5.1.2 ఆమ్రేడిత ప్రయోగాలు

ఆమ్రేడిత ప్రయోగం విరివిగా ఉంది. వ్యాకరణ శాస్త్రాన్ని అనుసరించి ఆమ్రేడితం పరమైతే సంధి రావడం కనిపిస్తోంది. “ద్విరుక్తస్య పర రూపమామ్రేడితం” అని లాక్షణికులు నిర్వచనం చెప్పారు. రెండుసార్లు ఉచ్చరింపబడినపుడు, రెండోమారు ఉచ్చరించిన దానిని ఆమ్రేడితమని వ్యవహరిస్తారు.

ఉదా: అయ్యో + అయ్యో = అయ్యయ్యో

ఇక్కడ ఆమ్రేడిత సంధి జరిగింది. ఏతత్విరుద్ధంగా వ్యవహారాన్ని బట్టి ఏర్పడే పదాలు కూడా జావళీలలో ప్రాచుర్యంగా ప్రయోగింపబడ్డాయి. ఉదాహరణకు మొదట + మొదట = మొట్టమొదట మొదలగునవి.

ఉదా: జంఝూటి – రూపకం లోని ఈ జావళి

ప॥ మొట్ట మొదట నట్ట నడుమ
తుట్ట తుదియు నెరుగనే
ఇట్టె వచ్చి విభుడు రాత్రి
ఏమి పనులు చేసెనే ॥మొట్ట॥
మోమొ మోము గరియ విభుడు
ముద్దు పెట్టెనంతలో
భామ యేమొ కాని నేను
పరవశమై యుంటినే ॥మొట్ట॥
అట్టి విభుడు చన్ను దోయి
బట్ట వచ్చినంతనే
ఎట్టి మాయ యేమొ నాదు
హృదయ మైక్య మయ్యెనే ॥మొట్ట॥
భాసుర శ్రీ వేణు గోప
బాలుడంటి నంతనే
దాసు రామదాస చిత్త
వసి యనుకుంటినే ॥మొట్ట॥ (16)

అయ్యయ్యొ అయ్యయ్యొ ఉప్పొంగీ ఉప్పొంగీ ఔరౌరా
 కట కట కద్దుర కద్దుర కాదుర కాదుర
 కొసరి కొసరి గుండె ఝల్ ఝల్ ఘల్ ఘల్
 చాలు చాలులే చాలుర చాలుర చాలే చాలే
 చెడ్డరా చెడ్డరా ఝుమ్మ ఝుమ్మని చెప్పరా చెప్పరా
 తీర తీర తెలిసె తెలిసె తెల్పవే తెల్పవే
 తొలుత తొలుత నిలు నిలు నిగ న్నిగ
 నేజెల్ల నేజెల్ల పిలువ పిలువ పొరి పొరి
 పోరా పోరా బాగుర బాగుర బిరి బిరి
 భళి భళి భళీ భళీరా మరి మరి
 మాటి మాటికి రాను రాను 

వంటి ఆమ్రేడిత పదాలు కల విశేష ప్రయోగాలు అధికంగా తెలుగు జావళీలలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ అచ్చ తెలుగులోనే ఉండడం మరో విశేషం.