6.1 తెలుగు జావళీలు – పాత్ర చిత్రణ

తెలుగులో వచ్చిన జావళీలు శృంగార ప్రధానమయినవే కావడం వల్ల ఈ జావళీలలో పాత్రలు చాలా పరిమితంగా ఉంటాయి. అంటే ఇంకా చెప్పాలంటే శృంగార రసానికి ఆలంబనాలయిన నాయకుడు, నాయిక ప్రధానంగా కనిపిస్తారు. ఈ రెండు పాత్రలతో పాటుగా మరో ప్రధానమయిన పాత్ర చెలికత్తె.

నాయకుడు గానీ, నాయిక గానీ విరహావస్థలో ఉన్నప్పుడు వారి మధ్య సయోధ్య కుదర్చడమే చెలికత్తె కర్తవ్యం. నాయకుడు నాయికను విస్మరించినపుడు నాయిక తన మనోగత భావాన్ని ఈ చెలికత్తె తోనే చెప్పుకుంటుంది. అన్య నాయికాసక్తుడయిన నాయకునికి తన విరహావస్థను వెల్లడీంచి మళ్ళీ తీసుకు రమ్మని పంపుతుంది.

ప్రధానంగా ఈ మూడు పాత్రలూ తెలుగు జావళీ రచనకు మూలమని చెప్పవచ్చు. ఈ మూడు పాత్రల స్వరూప స్వభావాల్ని, చిత్రణనూ, జావళీకర్తలు ప్రతిపాదించిన తీరుతెన్నుల్ని సమీక్షిద్దాం.

నాయకుడు:

సంసార సాగరంలో నిరంతరం మునిగి తేలేవారి దుఃఖాలను పోగొట్టి పరమానందం కలుగ చేయడానికి ఆధ్యాత్మిక భావం ప్రాధాన్యత వహిస్తుంది. జావళీలు ఆ భావనకు చెందినవే. జావళీకర్తలు దశావతార జావళీలు, నవరత్న జావళీలు, శృంగార జావళీలు, ఆయా ఊళ్ళలో గల దైవులపై, ప్రభువులపై మధుర భక్తి భావనలో రచించినవే. ఇవి ముక్తి ప్రసాదితాలు. జావళీలో జీవుడు భగవదైక్యం పొందడమే ప్రధానమయిన ధ్యేయం.

జావళీలలో నాయకుడు పరమ పురుషుడు. సాక్షాత్తూ భగవంతుడే. మధుర భక్తి సంప్రదాయం ప్రకారం సర్వాంతర్యామియై జీవుని అసూయా ద్వేషాల వంటి లౌకిక వాసనలు పోగొట్టి తనలో ఐక్యం చేసుకుంటాడు. నాయిక నాయకునితో పలికినా, నాయకుడు నాయికతో పలికినా, నాయిక చెలితో పలికినా, చెలి నాయకునితో పలికినా, నాయకుని ఆత్మగతమైనా, నాయిక ఆత్మగతమైనా ఏ జావళీలో చూసినా జీవుని భగవదైక్యం కనిపిస్తుంది.

చెలి:

జావళీలలో చెలి కేవలం గురుస్థానంలో ఉండి జీవుడికి భగవంతునికి మధ్య దూతికలా వ్యవహరిస్తుంది. జ్ఞానబోధ చేస్తుంది. నాయిక విరహాన్ని నాయకునికి, నాయకుని విరహాన్ని నాయికకు చక్కగా వివరించి ఇద్దరి సమాగమనానికి రంగం సిద్ధం చేస్తుంది.

నాయిక తాను నాయకుని అనుమానించడం, విరహంతో బాధ పడడం, రమ్మని ఉత్తరం పంపడం, రాకపోతే బాధ పడడం, వచ్చిన నాయకుని గెంటి వేయడం, తర్వాత పశ్చాతాప పడటం, ఈ విషయాలన్నీ చెలితో చెప్పుకోవడం ఈ జావళీలలో కనిపిస్తుంది. నాయికను, నాయకుడు బ్రతిమాలటం, నాయకుని ఆత్మగతం, నాయిక ఆత్మగతం ఇవన్నీ జావళీలో కనిపిస్తాయి.

12వ శతాబ్దికి చెందిన శ్రీ జయదేవుని గీతగోవిందంలో కూడా ఇవన్నీ కనిపిస్తాయి. అష్టపదులలో దూతిగా వ్యవహరించే సఖి, నెరపిన దౌత్యం నాయికా నాయకుల సంగమానికి దోహదం చేస్తుంది. అతి నైపుణ్యంగా నాయిక విరహాన్ని వర్ణించి చెప్పి, నాయకుని మనసుని కరిగేట్ల్లు చేస్తుంది.

నాయకుడు పడుతున్న విరహాన్ని నాయికకు చెప్పి సమయం వృథా పుచ్చక వెళ్ళి కలవమని రాధని తీసుకు వెళ్ళి కృష్ణుని దగ్గరకు చేరుస్తుంది. అందులో రాధ నాయిక, కృష్ణుడు నాయకుడు. చెలి గురు స్థానం అలంకరించింది.

సరిగ్గా అలాగే జావళీలలో నాయిక భక్తుడు, నాయకుడు భగవంతుడు, చెలి గురు స్థానం అలంకరించి భక్తుని భగవంతునిలో ఐక్యం చేయ్యటానికై ప్రయత్నం చేస్తుంది. కొన్ని ఉదాహరణలు.

నాయిక చెలితో భాషించే సందర్భంగా తన మనోగత భావాలను పంచుకునే భావాలు కల జావళీలు:

  1. సరసుని తోడి తేవే చానా – శహన – అట
  2. పోపొమ్మనే వాడి పొందేలనే మనకి – హిందుస్థాని – ఏక
  3. వేగమె నాథుని దేవే – సురటి – రూపక
  4. సుదతిరొ సామిని జూపవె – హిందుస్థాని – ఆది
  5. నలినాక్షి సామిని నమ్మరాదె – తోడి – మధ్యాది
  6. నాధుని మనము నమ్మగరాదె – ధన్యాసి – అట
  7. చాలే చాలే అలవాని పొందిక – కాఫి – మిశ్రమం
  8. రమ్మనవే సామిని రమణి – హిందుస్థాని – ఆది
  9. వాని రమ్మనవే చెలియా – ముల్తాని తోడి – ఆది
  10. పోవే పోపోవే చెలియ – యమునాకల్యాణి – చాపు

నాయిక నాయకునితో తన విరహావస్థను ప్రకటించే భావాలు కల కొన్ని జావళీలు:

  1. నాపై ప్రేమ లేని జాడ – హిందుస్థాని – అట
  2. మాయలాడి బోధనచే – సురటి – ఏక
  3. ఏమి సేతు ఎటుల సైతు – కాంబోది – రూపక
  4. వేళగాదురా సామి – ముఖారి – మధ్యాది
  5. ప్రొద్దాయెనిక జాలు సామి – బేహాగ్ – ఆది
  6. చిన్న దానరనే – హిందుస్థాని – రూపక
  7. నీతోటి మాటలు నాకేలరా సామి – హిదుస్థాని కాఫి – మధ్యాది
  8. యేల సామి నీ మనసేల – ధన్యాసి – రూపక
  9. మగనాల తాళరనే – బేహాగ్ – ఆది
  10. యేమిర సామి నీకిది తగున – శంకరాభరణం – ఆది

నాయకుడు నాయికతో తన విరహావస్థను ప్రకటించే భావాలు కల కొన్ని జావళీలు:

  1. తాళజాలనే యిక – ముఖారి – మధ్యాది
  2. భామ రావే భయము నీకేలే – హిందుస్థాని – ఆది
  3. ఈలాగున నుండ వచ్చున – దర్బారు – రూపక
  4. ముట్టరాదటే మోహనాంగిరో – సావేరి – ఆది
  5. సరి యేమి సారసాక్షి – అఠాణా – రూపక
  6. వగలాడి దిగులిడ నోర్వగదే – దర్బారు – అట
  7. నీరజాక్షి నిన్ను బాసినే – దేశీయ తోడి – రూపక
  8. ఓ మై లవ్లీ లలనా – ఖరహర ప్రియ – ఆది
  9. తారుమారులాడావేమే – నాటకురంజి – ఆది
  10. చాలు చాలు నీదు చెలిమి – బ్యాగ్ – రూపక

చెలి నాయకునితో నాయిక విరహావస్థను తెలియజేసి వారివురి మధ్యా సయోధ్యను కుదిర్చే భావాలు కల జావళీలు:

  1. ఈ లాగున నుండ వచ్చునా – దర్బారు – రూపక
  2. ఏలా మా రమణిపై చలము – కేదార గౌళ – ఆది
  3. మేరగాదురా – జంఝురిటి – చతురశ్ర లఘువు
  4. నాణెమైన వలపుల చెలిరా – సురటి – ఆది
  5. సారసాక్షి నీపై చాల – హిదుస్థాని కాఫి – ఆది
  6. కోమలాంగి తాళకున్నదిరా – కేదార – ఆది
  7. లేచిరారా మా చెలి నేలుకోరా – బేహాగ్ – ఆది
  8. జాలమిదేర సరసకు రార – బేహాగ్ – ఆది
  9. చలమేల రార – బేహాగ్ – ఆది
  10. సుందరి నేలుముర సామి – హిందుస్థాని – రూపక

నాయిక ఆత్మగతం:

  1. పాయరాని బాళిచే – హిందుస్థాని కాఫి – రూపక
  2. ఏ కామిని బోధించెనో – నాటకురంజి – ఆది

నాయకుని ఆత్మగతం:

  1. నీరజాక్షుల మాట – హిందుస్థాని – ఆది
  2. మగువల నమ్మరాదు – కల్యాణి – ఆది
  3. ఆదవారిని నమ్మరాదు – బేహాగ్ – రూపక
  4. తెలియ నైతినె జలజాక్షి – హంసధ్వని – మధ్యాది

చెలి గురుస్థానంలో ఉండి నాయికకు జ్ఞాన బోధ చేసి, నాయకుక్నకు నాయిక విరహాన్ని తెలిపిన పిమ్మట ఐహిక వాసనలు పోగొట్టుకున్న జీవుడు పరమాత్మతో ఐక్యమవడానికి పడే ఆరాటం ఈ కింది జావళీలో కనిపిస్తుంది.

నాయిక చెలితో చెప్పుకున్న విషయం. ఒక ఉదాహరణ:

పోవే పోవే పోవే పోవే పోవే పోపోవే చెలియ
పోవె వాని యిటు వేగ తేవె చెలియా
చెలి వేగ పోవె వానిటు వేగతేవే చెలీ

మదనుడు పదను శరము లెదనేయ
మదన సదన వినవేమింక పదనించె గదవే

నన బోణీ వినవే ఆ వనజ వైరి యిపుడు
నను బాధించేది న్యాయమౌనటవే

సరసుడైన ధర్మపురమున నెలకొన్న
పర వాసుదేవుని తేవే చెలియా

సరసుడైన ధర్మపురంలో ఉన్న ఆ పర వాసుదేవుని పొందు కోసం, చేరటం కోసం, భక్తుడు తపిస్తున్నాడు. జీవుని ఆరాటం కేవలం యిందులో భగవదనుగ్రహం తరగా పొంది భగవంతునిలో ఐక్యం కావాలనే తపన కనిపిస్తుంది. అంటే జీవుడు భౌతిక వాసనల నుండి దూరం అయ్యాడన్న మాట.

చెలిని బ్రతిమలాడుయోంది. తొందర పెడుతోంది. మదనుని పదునైన బాణాలు గుండెలకు గుచ్చుకుంటున్నాయనీ, తను తట్టుకోలేక పోతున్నానని, ఆ వనజ వైరి తనను బాధిస్తున్నాడని, త్వరగా వెళ్ళి ‘ఆ పర వాసుదేవుని తోడి తీసుకురావే’ అనీ చెప్తూ – ‘పోవే పోపోవే, పోవే, పోవే’ అంటూ ఎంతో ఆతృతతో చెలిని పంపుతూ, నాయకుని వేగంగా తొందర పెట్టి తీసుకురా అని చెప్తోంది. అంటే జీవుడు పరమాత్మలో ఐక్యమయ్యే పరిపక్వత వచ్చిందన్న మాట.