8.2 రాగ కాల నిర్ణయ పట్టిక

“పద వర్ణాలలోనూ, స్వరజతులలోనూ ఉండే స్వర కల్పన ధాతు విన్యాసాన్ని వర్ణించి, శృంగార రసాత్మకమయిన సాహిత్యంలో మధ్యమ కాలంలో స్పష్టమయిన లయతో అందంగా సాగి ఉర్రూతలూగించే రచన జావళీ” అని శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు తన ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము అనే గ్రంథంలో పేర్కొన్నారు.

జావళీ రాగ ప్రధాన మయినది.సభా సంప్రదాయ యుగంలో వర్ణాలతో ప్రారంభించిన సంగీత కచ్చేరీలలో భక్తి రస పుష్టినిచ్చే చక్కని కృతుల్ని, ఒరత్యేకాలాపాలు గల రాగాల్నీ, తరువాత తానమూ, పల్లవీ ముగించిన పిదప పదాల్ని గానం చెయ్యడం, చిట్ట చివర మధ్యమ కాలంలో చురుకైన లయలో ఓలలాడించే జావళీలు ఒకటి రెండు పాడి, మంగళంతో సభ ముగించడం చేసేపారని తెలుస్తోంది. దీన్ని పరిశీలిస్తే జావళీకి సంగీతంలో గల ప్రాధాన్యాన్ని గమనించవచ్చు.

“లయాత్మకత వలనా, మధ్యమ కాలం వలనా జావళీకి కూడా పద, వర్ణ, స్వరజతుల వలెనే భరత శాస్త్రానుగుణ్యంగా నాట్యం చేయడానికి, భావం అభినయించడానికీ ఎంతో అవకాశం ఉంది”. (3)

అందువల్ల సంగీత శాస్త్రంలో ఇంతటి ప్రాధాన్యం గల జావళీల రచన కొన్ని రాగాలలో మాత్రమే కొనసాగిందనీ, కొన్ని వేళలలో మాత్రమే ఆయా రాగాల జావళీలు పాడతారనీ రాసిన పూర్వ విమర్శకులలో – ముఖ్యంగా ఆరుద్ర చెప్పిన అభిప్రాయాలు నిజం కావనీ, జావళీలు చాలా రాగాలలో రాశారనీ, అన్ని కాలాలలో పాడే రాగాలన్నింటిలో జావళీ రచన సాగిందని చెప్పడానికి వీలవుతుంది.

సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు సుబ్బరామ దీక్షితులు గారు “సంగీత సంప్రదాయ ప్రదర్శిని” అనే గ్రంథాన్ని రచించారు. దీనిని ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ 1973 లో ప్రచురించింది.

వారు ఈ గ్రంథంలో జావళీలు సర్వకాల సర్వావస్థల్లోనూ పాడుకోదగ్గవని పేర్కొన్నారు. ఏ కొన్ని రాగాలకో జావళీ రచన పరిమితం కాలేదనీ, ఎల్లప్పుడూ పాడే రాగాలలో జావళీ రచన సాగిందని, వారి మాటల్ని బట్టి తెలుస్తోంది.