల్ని రచించారు. చక్కని శైలిలో పాండితీ పాటవాన్ని ప్రదర్శించే రచనలు వీరివి. భజన కీర్తనలే కాక, జావళీల వంటి శృంగార రచనలు కూడా చేశారు.
దంపూరి సుబ్బారావు (19వ శతాబ్ది)
వీరు నెల్లూరు మండలం, దంపూరి గ్రామ నివాసులు. శైవ బ్రాహ్మణులు. సంగీత శాస్త్రాన్ని, సంస్కృతాంధ్రాల్ని చక్కగా చదువుకుని మిక్కిలి ప్రావీణ్యాన్ని సంపాదించారు. సింహగిరి తల్పగిరి ముద్రలతో నెల్లూరిలో వేంచేసిన శ్రీ రంగనాథునిపై అనేక జావళీలను, పదాలను రచించారు. వర్ణాలను కూడా రచించారు. వీరు రచించిన పదాలకు క్షేత్రయ్య, సారంగపాణి పదాల కున్నంత ప్రాశస్త్యం ఉంది. అలాగే సింహపురి జావళీలు, సింహపురి పదాలు అని మిక్కిలి ప్రసిద్ధి సాహితీ లోకంలో ఉంది.
గబ్బిట యజ్ఞన్న కవి (1872)
ఇతడు గుంటూరు మండల నివాసి. వాగ్గేయ కారుడు. 19వ శతాబ్దికి చెందినవాడు. జన్మస్థలం ఏలేటిపాడు అగ్రహారం.
నివాస స్థలం రామారావు గూడెం అగ్రహారం, ఏలూరు తాలూకా. తల్లి అన్నపూర్ణ, తండ్రి సూర్యనారాయణ. వీరి రచనలు వేంకటేశ్వర శతకము (1900), భద్రాచల సీతారామ శతకము, జావళీలు, భజన కీర్తనలు మొ॥
కావ్య రచనలలోనూ, గాన విద్యలోనూ ప్రవీణులు. చాటు పద్యాలు చాలా చెప్పారు. పాట కచేరీలు చాలా చేసి బహుమతులు పొందారు. వీరి కృతులు, భజన కీర్తనలు, ఒక సంపుటంగా వెలువడ్డాయి.
సంస్కృతాంధ్ర భాషలలో అసాధారణ పాందిత్యాన్ని సంపాదించిన మహా రసికుడు. అతి మనోహరమైన సాహిత్యం గల కీర్తనలను, జావళీలను రచించారు. “హాయి గల్గెనుగా – చాలగ” అనే జావళీ దీనికి ఉదాహరణ.
ఆదిభట్ల నారాయణ దాసు (20వ శతాబ్ది)
వీరు విజయనగర ఆస్థాన విద్వాంసులు. శ్రీ విజయరామ గజపతి సంగీత పాఠశాలలో ప్రధానాచార్యులుగా పని చేశారు. వీణా వాదనంలో మిక్కిలి సమర్థులు, సిద్ధహస్తులు. అచ్చ తెలుగులో కూడా చక్కని కవిత్వం చెప్పే శక్తి కలవారు. హరికథ చెప్పడంలో నిరుపమాన ప్రతిభ కలవారు. ప్రధానాంశంగా హరికథలు రచిస్తూ అనేక కీర్తనలను, జావళీలను రచించారు. సందర్భానుసారంగా హరికథల మధ్యలో జావళీలు పాడేవారు. అందుకోసమే వీరు కొత్తగా స్వంతంగా జావళీలను రచించేవారు.
శ్రీ దుర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు (19వ శతాబ్ది)
వీరు క్రీ.శ. 1842-1896 ప్రాంతంలో విజయ నగర సంస్థాన విద్వాంసులుగానూ, శ్రీ ఆనంద గజపతి మహారాజుల వారి సంగీత గురువులుగానూ ఉన్నారు.
శ్రీ విజయరామ గజపతి మహారాజా వారిపై 20 గీతాలు, 15 స్వరజతులు రచించి వారి మన్నలను పొందిన ప్రతిభావంతులు.
సంగీత సాహిత్యాలలో అశేష ప్రతిభను ప్రదర్శీంచినవారు.
వీరు వీణావాదనంలో ప్రతిభా పాటవాల్ని సంపాదించి సితారు మొదలుగా గల వాద్యాలలోని మీటు జాతులను, కటికం మొదలుగా గల 21 తాళాలను అద్భుతంగా గానం చేయగల సమర్ధులు.
పూసపాటి పూర్వులు చేసిన దిగ్విజయాలను వర్ణిస్తూ 72 మేళకర్త రాగాలలో కృతిని రచించారు. శ్రీ ఆనంద గజపతిపై స్వరజతులు, జావళీలు, పదాలను రచించి వారికి అంకితమిచ్చారు.
శ్రీ దుడ్డు సీతారామయ్య (1883)
మహామహోపాధ్యాయ, సంగీత గణిక అష్టావధాని, శ్రీ దుడ్డు సీతారామయ్య గారు 15-10-1883న జన్మించారు. జన్మస్థలం వెలగదుర్రు, తణుకు తాలూకా, ప.గో. జిల్లా. తండ్రి కామశాస్త్రి, తల్లి సుబ్బమ్మ గారు. ఆరామ ద్రావిడులు. సహజ పాండిత్యం కలవారు. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి ఈయన గురువు.
వీరు వీణ, ఫిడేలు, గాత్రాలలో అపార విద్యా పారంగతులు. మృదంగం, సన్నాయి, హార్మోనియం వాదనాలే కాక నృత్యంలో కూడా ప్రవేశం కలవారు. అనేక పదాలు, వర్ణాలు, కీర్తనలు, జావళీలు రచించారు. వీరు అనేక చోట్ల సంగీత గణిక అష్టావధానం చేశారు. వీరి తోడి రాగ జావళి “ఏమి పల్కెనే” చాలా ప్రసిద్ధి చెందింది.
మైనంపాటి కామయ్య (1840 – 1925)
వీరు టంగుటూరుకు చెందినవారు. వీరి రచనలు రాఘవ పాండవీయం అనే పద్య కావ్యం, కుచేలోపాఖ్యానం అనే వచన కావ్యం. ఇవే కాక వీరి శృంగార జావళీలు మిక్కిలి ప్రసిద్ధాలు.
వీరు ప్రబంధ కర్తేగాక భరత శాస్త్ర ప్రయోక్తగా, ఆశు కవిత్వంలో నిష్ణాతులుగా, హరికథా గానంలో ప్రవీణులుగా మిక్కిలి ప్రసిద్ధి చెందారు. ఆత్మకూరు, గద్వాల, వనపర్తి వంటి సంస్థానాల్లో వీరు సన్మానితులైనారు.
వీరి శృంగార జావళీలు విశేష ప్రచారం పొందాయి.
మైనంపాటి నరసింహారావు (19వ శతాబ్ది)
వీరికి హరికథా కేసరి, హరికథా భీష్మ అనే బిరుదులు ఉన్నాయి. “నరహరి” ముద్ర ఉన్న గేయాలు, జావళీలు వారు రాశారు. వీటిలో కొన్నిటిని మైనంపాటి ధర్మరాజు గారు ముద్రించారు.
మైనంపాటి హనుమంతరావు (19వ శతాబ్ది)
వీరికి హరికథా సుధాకర, తరంగ గానసుధానిధి అనే బిరుదులు ఉన్నాయి. వీరు భక్తి శృంగార కీర్తనలు, జావళీలు అనేకం రచించారు.
గరిమెళ్ళ వేంకటేశ్వర కవి (19వ శతాబ్ది)
జననం 19వ శతాబ్ది చివరి భాగం. జన్మస్థలం చోడవరం. తండ్రి వేంకట జోగికవి. రచనలు సముద్ర మథనము (1900), దశావతార జావళీలు. పద్య సంవాద కావ్యం సత్యభామా సంవాదం మొ॥
యక్షగానకర్త, సామాన్య ప్రజలలో పురాణ గాథలను ప్రచారం చేసి, వారిలో భక్తి భావప్రేరణకు దోహదం చేశారు. సముద్ర మథనం లోని దరువులు చివర నరసింగపల్లి వేణుగోపాల ముద్ర ఉంది.
కీర్తి వేంకట రామకవి (19వ శతాబ్ది)
జననం 19వ శతాబ్ది ఉత్తరార్థం. జన్మస్థలం గొబ్బూరు, అనకాపల్లి తాలూకా. తండ్రి అనంతరామయ్య. రచనలు – ఎరుకల కథ (1906), నవరత్న జావళీలు (1905), హరి కీర్తనలు, క్రొత్త రామభజన కీర్తనలు (1914) మొ॥ యక్ష గానాల్ని కూడా రచించారు.
వీరి కీర్తనలు, జావళీలు జనాదరణ పొంది ప్రచారంలో ఉన్నాయి. రచనా శైలి సరళంగా ఉంది.
కార్యంపూడి రాజమన్నారు కవి (19వ శతాబ్ది)
జన్మస్థలం పేరాల, చీరాల తాలూకా, ప్రకాశం జిల్లా (1846-1917). సీతారామ భూపాల విలాస ప్రబంధం, శ్రీ సూర్యవిరాట్ప్రభు దర్శనము (పద్య కావ్యము 1914), వీపూరి పాళెపు వివిధావధానం (పద్య కావ్యము 1913), భగవన్నామ భాగవతం (స్తుతి 1918) మొదలగునవి వీరి కలం నుండి జాలువారిన రచనలు.
కారంచేటి మాధవస్వామి శతకం, చెన్నకేశవ విజయం, భగవన్నామ శతకం, భవనాముని దండకం, మకర కుండల విజయం, నీతి శతకం, మహేశ శతకం, రాజవంశ రత్నావళి (1894) వంటివి ఆధ్యాత్మిక రచనలు.
శృంగార జావళీలు, శ్రీకృష్ణ లీలలు, సమస్యా శతకం, హరిశ్చంద్ర చరిత్ర, హేలాపుర కన్యకా పరమేశ్వర దండకం మొ॥ రచనలలో వీరు ప్రదర్శించిన పాండితీ ప్రకర్ష మహత్తరమైనది. వీరి రచనలన్నీ భక్తి, నీతి బోధకంగా ఉన్నాయి.
తాటితోపు పట్టాభిరామయ్య (1863)
తిరుప్పనందాళ్ పట్టాభిరామయ్యగా ప్రసిద్ధుడు. జావళీ రచనలలో ప్రముఖ స్థానం కలవాడు. జన్మస్థలం తాటకేశ్వరం, తాలవనం అని కూడా తాటకేశ్వరానికి మరో పేరు. ఈయన జావళీలలో “తాలవనలోల” ముద్ర కనిపిస్తుంది.
ఇతడు తాలూకా ఆఫీసులో గుమాస్తాగా పని చేసేవాడు. “జావళీలు” తనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టడంతో పట్టాభిరామయ్య జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. పట్టాభిరామయ్య జావళీలు మైసూరు మహారాజా చామరాజ వుడయార్ దృష్టికి వచ్చి తన ఆస్థానంలో మంచి జీతంతో ఉద్యోగం ఇచ్చి సత్కరించాడు. పట్టాభిరామయ్య రాసిన కొన్ని జావళీలకు ఇంగ్లీషులో అనువాదం కూడా వచ్చింది.
ఉ॥ పూర్వీ కల్యాణి రాగంలో గల జావళీ
“నీ మాటలేమాయెనురా స్వామి బల్కర?”
“What has become of thy promises my friend? Tell!”
పట్టాభిరామయ్య కాలంలో గల జావళీ రచయితలు ఆంగ్లవిద్య నభ్యసించినవారే.
పట్టాభిరామయ్య జావళీలు మధుర భక్తితో అక్కడి శివుడు “తాళవనేశుని”పై రచించినవే. వీరు తెలుగు, కన్నడ భాషలలో ప్రవీణులు.
విద్యల తిరుపతి నారాయణ స్వామి నాయుడు (1872-1912)
సంప్రదాయ కర్ణాటక సంగీతంలో కృతులను, జావళీలను రచించినవాడు. తన తల్లియైన విద్యల కోమలమ్మ దగ్గర సంగీత విద్య నభ్యసించాడు. కోమలమ్మ త్యాగరాజు శిష్యులైన వాలాజిపేట పరంపరకి చెందినవారు. “విద్యల” బిరుదు వీరి పూర్వీకులకు విజయనగర ప్రభువులు ఇచ్చారు. తరువాత అదే ఇంటిపేరుగా స్థిరపడింది.
నారాయణస్వామి తన 20వ ఏటనే వీణావాదనలో గొప్ప ప్రావీణ్యాన్ని పొంది, హరికథలు చెప్పడంలో గొప్ప పేరు గాంచారు. కొన్నకోలు, వయొలిన్ వాయిద్యంలోనూ, నట్టువాంగంలో కూడా ప్రసిద్ధుడు. ఠాకూర్ కుటుంబం వారి పోషణలో వీరు ఉన్నారు. “తిరుపతీపుర వేంకటేశ” వీరి ముద్ర.
బేహాగ్ రాగం లోని “వగలాడి బోధనలు”, ఫరజ్ లోని “బాలరో సామిని”, కాఫీ రాగంలో “పాయరాని బాళిచే” ప్రసిద్ధాలు. ఆయన రచించిన కృతులు ఆనాటి సంగీత విద్వాంసులను ఆకట్టుకున్నాయి. ప్రసిద్ధ గాయని శ్రీమతి డి.కె. పట్టమ్మాళ్ ఆయన మేనల్లుని వద్ద నారాయణస్వామి గారి కృతులను నేర్చుకున్నారు. వీరిని వేంకటగిరి సంస్థానం కూడా ఆదరించింది. నవరాగ మాలిక రచన మహారాజులపై రచించినవే.
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ (1845-1902)
త్యాగరాజు శిష్య పరంపరకు చెందినవారు. మామయగు మెలట్టూరు గణపతి శాస్త్రిగారి వద్దనే మొదటి సంగీత శిక్షణ జరిగింది. తరువాత గురువు చావడి వేంకట సుబ్బయ్య. త్యాగయ్యగారి బంధువు, శిష్యుడు అయిన వేంకట సుబ్బయ్య, సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి మరో నలుగురు శిష్యులను తయారు చేసి త్యాగయ్య కృతులను నేర్పించారు.
వీరు పల్లవి విద్వాంసులు కూడా. విజయనగర మహారాజా వారు శ్రీ శ్రీ శ్రీ ఆనంద గజపతి, మైసూరు మహారాజావారూ, రామనాథపురం సంస్థానాధిపతులు వీరిని గౌరవించారు. సుబ్రహ్మణ్య అయ్యర్ సింహనందన తాళంలో కూడ పల్లవిని అతి రమ్యంగా పాడి అఖండ ఖ్యాతిని గడించారు. ఈ తాళం 108 తాళాలలో పెద్ద తాళం – ఆవర్తనానికి 128 అక్షరాలు.
శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గొప్ప లక్షణ లక్ష్య విద్వాన్సులు. కృతులు, తాన వర్ణాలు, పద వర్ణాలు, తిల్లానలు, జావళీలు వీరు రచించారు. వీరి ముద్ర “వేంకటేశ్వర”, “వరద వేంకటేశ్వర”, “శ్రీ వరద వేంకటేశ్వర” అని నానా విధాలుగా ఉంటుంది. వీరు నూరు రచనలు చేసినట్లు తెలుస్తోంది.
ధర్మపురి సుబ్బారావు (1864)
ప్రముఖ జావళీకారుడు. స్వర ప్రస్తారంలో, పల్లవి పాడటంలో కూడా ప్రసిద్ధుడైన చంద్రమౌళీశ్వరయ్యర్ ధర్మపురి సుబ్బారావుకి మేనమామ (మామగారు కూడా). తండ్రి సలహా మేరకు పొందిన తెలుగు పాండిత్యంతోనూ, మామగారి సంగీత ప్రభావం తోనూ సంగీత ప్రావీణ్యాన్ని, సాహిత్య అధ్యనాన్ని గావించి వాగ్గేయకారులుగా తయారయ్యారు. గుమాస్తాగా హోసూరు తాలూకాఫీసులో ఉన్న ధర్మపురి సుబ్బారావు దానిని వదిలి సంగీత ప్రపంచంలో మునిగి తేలినవారు.
వీరు విజయనగర మహారాజావారి ముఖ్య ఆహ్వానితులుగా ఉదకమండలానికి కూడా తరచూ వెళ్ళేవారట. మైసూరు ఆస్థానానికి కూడా తరచు ఆహ్వానించబడుతూ ఉండేవారు. చామరాజేంద్ర వుడయార్ గారిపై కూడ కొన్ని జావళీలను రచించారు.
వీరు తమిళ భాషలో కూడా జావళీలు రచించినట్లు ప్రచారంలో ఉంది. జావళీలే కాక అభిమన్యు కల్యాణం, శశిరేఖా పరిణయం అనేవి తెలుగులో రచించారు. తెలుగు భాషలో తప్ప వేరే భాషలో రచనలు చేయలేదని వీరి మనుమడు చెప్పినట్లు తెలుస్తోంది.
ధర్మపురీశ, ధర్మపురాధిప, ధరపురీశ అనేవి వీరి రచనలలోని ముద్రలుగా పేర్కొనవచ్చు.
కరూరు చిన దేవుడయ్య (19వ శతాబ్ది)
కరూరు దక్షిణామూర్తితో కలసి “గర్భపురి” ముద్రతో జావళీలు రచించారు. దక్షిణామూర్తి సాహిత్యాన్ని దేవుడయ్య స్వరపరిచారు. చెన దేవుడయ్య తండ్రి గొప్ప సంగీత విద్వాన్సుడు. వీణా వాదనంలో ప్రావీణ్యుడు. తాత రామాయణ శాస్త్రి మసూరు మహారాజా ఆస్థానంలో ఆస్థాన విద్వాన్సుడు. తండ్రి వైపునుండి సంగీతాన్ని, తల్లి వైపునుండి నృత్య ప్రావీణాన్ని, చిన దేవుడయ్య పొందాడు. “పారిజాతాపహరణం” యక్ష గానాన్ని రచించాడు.
వీణ కృష్ణమాచార్యులు (19వ శతాబ్ది)
కొలత్తూరుకి చెందిన రామానుజాచారి పుత్రులు మువ్వురు. టైగర్ వరదాచారి గాత్ర సంగీతంలో ప్రసిద్ధులు. కృష్ణమాచారి వీణా వాదనంలో సుప్రసిద్ధులు. కె.వి. శ్రీనివాసాచార్యులు గారు నాట్యంలో ప్రావీణ్యం గలవారు.
వీణ కృష్ణమాచార్యులు గారు “పద్మపురి వరద” ముద్రతో సంగీత రచనలు చేశారు. జతిస్వరాలు, తానవర్ణాలు, పదవర్ణాలు, కృతులు, పదాలు, జావళీలు రచించారు. ఈయన శిష్యురాలు చిన్నమ్మ ఆయన రచనలను జాగ్రత్త చేశారు. అలా జాగ్రత్త చేసినవాటిలో 22 జావళీలు కూడా ఉన్నాయి.
తచ్చూర్ పెద సింగరాచార్యులు, చిన సింగరాచార్యులు (1834 – 1872)
తచ్చూర్ సోదరులు ఫిడేల్ రంగాచార్యులు గారి శిష్యులు. తచ్చూర్ సోదరులు సంగీత ప్రపంచానికి చేసిన సేవ అనన్య సామాన్యం. పెద సింగరాచార్యులు ఫిడేల్ విద్వాంసులు, సంస్కృతాంధ్ర పండితులు. తెలుగులో చాలా కావ్యాలను, తెలుగు వ్యాకరణాది గ్రంథాలను రచించారు. వీరిద్దరూ ప్రచురించిన అపూర్వ సంగీత గ్రంథాలు:
1) స్వర మంజరి
2) గాయక పారిజాతము
3) సంగీత కళానిధి
4) గాయక లోచనము
5) గాయక సిద్ధాంజనము (1-2 భాగాలు)
6) గానేందు శేఖరము
7) భగవత్సారామృతము
మొ॥ గ్రంథాలు వీరికి ఖ్యాతిని తీసుకొచ్చాయి.
శ్యామశాస్త్రి మనుమడైన అన్నస్వామి శాస్త్రి మొ॥ వారు వీరి శిష్యులు. విజయనగర ప్రభువులు, మైసూరు ప్రభువుల పోషణలో నుండి వారి పుస్తకాల్ని, జావళీల్ని ఆ రాజులకి అంకితం చేశారు. జావళీకారులు కేవలం జావళీకర్తలుగానే మిగిలిపోకుండా వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన పండితులని పై పరిశీలన వల్ల స్పష్టమవుతోంది.
(To be continued… Last edited 30 Oct 2025)