స్త్రీ స్వరూప స్వభావాదుల్ని బట్టి భారతీయాలంకారికులు నాయికా భేదాల్ని పేర్కొన్నారు. అవయవాదుల ద్వారా ప్రకటించే భావాలను, స్వతఃసిద్ధంగా స్త్రీ సహజమైన కొన్ని నైజాలను, శృంగార విషయంలో వారి వారి ప్రవృత్తులను, ఆకారాది రూపు లావణ్య విశేషాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు.
ఇక శృంగార విషయానికొస్తే అష్టవిధ శృంగార నాయికలనే ఒక విభాగం చేశారు నాయిక నాయకుని విషయంలో వివిధ సందర్భాలలో ప్రదర్శించే హావభావ విన్యాసాల ఆధారంగా, మనో భావాలకు అనుగుణంగా, కోపతాపాలకు అనురూప్యంగా శృంగార నాయికా భేదాలు ఏర్పడ్డాయి. ఇవి ఎనిమిది విధాలు:
- స్వాధీన భర్తృక
- వాసక సజ్జిక
- ఖండిత
- కలహాంతరిత
- విప్రలబ్ధ
- విరహోత్కంఠిత
- ప్రోషిత భర్తృక
- అభిసారిక
శృంగార రస ప్రధానంగా జావళీ రచన సాగింది కాబట్టి అందులోనూ నాయికా నాయకుల పరస్పర సమాగమం కోసం, వారు పడే ఆవేదనల్ని ప్రస్ఫుటించేవి కాబట్టి, ఆయా సందర్భాలలో జావళీ కర్తలు ఈ అష్టవిధ శృంగార నాయికా లక్ష్ణాల్ని సైతం తమ జావళీలలో ప్రయోగించి రచించారు. ఆ విషయాల్ని విశ్లేషించడమే ఇక్కడ ప్రధానోద్దేశం.
అలంకారికులు నాయికల స్వరూప స్వభావాల్ని బట్టి వారిని అష్ట విధ నాయ్యికలుగా విభజించారు. నాయికా నాయకుల మధ్య ఎంత అనురాగమున్నా వారి వారి ప్రవర్తన, మాట తీరు, మానసిక స్థితి – పరిగణ లోనికి తీసుకుని ఈ విభజన చేశారు.
స్వాధీన భర్తృక:
పురుషుని తన గుణం చేత వశం చేసుకునేది. నాయకుడు ఎల్లప్పుడూ తన పక్కనే ఉండగా అధికమైన మోదం, అభిమానం కల్లిగి ఉండే నాయిక. ఎల్లప్పుడూ తన యింగిత మెరిగి తన యాజ్ఞకు లోనుగా నడిచే పతి కలది.
క్లుప్తంగా చెప్పాలంటే – స్వాధీనమైన భర్త కల శృంగార నాయిక అని అర్థం.
ఫరజు – ఏక
ఇన్నాళ్ళ వలె గాదె వాని గుణమెంతని విన్నవింతునె ఓ చెలి
నన్నెడ బాయడు అన్యుల జూడడు
మన్నన వీడడు మానినీ మణిరో
వన్నెకాడె యెందున్నడె
వాడన్నిటి నెర జానుడె
సుందర శ్యామ వెంకట రమణుడు
నెనరున కలిగిన నేదాన గాన ఓ మద గజ గమనరొ (1)
సుందర శ్యామల వెంకట రమణునికి అంకితమయిన ఈ జావళీలో స్వాధీన పరికాలక్షణం స్పష్టంగా కనిపిస్తుంది.
నాయిక చెలితో తన నాయకుని గూర్చి చాలా గర్వంగా చెప్పుకుంటోంది. తనను ఎడబాయడన్న నమ్మకంతో ఉంది, ఇతరులను కన్నెత్తి చూడనే చూడడట. తానంటే చాలా గౌరవం కలవాడట. తన నాయకుడు తనను వీడడనే గట్టి నమ్మకం తనకున్నదట.
అలాగే ఈ జావళీలో కూడా స్వాధీన పతికా లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఫరజు – ఆది
స్మర సుందరాంగుని సరి ఎవ్వరే
సరస కోటి లోన వజీరుహమీరె
ఆడిన మాటకు అడ్డము బలుకడే ఏ
చేడియలను కనుల జూడడే
వీనుల కింపుగ వీణ వాయించి అలి
వేణి నే పాడగ శాభాషిచ్చునే
ధరణిలో రతి దేల్చు ఉదార శ్రీ
ధర్మ పురాధిపు డైనట్టి మా
నాయిక నాయకుని గూర్చి చెలితో గొప్పగా చెప్పుకుంటోంది.
ధర్మ పురాధిపుడైన తన నాయకునికి సరి ఎవరూ లేరట. అంత అందగాడట. తన మాటలకు ఎప్పుడూ అడ్డం పలుకడట. తను ఏది పలికినా కాదు అని అనడట. తన ఎదురుగా తిరుగాడు చేడియలను సైతం కన్నెత్తి చూడడట.
నాయికకి తన నాయకునిపై ఎంత నమ్మకమో, తనకు విధేయుడుగా ఉంటాడే కానీ ఎప్పుడూ బాధ పెట్టడట.
వాసక సజ్జిక:
“ప్రియాగమ వేళ గృహమున్
తనువున్ సవరించు నింతి వాసవసజ్జిక”
అని కావ్యాలంకార సంగ్రహం వాసక సజ్జికా లక్షణాన్ని పేర్కొంటోంది. అంటే –
“ప్రియుడైన నాయకుడు వచ్చే సమయానికి
ఇంటినీ, ఒంటినీ చక్కదీర్చుకొనే నాయిక” అని అర్థం.
తన పడకటింటిని సింగారించి నాయకునికై ఎదురు చూస్తే నాయిక, ప్రియుని కోసం సురత సామగ్రి సన్నాహం చేసి, తాని అలంకరించుకుని ఎదురు చూసేది. తన మనసైన ప్రియుడు వచ్చే వేళకు ముంగిటినీ, పడకటింటినే అలంకరించి ఎదురు చూసే నాయిక ఈ వాసక సజ్జిక.
ఈ కింది జావళీలో వాసక సజ్జిక లక్షణాలన్నీ సంపూర్ణంగా గోచరమవుతాయి.
కాంభోజి – రూపక
ఏమి మాయము చేసి పోతివో శ్యామ సుందరాంగా నాతో
…
…
మంగళ స్నానము రంగుగ జేసే ఉప్పొంగుచు నీ మృదు
అంగ సంగముతో కౌగలించేనని వంగి వళంగి శ్రీ
మంగళాంగుడౌ తాఆలవనేశుని
నాయిక నాయకుని కోసం ఎదురు చూస్తోంది.
తాళవనేశుడు నాయకుడు. చక్కగా మంగళ స్నానం చేసింది. తన నాయకుడు వస్తాడని ఉప్పొంగుతూ అంగ సంగంతో కౌగిలిలో బంధిస్తాడనీ ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. మంగళాంగుడైన ఆ తాళవనేశుని కోసం వంగి నమస్కరించడానికి సిద్ధపడుతోంది.
విరహోత్కంఠిత:
నాయకుడు ఇంకా రాడాయెనని విరహం చేత చింతించే నాయిక. పెనిమిటి రావడానికి ఆలస్య మయినందుకు విరహ పడేది. కన్నీరు కార్చడం, తన గోడు చెలికత్తెతో చెప్పుకోవడం వంటి భావాలు కలది.
బ్యాగ్ – రూపక
ఈ విరహ మెటులోర్తునే చెలియా
నేమి సేతు నా మనోహరుండు రాడటేనా
సామి కే మిటారి దూరు చెప్పెనె చెలియా
యెందాక సైతు వానిబాసి యీ సుమ శరుని
చిగురాకు బటకుచే కుచంబు దాకెనె చెలియ
నే తాళజాల బాలచంద్ర సామిని బాసి
నాయిక చెలితో తన విరహాన్ని తెలుపుకుంటోంది. బాలచంద్ర సామి, తన నాయకుడు రానందుకు దుఃఖిస్తోంది. ఏ మిటారి అడ్డగించిందో, రాకుండా చేసిందో, లేకపోతే తప్పక వచ్చేవాడే అనే నమ్మకాన్ని కూడా వెళ్ళబోసుకుంటోంది. తన నాయకుని వీడి తాను బతకలేననీ! సుమ శరుని చిగురాకు బాకుచే కుచంబు దాకెనె! అని తాళజాలననీ, బాలచంద్ర సామి రానందుకు తాను తట్టుకోలేక పోతోందని, విరహాన్ని భరించలేనని, చెలితో చెప్పుకుని బాధ పడుతోంది నాయిక.
సురపురి వేణుగోపాల ముద్రతో ఉన్న మరొక జావళీలో నాయిక తన చెలితో మొర పెట్టుకుంటోంది.
తోడి – అట
యెటువలె సైచుదునే విరహము
యింతిరో విరహము యెందని యోర్తునె
కాంతుని బారికి కలియ రమ్మను మనె
…
…
వేమురు సురపురి వేణుగోపాలుని
కాముని కేళిని కలవర మందితి
సురపురిలో ఉన్న వేణు గోపాల స్వామి నాయకుడు. నాయిక విరహాన్ని ఎడబాటును భరించలేక చెలితో మొర బెట్టుకుని దుఃఖిస్తోంది. విరహాన్ని తాను తట్టుకోలేక పోతుందట. కాముని కేళికి ఆతృత పడుతోంది. చెలిని తొందర పెట్టి తన విరహాన్ని అర్థం అయ్యేట్లు తెలిపి దొఃఖిస్తూ తన పతిని తీసుకు రమ్మని బతిమలాడుతోంది నాయిక.
విప్రలబ్ధ:
నాయకునిచే సంకేత స్థలంలో వంచింపబడి దుఃఖించే లక్షణం కల నాయిక. వ్యాకుల హృదయి అయిన నాయిక. ప్రియుడు రానందుకు అతనిచే వంచింపబడినట్లు తలపు గల నాయిక.
కానడ – మిశ్ర చాపు
చారుమతి యుపచారము లేటికే
మీరిన శోకము లేరీతిగ తీరు
సరసుడు జూడని యాభరణము లేటికే
మరచే నటనే! కరుణాశాలి
వేగమే ప్రాణేశుడు రాగలడో రాడో
జాగు చేయునో! నాగవేణీ రో
నాయిక నాయకుని కోసం ఎదురు చూస్తోంది. తప్పకుండా వస్తానని చెప్పడం వల్ల్ల చక్కగా అలంకరించుకుని సిద్ధంగా ఉంది. చెలితో తాను నాయకునిచే వంచింపబడినట్లు చెప్పుకుంటోంది.
తనకు శోకాలు అధికమవుతున్నాయనీ ఎన్ని ఉపచారాలు చేసినా ఉపయోగం లేదనీ చెలితో చెప్పుకుని బాధ పడుతూ తన శోకం ఏ రీతిగా పోతుందో అంటూ దుఃఖిస్తోంది.
చక్కగా అలంకారాలు పెట్టుకుని ఎదురు చూస్తున్న నాయిక సరసుడు రాకపోవడంతో, ఆ ఆభరణాలు ఎందుకని విరక్తిగా మాట్లాడుతోంది. కరుణాశీలి అయిన నాయకుడు నిజంగా వస్తానన్నాడు. మరచి పోయాడా? అనే శంకను చెలితో చెప్పుకుంటోంది నాయిక.
ఓ నాగవేణీ – నిజంగా వస్తాడా? రాగలడో, రాలేడో, ఏమి ఆటంకాలు వచ్చాయో, ఆలస్యంగా వస్తాడో, అంటూ భర్త రానందుకు దుఃఖిస్తూ, వంచనకు గురైనట్లుగా భావిస్తూ, చారుమతీ – అని సంబోధిస్తూ తన చెలితో బాధని పంచుకుంటోంది నాయిక.
శంకరాభరణం – ఆది
యేమిర నా సామి నీకిది తగున
కామినుల యెడ నిట్టి నీమవు మాటలకును
నిన్న రేయి వచ్చేవనీ నిద్ర లేక వేసారితి
వన్నెలాడి నీతోమరి కన్ను సయిగ చేసెనేమొ
అతివరో వచ్చేనని ఆన బెట్టె పోతివిర
ప్రాణనాథ నీవే బల్ జాణవే శబాసుర
తప్పక సురపురి దైవరాయ గోపాల
ఇప్పుడైనను గూడమంటె తప్పు మాట లాడెదవే
ఈ జావళీలో నాయిక నాయకుని వంచన గురించి నిలదీసింది. ఇది తగునటరా అని ప్రశ్నించింది. రాత్రి వస్తానని, నిద్ర లేక నీకోసం పడిగాపులు పడి ఎదురు చూస్తే నీవు రాలేదు. ఏ వన్నెలాడి కన్ను సైగ చేసిందో అని సవతిని విమర్శించింది. ఒట్టు పెట్టుకుని వస్తానని చెప్పి, ప్రాణనాథ! గొప్ప పని చేశావులే, గొప్ప జాణుడవే, శహబాస్ అని ఎద్దేవా చేసింది.
ఇప్పటికైనను మించి పోయింది లేదని, తనను కూడుమని, తప్పు మాట లాడవద్దని సురపురి దైవరాయ గోపాలుని ప్రార్థించిది.
బ్యాగ్ – రూపక
అంతలోనె తెల్లవారె అయ్యో యేమి సేతునే
కాంతుని మనసెంత నొచ్చెనొ ఇంతి యెటు సైతునే
కొదమ గుబ్బ లెదను గదియ నదుము కొనుచు
చాలా పెదవి తేనె లాన నా మదిని దోచు వేళ
పంతమున తటాల లేచి పైట కొంగు జారగా
కాంత దొంతర విడె మొసంగి కౌగలింపు చుండగా
సోమ భూపాల రమ్మని భామ ప్రేమ మీరగా
కాము కేళి లోన మిగుల కలసి మెలసి యుండగా
సోమ భూపాలుడు నాయకుడు. నాయిక చెలితో దుఃఖిస్తూ చెపుతోంది. “కొదమ గుబ్బ లెదను గదియ నదుము కొనుచు, ముద్దు పెట్టు కొనుటకు పెదవి తేనెలానగా అంతలోనె తెల్లవారి పోయిందే. అయ్యో నేనేమి చెయ్యగలను. నా కాంతుడు ఎంత నొచ్చుకున్నాడో.”
“పైట కొంగు జారగా, దొంతర విడెమిచ్చి కౌగలింపు చుండగా, ప్రేమ మీర కామకేళి లోన మిగుల కలసి మెలసి యున్న వేళ – అయ్యయ్యో ఏమి చెప్పనే – అంతలోనే తెల్లవారి పోయింది” అంటూ పాపం, నా భర్త ఎంత బాధ పడ్డాడో అంటూ వాపోయింది నాయిక.
ఖండిత:
ప్రియునిపై అన్యస్త్రీ సంభోగ లక్షణాల్ని చూసి ఈర్ష్య చెంది దుఃఖించి కోపించేది.
సురటి – ఏక
మాటలేల చాలు చాలుర నా సామి
బోటి తోడను పొందు గాను భోగించినా వేమిర
మాటికి కుంకుమ పైజారెనురా
కాటుక రెప్పల కంటినదేరా
యేటికి భ్రమమదియేరా జాడ దెల్పర
చిందిన గంధపు పూతలవేరా
చెక్కిటలు చెమటలు బుట్టునదేరా
సుందర నీ యధర మందు పలు నొక్కులుర
కన్నుల నిద్దుర మబ్బులవేరా
కరుణాకర సూర్య ప్రభువౌర
చిన్నెలు జూచి సంతసించితి నేర పోపోరా
ఈ జావళీలో నాయకుని నాయిక నిలదీసింది. నాయకుడు పరస్త్రీ భోగానంతరం ఇంటికి రాగా అతనిని నాయిక చూసింది. చాలా కోపం వచ్చింది. నాయికకు ఇంకెంకుదురా మాట్లాడతావు అని ప్రస్నించిది. చాలు చాలని వారించింది. మరొక బోటితో భోగించి వస్తున్నావా – అని ప్రశ్నించింది. నువ్వు చెప్పకుండానే అర్థం అయ్యిందిలే అంది.
కుంకుమ నీ శరీరంపై కనిపిస్తోంది. నీ రెప్పలకు ఆ కాటుక గుర్తులున్నాయి. ఏమిటి? ఉన్న విషయం చెప్పరా – అని చాలా కోపంతో ప్రశ్నించింది. గంధపు పూతలు కనిపిస్తున్నాయి. నీ చెక్కిటలు చెమటలు పట్టినట్లు కనిపిస్తున్నాయి. నీ అధరం చూస్తుంటే అన్నీ పంటి గాట్లు కనిపిస్తున్నాయి. ఇంత కాలం నీ మాయ మాటలు నమ్మి సంతోషించానే కానీ నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదురా అని నాయకునితో అన్యస్త్రీ సంభోగ లక్షణాలను చూపిస్తూ తీవ్రంగా మాట్లాడింది.
కానడ – రూపక
వాని పొందు చాలు వద్దనె
వనితామణి అల
చాన మాటలెల్ల దాని సదనమే
సతమనుచు నుండిన
కమ్మ విల్తుడేయు అమ్ముల పోటున
రొమ్మున నాటిన కమ్మ వ్రాసిచ్చిన
కొమ్మ నంపి వేన తోడి తెమ్మని
నేదాని పొమ్మని బల్కిన
నాయిక తన దుఃఖాన్ని చెలికి చెప్పుకుంటోంది. పరస్త్రీ యింట్లో గడుపుతున్న ప్రియుని అసహ్యించుకుంటుంది. ఛీ ఛీ వాని పొందు ఇక వద్దే వద్దు అంది. ఎప్పుడూ దాని యింట్లోనే కాపురం పెట్టేవాడు తన కక్కర లేదంది.
మన్మథుడు తనను బాధిస్తున్నాడనీ, ఆ అమ్ములు తన రొమ్మున నాటినప్పుడు భరించలేని బాధన్ ననుభవిస్తూ తన సమ్మరాసి చెలితో పంపి, వెంట తీసుకు రమ్మని చెప్పినా ఆమెకు సమాధానం చెప్పకుండా అక్కడే ఉండి పైగా పొమ్మన్నాడట. అటువంటి వాని పొందు తనకు వలదని, ప్ప్రియుడు అన్య కాంత ఇంట్లో ఉండడాన్ని అసహ్యించుకొని బాధపడుతూ చెలికి తన మనో భావాల్ని వ్యక్త పరిచింది.
పూర్వి కల్యాణి – మిశ్ర లఘు
నీ మాట లేమాయెనురా సామి బల్కర
ఏమేమో బోధించి నన్నేమార చేసేవల
చక్కని సామివలె చెక్కిలి నొక్కిరవ
ముక్కెర నీ కిచ్చేనని టక్కులచే సొక్కించిన
మాటి మాటికి మరు మాటలాడ బిల్చుచు
పాటీలు నీకాంపేనని తాటోటముతో నీవను
జాలము జేసికల సేలి రతనాల జువి
కీలజత పంపేనన్న తాలవనలోల అల
ఈజావళీలో నాయిక నాయకుని అబద్ధపు మోసపు మాటలకు అవమానంతో బాధ పడుతూ నాయకుని నిలుచోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది.
నువ్వు చెప్పిన వన్నీ అబద్ధాలా? అవన్నీ ఏమైయ్యాయి? ఏవేమిటో మాట్లాడావు. అవన్నీ నిజమని నమ్మిన నన్ను ఏమార్చావు కదా! ఎందుకు అంత మోసము చేశావు? ఎంత ముద్దుగా చక్కగా మాట్లాడుతూ నా చెక్కిలి నొక్కి రవముక్కెర కానుకగా తప్పక యిస్తావని నీ టక్కులచే నా దగ్గర అబచ్చ్దాలు చెప్పావు కదూ – ప్రగల్భాలు పలికావు కదూ?
మాటిమాటికి నన్ను పిలుస్తూ ఏవేవో ప్రేమ కబుర్లు చెపుతూ పట్టీలు పంపుతానని చాలా గర్వంగా డప్పాలు కొట్టావే? రతనాల జుమికీల జత కూడా పంపుతాన్నావు? ఓ తాలవనేశా! నన్నెందుకు అబద్ధాలతో మోసం చేశావు? నీవు చేసిన వాగ్దానలన్నీ వట్టి బూటకపు మాటలేనా అని చాలా కోపంగా నాయకునితో తీవ్రంగా మాట్లాడింది.
కలహాంతరిత:
పతిని మొదట అవమానించి తరువాత పశ్చాత్తాప పడేది.
బేహాగ్ – రూపక
యెంత పాపమింతి నైతినే చెలి
పంతగించి పొయ్యే సామి బతిమాలిన రాడు గదె
కృప దొలంగి విభుడు చాల గినిసి వేసి పోయెగా
చపల నేత్ర యెట్లు సైతు సరసుని గురు విరహ తాప
పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలాడు వాని
వలచి మోస పోయితిని కిసలయ పాణి యేమి సేతు
దివిజ పతి ముఖ వినుత బల దేవ రసిక భుజగ వరుని
యువిరళ రతి సుఖ సంపద లబ్బునో యిక నబ్బదో చెలి
నాయకీ నాయకుల మధ్య ఏదో జరిగింది. తన ప్రియుడు బాధ పడేటట్లు ఏదో మాట్లాడి వెళ్ళి పోయేట్లు చేసింది నాయిక. చెలితో మొర పెట్టుకుంటోంది.
స్త్రీ జన్మ ఎంతో పాపం చేస్తే వస్తుందో, నా మీద పంతం పట్టి వెళ్ళిపోయాడే. నా మీద దయ లేకుండా పోయిందే సామికి. చాలా విసిగి వేసారి వెళ్ళిపోయిన నా పతి “గురు విరహానికి” నేను తట్టుకో లేక పోతున్నానే, నేనేం చెయ్యను. ఇప్పుడు ఎంత బతిమాలినా రాడేమో అనిపిస్తోంది.
“పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలకు” నే చాలా మోసపోయాను. కిసలయపాణి, ఆ మాటలను మరచి పోలేక బాధ పడుతున్నాను. అనవసరంగా బాధ పెట్టానేమో. కోపంతో వెళ్ళిన అవిరళ రతి సుఖ సంపద యింక నాకు లభించదేమో! తొందర పడి నా స్త్రీ సహజమైన లక్షణాలచే బాఢ పడేట్లు చేశా కదూ” అంటూ తన పశ్చాత్తాపాన్ని చెలితో చెప్పుకొని బాధ పడుతోంది నాయిక.
నాయకుడు ఎంత మోసగాడైనా, తెలిసి కూడా, తిట్టి కూడా తిరిగి అతని పొందు కోసం తపిస్తోంది నాయిక.
జంఝూటి – మధ్యాది
నేనేమి సేతునే భామినీ
సామి యింటికి రాగ సరసము
లేకను భామిని పొమ్మంటినే
ఒప్పగు తెలివి యొకరి సొత్తు
గాదని జెప్పుట నిజమాయె
మలయా నిలము దాయ
చలువ రేడు గాయమై సెగ దోచెనే
సుందరి రేపలె కందర్ప జనకునితో
పొందగ నైతినే పొందగ నైతినే
భర్త యింటికి వచ్చాడు. సరసాలాడ బోయాడు. దానికి అవకాశం ఇవ్వలేడు నాయిక. ఏదో గొడవ జరగ బట్టే నాయికకు కోపం వచ్చింది. దగ్గరకు వచ్చిన నాయకుని దూరంగా పోయేట్లు చేసుకుంది. వెంటనే పశ్చాత్తాప పడింది. తన బాధని చెలికి వెళ్ళబోసుకుంటోంది.
“ఓ భామినీ, నా యింటికి వచ్చిన సామిని సరరం లేక నేపొమ్మన్నానే! తెలివి తేటలు ఒకరి సొత్తు కాదనే మాట నిజమే ననిపిస్తోంది. ఏం చెయ్యనే! పిల్ల గాలులు గిలిగింతలు పెడుతున్నాయి. చలువ రేడు గాయం చేసి శరీరాన్ని సెగలతో ముంచెత్తుతున్నాడు. నా సామి యింటికి ఎలా వస్తాడే? నే పొమ్మన్న వాడిని తిరిగి తెచ్చుకో గలనా? ఓ సుందరీ! రేపల్లె కందర్ప జనకుని నే పొందలేక పోతున్నానే” అంటూ దుఃఖిస్తూ నాయిక తన చర్యకి పశ్చాత్తాప పడుతుంది.
ప్రోషిత భర్తృక:
పతి దేశాంతరం వెళ్ళి ఉండగా వియోగంతో చింతించేది ప్రోషిత భర్తృక.
హిందుస్థాని కాఫి – ఆది
సామిని రమ్మనవే సఖి కామిని వినవే
శ్రీ కాళహస్తీ పుర ధామునిపై మరులు దాచగ లేనే
అన్నము నోటికింపుగ లేదే
నానుబాల జుంటి తేనియు చేదే
మారుడు తాను బల్ మమత తోను
సారెకు విల్వంచి సాహస మొనర్చెనే
నేటికి సామిని సూటిగ దెచ్చితె
బోటిరో నీకునె కోటికలిత్తునె
ఇక్కడ పతి అలిగి వెళ్ళలేదు – ఏదో కారణంగా ఎడబాటు కలిగింది. తట్టుకోలేకపోతోంది. మనస్సు బాధగా ఉంటే ఏదీ తినాలనిపించదు. రుచించదు. ఆ పరిస్థితిని చెలికి వివరిస్తోంది. సామిని రమ్మని చెప్పమని చెలిని బ్రతిమాలుకుంటోంది. కాళహస్తీ పుర ధామునిపై మరులు దాచుకోలేక పోతోందిట. తన పొందు కోసం తహతహ లాడుతోందిట.
అన్నం తిందామంటే ఇంపుగా లేదుట. సహించడం లేదుట. నానుబాల జుంటి తేనె కూడా తియ్యగా ఉండాల్సింది పోయి విపరీతంగా చేదుగా ఉందిట. మన్మథ బాణాల తాకిడికి తట్టుకోలేక పోతోందిట. ‘నా సామిని తీసుకు రావే. ఓ బోటి! నీకు కోట్లిస్తానే, ఎంతైనా యిస్తాను. ఏమైనా యిస్తాను. నా సామిని నా వద్దకు తీసుకు రావే’ అని నాయిక చెలిని బతిమలాడుతోంది. పతి యెడబాటును చెలికి అర్థం అయేట్లు చెపుతోంది.
హిందూస్థాని – ధృవ
నన్నెడ బాసిన మొదలు
కన్నులకు నిదుర రాదె చెలి
రేయి పగలు రెప్ప పాటు లేక పలు మారు
నీ పేరు బిలుచుచును కనుల నీరు నడకలై పారెనయ్యో
సుదతిరొ యిపుడు యీ సుందరాంగుడె నను
నిక్కము గాను వీక్షించుచును
గాఢాలింగనముతో నను గూడుచును
అయ్యో సంతోష సముద్రమున నీదుచును
నాయకుని యెడబాటున కల్గిన తన మనోభావాల్ని చెలికి చెప్పుకుంటోంది నాయిక. కంటికి నిద్దుర రావడం లేదుట. రాత్రనక పకలనక అలా రెప్ప పాటు లేకుండానే పేరును పదే పదే పిలుస్తూ కనుల నీరు కడవలై పారేట్లుగా బాధ పడుతోంది. ఆ సుందరాంగుడు తనను వీక్షించి, కూడి, గాఢాలింగనం చేసి తనను సంతోష సముద్రంలో నీదుచున్నట్లు భావించుకుంటోంది. తన పతితో తాను కలసి ఏవేవో చేస్తున్నట్లు ఊహించుకొని అక్కడ లేని పతిని గూర్చి బాధ పడుతూ ఎడబాటును సహింపలేని తన స్త్రీ సహజ భావాల్ని చెలికి చెప్పుకుంటోంది.
అభిసారిక:
సంకేత స్థలానికి తనకు తానుగా వెళ్ళేదీ, లేదా ప్రియుని తన వద్దకు రప్పించుకునే లక్షణం కల పడతి.
కమాచి – రూపక
ఇంత వేగ పడిన కార్య మెట్టు లౌనురా
రవంత వేళ జూచి ముద్దాడుట దగునురా
మెత్తని పానుపున మగని మెల్లనె నిద్రింప జేసి
యత్త మామ లెరుగకుండ వత్తును పోరా
మరుదులు గ్రామాంతరమ్మ్ము లరిగి రాడ బిడ్డ లింక
పొరుగిండ్లకు నాటలాడ బోదురు గదరా
దాపున మా పూల దోట లోపల నీ వుండుము గడె
సేపు లోనె బాగాల్ గొని చేర వత్తురా
చెన్ను మీర గబ్బిట యజ్ఞన్న కవి నేలినట్టి
చిన్ని కృష్ణ మదిని నేర మెన్న బోకురా
ఆ పరమ పురుషునితో ఐక్యతకు అన్నీ అడ్డంకులే. ఎన్ని చక్క బెట్టుకోవాలి. ఎన్ని ప్రతిబంధకాల్నుండి తప్పించుకొని బయటకు రావాలి. నాయిక చిన్ని కృష్ణుని పొందు కోసం ఆరాట పడుతోంది. సామి తొందర పెడుతున్నాడు.
తొందర పడితే కార్యం పూర్తవుతుందా సామీ! కాస్త సమయ సందర్భాలు చూసుకోవాలి కదా! సమయం చూచి ముద్దులాడాలి గానీ యిష్టం వచ్చినట్లు చేయాలంటే సాధ్యమా? వలదు సామీ వెళ్ళిపో.
నా భర్త యింట్లో ఉన్నాడు కదా. కాస్తంత మెత్తని పానుపుపై నిద్రించేట్లు చ్చేసి, ఆ తరువాత వస్తాను. అత్త మామలు కూడా నన్ను చూడకూడదు కదా. ఆ సమయాన్ని, పరిష్తితులను చూసి మెల్లగా నేనే వస్తాను. నన్ను తొందర పెట్టకు. నా పరుదులు గ్రామాంతరం వెడతారు. ఆడబిడ్డలు పొరుగింట్లకు ఆటలాడడానికి వెడతారు. అందరూ ఎవరి కార్యాలలో వారు నిమగ్నమైన సమయం అయితే నిశ్చింతగా రాగలను.
నా యింటికి దగ్గర లోనే మా అందమైన పూల తోట ఉంది. ఇప్పుడే ఓ గడియ సేపు లోనే అక్కడ ఉంటాను. నే బాగాల్ తీసుకొని నీ దగ్గర స్వయంగా వస్తాను. నన్ను తప్పుగా భావించకు. నేరమనుకోకు. ఆ సంసార బంధనాన్ని చక్కబెట్టుకుంటే గానీ నేనీ చెంత చేరలేను – అంటూ సంకేత స్థలమైన పూల తోటకు రమ్మని, తాను అచ్చటకు వస్తానని తొందర పడవద్దని నాయిక నాయకునికి మొర పెట్టుకుంది.
బేహాగ్ – రూపక
సమయమిదె రారా నా సామి
తామసించకురా
కమల వైరి చనుదెంచిన కాంక్ష లీడేరదుర
మగడు ఊరలేడు నా మామగారి జోలి లేదని
పగ తెగ తెలిసినదిరా వట్టి పంతమేలరా
మన్ననచే నీవు వచ్చి నన్ను గూడి యుండినట్లు
నిన్న రేయి కల గంటి నీరజాక్ష వేంకటేశ
తన యింట్లో పరిస్థితులు అనువుగా ఉన్నాయని నాయకుడు తన సామి వేంకటేశుని యింటికి రమ్మంటోంది నాయిక. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా రమ్మని వేడుకుంటోంది. అదే మంచి సమయమని చెపుతోంది. కారణాలు కూడా చెపుతోంది. తన పతి ఊరిలో లేడట. మామగారి విషయాలు పట్టించుకోనవసరం లేదుట. నిన్న రాత్రి కల గూడా వచ్చిందిట తనను సామి కూడి యున్నట్లు. త్వరగా రమ్మని కమల వైరి వస్తే కోరికలు తీరవని, సమయ సందర్భాలన్నీ ఏకరువు పెడుతోంది సామితో చెలి ద్వారా నాయిక.
యమన్ – దేశాది
సమయము గాదుర – సామి లేచి పోరా
సామి లేచి పోరా జాగువ చేసేవురా
చేయి పట్టి నా సిగ్గు చెరచకురా సామి
వేయి విధముల నే వేడుకున్న వినవు
అత్తింటి కోడలని ఆలోచింపక
చిత్తజు కేళి కాయత్తమై యున్నాను
ఇంటి వారందరు నిట్టట్టు తిరిగేరు
కంటికి తెలియక కదిలి పోరాయిని
రాజగోపాల తట్టు సేయుటేల
సాజముగ ఒకసారి వత్తువు గాని
ఓ రాజగోపాలా! సామీ! దయ చేసి వెళ్ళిపో, ఇది సమయం కాదు. ఇంకొకసారి వీలు వెంట రావచ్చులే. ఆలస్యం చెయ్యకుండా వెంటనే పోరా. నా చెయ్యి పట్టి అందరిలోనూ సిగ్గు చెరచకురా, ఎంత బతిమాలినా వినకున్నావేమీ? నే అత్తింటి కోడలినని, అస్సలు నువ్వు ఆలోచించడం లేదు గదూ. చిత్తజు కేళికి సిద్ధమయావు.
నీకర్థం కావడం లేదు నా స్థితి. ఇంట్లో వారందరూ ఇటు అటు తిరుగుతున్నారు. రెండో కంటికి తెలియకుండా తొందరగా కదిలి పోరా సామీ.
నన్ను అల్లరి పెట్టకు, సమయం చూచి ఇంకొక స్సారి తప్పక వద్దువు గాని, దయ చేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్ళిపోరా, అని తనింటి పరిస్థితి విశదంగా చెప్పి ఆ రాజగోపాలున్ని వేడుకొనినది.
జావళీలలో స్త్రీ సహజమయిన ఆర్తి, ఆవేదన, ఎదురు చూడడం, విరహంతో తపిస్తూ వేగిపోవడం, ఎక్కువగా కనిపిస్తుంది. ప్రాయకంగా జావళీ నాయికలు విరహోత్కంఠితలు, విప్రలబ్ధలు, ఖండితలు. నాయికా నాయకుల మనోగతాలను, చెలి బోధనలను పరిశీలిస్తే – జీవుడు (నాయిక) భగవంతుని (నాయకుని)తో ఐక్యమవడం కోసం చేసే ప్రయత్న ఫలితమే జావళీ సాహిత్య ఫలమని స్పష్టమవుతోంది.
ఈ విధంగా అష్టవిధ శృంగార నాయికలే కాక తెలుగు జావళీలలో సామాన్య లక్షణాలతో సనిపించే నాయికలు కూడా దర్శనమిస్తారు.