“పూర్వ పర స్వరంబులకు పర స్వరంబేకాదేశంబగుట సంధి యనంబడు” (24) అని బాల వ్యాకరణం సంధి పదాన్ని నిర్వచిస్తోంది. తెలుగు లోనికి సంస్కృత పదాల ద్వారా సంస్కృత వర్ణాలు ప్రవేశించడంతో ఆయా వర్ణాలకు సంబంధించిన సంస్కృత సంధులు కూడా తెలుగు కావ్య భాష లోనికి ప్రవేశించాయి.
“తెలుగునకు వర్ణములు ముప్పదియారు” (25) అని తెలుగు భాషకు వర్ణాల్ని పేర్కొంటూ చిన్నయ సూరి పంతొమ్మిది అక్షరాలు సంస్కృత సమాలతో కలిసి తెలుగు భాషలో ప్రవేశించి, ప్రయోగింప బడతాయని పేర్కొన్నాడు. దీనిని బట్టి సంస్కృత భాష నుండి తత్సమ రూపంగా ప్రకాశించే పదజాలంలో ఏర్పడే సంస్కృత సంధులు కూడా తెలుగు భాషలోనికి, కావ్య భాషలోనికి యథాతథంగా ప్రవేశించాయి. అందువల్ల తెలుగు భాషలో సంధి విజ్ఞానాన్ని అధ్యయం చెయ్యడమంటే తెలుగు సంధులతో పాటుగా సంస్కృత సంధుల్ని కూడా ప్రస్తావించ వలసి ఉంటుంది.
తెలుగు జావళీలలో తెలుగు సంధులు, సంస్కృత సంధులు తెండింటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఉకార సంధి నిత్యంగా జరిగింది.