| ముద్ర | కవి |
| వేంకటేశ | పట్ణం సుబ్రహ్మణ్యయ్యర్ |
| ధర్మపురీశ | ధర్మపురి సుబ్బారావు |
| చామ నృపేంద్ర, బృహదీశ్వర | చిన్నయ |
| తాళవన లోల | తిరుప్పనందాళ్ పట్టాభిరామయ్య |
| శ్రీనివాస | రామనాథపురం శ్రీనివాసయ్యర్ |
| తిరుపతి వెంకటేశ | తిరుపతి విద్యల నారాయణస్వామి |
| పద్మనాభ, పంకజ నాభ | స్వాతి తిరునాళ్ |
| శివరాముని పదములు | కరూర్ శివరామయ్య |
| బాలచంద్ర | బెంగళూర్ చంద్రశేఖర శాస్త్రి (కోలార్) |
| గర్భపురీశ | కరూరు దక్షిణామూర్తి, చినదేవుడయ్య |
| రాజగోపాల | విజయరాఘవ నాయకుడు |
| శింహపురి రంగధామ | దంపూరి సుబ్బారావు |
| వరదుడ మువ్వపురి నిలయుడ | క్షేత్రయ్య |
| శ్రీ గబ్బిట యజ్ఞన్న | గబ్బిట యజ్ఞ నారాయణ శాస్త్రి |
| తోట్లవల్లూరి వేణుగోపాల | దాసు శ్రీరాములు |
| రేపల్లె రాజగోపాలుడు | కొండగుంటూరి నాగభూషణ రావు |
| కోట్రీక పుల్లయ్య శెట్టి | కోట్రీక పుల్లయ్య శెట్టి |
కన్నడ జావళీలలో శేషాద్రీశా, కమలేశ విఠల, మంగళ పురీశా, శంకరీశా, త్రిణపురీశా అనే ముద్రలు ఉన్నట్లు తెలుస్తున్నాయి.
జావళీలలో ప్రయోగించిన ముద్రల ఆధారంగా సాహిత్య రచనకు, అధ్యయనానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ముద్రలలో కనిపించే దైవ ప్రాముఖ్యాన్ని బట్టి నాటి సమకాలీన సమాజంలో ఉన్న ఆధ్యాత్మిక స్థితి, ప్రచారంలో ఉన్న మతాలు, వాటి ప్రాబల్యాలు తెలుసుకోవచ్చు.
భారతదేశంలో అతి ప్రాచీన చరిత్ర గల దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ దేవాలయాలలో అనేకమైన దేవతామూర్తులు విశేషమైన చరిత్ర కలవారుగా కీర్తింపబడ్డారు. ఈ జావళీల ముద్రల కారణంగా ఆయా దేవాలయాల ఘన చరిత్రను, ఆయా దేవతా మూర్తుల వైభవాన్ని ఎంతో కొంత తెలుసుకోవచ్చు.
ఇక క్షేత్రాల విషయాన్నికొస్తే సాహిత్యంలో క్షేత్ర మాహాత్మ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అనేక క్షేత్రాలకు సంబంధించిన విశేషాలు అనేక కావ్యాలకు కావ్య వస్తువులయ్యాయి. అంతే కాదు. అలా ఆవిర్భవించిన కావ్యాల ఆధారంగా చరిత్రకు సైతం అందని, వెలుగుకు నోచుకోని అనేక విషయాలు వెలుగు లోనికి వస్తాయి. కేవలం క్షేత్రాలపై రూపొందించిన ముద్రల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, నాటి కాలంలో గల క్షేత్ర ప్రాధాన్యంతో పాటు, క్షేత్ర మాహాత్మ్యాది విశేషాలు కూడా తెలుస్తాయి.
సాహిత్యాన్ని ఆదరించి అందలం ఎక్కించాలన్నా, అనాదరించి అధఃపాతాళానికి తొక్కేయాలన్నా ప్రధాన పాత్ర రాజులదే. రాజాశ్రయం లేని కవిత ప్రజాదరణకు గానీ, ప్రాచుర్యానికి గానీ నోచుకోలేదన్నది సాహిత్య చరిత్ర నిరూపించిన సత్యం. రాజ ప్రోత్సాహం, ఆదరణ లేకుంటే ఉత్తమోత్తమ సాహిత్యార్భావం జరగడానికి ఇంకా ఎంతో సమయం వేచి ఉండాల్సి వచ్చేది.
రాజరాజ నరేంద్రుని ప్రొత్సాహమే లేకుంటే నన్నయ ఆంధ్ర మహాభారత రచన గావించడం అసంభవమని చెప్పనక్కరలేదు. ఎందరో రాజులు చరిత్రలో ఉన్నారు. కానీ కొందరే సాహిత్యాన్ని ఆదరించి, లోకంలో చిరస్థాయిగా నిలచిపోయారు. అటువంటి రాజులకు కవులు తమ కావ్యాల్ని అంకితమిస్తూ, ప్రభువుల వంశాదికాల్ని, వారి ప్రతాపాది విశేషాల్ని, దాన ధర్మాల్నీ, దండయాత్రల్ని, తమ కావ్యాలలో వర్ణించి చరిత్రకు ఎంతో మేలు చేశారు.
కాబట్టి కవుల కవితా వీక్షణాలకి చిక్కిన రాజుల వర్ణనల ఆధారంగా చరిత్రను ఉద్ధరించి మరిన్ని వింతల్నీ, విశేషాల్నీ వెలికి తీయవచ్చు. తెలుగు జావళీలలో కూడా ప్రభువుల పేర్ల మీద కొన్ని ముద్రలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఆయా ప్రభువుల జీవిత విశేషాల్ని, కళాదరణని తెలుసుకోవడం ద్వారా చారిత్రక విషయాలకు ఎన్నింటికో కొత్త ఊపిరినందించే అవకాశం కలుగుతుంది.
ఇక తెలుగు జావళీలలో కొన్ని కవి నామాల్ని తెలిపే ముద్రలు ఉన్నాయి. కవిగా కృతుల్ని రచించిన తరువాత లోకంలో అశేష ఆదరణ లభించిన తరువాత, ఆ కృతిని రచించిన గ్రంథకర్త వివరాలు సరిగ్గా తెలియకపోతే సాహితీ లోకం తీవ్ర అసంతృప్తికి లోనవుతుంది. విశ్లేషకులు, పరిశోధకులు పరిశోధించి, కొన్ని ఆధారాల్ని చూపించి గ్రంథకర్త విషయంలో భిన్నాభిప్రాయాలతో వాదించుకుంటారు.
తెలుగు సాహిత్యంలో వివాదాస్పద స్థితిలో నిలిచిపోయిన అనేక కావ్యాలలో జరిగింది ఇదే. ఇటువంటి తప్పు జరుగకుండా, సాహిత్య చరిత్రని తప్పు దోవ పట్టించకుండా ఉండాలంటే, కృతికర్త తన వివరాల్ని ఎక్కడో ఒక చోట చాలా స్పష్టంగా పేర్కొనడం అత్యంత ఆవశ్యకం. ఈ లోటును జావళీ కర్తలు పూర్తి చేశారని చెప్పవచ్చు. కొన్ని ముద్రలలో కవులు వారి పేర్లను పేర్కొన్నారు.
ఈ విధంగా జావళీలు, దైవత క్షేత్రాది వివరాల్ని, జావళీకర్తల విషయాల్ని అంకితం పుచ్చుకున్న ప్రభువుల విషయాల్ని స్పష్టంగా తెలియజేసే ముద్రల్ని కలిగి సాహిత్యంలో ఏర్పడే అస్పష్టతలకి తెర దించే విధంగా రూపొందించుకోవడం అందరూ ఆనందించ దగ్గ విషయం.
అథోజ్ఞాపికలు
- క్రీడాభిరామము – ప. 295
- తెలుగు సాహిత్య చరిత్ర – 2 భా. పుట 265
- తెలుగు సాహిత్య చరిత్ర – 2 భా. పుట 281
- ఆంధ్ర విదుషీమణులు – పుట 221
- ఆస్థాన నర్తనాలు – పుట 181
- జావళీ పదములు – పుట 9