8.1 జావళీలు – రాగాలు – అభిప్రాయాలు

జావళీలు గాన విద్యలో ప్రాచీన అర్వాచీన కాలాల్లో సర్వ జన హృదయానంద కరంగా రూపు దాల్చాయి. విశిష్టంగా అనేక జావళీలు దైవతాలకు, ప్రభువులకూ అంకితాలుగా రచించబడి శృంగార రసాన్ని ఆలంబంగా చేసుకొని పరిఢవిల్లాయి.

రాగ తాళ శయ్యా భేదాలతో పరితుష్టి నొంది, అటు శబ్ద సౌందర్యం, ఇటు భావ సౌందర్యాలతో అలరారాయి. పూర్వపు జావళీల్ని, నవీన జావళీల్ని పరిశీలించగా, పూర్వపు జావళీలలో బహు లక్షణాలు ఒక దానిలో నిబిడీకృతమై ఉండగా, ఆధునిక జావళీలలో ఒక దానిలో ఒక లక్షణమే కలిగి ఉండడం వల్ల రసికులు ఇఛ్ఛానుసారంగా వీటిని ఆస్వాదించే యోగ్యతను కలిగి ఉన్నాయి.

కాబట్టే ప్రాచీన అర్వాచీన జావళీల్ని చదవదం ద్వారా సహృదయుల హృదయానందం తప్పక సిద్ధిస్తుంది. కేవలం జావళీల్ని దోష భూయిష్ఠ మయినవనే సంకుచిత మనస్తత్వంతో చూడడం మంచి పని కాదు. “ఎల్ల జనుల కెల్ల నుండు తప్పు” అన్న వేమన్న వాక్కిక్కడ వేదం. దోషం లేని వారెవరు? కాళిదాస మయూరాది కవులలో సైతం దోషం వెదికితే దోషాలు కనిపిస్తుంటే ఇంక అన్య కవుల విషయంలో వేరే చెప్పవలసిన అవసరం ఏముంటుంది?

అసలు ‘జావళీ’ అనేది సాహిత్యాధారంగా రూపొందిన మాట. దీనిలోని ఛందస్సు సంగీతాన్ని ఆశ్రయించే ఉంటుంది. సంగీత, సాహిత్యాల సమ్మేళనమైన విశిష్ట ప్రక్రియ అయిన ఈ జావళీలలో ప్రయుక్తమయ్యే రాగ తాళాది విశేషాల్ని విశ్లేషించడానికి ఆయా ర్రంగాల్లో సుప్రసిద్ధులు, మహిమాన్వితులూ అయిన వారి అభిప్రాయాల్ని పొందుపరచడం, వాటి ఆధారంగా విషయ నిర్ణయం చేయడం ప్రాధాన్యమని భావించడం వల్ల ఇక్కడ కొందరు ప్రముఖుల అభిప్రాయాల్ని ఈ సందర్భంగా ఉటంకిస్తున్నాను.

జావళీ రాగాల గురించి సంగీత శాస్త్రంలో నిస్ణాతులయిన వారు ఈ విధంగా వారి అభిప్రాయాల్ని పేర్కొంటున్నారు.

ప్రొ॥ పి. సాంబమూర్తి

“ఆకర్షించే దేశ్య రాగాలైన ఫరజ్, సెంజురుటి, కాఫి, బేహాగ్, హమీర్ కల్యాణిలలో కొన్ని జావళీలు, సాధారణ రాగాలలో కొన్ని జావళీలు కలవు. ఈ రాగాల కూర్పు పండిత పామరులను తేలికగా వశ పరచుకుని, వారిని రంజింప జేస్తాయి. వినగానే ఆకర్షించే శక్తి గల సంగీతం వలననే జావళీలు ప్రాశస్త్యం పొందాయి. జావళీలలో సంగీతం నిరాఘాటంగా సాగటం ప్రత్యేకత.” (1) (South Indian Music)

డా॥ వి. ఎస్. సంపత్ కుమారాచార్య

“జావళీలు దేశ్య రాగాలలో అత్యంత జన ప్రియమైనవి. రాగానికి విశేషమైన మెరుగు పెట్టడానికి, అందంగా ఉండడానికి, రస స్ఫూర్తికీ దోహదం చేసే విధంగా జావళీ రచయితలు లక్షణ శాస్త్ర నియమాలను కూడా ఉల్లంఘించారు. ఒక రాగంలో వేరొక రాగచ్ఛాయ సొగసు చేరి ఉంటుంది. హుస్సేని, సారంగ, మాంజి, దేశి కాఫి, దేశి తోడి, మోహన, ఆహిరి, కేదార, యమునా కల్యాణి, వసంత, అభేరి వంటి రాగాలలో కూడా జావళీలు రచించారు.” – కర్ణాటక సంగీత పారిభాషిక శబ్దకోశము.

వై. సత్యనారాయణ

“జావళీలన్నీ ఖమాస్, బేహాగ్, జంఝూటి, కాఫి, మోహన మొదలైన రక్తి రాగాలలో ఉండడం, చక్కని నడకతో మధ్యమ కాలంలో ఉండడం, కొన్ని మధ్యమ శృతిలో ఉండడం, జావళీలు శ్రోతలను రంజింప చేయడానికి గల కారణం.” – Music Academy Journal

శ్రీ గోస్వామి

“ఇది గేయ ప్రక్రియ. శృంగార గీతము. మధురమైన రాగాలలో వ్రాయబడినది. ఇందు గల సంగీతము తేజోవంతము గాను, రస ప్రధానము గాను, నాయికా నాయక లక్షణము ననుసరించి వుండును” – The Story of Indian Music

రీతా రాజన్

“కర్ణాటక సంగీతం లోని రక్తి రాగాలైన దర్బార్, కేదార గౌళ, కల్యాణి, ముఖారి, కాంభోజి, భైరవి, బిళహరి, సురటి, అఠాణా, సావేరి, తోడి రాగాలలో జావళీలున్నాయి. జావళీ కారులు రాగచ్ఛాయలను మార్చి వేశారు. ఆయా రాగాలలో గల వర్ణాలు, కీర్తనలలో లేని రాగచ్ఛాయలను జావళీలలో చూపించారు.” – The Javali Form Karnatic Music. Music Academy Journal’

ఖమాస్ రాగం – జావళీకారులు ఎక్కువగా అభిమానించి వాడుకున్న రాగం. కాకలి నిషాద ప్రయోగం చేశారు. ప్రేమ గీతాలైన ఈ జావళీలకు కాకలి నిషాద ప్రయోగం ఖమాస్ రాగానికి చాలా అనుగుణమైంది.

యమునా కల్యాణిలో హిందుస్తానీ పోకడలు ఉన్నాయి. ధర్మపురి సుబ్బారావు రాసిన జావళీలలో ఈ పోకడలు ఉన్నాయి.

ఫరజ్ – జావళీలలో సాధారణంగా వాడే రాగం. “ఇటు సాహసములు” అనే స్వాతి తిరునాళ్ రచించిన జావళీ సైంధవ రాగంలో గల అపూర్వ రాగంలో ఉండడం విశేషం.

జావళీకారులు దేశీ రాగాలలో వేగవంతమైన విధంగా రాశారు.

‘సామి రాడాయగదే’ త్రిశ్రగతిలో రచించిన ధర్మపురి సుబ్బారావు జావళీ బేహాగ్‌లో జానపద బాణీలో ఉంది.

‘చానరో’ – ఖమాస్ రాగంలో గల జావళీ. అందమైన మెళకువలతో కాకలి నిషాద ప్రయోగంలో శ్రీ పూచి శ్రీనివాసయ్యంగారు రచించారు.

చెన్న కేశవయ్య:

“ఖమాస్, బేహాగ్, సురటి, ఖరహరప్రియ, కమలా మనోహరి, సింధు భైరవి, హిందుస్థాని కాఫి, కానడ, నాదనామక్రియ మొదలైన రాగాలలో జావళీలున్నట్లు తేలినది.” Music Academy Journal

ఎస్. ఆర్. జానకిరాం:

“సామాన్యమైన రాగ తాళాలలోనే జావళీలుండును. దేశ్య రాగాలలో కొన్ని జావళీలు కలవు. ఫరజ్, జంఝూటి, కాఫి, బేహాగ్, హమీర్ కల్యాణి మున్నగునవి దేశ్య రాగాలు.” – సంగీత శాస్త్ర సారము.

జావళీకి అమర్చిన సంగీత బాణీలను అందంగా తీర్చి దిద్దుటలో రాగమునకు ఉన్నట్టి నియమములను కొంతవరకు సడలించబడును. ఇతర రాగాలను సూచించు కొన్ని భాగాలను పరిచయం చేయబడును. దీనిని జావళీలలో మాత్రమే అనుమతించబడినది.

ముఖారి రాగంలో గల “ఏమందునే ముద్దు బాలామణీ”, ఖమాస్ రాగంలో గల “అపదూరుకు లోనైతినే” అను జావళీలను పరిశీలించగా మొదటి జావళీ లోని చరణంలో హిందుస్థానీ కాఫీ రాగమును సూచించు ఒక భాగమున్నది. తరువాత జావళీ లోనే చరణం హిందుస్థానీ బేహాగ్ రాగమును సూచించుచున్నది.” – సంగీత శాస్త్ర సారము.

జావళీలలో ప్రయుక్తమయిన రాగాల గురించి ప్రముఖులు ఉదాహరణలతో పేర్కొన్నారు. ప్రస్తుత నా పరిశోధనకు ఆధార భూతాలుగా నిలిచిన, నేను సేకరించిన, నాకు లభించిన 471 జావళీలను సంగీత, రాగాల విషయికంగా పరిశోధించగా, నాకు మొత్తం 63 రాగాలు కనిపించాయి. మొత్తం 471 జావళీల ద్వారా లభించిన వాటిలో 63 రాగాలున్నాయని నా పరిశీలనలో తేలింది. వాటి వివరాల్ని ఇక్కడ పేర్కొంటున్నాను.

హిందుస్థాని కాఫి – 67
బేహాగ్ – 57
ఖమాస్ – 37
తోడి – 37
హిందుస్థానీ – 24
సురటి – 22
సెంజురుటి – 22
కాఫి – 18
ఫరజ్ – 16
బ్యాగ్ – 12
బిళహరి – 9
శంకరాభరణం – 8
కేదారగౌళ – 8
కల్యాణి – 7
కదంబం – 7
ముఖారి – 7
కన్నడ – 6
మాంజి – 6
అఠాణ – 6
యమునా కల్యాణి – 6
ఆనంద భైరవి – 5
బేగడ – 5
నాటకురంజి – 5
నాదనామక్రియ – 5
కాంభోజి – 4
కమాచి – 4
భైరవి – 4
హంసధ్వని – 4
కానడ – 4
దర్బారు – 3
హుసేని – 3
ధన్యాసి – 3
సావేరి – 3
దేశీయ తోడి – 3
యదుకుల కాంభోజి – 3
శుద్ధ కాంభోజి – 2
కాంబోది – 2
ములతాని తోడి – 2
నాయకి – 2
మోహన – 2
యమన్ – 2
పూర్వి కల్యాణి – 2
హనుమత్తోడి – 2
హమీర్ కల్యాణి – 2
సింహేంద్ర మధ్యమ – 2
హిందుస్థాని భైరవి – 1
హిందోళ – 1
చక్రవాక – 1
దేవ మనోహరి – 1
మాంద్ – 1
ఖరహర ప్రియ – 1
సైంధవి – 1
హిందుస్థాని తోడి – 1
వసంత – 1
హరి కాంభోజి – 1
చామరం – 1
భైరవి – 1
కేదారం – 1
సింధు భైరవి – 1
జుజావంతి – 1
శ్రీ రాగం – 1
సింధు కమాచి – 1
శహన – 1