ప్రాచీన సాహిత్యం నుండి, కవి తనకు సంబంధించిన వివరాల్ని గానీ, తల్లిదండ్రుల వివరాల్ని గానీ, గోత్రాదుల్ని గానీ, కాలప్రాంతాదుల్ని గానీ ప్రస్తావిస్తూ ఆశ్వాసాంత గద్యలలో పొందుపరచడం కనిపిస్తోంది. తెలుగు కవులకు ఈ స్ఫురణ అంతగా లేదనే చెప్పవచ్చు. లేదా ఆశ్వాసాంత గద్యలు తాళ పత్రాదులలో చివరిగా ఉండడం వల్ల నశించి పోవడానికి కూడా అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి.
అయితే శతక కర్తలలో వారి పద్యాలలో చివరి పాదాన్ని మకుటంగా నిలిపే సంప్రదాయం ఉంది. ఈ మకుటాల వల్ల ఆ కర్తకు సంబంధించిన కవి కాలాదుల్ని, వివరాల్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఇదే సంప్రదాయాన్ని అనుసరించిన వైనం జావళీలలో కూడా కనిపిస్తుంది.
తెలుగులో వచ్చిన జావళీలలో ఒక పల్లవి, కొన్ని చోట్ల అనుపల్లవితో పాటుగా రెండు మూడు చరణాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇలా సాగిన జావళీ రచననలో చివరి పాదాన్ని అన్ని జావళీలలో ఒకే విధంగా రూపొందించడం కనిపిస్తుంది.
ఈ చివరి పాదంలో జావళీకర్త పేరు, తదితర వివరాలు, ఆరాధ్య దైవం వంటి వివరాలు ఉండడాన్ని గమనించవచ్చు. వీటినిబట్టి ఆ జావళీకర్త వివరాల్ని తెలుసుకొను, అవి ఏ రచయితలచేత రచింపబడ్డాయో నిర్ధారించవచ్చు. ఈ విధంగా రూపకల్పన చేసిన అంత్య చరణాన్నే “ముద్ర” అని పిలుస్తారు. స్వభావరీత్యా ఈ ముద్రలు మూడు రకాలుగా కనిపిస్తున్నాయి.
- దైవతాలు
- రచయితకు సంబంధించినవి
- ప్రభువులకు సంబంధించినవి
జావళీ రచయితలు తమ ఇష్ట దైవాల పేరు మీదో, తమ ఊరిలో నెలకొన్న స్వామి పేరు మీదో, తమ ఏలికల మీదనో ఈ జావళీలను రచించారు. దైవతాలకు అర్చనా రూపం గానూ, ఏలికలకు అంకితం గానూ, జావళీల రచన సాగింది. స్వామి ముద్ర, ప్రభు ముద్రలతో పాటు రచయిత ముద్రలతో కూడా జావళీలు లభించాయి.
సాహిత్యాన్ని పోషించి అంకితం తీసుకున్న మహారాజులు ఈ జావళీలను కూడా గౌరవించి అంకితం తీసుకున్నారు. ఈ రచన మీద గౌరవం లేకపోతే, ఆ రచన కొక స్థాయి లేకపోతే ప్రభువులు అంకితం తీసుకోవడానికి ఆసక్తి చూపరు. ఆదిలో జావళీలు సంగీత సాహిత్య నృత్య కళల సమాహార రూపాలయిన ఉత్తమ రచనలుగా గౌరవింప బడ్డాయని అనడానికి ఈ ప్రభువుల పోషణమే సాక్ష్యంగా చెప్పవచ్చు.
లభించిన జావళీలలోని ముద్రల్ని పరిశీలించగా ముద్రలలో కేవల దైవాన్ని కొన్నింటిలోనూ, కేవల క్షేత్రాన్ని కొన్నింటిలోనూ, దైవత క్షేత్రాల్ని రెంటిని కొన్నింటిలోనూ పేర్కొనడం కనిపొస్తుంది. ప్రభువుల పేరు మీద కొన్ని, రచయితల పేరు మీద కొన్ని, రచయిత ఇష్ట దైవం పేరుమీద కొన్ని కనిపిస్తున్నాయి.
(Last edited 01 Nov 2025)