5.9 వ్యాకరణ విశేషాలు

పద సాహిత్యానికి కావ్య సాహిత్యం కన్నా అధిక జనాదరణ, ప్రాచుర్యం లభించడానికి కారణం, సామాన్య జనులు వారి నిత్యమూ జీవనంలో వాడుకునే పదాలను తీసుకొని, అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందంగా రచించడమే.

పద కవిత్వానికి అధిక ప్రాచుర్యాన్ని తీసుకొచ్చిన అన్నమాచార్యుడు ఉదయించిన కాలం నుండి భాషా విషయికంగా కూడా వినూత్నమయిన పరిణామాలు సంభవించాయి. ఆంధ్ర వాఙ్మయంలో క్రీ.శ. 15వ శతాబ్దం ప్రబంధ యుగం. అష్టాదశ వర్ణనలు, రసాలంకారాది విశేషాలు, వ్యంగ్య వైభవం, కవితా చమత్కృలతో నిండిన ప్రబంధాలు వెలువడుతున్న కాలం.

రాజకీయంగా పరిశీలిస్తే మహమ్మదీయుల దండయాత్రలతో ఛిన్నాభిన్నమయిన మత వ్యవస్థ. ఇలాంటి సమయంలో తాను నమ్మిన వైష్ణవ మత ప్రాశస్త్యాన్ని, సాహిత్యాన్ని వ్యాప్తి చేయడం కోసమే అన్నమయ్య పద సాహిత్యాన్ని పట్టకట్టాడు. తాను విశ్వసించిన సిద్ధాంతాల్ని ప్రజలకు బోధించి, వారిని కూడా సన్మార్గ వర్తనులుగా తీర్చిదిద్దడం కోసం కృషి చేశాడు. అందుకు జన వ్యవహార భాషే సౌలభ్యమైనదిగా గుర్తించి, దానికి కూడా అధిక ప్రాధాన్యాన్నిచ్చాడు.

కేవలం పద్య రచనా పద్ధతులు గల సాహితీ ప్రక్రియలకైతే పండితామోదం కోసం పండిత భాషను ఉపయోగించాలి గానీ, పద కవితలు, ప్రజల ఆదరణపై జీవించేవి కాబట్టి వాటికి ప్రజల భాషే యోగ్యమైనది. పైగా ఇవి లయాత్మకమైనవి. గేయాత్మకమైనవి. చక్కని సాహిత్యాన్ని సంగీతంతో అందించి సహృదయానందాన్ని కలుగజేసే కళాత్మకమయినవి. అందుకే గేయ రూపాత్మకమైన ఈ ప్రక్రియలలో భాషా సారళ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

అన్నమయ్య మహా భక్తుల కోవకు చెందినప్పటికీ కేవలం స్తోత్రప్రాయాలైన భక్తి పాటల్ని పాడినవారు కాడు. సంగీతవేత్త అయినప్పటికీ నాదప్రధానమైన రచనల్ని మాత్రమే సాగించినవాడు కాడు. మహాకవి అయినప్పటికీ కావ్యాల్నే అల్లినవాడు కాడు. భక్తుడు, గాయకుడు, కవి అయిన అన్నమయ్య రాసిలో, వాసిలో మిన్న అయిన భావ ప్రధానమైన రచనల్ని చేశాదు.

ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో పద ప్రక్రియలు ఒక నిర్దుష్టమయిన స్థానాన్ని కల్పించి, పదకవితా పితామహుడనే ప్రశస్తిని పొందాడు. అన్నమయ్య అనుసరించిన మార్గమే వాగ్గేయకారులందరికీ ఆచరణీయమైంది. వ్యావహారిక భాషకు అధిక ప్రాధాన్యాన్నిచ్చారు. తెలుగులో వెలసిన జావళీలలో కూడా వాడుక భాషా పద ప్రయోగం ఎక్కువగా కనిపిస్తుంది.

చిన్నయ సూరి ఆఛ్ఛిక పరిఛ్ఛేదంలో –

“సంస్కృత సమేతరంబయిన భాష యచ్చ యనంబడు” (17) అని పేర్కొన్నాడు. అంటే సంస్కృత భవాలు, ప్రాకృత సమాలు, ప్రాకృత భవాలు, దేశ్య పదాలు అచ్చ తెలుగు భాష కిందికి వస్తాయి. తెలుగులో వచ్చిన జావళీలలో పైన పేర్కొన్న విధంగా అన్ని రకాల పదాల్ని ఉపయోగించడం కనిపిస్తోంది. తత్సమ పదాల వ్యవహారం వర్ణనలలో కనిపిస్తోంది.

ఉదాహరణకు:

సావేరి – ఆది

చక్కని యేకేంద్ర
సన్నుత తుళుజేంద్ర
జనపాల రాజేంద్ర
సలలిత గుణసాంద్ర

సరసనొక రాజ
సన్నుత వర
దీపాంబికా తనయ
శ్రీ తుళుజేంద్ర

సరసిజాక్షి చేర
రమ్మని పిలిచి
సురత కేళి జత
గూడితి వేర (18)

తత్సమ పదాల్ని ఉపయోగిస్తూ నిర్మాణం చేసిన సమాస పదాల ప్రయోగాలు కనిపిస్తున్నప్పటికీ, ఎక్కువగా ఆఛ్ఛిక పదాలతోనే జావళీ రూపొందడం విశేషం. తెలుగు భాషలో సహజసిద్ధంగా వ్యవహారంలో ఉన్న పదాలు సౌందర్యాన్ని సంతరించుకొని ఎలా ఈ జావళీల్లో ఆవిష్కృతమయ్యాయో చూడండి.

దర్బారు – మిశ్ర చాపు (Previously Posted at https://javali.blog/2025/11/02/1253-%e0%b0%ae%e0%b0%a8%e0%b0%b8%e0%b1%81-%e0%b0%a6%e0%b1%80%e0%b0%b0%e0%b1%86%e0%b0%a8%e0%b0%be-manasu-direna/ )

మనసు దీరెనా సామి మనసు దీరెనా సామి
వనజాక్షి దాని పొందు వైకుంఠమాయెనా

మరుగు పరచ ణేటికిరా మంచిది లేరా
మెరుగు బోణి వగలు తిరు మంత్రము లాయెనా

చొక్కి యున్న జాడలు చూచిన చాలు దాని
ప్రక్క బండి యుండుటే బ్రహ్మానంద మాయెనా

వినుము తోట్ల వల్లూరి వేణుగోపాల శౌరి
ఘనుడు దాసు శ్రీరామ కవి సన్నుతి జేసెనా (19)

ఈ జావళీ వనజాక్షి పొందు వైకుంఠమని మెరుగుబోణి వగలు తిరు మంత్రాలయ్యాయని పేర్కొంటూ సంభాషణాత్మకంగా, చమత్కార యుతంగా సాగింది. జావళీని నడిపించే పద్ధతిలో సారళ్యత, సూటిగా చెప్పే భావం, అంతిమ చరణంలో కవి నామాంకిత ముద్ర, దైవత ముద్రతో కలిసిన కూర్పు, సులభ గ్రాహ్యత వంటి లక్షణాలు ఉన్నాయి.

యదుకుల కాంభోజి – త్రిపుట (Previously posted at https://javali.blog/2025/11/22/1258-%e0%b0%ae%e0%b1%82%e0%b0%9f%e0%b0%b2%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be-mutaladigitina/ )

మూటలడిగితినా ముల్లెలడిగితినా
మూతి త్రిప్పెద వేమిరా ముద్దిడరా మోము త్రిప్పెద వేమిరా

నోటి మాటకైన నోచుకో నైతినా
కూటములా ముద్దు కోమలి పాలైన

త్యాగశీలుడవు నీవు దాచిన సొమ్మంత వేగ నాకిమ్మంటినా
నా బాగాలివ్వనైన పనికి రానైతినా
బాగాయెనది యెంత బంగారు బొమ్మైనా

వడిగ నే నీ పాన్పు వద్దకు జేరగ వద్దు వద్దన నేలరా
అడుగు లొత్తగ నైన అనుకూల పడరాదా
పడతి బోధన లిహ పద సాధనములైన

పాలించు శ్రీ తోట్ల వల్లూరి వేణు
గోపాలా మ్రొక్కితి మ్రొక్కితి
శ్రీల మించిన దాసు శ్రీ రామ కవి కృతి
వాలాయముగ నిన్ను వర్ణన జేసిన (20)

ఈ జావళీలో మూట – ముల్లె, ముద్దు, నోటిమాట వంటి అచ్చ తెలుగు పదాలే కాకుండా “దాచిన సొమ్ము”, “బంగారు బొమ్మ” వంటి ఆచ్ఛిక సమాస పద ప్రయోకం లయాత్మకంగా సాగి కమనీయంగా ఆవిష్కృతమయింది.

“చిన్నప్పుడు రతి కేళిక
నున్నప్పుడు కవిత లోన యుద్ధము లోనన్
వన్నె సుమీ రా జెప్పుట
పన్నుగనో పూసపాటి సీతారామా!”

అన్నట్లుగా ఈ జావళీలలో సంబోధనాత్మకాలయిన అనేకానేక సంబోధనలు కనిపిస్తాయి. కవిత్వంలో ఎంతటి వారినైనా శత్రు భయంకరుడూ, మహా శౌర్యవంతుడూ అయిన రారాజును సైతం కవి “రా” అని సంబోధిస్తాడు.

కవిత్వంలో అంత స్వేచ్ఛ ఉంది. అసలు అలా సంబోధిస్తేనే అసలు అందం వస్తుంది. ఇక ప్రణయ జలధిలో మునిగి ఉన్న నాయికా నాయకుల మధ్య సంబోధనల్ని చెప్పవలసిన అవసరం లేదు.

వారిద్దరి ప్రణయం ఎంతో చనువుగా ఉంటుందని ఆ సంబోధనల్ని బట్టి చెప్పవచ్చు. ఆత్మీయతానురాగాల్ని ప్రకటించేవి, కోపాన్ని ప్రదర్శించేవి, విరహావస్థను కళ్ళకు కట్టినట్లు వివరించేవి, పారవశ్యంతో ఉన్న భావావేశాల్ని పలికించేవి, ఇలా రకరకాల సంబోధనలు ఈ జావళీలలో కనిపిస్తాయి.

చిన్నయ సూరి బాల వ్యాకరణంలో “ఓ, ఓరి, ఓయీ” వంటి సంబోధనల్ని పేర్కొన్నాడు. కానీ ఈ జావళీలలో అనేక సంబోధనలు రకరకాల భావాల్ని వ్యక్తం చేసేవిగా కనిపిస్తూ ఆశ్చర్యాన్ని కలుగ జేస్తాయి.

ఫరజు – ఆది (Previously Posted at https://javali.blog/2021/03/29/650-%e0%b0%8f%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%87%e0%b0%af%e0%b1%81%e0%b0%a6%e0%b1%81-emi-seyudu/ )

ఏమి సేయుదునటే ఏణాక్షి
నోము ఫలమేమొ నాసామి కేసతి
నానామమంటే కాకనే మేమన్నతోగాన

సరసుడు నన్నే సదా సరసమాడే సైకల
సారసాక్షి విని దూరనేమో గాన

మేడపై మేమిర్వురు జోడు గూడే కడు
వేడుకెల్ల నా చేడె చెరిచెనే

మొలక నవ్వు తోను మై పులకరించేలిన
తాళవనీశుని చాలించెనే సవతి (21)

ఈ జావళీ లోని స్త్రీ సంబోధ వాచకాల ప్రయోగం ద్వారా రచనకు సరసత అబ్బి, శ్రోతలను అలరింపజేస్తుంది. అలాగే పురుష వాచక సంబోధ వాచకాలు కల ఈ జావళీని చూడండి.

కాఫి – అట (Previously Published at https://javali.blog/2020/10/31/351-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b5%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b5%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf-povoyi-povoyi/ )

పోవోయి పోవోయి పొలతులతో
నింత పోటా పోటీ లేమోయి

వావిని ఈవాడ వనితలెల్ల నీకు
వావారె వావారె వదిన మరదళ్ళయిరి

తల తడిపి తగని బాసలు చేసిన
నమ్మ దగిన కాలము గాదురా
చెలువుర మన యూరి
వెలయాండ్రతో నీకు
భళి భళి భళి భళీ
బహరీ ఖాతాలాయె

వేష భాషలు చూపి విషము
చక్కెర జేసి విడుతురోయి పురుషులు
హాషామాషీ చెలియల సయ్యాటలు నీకు
భేషు భేషు భేషు విజయ బిరుదములాయె

బహు రూప ధర తోట్ల వల్లూరి
వేణుగోపాల యెంత జాణవు
రహిమించు దాసు శ్రీరాముని పలుకులు
అహ హాహా అహా అహా అమృత బిందువులాయె (22)

ఈ జావళీలో ఓయి వంటి సంబుద్ధి వాచకాలతో పాటుగా నామ వాచకమైన ‘చెలువుడ!’ అన్నట్లుగా సంబోధించడం కనిపిస్తుంది.

సంవాదాత్మకంగా సాగిన ఈ జావళీలో తిరస్కరించడానికి ఉపయోగించే వ్యతిరేకార్థక శబ్దాలు కూడా సంబోధనలో ఉపయోగించడం కనిపిస్తుంది.

యదుకుల కాంభోజి – త్రిపుట (To be published soon)

వాడా నిను బంపున వాడా నను బిల్వ
వనిత నే రాననవే పోపోవే

చింతలేల వాడు చీటి బంపెనా
సంతోషమే యనవే పోపోవే

చిన్న నాటి నుండి చేసిన తన తోడి
చెలిమి చాలు ననవే పోపోవే

కోపమేటికి తోట్ల వల్లూరి శ్రీ వేణు
గోపాల దగు ననవే పోపోవే

వేయేల దాసు శ్రీ రామ హృదయ వాసివై
యుండుమీ అనవే పోపోవే