7.1 తెలుగు జావళీలు – వర్ణనా సౌందర్యం

కవిత్వం నవనవోన్మేషమైనది. భావ ప్రపంచాన్ని ఆవిష్కరించే కమనీయమైన లక్షణం కలది. విశ్వనాథుని అభిప్రాయం ప్రకారం ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అని నిర్వచించినా, లేదా, “ఇష్టార్థర్య వచ్చిన పదావళిః కావ్యం’ అన్న దండాచార్యుని కావ్య లక్షణాన్ని స్వీకరించినా, సుప్రసిద్ధ సాహిత్య అలంకారికుడు మన ఆంధ్ర దేశానికి చెందినవాడూ అయిన జగన్నాథ పండిత రాయలు పేర్కొన్నట్లుగా ‘రమణీయార్థః ప్రతిపాదక శబ్దః కావ్యం’ అని ఆమోదించినా కవి కృతమైన ప్రతి రచనా కావ్యమే అవుతుంది.

“అపారే కావ్య సంసారే
కవిరేవ ప్రజాపతిః” అన్నారు.

కవి బ్రహ్మతో సమానమైన వాడు. ఈ సృష్టిలోని వస్తు స్వరూపాన్ని దర్శించి, తనదైన రీతిలో ఆవిష్కరించే ప్రజాపతి. కాబట్టి సామాన్యుడు కవి కాజాలడు.

“నా నృషిః కురుతే కావ్యం” అన్నారు.

ఇలా ఏ అభిప్రాయాన్ని స్వీకరించినా కవి మస్తిష్కంలో ఆవిర్భవించిన రచన దివ్య గుణ శోభితమై అలరారుతుంది. కవి హృదయం నుండి వెలువడ్డ ప్రత్యక్షరమూ ఒక కావ్యమే అవుతుంది. అందువల్ల తెలుగు వాగ్గేయకారులు ఆర్తితో, ఆలోచనతో రచించిన ప్రతి సంకీర్తనా, పదమూ, కృతీ విశిష్ట గుణ యుక్తాలయిన రచనా విశేషాలతో అలరారుతున్నాయి.

సంగీతానికి సంబంధించిన గాన యోగ్యమైన రచనలలో సాహిత్య సంపద సాధారణంగా ఉన్నప్పటికీ మనలో వాగ్గేయ కారులనిపించు కోవడానికి కేవలం సంగీతం తెలిసి ఉంటే సరిపోదు. దానితో పాటుగా చక్కని భాష తెలిసి ఉండాలి. వ్యాకరణం, ఛందస్సు, అలంకార శాస్త్రం మొ॥ వాటి యందు చక్కని అభినివేశం ఉండాలి. అంతేకాదు, కావ్య సంప్రదాయం, లక్షణాలు కలిగి ఉండాలి. వీటితో పాటు స్వతంత్రంగా వర్ణలు చేయగల భావుకత, ఉచితజ్ఞత, చిత్రార్ద్రత కూడా అత్యంత ఆవశ్యకాలు.

(To be continued… Last edited 12 Jan 2026)