జావళీ అనేది నాయికా నాయక భావంతో కూడిన శృంగారాత్మక రచన అనే విషయం పూర్వాధ్యాయాల ద్వారా విదితమే. అయితే ఆంధ్ర సాహిత్యంలో వాగ్గేయకారులు గావించిన పద రచనే దీనికి మూలమని చెప్పవచ్చు.
శృంగార రస భావాదుల తోనూ, నాయికా నాయకుల సమాగమాది విశేషాల తోనూ, క్వాచిత్కంగా సంభోగ శృంగార విషయాల్ని పొందుపరచు కున్నప్పటికీ జావళీలు భగవత్పరంగా ఐక్యతను పొందాయి.
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుడు, క్షేత్రయ్య రచించిన పద రచనా మాధురీ మహిమలే జావళీల్ని మరింతగా గుబాళింప జేశాయని చెప్పవచ్చు. వారు ప్రారంభించిన ఈ శృంగార రస ప్రధానమైన పద రచన జావళీ ఆవిర్భావానికి నాంది పలికిందని చెప్పవచ్చు.
ఆ తరువాత, కాలానుగుణంగా వచ్చే మార్పుల ఆధారంగా దాసకూటాలనే పేరుతో మరి కొంతమంది ఈ పద సాహిత్యాన్ని కేవల లౌకిక శృంగారాత్మకంగా సాగించారు. అలా ప్రారంభమైన కేవల శృంగార స్వరూపమే కళ్ళకు కట్టినట్లు ఆధునికులకు గోచరించింది. అందువల్ల ‘జావళీ’పై సరైన అభిప్రాయం లేదు. సదభిప్రాయం కోల్పోయిన ఆధునికులు జావళీలపై చులకన భావాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం పచ్చి శృంగారానికే ప్రాధాన్యమిచ్చిన రచనలుగా దుయ్యబట్టారు. వీటిలో ప్రస్తావించిన అంశాలేవీ లేదని భావించారు.
కానీ జావళీ సాహిత్యం తెలుగు సాహిత్యానికే కాక, ఆధునికంగా వస్తున్న సాహిత్యానికి కూడా ఎంతో మేలు చేసింది. గేయాత్మక ప్రక్రియల్లోకి జావళీ శర వేగంతో దూసుకు పోయి తన ప్రభావాన్ని చూపింది.
ఇదే వేగంతో సినీ సాహిత్యంలో కూడా ప్రవేశించింది. సినీ రంగం లోకి జావళీ ప్రవేశించడం తోటే సినీ సాహిత్యంపై జావళీ తన ప్రతిభా వంతమైన ప్రభావాన్ని చూపింది. ఆ ప్రభావానికి లోనై ఎన్నో సినిమా పాటలు జావళీల ఆధారంగా వెలుగు చూశాయి. అన్ని లక్షణాలు కల జావళీలు తెలుగు చలన చిత్ర సీమలో యథాతథంగా చిత్రీకరించబడి వాటి ప్రాధాన్యతను నిలబెట్టుకున్నాయి.
జావళీ రాగ తాళాలతో కూడిన పాట. తెలుగు సాహిత్యంలో ఎక్కడో, ఏ కొన్ని సందర్భాలలోనే తప్ప, సంగీతం, సాహిత్యం కలసిన సందర్భాలు తక్కువ. సాహిత్యం లోని పద్యాలన్నీ ఛందో భూమికపై సాగిపోతాయి. లేకపోతే మాత్రా గతుల పైనే ఆధారపడి ఉంటాయి. కానీ సశాస్త్రీయమైన సంగీతం ప్రాచీన సాహిత్యానికి అవసరం అంతగా ఉండదు. అందువల్ల జావళీ ఉనికి ప్రశ్నార్థక మయ్యిందని భావించవచ్చు. ఎప్పుడైతే భారత దేశంలో సినీ రంగం ప్రఏశించిందో, సరిగ్గా అప్పుడే జావళీ సంగీతంతో పాటుగా మళ్ళీ వెలుగు లోనికి వచ్చింది.
ప్రధానంగా సినిమా నిర్మాణంలో సంగీత సాహిత్యాల సమ్మేళనం ఉంటుంది. నాయికా నాయకుల శృంగారం వర్ణించే సందర్భాలు, విరహాన్ని వర్ణించే సన్నివేశాలు తప్పని సరిగా కథా భాగంలో ఉంటాయి. అంతే కాకుండా సినిమా సామాన్య ప్రజలకు ఉద్దేశించి నిర్మించేది కాబట్టి వారు అందించబోయే చిత్రం సాధారణ వ్యక్తికి ఉద్దేశించినదన్న విషయం వారికి ఎప్పుడూ గుర్తుంటుంది.
అందుకోసం భాష ఎంతో సరళంగా ఉండాలి. కథాంశంతో పాటు సంగీత ప్రధానమయిన పాటలు ఉన్నప్పుడే ఆకర్షణ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉంటేనే కదా సినిమా ప్రజాదరణ పొందేది. సరిగ్గా ఈ లక్షణాలన్నీ జావళీలలో ఉండడం వల్లనే, జావళీలు అత్యంత వేగవంతమైన రీతిలో సినిమా సాహిత్యం లోనికి ప్రవేశించి, ఆయా సినీ రచయితల చేత కొంగ్రొత్త జావళీల్ని రచింప జేసిన ఘనతను వహించాయి.
జావళీలు సంగీత శాస్త్రాన్ని అనుసరించి, రాగాలతోనూ, తాళాలతోనూ సమ్మోహన పరిచేవిగా రూపొందాయి.
ప్రధాన రసం శృంగారం. నాయికా నాయకుల మధ్య జరిగే ముచ్చట్ల దగ్గర్నుండి మూతి విరుపుల దాకా, కంటి సైగల నుండి కన్నీటి బిందువుల దాకా ఎన్నో మనసుకి నచ్చేవి, మనసు మెచ్చుకొనేవీ అయిన సంఘటనలు ఉంటాయి. వాటిని చూసి ప్రేరేపితులైన రచయితలు ఆ సందర్భాలలో సన్నివేశ గీతాలు రస పుష్టిని పొందాలనే భావంతో అవే రాగ తాళాలను అనుసరిస్తూ కూడా జావళీ రచనలు చేశారు. ఈ నేపథ్యం కారణంగా తెలుగు సినిమాలపై జావళీల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇలా రచించిన జావళీలు ప్రేక్షకుల హృదయాల్ని కదిపాయి. అశేష ఆదరణకు పాత్రమయ్యాయి.
జావళీల ఆవిర్భావ వికాసాల కాలం క్రీ.శ. 1450 నుండి 1920 ప్రాంతాల దాకా సాగిందని నిర్ణయించవచ్చు. ఈ కాలంలో దక్షిణ భారత దేశమంతా అధిక ప్రాచుర్యాన్ని పొంది, బ్రిటిష్ పాలకుల్ని సైతం ఆనంద పరవశుల్ని గావించిన ‘జావళీ’ 20వ శతాబ్ది ప్రాంతంలో ఆనాటి ఉదాత్తతనీ, ఔన్నత్యాన్నీ కోల్పోయి సరైన స్థానం లభించక పోవడంతో సినీ గేయ రచయితల చేతిలో పడి వేశ్యలు పాడే గీతాలలో చోటు సంపాదించింది.
దీని ప్రభావం పరిశోధకులపై పడింది. జావళీలు అనగానే కేవలం వేశ్యల కోసం రాసిన గీతాలుగా రూఢి అయిపోయాయి. జావళీ రచయితలు అదృశ్యం అయిపోయారు. ప్రజానురంజకంగా ఉండేడట్లుగా జావళీని ఆధునిక కవులు మార్చి వేశారు.
ప్రారంభంలో జావళీ ప్రభావంతోనే సినీ పాటల రచన ప్రారంభమయింది. జావళీలలో గల స్వర కట్టును అనుసరించి తెలుగు, తమిళ సినిమాలలో పాట ప్రవేశించింది.
తెలుగు సినిమాలలో ప్రారంభ దశలో జావళీల్ని అనుసరిస్తూ రాసిన కొన్ని సినిమా పాటలున్నాయి. ఉదాహరణకి:
- “సరసము లాడేటందుకే” హిందుస్థాని కాఫి రాగంలో గలజావళీకి అనుసరణగా వెలసిన “పిలచిన బిగువట రా” అనే గీతం మల్లీశ్వరి చిత్రంలో ఉంది.
- “అపదూరుకు లోనైతినే” అనే ఖమాస్ రాగంలో గల జావళీకి అనునరణాత్మకంగా సాగిన “చాలు చాలు నవ మోహనా” అనే పాట కాళహస్తీ మాహాత్మ్యంలో ఉంది.
అలాగే తమిళ సినిమాలలో కూడా జావళీ ప్రక్రియ ప్రభావానికి లోనై చిత్ర గీతాలు వెలువడ్డాయి. ఉదాహరణకి:
- “చెలి నేనెట్లు సహియింతునే” అనేఫరజ్ రాగంలో గల జావళీకి సినిమా స్వరకట్టు “మరవనే ఎన్నాలీళుమే గిరిధారీ ఉనదెరులే‘
- “ఏల రాడాయనే” అనీ భైరవి రాగంలో గల జావళీకి సినిమా స్వరకట్టు “ఉన్నై కండు మయంగాద పేర్గళుండో”
వంటివి.
తదుపరి వచ్చిన కొన్ని సినిమా పాటలు జావళీలలో గల పల్లవి ఆధారంగా చేసుకుని సొంత సాహిత్యంతో సినీ రచయితలు రచించారు.
దాసు శ్రీరాములు గారి జావళీ –
ప॥ ఏమనెనే కోమలీ తెలుపవే నీతో ఏమనెనే కోమలి
ఈ జావళీని అనుసరిస్తూ సముద్రాల “షావుకారు” (1950) చిత్రంలో ఒక పాటను రచించారు.
“ఏమనెనే చిన్నారి ఏమనెనే
వన్నెల సిగపూవా కను సన్నలలో భావమేమె
ఆమని కోయిల పాటల
గోముల చిలికించు వలపు కిన్నెర
తానేమని రవళించెనే?
వనరుగా, చనువైన నెనరుగా,
పలుకె బంగారమై, కులుకె సింగారమై
మావాడ రాచిలుక
మౌన మౌనముగా ఏమనెనే” (5)
ఈ పాటలో “ఏమనెనే” అనే నాలుగక్షరాల ప్రశ్నను జాగ్రత్తగా వింటే, ఈ నాలుగక్షరాల ప్రశ్న నాలుగు సార్లు వస్తుంది. వస్తూ వస్తూనే, మొదటి సారి కుతూహలాన్నీ, రెండో సారి ఆందోలనని, మూడో సారి బుజ్జగింపునీ, నాలుగో సారి ఆత్రుతనీ స్ఫురింప జేస్తుంది. మనోహరంగా ఉన్న ఈ భావానికి ప్రభావం జావళీ రచనే.
“రమణిరో సముఖాన రాయబార మేటికో
నిముషమైన తాళలేను నేనే వాని రమ్మందునే”
అనే జావళీ శ్రీ దాసు శ్రీరాములు గారు రచించారు. ఆ జావళీ స్ఫూర్తితో వచ్చిన ఈ సినిమా పాటను చూడండి.
“పలుకరాదటే చిలుకా పలుకరాదటే
సముఖములో రాయబార మెందులకే”
చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై రచించిన ‘మధురా నగరిలో‘ అనే జావళీని “త్యాగయ్య” సినిమాలో కూచిపూడి భాగవతులు పాడుతూ అభినయించినట్లుగా యథాతథంగా స్వీకరించి చిత్రీకరించారు.
ఈ జావళీని “త్యాగయ్య” రెండు చిత్రాలలో పల్లవి వరకూ వాడుకొన్నారు.
అలాగే “అభిమానం” చిత్రం లోనూ, భరణి వారి “ప్రేమ” చిత్రం లోని హాస్య గీతం లోనూ, “పతిభక్తి”లో పల్లవి మినహా మిగతా పాటనూ, “సిరిమువ్వల సింహనాదం”లో రేఖా మాత్రం గానూ ఉపయోగించడం విశేషం.
“జీవిత నౌక” చిత్రంలో “మధురా నగరిలో” అనే జావళీ స్ఫూర్తితో రచింపబడిన ఒక గీతం వెలువడింది.
“చల్లలమ్మే భామనోయి
పల్లెపట్టు లేమనోయి
అత్త చాటు పిల్లనోయి
దారి విడువు కృష్ణయ్య – నా”
అంటూ డా॥ సి. నారాయణ రెడ్డి గారి రచన హృద్యంగా సాగింది.
“ఆకాశ రాజు” చిత్రంలో
“చిలుక చూడరా మిన్నులలో
ఎగిరి పోయె బాలా
జాణతనాన గడుసుదనాన
మధురా నగరిలో చల్లనమ్మ బోదు
దారి విడుము కృష్ణా కృష్ణా…”
అనే పాట. దీనితో పాటుగా వాహినీ వారి “భక్త పోతన” చిత్రంలో
“మంచి సమయము రారా ఇది
చలమేల చేసేవురా
నిన్నే కోరి నీకై నిలచితిరా
రారా కోరిక దీర మనకిది”
అంటూ బెజవాడ నాగరత్నం గారు కల్యాణి రాగంలో పాడిన ఈ పాట కూడా జావళీ ఛందస్సులోనే వెలువడింది. దీని కర్త సముద్రాల. దీనికి ఆధారభూతంగా నిలిచింది ఒక సారంగపాణి పదమే. దానిని చూడండి.
ఉదాహరణకి:
నీలాంబరి – ఆది
“రారా సామి నీకు మొక్కేరా”
ఇంకా,
“నగుమోము జూపించవా” (అమర శిల్పి జక్కన్న),
“అందెలు పలికెనులే” (భక్త పోతన),
“నడి రేయి గడిచేనే” (జయసింహ)
వంటి పలు చిత్రాలలోని పై గీతాలే సినిమాలలో జావళీ మరో రూపం దాల్చిందని చెప్పడానికి ఆధారాలుగా నిలుస్తున్నాయి.
1947లో విడుదలయిన “రత్నమాల” అనే చలన చిత్రంలో సముద్రాల గారు రచించిన ఈ గీతాన్ని చూడండి.
“మదనా నవ మదనా
స్వాగతమోయీ స్వాగతమోయీ
చిగురాకులివే బాకులివే
చిలుక హుమాయి వజీరా
వలపులతో కులుకులతో
రాజ్యమేల రావోయీ రస రాజ్యమేల రావోయీ
కన్నెల వాల్గనుల చూపులే
కలువ పూల హారాలు
మనసిజ మా మనసులే నీకు
మంగళ హారతులు గొనుమా!” (6)
ఈ పాతలోని నాయిక రత్నమాల. సౌందర్యవతి. ఈమె పేరుమీదే చిత్రానికి పేరు పెట్టారు. ఈమె సౌందర్యవతే కాదు, విద్యావంతురాలు. పదహారో వన్నె కళాస్వాదకురాలు. అటువంటి ఈ యువతి తన చెలికత్తెలలో చేరి ఓసారి మన్మథునికి పూజచేసి, “చిగురాకులివే బాకులివే హుమాయి వజీరా” అంటూ స్వాగతించింది.
కన్నెల వాల్గనులే కలువ పూల హారాలట. అతన్ని స్వాగతిస్తూ తన రాజ్యాన్ని ఏలమంటోంది. ప్రియుణ్ణి ఆకర్షించడానికి చూపే ప్రలోభాలు, స్వాగతాలు, ఆరాధనలూ ఇవన్నీ జావళీల్లో కనిపిస్తాయి. జావళీ ప్రభావంతో కవులు సుందర పదజాలంతో ఎంతో సోయగంగా రచించారు ఈ పాటని.
నాయిక అలక తీర్చడానికి నాయకుడు పడే ఆవేదన, ప్రాధేయపడే విధానాన్ని గీతాంశంగా తీసుకొన్న జావళీ అనుసరణ “శ్రీ కృష్ణార్జున యుద్ధం” అనే చిత్రంలో రూపొందించారు. “గయోపాఖ్యానం” అనే చిలకమర్తి వారి నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 1963లో విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందింది.
అలిగితివా సఖీ! ప్రియా! కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా?
లేని తగవు నటింతువా, మనసు తెలియ నెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయను చూడవా!
నీవె నాకు ప్రాణమని
నీ యానతి మీరనని
సత్యాపతి నా బిరుదని
నింద ఎరుగవా?
ప్రియురాలివి, సరస నుండి
విరహ మిటుల విధింతువా!
భరియింపగ నా తరమా,
కనికరించవా?
అనే ఈ పాటకు తోడుగా –
“నను భవదీయ దాసుని, మనంబున
నెయ్యపు కింక బూని – తా
చిన యది నాకు మన్ననయ; చెల్వగు నీ
పద పల్లవంబు – మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన
నొచ్చునందు – నే
ననియెద, అల్క మానవు గదా,
యికనైన అరాళ కుంతలా” (7)
అనే పద్యాన్ని కూడా జోడించి, సందర్భానికి, సన్నివేశానికి రస పుష్టిని తెచ్చే విధంగా చిత్రించారు. ఈ పద్యాన్ని “పారిజాతాపహరణం” కావ్యం లోంచి ముక్కు తిమ్మన్న గారి పద్యాన్ని యథాతథంగా స్వీకరించి గీతంలో కలిపి ఉపయోగించడం విశేషం.
పింగళీ నాగేంద్రరావు గారు రాసిన గొప్ప పాటలలో ఇదొకటి. అలిగిన భార్య అలకను తీర్చడానికి బతిమలాడే, బుజ్జగింపు మాటల్ని ఎంతో అందంగా ప్రయోగించారు కవి.
1963లో వచ్చిన అత్యత్భుత కళాఖండం, తెలుగు చలన చిత్ర సీమ లోనే మకుటాయ మానంగా వెలిగిన చిత్రం “నర్తనశాల”. ఈ చిత్రంలో ఒక పాటను రూపకల్పన చేశారు. విరాటుని కొలువులో ద్రౌపది, సైరంధ్రి అనే పేరుతో సుధేష్ణా దేవి దగ్గర పని చేస్తుంటుంది. ఆమె ప్రతిభ తెలుసుకొన్న సుధేష్ణ, సైరంధ్రి చేత ఒక పాట పాడించినట్లు ఈ గీతాన్ని తీశారు.
వగలెరిగిన చెలునికి నా కథ,
సఖియా వివరించవే!
నిన్ను జూచి, కనులు చెదరి
కన్నె మనసు కానుక జేసి
మరువ లేక మనసు రాక
విరహాన చెలి తానె వేగెనని
మల్లె పూల మనసు దోచి
పిల్ల గాలి వీచు వేళ
కలువ రేని వెలుగు లోన
సరసాల సరదాలు తీరెనని” (8)
“కనులు చెదరి, కానుక చేసి, విరహాన చెలి చాల వేగెనని” నాయిక విరహాన్ని చెలికత్తెతో చెప్పి, ప్రియుని స్వాగతించడం, అతని రాకకై పరితపించడం వంటి అంశాల వర్ణనలున్న ఈ గీతం, సాక్షాత్తూ జావళీ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్నదే.
విరహం, దూతికా రాయబారం, ప్రియా సమాగమం కోసం విరీక్షణ, తపన వంటి లక్షణాల ప్రధాన భూమిక తోనే జావళీలు రూపొందాయి. ఈ గీతం చాలా ప్రసిద్ధిని పొందింది.
ఇంకొక గీతం, అన్ని విధాలా జావళీ లక్షణాలున్న ఒక గీతాన్ని సుప్రసిద్ధ సినీ గీత రచయిత సముద్రాల రస రమ్యంగా రచించారు.
“నిను చేర మనసాయెరా!
నా స్వామీ! చనువార దయ చేయరా!
విడిదికి రమ్మని చాల వేడితిరా
బిడియము నీకేలరా! దొరా!
సరసుడవని నిన్నె పదిమంది పొగడ
మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా
వయసు నీ కొరకుఏ పలవరించేరా
తనువు నిన్ దలచి పులకరించెరా
మగువ కోర మొగమాట మేలరా?
బిగువు మాని జవరాలి నేలరా!
సొగసు జూచి ఎదురు కాచి నిలిచి
పగల్ రేలు దిగుల్ చెందు చెలికి” (9)
సౌందర్యాన్ని చూసి మురిసి పోయి, అంతటి సౌందర్యమూ అడవి కాచిన వెన్నెల అయిపోతోందని వగచి, నాయకుని రాక కోసం ఎదురు చూస్తూ నిలిచి పోయి, రాత్రనక పగలనకా నాయిక దిగులుతో విరహావస్థను అనుభవిస్తోంది.
ఈ జావళీని 1964లో విడుదలయిన “బొబ్బిలి యుద్ధం” అనే చిత్రంలో రూపొందించారు. ఈ సందర్భంగా “నూట పదహార్లు” అనే పేరుతో భరాగో గారు సంకలితం చేసిన సినీ పాటల పుస్తకంలో ఈ విధంగా పేర్కొన్నారు.
“రాజకీయంలో రాయబార వర్గాన్ని తంత్రజ్ఞతతో వశపరచు కోవడలో వారికి మకార త్రయాన్ని ఎరపెట్టడం బి.సి. నాటి నుండి వున్నదే. ఆ ప్రకారం గానే బుస్సీ దొర గారి మనసుని రంజింపజేయడానికి విజయ రామరాజు ఏర్పాటు చేసిన మగువ నాత్య ప్రదర్శన కోసం తయారు చేసినదీ పాట.
ఎక్కడా మిక్సింగు, గ్రహ భేదం లాంటివి లేకుండా పరిశుద్ధమైన నట భైరవి రాగంలో స్థిరపరచిన ఈ జావళీ రచన శ్రీ శ్రీ గారికి నల్లేరు మీద బండి నడకగా సాగింది.
సొగసు చూచి, ఎదురు కాచి నిలచి పగల్ రేల్ దిగుల్ చెందు చెలి అని అప్పుడో మధ్య యుగం నాటి కవులు చేసిన లాంటి ప్రయోగం చేసి శ్రీ శ్రీ గారు ఈ జావళీకి ఎంతో దర్జా తెచ్చి పెట్టారు.”
1966లో విడుదలయిన “పరమానంద శిష్యుల కథ”లో ఇంకో జావళీ ఉంది.
“కామినీ మదన రారా!
నీ కరుణ కోరి పిలిచేరా…
నాటి తొలి ప్రేమ మురిపాల తేల
నాదు జత చేరి లాలించు వేళ
నెరపిన నీ సరాగాలన్నీ
నీటిపై వ్రాతలేనా?
మోముపై కనకున్న మనలేని స్వామి
ప్రేమ విడనాడి పెడమోము లేమి?
ఏమైనా జగమ్మేమన్నా
నీకై జీవించుదాన” (10)
“కామినీ మదన రారా! పాటలో రచన, స్వర రచన – తెలుగు సినిమాలలో వచ్చిన అశేష సంఖ్యలోని జావళీలలో ఎంతో మధురం అయినా, ఆ సన్నివేశానికి వేసుకొన్న ప్రణాలిక అపురూపం. “ఆ రోజుల్లో నా ప్రేమ మురిపాలు పొందడానికి ఊహూ ఇదైపోతివే… నా మొహం చూడకండా దినం వెళ్ళదన్నావే… అదంతా నీటిమీద రాతలేనా” అంటూ రస రమ్యంగా రచన సాగిందని భరాగో వ్యాఖ్యానించారు.
అంతకు ముందు జరిగిన వాటిని ఊహించుకొని, నాయకా భావ స్థితిలో నాయిక తలబోసు కోవడం, భావ ప్రాధాన్యం కల హృదయాన్ని రంజింపజేసే లక్షణాలున్న ఒక వర్ణనాత్మక పద్ధతి జావళీలలో కనిపిస్తుంది. ఆ పద్ధతిలోనే ఈ గీత రచన జరిగింది. ఈ గీతాన్ని సముద్రాల రచించారు.
- “సమయమిది డాయర సరసుడా
సమయమిది డాయరా
తమిగొని జత గొని సరసాల తేల తగు
సమయమిది డాయరా”
(“పెళ్ళి సందడి” చిత్రంల్లో జూనియర్ సముద్రాల రచించిన ఈ గీతం)
- “మదనా సుందర నాదొరా
నా మది నిన్ను గని పొందినదిరా వన్నె దొరా”
(“గులేబకావళీ కథ” చిత్రంలో డా॥ సి. నారాయణ రెడ్డి గారు రచించిన గీతం)
- “ఓ మదనా మనసాయెరా
పరువము పొంగె తరుణము నేడె
మరి మరి నీకై రాబోదురా”
(“పూజాఫలం” చిత్రంలో డా॥ సి.నా.రె. గారు రచించిన గీతం)
- “రారా కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేనురా”
(“పిడుగు రాముడు” చిత్రంలో డా॥ సి.నా.రె. గారు రచించిన గీతం)
- “రారా ప్రియా! సుందరా!
కౌగిలిలో నిన్ను కరిగింతురా!”
(“భక్త ప్రహ్లాద” అనే 1967లో వచ్చిన దాశరథి గారి గీతం)
- “అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ”
(“అమర శిల్పి జక్కన్న” – దాశరథి గారి గీతం)
- “అందని సుర సీమ నీదేనోయి
అందరు ఆశించు అందాల హాయి
అందించే నెరజాణ నోయి”
(“భక్త ప్రహ్లాద” – సముద్రాల జూనియర్ గీతం)
- “మగరాయా వలరాయా
ఈ వయారి నీ సొమ్మురా”
(“రహస్యం” – మల్లాది రామకృష్ణ గారి గీతం)
(“విప్రనారాయణ” చిత్రం)
లోని గీతాలు జావళీ ప్రభావంతోనే వెలువడ్డాయి.
ఈ విధంగా జావళీలు, సినిమాలలో – ప్రారంభంలో జావళీ ఛందస్సులో, జావళీ స్వరకట్టులో ఆరంభమై జావళీల పల్లవిని తీసుకుని, ఆ పిమ్మట జావళీలలో గల ప్రేమ యితివృత్తంగా తీసుకుని రచింపబడ్డాయి. కాలక్రమంగా ఆ స్థితి కూడా దాటి జావళీ తన పూర్తి స్వరూపాన్ని పోగొట్టుకొని “మంచి పేరూ, చెడ్డ పేరూ” వీటికి అతీతంగా చేరుకోలేని తీరాలకు వెళ్ళి కనుమరుగై పోయింది.