తెలుగు సాహిత్యం – సంగీత ప్రశస్తి telugu sAhityam – sangIta praSasti

దక్షిణ భారతీయ భాషలలో ఉన్న అన్ని సంగీత ప్రక్రియలలోని రచనలను పరిశీలిస్తే, తెలుగులో ఉన్నన్ని రచనలు మిగిలిన మూడు భాషలలో రచనలన్నీ కలిపినా అంతకెక్కువగానే కనిపిస్తాయి. మొట్టమొదట ‘ పదం ‘ రచించినవాడు తెలుగువాడు. ‘ కీర్తన ‘ రచించినవాడు తెలుగువాడు. ‘ సంకీర్తన ‘ రచించినవాడు, ‘ భజన ‘ సంప్రదాయానికి నాంది పలికినవాడు, ‘ జావళి ‘ రాసినవాడు కూడా తెలుగువాడే. ఇలాగే ఎన్నో సంగీత ప్రక్రియలు కర్ణాటక సంగీతానికి అందించినది తెలుగువారు. 

తెలుగు సాహిత్యంలో సంగీతం గురించిన ప్రస్తావన 13వ శతాబ్దపు చివరి కాలం నుంచి కనిపిస్తోంది. 13వ శతాబ్దపు చివరి భాగంలో పాల్కురికి సోమనాథుడు తన ‘ పందితారాధ్య చరిత్ర ‘, ‘ బసవ పురాణాల ‘లో సంగీతం గురించి మిక్కుటంగా చెప్పాడు. ఆనాటి సంగీత సంప్రదాయాన్ని తెలుసుకోవడానికి, తెలుగువారి సంగీతజ్ఞతను పరిశీలించడానికి ఆయన పేర్కొన్న వివరాలు ఎంతో ఉపకరిస్తాయి. ఆయన ఆనాడు ప్రజలు పాడుకొనే పాటలను పేర్కొన్నాడు.

పండితారాధ్య చరిత్రలో –


” పదములు తుమ్మెద పదముల్ ప్రభాత
పదములు, పర్వత పదము లానంద
పదములు, శంకర పదముల్ నివాళి
పదములు, కామేశు పదములు గొబ్బి
పదములు, వెన్నెల పదములు, సెజ్జ
వర్ణనమతిగణ వర్ణన పదము
లర్ణన ఘోషణ ఘార్ణిల్లుచుండ
పాడుచు నాడుచు పరమహర్షమున “


అని అన్నాడు. ఇన్ని రకాల పదాలు ఆనాడు వాడుకలో ఉండేవి. ఉందులో కొన్ని ఈనాడూ ఉన్నాయి. ఈ పాటలనే లాక్షణికులు పదాలనీ, ప్రబంధాలనీ, ఏలలనీ అనేక పేర్లతో పిలిచేవారు. సామాన్యార్థంలో అవి ప్రబంధమయినా, పదం అయినా, ఏల అయినా, అన్నీ పాటలే!


అందుకే వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ‘ ఊగునప్పటి యేల – ఊయల; జోగునప్పటి ఏల – జోల ‘ అన్నారు.

కృత సంశబ్దనే – అంటే కీర్తించునది
కీర్తనం సమ్యక్ కీర్తనం – సంకీర్తనం
గీయతి ఇతి – గీతం లేదా గేయము అని వ్యాకరణం.

పాల్కురికి సోమనాథుడు తన బసవ పురాణంలో మార్గ, దేశి సంగీత విభజన పేర్కొన్నాడు. సప్త స్వరాలను, 22 శృతులను పేర్కొన్నాడు. పండితారాధ్య చరిత్రలో 108 రాగాలను పేర్కొని వాటిని సాంగ, దేశాంగ, క్రియాంగ, ఉపాంగ, రాగాంగ రాగాలుగా విభజించాడు. స్త్రీ, పురుష, నపుంసక విభజన కూడా చేశాడు. షాడవ, ఔడవ విభజన కూడా చేశాడు.


తరువాత కవులలో పింగళి సూరన తన కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం – రెండింటిలోనూ సంగీత శాస్త్ర సంకేతిక పదాలను ఉపయోగించాడు. ముక్కు తిమ్మన, రామరాజ భూషణుడు, అల్లసాని పెద్దన, శ్రీకృష్ణ దేవరాయలు, శ్రీనాథుడు మొదలైన కవులంతా వారివారి కావ్యాలలో సంగీత శాస్త్రాన్ని అంతో ఇంతో స్పృశించారు. దీనివల్ల తెలుగువారి సంగీతజ్ఞత, సంగీత ప్రియత్వమే కాకుండా తెలుగు నాట ఆనాడు ఉన్న సంగీత సంప్రదాయం కూడా మనకు తెలుస్తోంది.

సంగీత శాస్త్రానికి కూడా తెలుగువారు ఇతోధికంగా సేవ చేశారు. ఇప్పుడు మనకి లభ్యమౌతున్న లక్షణ గ్రంథాలలో కనిపించే కనీసం 15గురు సంగీత శాస్త్ర లాక్షిణికులను పేర్కొనాలి. 14వ శతాబ్ది నుంచి నేటి వరకు ఎన్నో musiological మనకు తెలుగువారు రచించినవి కనిపిస్తాయి.పైన పేర్కొన్న విధంగా భారతీయ సంగీత శాస్త్ర వికాసానికి ఆంధ్రులు అంతగానో దోహదం చేశారు. వారిలో – 

1.  జాయప సేనాని  13వ శతాబ్దం  నృత్తరత్నావళి
2.  శార్ఙ్గ దేవుడు 13వ శతాబ్దం  సంగీత రత్నాకరం
3.  సింహభూపాలుడు    14వ శతాబ్దం  సంగీత సుధ (సంగీత రత్నాకరానికి వ్యాఖ్య)
4.  హరిపాల దేవుడు  14వ శతాబ్దం  సంగీత సుధాకరం
5.  విద్యారణ్యులు  (వేంకటమఖి మేళకర్తజన్య
రాగ పద్ధతికి అంకురార్పణ చేసినది వీరే)
14వ శతాబ్దం  సంగీత సారము
6.  కుమారగిరి వసంత రాజు  14వ శతాబ్దం  వసంత రాజీయం – నాట్య శాస్త్ర గ్రంథం
7.  పెదకోమటి వేమారెడ్డి  15వ శతాబ్దం  సంగీత చ్హింతామణి
8.  గోపేంద్ర తిప్ప భూపాలుడు  15వ శతాబ్దం  తాళదీపిక
9.  చతురకల్లి నాథుడు  15వ శతాబ్దం  కళానిధి అనే సంగీతరత్నాకరానికి వ్యాఖ్య
10.  అన్నమాచార్యులు  15వ శతాబ్దం  సంకీర్తన లక్షణము
11.  బండారు లక్ష్మీనారాయణ  16వ శతాబ్దం  సంగీత సూర్యోదయం
12.  చెరుకూరి లక్ష్మీధరుడు  16వ శతాబ్దం  రాగ లక్షణ వివేకం 
13.  రామామాత్యుడు  16వ శతాబ్దం  స్వరమేళ కళానిధి 
14.  చతుర దామోదరుడు  16వ శతాబ్దం  సంగీత దర్పణం
15.  అహోబిల పండీతుడు  17వ శతాబ్దం  సంగీత పారిజాతం
16.  సోమనాథుడు  17వ శతాబ్దం  రాగవిబోధ

మొదలైనవారు ముఖ్యులు.

తెలుగున ఈనాడు మనకు లభ్యమైన రచనలనుబట్టి చూస్తే, క్రీ.శ. 13వ శతాబ్దానికి పూర్వభాగంలో (1268-1323) వర్ధిల్లిన కృష్ణమాచార్యుని సింహగిరి నరహరి వచనాలే తొలి వచన సంకీర్తనలు. భగవద్రామానుజులు సంస్కృతంలో రాసిన గద్యత్రయం (శ్రీపతి గద్య – వైకుంఠ గద్య – శ్రీరంగ గద్య) యొక్క ప్రభావం ఈయన వచన రచనలో మనకు కనిపిస్తుంది. ఈయన రెండవ ప్రతాప రుద్రుని (1254-1323) కి సమకాలికుడు. ‘సింహగిరి నరహరీ నమోనమో దయానిధీ’ అన్న మకుటంతో నాలుగు లక్షలకు పైగా వచనాలను రచించాడు. అన్నమయ్య తమ పూర్వ వాగ్గేయకారులలో ఇద్దరినే పేర్కొని ప్రశంసించారు. ఒకరు ఈయన, రెండవవాడు ‘గీతగోవిందం’ రాసిన జయదేవుడు.

“ధర కృష్ణాచార్యాదిక
పరికల్పిత పదము తాళ బంధచ్ఛందో
విరహితమై చూర్ణాఖ్యం
బరుగు నినిర్యుక్తనామ భాసితవగుచున్”
(సంకీర్తనల లక్షణము – 54)

ఈయన రచనలను చూర్ణపదాలని కూడా అంటారు. వీటి ఆధారంగానే తరువాత తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుడు ‘వేంకటేస్వర వచనాలూ వెలయించాడు.

కృష్ణమాచార్యులు రాసినట్లు చెప్పబడుతున్న నాలుగు లక్షల వచనాల్లో, మన దురదృష్టం కొద్దీ అవాళ మనకు వంద కూడా దొరకలేదు. దొరికిన వచనాలలో ఒకదానిలో ఆయన ఇలా రాశారు.

‘ …. నీ జపంబు చేసి తారణ నామ సంవత్సర భాద్రపద మాసంబున కృష్ణపక్షము గురువారము దినమందున 14 ఘడియల మీదట శ్రీ మధ్యాంత నే పొడగంటినో దేవా…’ అని

అంటే, 1284 ఆగష్టు లేదా సెప్టెంబరు 7న, వారికి స్వామి సాక్షాత్కారం అయింది. అప్పటికి వారి వయస్సు 16, అంటే ఆయన 1268 లో జన్మించి ఉండాలి.

తాళపత్ర ప్రతులను బట్టి చూస్తే, ఈయన తన రచనలను ధ్యాన సంకీర్తనలనీ, నామ సంకీర్తనలనీ, వేదాంత సంకీర్తనలనీ విభజించినట్లు తెలుస్తోంది. ఆయన వచనాలలో ఒకటి చూద్దాం –

“దేవా! విష్ణు భక్తిలేని విద్వాంసుని కంటే
హరి కీర్తనము సేయునతడె కులజుండు
శ్వపచుండైన నేమి – ఏ వర్ణంబైన నేమి
ద్విజుని కంటె నతడె కులజుండు – ద్రిష్టించి చూడంగ
విద్వజ్జన వైభవ దివ్య భూషణము
సింహగిరి నరహరిం దలచిన యతడె కులజుండు
చతుర్వేద షట్ శాస్త్రముల్ సదివిన నేమి
సకల ధర్మంబులు సేసిన నేమి
మా సింహగిరి నరహరి దాసులకు దాసులైనం గాని
లేదు గతి
స్వామీ! సింహగిరి నరహరీ! నమోనమో – దయానిధీ!”

అన్నమాచార్యుల వారి –

‘ ఏ కులజుడైననేమి అవ్వడైననేమి
ఆకడ నాతడె హరి నెరిగిన వాడు ‘

దీనిపై కృష్ణమాచార్యుల వారి వచన సంకీర్తన ప్రభావం కనబడుతోంది. ఈయన వచన రచనలన్నీ ప్రధానంగా భక్తిని ప్రవచించినవే!
ఇంకొకటి చూడండి —

దశరథాత్మజ రామా రామా
ధన్య చరిత్ర రామా రామా
భరతారగజ రామా రామా
పంకజేక్షణ రామా రామా
మిత్ర తేజా రామా రామా
సుమిత్ర వరదా రామా రామా
నందితాత్మజ రామా రామా
నందితాభరణ రామా రామా
మానసింధూ రామా రామా
దీనబంధూ రామా రామా!

త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తనలపై కృష్ణమాచార్యుల వారి రామ వచనాల ప్రభావం ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. కృష్ణమాచార్యుల వచనాలు, ఆనాడు ప్రసిద్ధమైన అన్ని వైష్ణవాలయాలలోను పఠింపబడుతూండేవి. తిరుమలపై వీరి కీర్తనలు పాడబడుతూ ఉండేవి అనడానికి అన్నమయ్య చరిత్రలో ఈ కింది విషయమే తార్కాణం.

ఆడుచు పతకమాకన్నలు
జోల పాడంగ నాడెల్ల పరిబిడ్డనైతి
ఆ కృష్ణమాచార్యు ఆధ్యాత్మ
వినుతి రాకగన్నాళ్ళు విరక్తుడనైతి

తొలి వచన సంకీర్తనాచార్యునిగా భజన సంప్రదాయానికి ప్రపితామహునిగా తెలుగునాట తొలి వాగ్గేయకారునిగా కృష్ణమాచార్యులు కీర్తి వహించాడు. ఆయన అటు సంగీత రచనలలోనూ ఇటు సాహిత్యంలోనూ తన ప్రభావాన్ని తరువాతి వారిపై చూపించాడు.
అన్నమయ్య ముందు కృష్ణమాచార్యునికి నడుమ ఏవో ఒకటి రెండు రచనలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా సరిగా కాల నిర్ణయం చెయ్యడానికి వీలు లేకున్నాయి. 14వ శతాబ్దంలో నాచన సోమునిదని చెప్పబడే ‘వీణా గానము వెన్నెల తేటా’ అనే రచన జాజర పాటగా పేరు పొందింది.

ఏగంటి వారి పదాలలో ‘శివ శివ యన మేలు తుమ్మెదా’ అనే తుమ్మెద పదం ఒకటి కానవస్తోంది. ‘ సూర్య సోమా వహ్ని నడుమా – శౌర్యమానే చిలుకా గంటి ‘ అనే ఏల ఒకటి. ఇవి గార్లపాడు లక్ష్మయ్య గారివని విమర్శకుల అభిప్రాయం. ఈయన అన్నమయ్యకు సుమారుగా సమకాలీకుడంటున్నారు.

కర్ణాటక సంగీతానికి పదం – సంకీర్తన – భజన సంప్రదాయం అందజేసిన వారు తాళ్ళపాక పద కవిత్రయం వారు. ఒక రెండు వందల సంవత్సరాల కిందటే అన్నమయ్య ప్రపంచానికి తెలిసి వుంటే కర్ణాటక సంగీత చరిత్ర పూర్తిగా తిరిగి రాయబడి ఉండేది.

32,000 పైగా సంకీర్తనలు రచించిన అన్నమయ్య – ‘ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షింపగా, తక్కినవి భండారాన దాచియుండనీ’ అని తన కాలంలో రాగి రేకులపై అవి చెక్కించి శ్రీ వేంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలోనే సంకీర్తనల భండారంలో అవి దాచి ఉంచుటచేత, ఆయన రాసిన 32,000లలో మనకీనాడు 14,328 పదాలు మాత్రమే దొరుకుతున్నాయి.
కొన్ని రేకులు అహోబిలానికి, మరికొన్ని తంజావూరు వరకు తరలి పోయాయని చెబుతారు. కొన్ని రేకులు తస్కరించబడ్డాయంటారు. రాగం విని కరిగిపోలేని జాతి రాగి కరిగించుకున్నది అంటారు.

కృతి, కీర్తన అని నేడు పిలవబడుతున్న సంకీర్తనలను అన్నమాచార్యులు ఆనాడు పదమని, సంకీర్తనని అన్నారు. అన్నమాచార్యుల వారి రచనలలో భక్తి, ముక్తి, రక్తి, ఉత్కృష్టమైన శృంగారం, పరమోత్కృష్టమైన ఆధ్యాత్మిక చింతన, విపరీతమైన వైరాగ్యం, నిష్పక్షపాతమైన సామాజిక స్పృహ, మనసును కదిపెడి మానవత్వం కనిపిస్తాయి. జానపద రీతులు గోచరిస్తాయి. జానపద భాషలు వినిపిస్తాయి. శాస్త్రీయత స్పందిస్తుంది. తెలుగుననే కాక సంస్కృతంలో కూడా అన్నమయ్య సుమారు 100 పదాలు, మనకు దొరికిన వరకూ రాశారు.

అన్నమయ్య భక్తి పారవశ్యం ఎటువంటిదంటే అతడు వేంకటేశ్వరుడైనా, వేణుగోపాలుడైనా, ఆంజనేయుడైనా, అహోబిల నరసింహుడైనా, రాముడైనా, శ్రీరంగ విఠలుడైనా అందరూ ఆయనకు వేంకటేశ్వరులే. సంగీతం దృష్ట్యా చూస్తే పల్లవి చరణంగా విచ్ఛేదన చేసి ఒక సంగీత ప్రక్రియను కర్ణాటక సంగీతానికి అందించిన మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య.

అందుకే ఈయనను పదకవితామహుడని, సంకీర్తనాచార్యుడని, హరికీర్తనాచార్యుడని, శాస్త్ర్రకారులు అంగీకరించారు. ఆయన రచనలలో జాజరలు, చందమామ పదాలు, కోవెల పదాలు, చిలుక పాటలు, తుమ్మెద పదాలు, లాలి, సువ్వి, గొబ్బి, ఉయ్యాల, జోల, మేల్కొలుపులు, నలుగులు, దంపుళ్ళు, గుజ్జన గూళ్ళు, మంగళ హారతులు, అల్లోనేరేళ్ళు, తందనాలు, వెన్నెలలు ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి.

తాళ్లపాకవారి సంగీతంలో వారు అనేకమైన అపురూప రాగాలు వాడారు. వారు అంటే అన్నమయ్య, పెద్ద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు. వారు వాడిన అపురూప రాగాలు ఆబాలి, అమరసింధు, కొండ మలహరి, తెలుగు కాంభోజి, దేశాలం, ముఖారి, పంతు, భౌళి రామక్రియ.

పాల్కురికి సోమనాథుడు పేర్కొన్న 108 రాగాలలో వారు 20 మాత్రమే ప్రయోగించారు. అవి కన్నడ గౌళ, గుండక్రియ, కాంభోజి, దేశాక్షి, దేశి, ధన్యాసి, నాట, భూపాళం, భైరవి, భౌళి, మలహరి, మాళవి, గౌళ, మాళవశ్రీ, రామక్రియ, లలిత, వసంత, శంకరాభరణం, శ్రీరాగం, సాళంగనాట, గుజ్జరి. ఈనాడు ప్రఖ్యాతిలో ఉండి వారు వాడని కొన్ని ముఖ్య రాగాలు మోహన, కల్యాణి, ఆనంద భైరవి, ఖరహరప్రియ మొదలైనవి.

అన్నమయ్య ప్రయోగించినవి, ఈనాడు మనకు లభ్యం కానివి కొన్ని రాగాలున్నాయి. తెలుగు కాంభోజి, కొండ మలహరి, ద్రావిడ భైరవి, దేశాళం, అమరసింధు, రాయగౌళ, సారణి మొదలైనవి. వారి సంకీర్తనల లక్షణం ఈనాడు మనకు లభ్యం కాలేదు. కాని చిన్నన్న తెలుగు సంకీర్తన లక్షణాలని బట్టి అన్నమయ్య వృత్త పదం, నిబంధన పదం, చూర్ణ పదం అని పదాలను మూడుగా విభజించాడని తెలుస్తుంది.

యతి ప్రాసలు, గురు లఘు నియమం, దేశీ, మార్గ తాళాలు, దరువులు, జక్కుల రేకులు, యేలలు, గొబ్బిళ్ళు, చందమామ పదాలు మొదలైన వాటిని, వాటి లక్షణాలను రాశాడు. ఆ రకంగా కర్ణాటక సంగీతంలో ఈనాడు మనం వాడుతున్న అనేక ప్రక్రియలకు మూలపురుషుడు అన్నమయ్య. కానీ ఇతని రచనలు 50 సంవత్సరాల కిందటి వరకు వెలికి రాకపోవడం వలన మౌఖిక సంప్రదాయంలో మిగిలిన ఏ కొద్ది మాత్రమో కాలగర్భంలో క్రమేణా కలిసిపోవడం వలన తరువాతి వాగ్గేయకారులు ఈయన మార్గాన్ని అనుసరించలేక పోయారని తెలుస్తుంది.

నిజానికి త్యాగరాజ స్వామి వారికి అన్నమయ్య అన్న ఒక వాగ్గేయకారుడు ఉన్నట్లే తెలిసినట్లు లేదు. ఎందుకంటే, త్యాగరాజ స్వామి భద్రాచల రామదాసును మాత్రమే తన రచనలలో పేర్కొన్నారు. తెలిసి ఉంటే అన్నమయ్యని పేర్కొనక పోవడం అసంభవం.

సంస్కృతంలో ఈనాటికీ మనం జయదేవుని అష్టపదుల తరువాత ప్రముఖంగా పేర్కొనేవి నారాయణ తీర్థుల వారి ‘ తరంగాలు ‘, సదాశివ బ్రహ్మేందుని కీర్తనలు. ఇద్దరూ తెలుగువారే. సదాశివ బ్రహ్మేందుల గురించి మనకు తెలిసినన్ని వివరాలు నారాయణ తీర్థుల గురించి తెలియడం లేదు. కొన్ని కొన్ని ఆధారాల వలన నారాయణ తీర్థుల వారు 1600 ప్రాంతం చెందినవాడని నిర్ణయించవచ్చు.
సంస్కృతంలో ‘ శ్రీ కృష్ణ లీలా తరంగిణి ‘ తో పాటు వారు ‘ పారిజాతాపహరణం ‘ యక్ష గానంగా వెలయించారు. భజన సంప్రదాయాన్ని పరిపుష్టం గావించిన వాగ్గేయకారులు వీరు. కూచిపూడి వారి నాట్య సంప్రదాయంలో ఒక నాట్యకత్తె నృత్యం చెయ్యడానికి అనువుగా వారి తరంగాలు తరతరాలుగా ఉపయోగ పడుతున్నాయి.

నృత్య నాటికకు పారిజాతాపహరణం ఉపయోగపడింది. వారి కృష్ణలీలా తరంగిణిలో 12 అంకాలున్నాయి. ఒక్కొక్క అంకం పేరు తరంగిణి. మనం ఇవాళ అనుకున్నట్లు వాటి పేరు తరంగం అని వారు ఉద్దేశించలేదు. బహుశః తీర్థులవారు పూరీ నుంచి వరహూరు వరకు చేసిన క్షేత్ర యాత్రలో ఈ గ్రంథం రాసి ఉండవచ్చు. ఒరిస్సా లోని పూరి, తమిళనాడు లోని వరహూరు వారి గ్రంథంలో గోచరిస్తాయి. మిగిలినవన్నీ ఆంధ్ర దేశంలోని పుణ్య క్షేత్రాలు.

శ్రీ కృష్ణ లీలా తరంగిణిలో 12 అంకాలున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క తరంగం. శ్రీ కృష్ణ జననంతో ప్రారంభమై రుక్మిణీ కల్యాణంతో ముగుస్తుంది. మొత్తం 156 కీర్తనలున్నాయి. ఆంధ్ర దేశంలో భజన మండలులలో జనరంజకత పొందినివి 15. అవి – 

ఏహి ముదందేహియదుకుల కాంభోజిఆది
కలయ కల్యాణికేదారగౌళఆది
కలయ యశోదకేదారగౌళఆది
కృష్ణం కల్లయసఖిముఖారిఆది
క్షేమంకురు సతతమసావేరిఆది
గోవింద ఘటయాకాంభోజిఝంప
గోవిందమిహ గోపికానందమధ్యమావతిఆది
జయజయ గోకులబాలకురంజిఆది
నందగేహినీద్విజావంతిఆది
పూరయ మమకామంబిలహరిఆది
బాలగోపాల కృష్ణమోహనఆది
బాలగోపాల మాముద్ధరమోహన (యరేగుత్తి?? రేవగుప్తి?? )ఆది

మొదలైనవి.

ఈ 156 కీర్తనలకు మొత్తం 36 రాగాలు ప్రయుక్తమయ్యాయి. మంగళ కాపి అనే అపూర్వ రాగం ఒకటి కనిపిస్తుంది. ఆహిరి, మంజరి, ద్విజావంతి, కర్ణాటక సారంగ, గౌరీ రాగాలలోని తరంగాలు ప్రశస్త రచనలని విమర్శకుల అభిప్రాయం.

నారాయణ తీర్థులవారి పారిజాతాపహరణం ప్రాయికంగా యక్షగానం. ఇది ఒక 50 సంవత్సరాల క్రితం తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయంలో దొరికింది. మేలట్టూరు భాగవతుల వద్ద కూడా దీని తాళపత్రం ప్రతి ఒకటి ఉన్నది. నాట్య సంగీతానికి అనువైన తొలి రచనగా దీనిని మనం అంగీరికరించ వచ్చునేమో!

తరువాతి వాగ్గేయకారుడు సదాశివ బ్రహ్మేంద్రుడు. Prof. V. Raghavan గారు 11.1.1970 ‘ హిందూ ‘ లో సదాశివ బ్రహ్మేంద్రుల గురించి రాసిన వ్యాసంలో ఇలా అన్నారు. “Like Narayanatirtha, Brahmendra as he is sometimes referred to, was Telugu and his surname (ఇంటి పేరు) was Moksham and general name Sivarama”

ఈయన సంస్కృతంలో రాసిన 23 పాటలు ఈనాడు మనకు లభ్యం అవుతున్నాయి. వీటన్నిటికీ రాగాలు పేర్కొనబడ్డాయి. ముఖంగా ప్రచారంలో ఉన్నాయి.

మానస సంచరరేనవరోజుఆది
భజరే గోపాలంకల్యాణి 
స్మరవారం వారంకాపి 
గాయతి వనమాలికుంతలవరాళి 
క్రీడతి వనమాలిసురటి 
భజరే తదునామంసావేరి 
పిబరే రామరసంజంఝూటి 
భజరే రఘువీరంమోహన 
చేతః శ్రీరామంసురటి 
ఖేలతి మమహృదయంఅఠాణ 

సురటిలో ఉన్న మరో ముఖ్యమైన కీర్తన ‘తురంగ తరంగే గంగే’. ఈయన పాటల్లో నిర్గుణ తత్వాన్ని ఆరాధించేవి.

ఖేలతి బ్రహ్మాండే భగవన్ ఖేలతి పిండాండేతోడి
స్థిరతారహింసహిరే మానసధరసరి
చింతానాస్తికలకాంభోజి

వీరి కీర్తనలలో ‘ పరమహంస ‘ ముద్ర గోచరిస్తుంది. సంగీతమూర్తి త్రయంలో ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితులవారు, త్యాగరాజ స్వామి పారిపై వీరి ప్రభావం గోచరిస్తుంది. జీవన్ముక్తుడైన ఒక మహా వాగ్గేయకారుడు సదాశివ బ్రహ్మేంద్రులవారు.

యోగులు వాగ్గేయకారులు కావడం, వాగ్గేయకారులై మొదట తరువాత యోగులు కావడం భారతీయ సంగీత సంప్రదాయంలో తరచు కనిపిస్తుంది. అలాంటి వారిలో సిద్ధేంద్రయోగిని కూడా మనం ఇక్కడ ప్రసక్తి చేసుకోవాలి.

నాట్యం పంచమ వేదమని ఒక వంక అంగీకరించినా, నాట్యం చేసేవారిని నటవిట నాయకులని సంఘంలో చులకనగా చూడడం ఒకనాటి సంప్రదాయం. ధనికుల భోగ లాలసతకు లోనై పవిత్రమైన కళ దిగజారితున్న రోజుల్లో దాన్ని పునరుద్ధరించి పునర్నిర్మించినవాడు సిద్ధేంద్ర యోగి.

నాట్య కళను వేదంలాగానే పురుషులకు, బ్రాహ్మణులకు పరిమితం చేసిన సిద్ధేంద్రుడు సుమారు 17వ శతాబ్దానికి చెందినవాడై ఉండాలి. ఆయన రచించినదే భామాకలాపం. మధుర భక్తికి నిదర్శనమైన ఈ నృత్య నాటిక ఈ నాటికీ కూచిపూడివారు ప్రదర్శించే ముఖ్యమైన ప్రక్రియ.

అందులో కర్ణాటక సంగీతానికి పతాకాయమానమై , తరువాతి వారికి మార్గదర్శకమైన కొన్ని రచనలు కనిపిస్తాయి. ఆహిరి రేగుత్తిలో భామనే సత్యభామనే – ఇప్పుడు కొందరు దీన్ని ఆనంద భైరవిలో పాడుతున్నారు.

సిద్ధేంద్ర యోగి ఈ కలాపంలో దరువులు, కందార్ధలు, వెన్నెల పదాలు, లేఖ ఎన్నో ప్రయోగించాడు. ముఖ్యంగా సత్యభామ శ్రీకృష్ణునికి రాసిన లేఖ తరువాత ఎందరో రచించిన లేఖలకు మూలం.

వరుస క్రమంలో తరువాతివాడు కంచెర్ల గోపన్న అనబడే భద్రాచల రామదాసు (1620-80). అన్నమయ్య తొలి పదకర్త అయినా, ఆయన పదాలు వెలికి రాలేదు. ఆ పదకర్త (తెలుగులో) కనీసం పంతువరాళిలో ‘ఎన్నగాను రామభజన…’ (missing text?)

సంగీతం దృష్ట్యా చూస్తే మొట్టమొదటి సారిగా ఆనందభైరవి రాగాన్ని ఉపయోగించిన వాడు రామదాసు. ఆనందభైరవి ప్రత్యేకంగా ఆంధ్రుల మనసుకు నచ్చిన రాగం. ఎక్కువగా ఉపయోగించిన రాగం. క్షేత్రయ్య కూడా ఆనందభైరవిని ఎక్కువగా వాడాడు. బహుశః ఇది తొలుత ఆంధ్ర భైరవి ఏమో, తరువాత ఆనందభైరవి అయిందేమో అంటున్నారు రజనీకాంతరావు గారు.

రామదాసు కీర్తనలలో ఆనందభైరవి రాగంలో ప్రసిద్ధమైనవి:

పలుకే బంగారమాయెనా కోదండపాణి
ఎటుబోతివో రామ
రామునివారము మాకేమి విచారము
కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము
తెలితకనే మోసపోతిని
ఎందుకు కృప రాదు
రామనామమే జీవనము
రామా నీచేతేమి కాదుగా

రామదాసు – ఆహిరి, వరాళి, ధన్యాసి, సౌరాష్ట్ర, యదుకుల కాంభోజి, సైంధవి, సురటి, నాదనామక్రియ, కల్యాణి, శంకరాభరణం, పున్నాగవరాళి, పంతువరాళి, గౌళి పంతు, బిలహరి, ముఖారి, సావేరి, అసావేరి, నవరోజు, నీలాంబరి మొదలైన రాగాలలో కీర్తనలు వెలయించాడు. ఇవికాక హిందుస్థానీ రాగాలు కొన్ని ఈయన రచనల్లో కనిపిస్తాయి. కాపీ, కమాసు, దర్బారు, బేగడ, కానడ, యమునా కల్యాణి మొదలైనవి.

“రామదాసు భజన కీర్తనలు లేని భజన కూటం గాని, భజన కూటం లేని రామ మందిరం గాని, రామ మందిరం లేని గ్రామం గాని ఆంధ్ర దేశంలో కనబడదు” అన్నారు రజనీకాంతరావు.

తెలుగులోనే కాక సంస్కృతంలోనూ రామదాసు రచనలు 5,6 కనిపిస్తున్నాయి. నవరోజులో రెండు – 1. భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం, 2. భజరే మానస రామం భజ భజరే జగదభిరామం; రేగుత్తిలో – వందే విష్ణుం దేవం అశేష స్థితి హేతుం; సావేరిలో – కలయే గోపాలం కస్తూరి తిలక సుఫాలం వంటివి నారాయణ తీర్థుల వారి తరంగాలను గుర్తు చేస్తాయి.

ఈ నాటికీ భజన సంప్రదాయంలో రామదాసు కీర్తనలు ఆంధ్ర దేశంలో అనేక చోట్ల వినిపిస్తాయి. అందులో కొన్ని – 

తారక మంత్రము కోరిన దొరికెనుధన్యాసిఆది
తక్కువేమి మనకూనాద నామ క్రియఆది
ఏ తీరుగ నను దయ జూచెదవోనాదనామక్రియఆది
గరుడ గమన రారాయమునా కల్యాణిఆది
శ్రీ రామ నీనామ మేమి రుచిరాగౌలి పంతుఆది
సీతారామ స్వామీ నే చేసినసావేరిఆది
ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనకాంభోజిఆది
నను బ్రోవమని చెప్పవెకల్యాణిఆది

మొదలైనవి. వీరి రచనల్లో ముఖ్యంగా పేర్కొనదగిన దండకం ఒకటి గొప్ప రచన.

‘పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో’

రామదాసు రచనల్లో కనిపించే కరుణ, వినిపించే గుండె లోతుల్లోని భక్తి ఆయనకు వాగ్గేయకారుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. త్యాగరాజస్వామి వారు రెండు మూడు చోట్ల భద్రాచల రామదాసుని ప్రస్తుతించడం కనిపిస్తుంది.

శ్రంగార పద వాఙ్మయంలో దారి చూపినవారు తాళ్ళపాక కవులైనా, అగ్ర స్థానం సంపాదించినవాడు క్షేత్రయ్యేనని, ఇతడు నారాయణ తీర్థుల వారికి, రామదాసుకి సమకాలీనుడని చారిత్రకులు భావిస్తున్నారు. ధతు కల్పనలో తరువాతి వాగ్గేయకారులెందరికో మార్గదర్శకుడు క్షేత్రయ్య.

ఇవాళ కర్ణాటక సంగీత పురాగాథలెన్నో క్షేత్రయ్య పదాలలోనే ఖచ్చితమైన, నిర్దిష్టమైన రూపు దాల్చుకున్నాయి. కృష్ణా జిల్లాలో కూచిపూడి సమీపంలో మొవ్వ గ్రామానికి చెందిన వాడని కొందరు అభిప్రాయపడ్డారు.

క్షేత్రయ్య పదాలలో రసం ఏదీ? అని కొందరి ప్రశ్న. శృంగారాత్మకమైన భక్తి అంటారు కొందరు. లేదు, అందులో భక్తి లేదు కేవలం శృంగారం అని అంటారు కొందరు. అన్నింటిలోను భక్తో ముక్తో చూడడం అంత మంచిది కాదు. ఉన్నదాన్ని, ఉన్నప్పుడు, ఉన్న చోట చూడాలి.

క్షేత్రయ్య పదాలలో ఉన్నది కేవలం శృంగారం మాత్రమే. అయితే ఒక రకమైన భక్తి పేరు శృంగారం. ఒక రకమైన శృంగారాన్ని భక్తి అనవచ్చు. ఒకటి మాత్రం నిజం. క్షేత్రయ్య పండితుడు. శాస్త్రవేత్త. సంగీత మర్మాలు తెలిసిన వాగ్గేయకారుడు. ఆ కాలంనాటి వ్యక్తి రాగాలకు నిర్దిష్టమైన రూపాలు కల్పించి పదాలు పాడి కర్ణాటక సంగీతంలో నూతన అధ్యాయం ప్రారంభించినవాడు. ఇతని ముందు కాని, తరువాత కాని పదకవిత్వంలో ఇతనిని మించినవారు లేరు.

క్షేత్రయ్య ‘వేడుకతో నడుచుకున్న విటరాయుడే’ (కాంభోజి రాగం, త్రిపుట తాళం) అనే పదంలో తను ఎన్ని పదాలు రాసిందీ చెప్పాడు. క్షేత్రయ్య రాసిన మొత్తం పదాల సంఖ్య 4,500. ఇతడు మధుర, తంజావూరు, గోల్కొండ సంస్థానాలలో ఆదరింపబడి వేలకొలది పదాలు వారిపై చెప్పినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

అలాగే అనేక క్షేత్రాలు దర్శించి ఆయా క్షేత్రదైవాలపై క్షేత్రయ్య పదాలు రాశాడు. క్షేత్రయ్య పదాలలో అక్కడక్కడ అన్నమయ్య ప్రభావం ఉన్నట్లు కొందరు పరిశోధకులు చెపుతున్నారు. కానీ అది వివాదాస్పదమైన విషయం. క్షేత్రయ్య పదాలకు అలంకార శాస్త్రానికి గల సంబంధాన్ని వివరిస్తూ కొన్ని వ్యాఖ్యానాల తాళపత్ర గ్రంథాలు దొరికాయి. ఆ వ్యాఖ్యానం పేరు ‘ శృంగార రసమంజరి ‘, కర్త ఎవరో తెలియదు.

క్షేత్రయ్య పదాలను సంగీత శాస్త్ర దృష్టితో చూస్తే, రాగ స్వరూపానికి క్షేత్రయ్య ఏర్పరచిన మార్గం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అన్నమాచార్యుల వారు వాడిన కొన్ని రాగాలు క్షేత్రయ్య నాటికి అంతరించాయి.

క్షేత్రయ్య సుమారు 39 రాగాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. అందులో 6 రాగాలలో ఒక్కొక్క పదమే ఉంది కనుక 32 రాగాలే వాడారని చెప్పవచ్చు. ఎక్కువగా వాడిన రాగాలు 22. ఇందులో కాంభోజిలో 37 పదాలున్నాయి.

ముఖారిలో 22, సావేరిలో 16, తోడిలో 15, కేదారగౌళ, పంతువరాళి, ఘంటారావంలో ఒక్కొక్క దానిలో 13, మోహన, యదుకుల కాంభోజి 12, బిలహరి 11, ఆనందభైరవి, మధ్యమావతి 10, శంకరాభరణం, ఆహిరిలో 9, హుసేని, పున్నాగవరాళి, సౌరాష్ట్రలో 8, బేగడ, నవరోజు, సైంధవిలో ఐదేసి కనిపిస్తున్నాయి.

క్షేత్రయ్య పదాలలో పల్లవి, అనుపల్ల్లవి, చరణాలు ఏ రకంగా ఒకదాని తరువాత ఒకటి క్రమంగా వస్తాయో రాగవృద్ధికూడా అలా కనిపిస్తుంది. ఎత్తుగడ, నడక, స్వరసంచారం, రాగం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని మనకు అందిస్తాయి.

ఒక రకంగా చూస్తే క్షేత్రయ్య ప్రయోగించిన సైంధవి, ఆహిరి, ముఖారి, బేగడ మొదలైన రాగాలే తరువాతి వాగ్గేయకారులకు మార్గదర్శకాలయ్యాయని చెప్పవచ్చు. సాధారణంగా క్షేత్రయ్య పదాలు విలంబ కాలంలో పాడవలసినవి.

నాట్య శాస్త్రానుసారం పదాలను అభినయించడానికి తగిన రీతిలో క్షేత్రయ్య పదరచన కనిపిస్తుంది. క్షేత్రయ్య రచించినవిగా చెప్పబడుతున్న 450 పదాల్లో సుమారు 350 పదాలు లభ్యమవుతున్నాయి.

క్షేత్రయ్య అన్నమాచార్యులవలే యుగళ గీతాలలో పాడదగిన నాయికా నాయకుల సంవాద పదాలు కూడా రచించాడు. సంగీత కచేరీలలో ఈనాడు మనకు క్షేత్రయ్య పదాలు వినిపించక పోవచ్చు. కానీ నృత్య వేదికలపై కనిపిస్తున్నాయి.

రామదాసు కీర్తనలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో ఆంధ్ర దేశంలో మునిపల్లె సుబ్రహ్మణ్యం కవి (1730-80) ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు కూడా అంత ప్రాచుర్యాన్ని పొందాయి. 6 కాండల రామాయణంలో 104 కీర్తనలు ఉన్నాయి. తిరుపతి వేంకటేశ్వరునికే అంకితంగా రచింపబడిన గ్రంథమిది. అక్కడక్కడా కాళహస్తీశ్వరునిస్తోత్రం చేయడం కూడా కనిపిస్తుంది. కనుక ఈ గ్రంథకర్త ఈ ప్రాంతం వాడని తెలుస్తోంది. కొందరు ఇతను కృష్ణా జిల్లా మునిపల్లెకు చెందినవాడని కూడా అంటారు. ఇందులో 61 సంకీర్తనలకు స్వర రచన కనిపిస్తుంది. మొత్తం 31 రాగాలు ఉపయోగింపబడ్డాయి. సావేరి, శుద్ధ సావేరి, కల్యాణి, మధ్యమావతి, ముఖారి, సౌరాష్ట్ర, బిలహరి, బేగడ, సురటి, సారంగ, అఠాణ, శహనా, ఆనంద భైరవి, మాయామాళవ గౌళ, నాట, యదుకుల, కాంభోజ, నవరోజు, తోడి, దేవగాంధారి, కామవర్ధిని, గౌళ మొదలైనవి కనిపిస్తున్నాయి.

త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలలో ఆధ్యాత్మిక రామాయణంలోని సంకీర్తనలను సరిపోల్చవచ్చు. ముఖ్యంగా ముఖారిలో ‘ చేరి వినవే శౌరిచరితము గౌరి ‘, నాదనామక్రియలో ‘ రాకేందు వదన ‘ అలాంటివి. పల్లవి, అనుపల్లవిలతో పాటు ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలో ప్రాస నియమం కూడా కనిపిస్తుంది.

3 నుంచి 10 చరణాలు కనిపిస్తాయి. స్వర కల్పన, నెరవల్ మొదలైన అలంకారాలతో నిండినా, కచేరిలలో ఆధ్యాత్మిక రామాయణ సంకీర్తనలకు చోటు లేదు. అక్కడక్కడా నృత్య వేదికలపై మాత్రం ఇవి వినిపిస్తున్నాయి.

ఇవి కాక సుబ్రహ్మణ్య కవి కొన్ని పదాలు కూడా రాశాడని కొందరంటారు. ‘ మనసు నచ్చితే రమ్మనవే ‘ అనే ముఖారి రాగ పదం, ‘ చెలియ ఈ విరహ మగ్గలమాయె నెట్లోర్తు ‘ అనే ఆనంద భైరవి పదం, ఇలాంటివి కొన్ని అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఆంధ్రులకంటూ ఒక సంగీతం ప్రత్యేకించి లేదనుకునే వారికి అన్నమయ్య నుంచి ఆధ్యాత్మిక రామాయణ కీర్తనల వరకూ వచ్చిన పాటల్ని వింటే వాటికి ఒక ప్రత్యేకమైన బాణి, శైలి, తీరు ఉన్నాయని తెలుస్తోంది.

క్షేత్రయ్య తరువాత ఆ స్థాయిలో చెప్పుకోదగిన పదకర్త సారంగపాణి.

కార్వేటి నగర వాస్తవ్యుడైన సారంగపాణి వేణుగోపాల ముద్రతో 75 శృంగార పదాలు, 66 వేశ్యా విలాస దూషణలు, 46 వైరాగ్య నీతి బోధలు, 16 జానపద భాషా పదాలు రాశారు.

ఆయన పదాలలో సావేరి, కేదార గౌళ రాగాలలో రెండు హెచ్చరికలు, నవరోజులో ఒక లాలిపాట, భైరవిలో ఒక మంగళం చాలా ప్రసిధ్ధి చెందింది. ఈయన ఎక్కువగా ప్రయోగించిన రాగాలు ఆనంద భైరవి, కేదారగౌళ, శంకరాభరణం, భైరవి, గౌళిపంతు, మోహన, పంతువరాళి.

సారంగపాణి పదాలలో సంస్కృతాంధ్ర భాషలలో అతని పాండిత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

శహన రాగంలో ‘ మొగుడొచ్చి ‘ చాలా ప్రఖ్యాతి నొందిన పదం. అలాగే జంఝూటిలో ‘ అలుక చేసి పలుకడేమో ‘, ఆనంద భైరవిలో ‘ రమ్మనె ఈ మేను వాని సొమ్మనె కౌగిట చేర్చు కొమ్మనె మోవి తేనెలిమ్మనే ‘ అన్న, భైరవిలో ‘ నీ పొందు చేయక విడిచేసా ‘, మోహనలో ‘ ఎంత పేదవాడే వేణుగోపాలుడు ‘ చాలా ప్రఖ్యాతి నొందిన పదాలు. ‘ లాలించి ఊచేరు లలన లింపునను ‘ అనే లాలిపాట ‘ ఇందిరా రమణనకు ఇభరాజ వరదునకు ‘ అనే మంగళం ఆంధ్ర దేశంలో ఇప్పటికి వినిపిస్తుంటాయి.

చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది పదకర్తలను చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా గోవింద సామయ్య, కూపన సామయ్య అనే అన్నదమ్ములు కార్వేటి నగరానికి చెందినవారే. గోవింద సామి భరత శాస్త్ర కోవిదుడు. ఇతని జతిస్వరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కేదారగౌళ, నవరోజు, ముఖారి రాగాలలో ఈయన పదవర్ణాలు రాశారు. కూపనసామి రచనలలో నాటకురంజి రాగంలో ‘ ఇంత అలుక ‘ అన్న పదవర్ణం ప్రసిద్ధం.

మువ్వనల్లూరు సభాపతయ్య, మాతృభూతయ్య, చెంగల్వరాయ శాస్త్రి, సుబ్బరాయ శాస్త్రి, వీరభద్రయ్య, మేలటూరి వెంకటరమణ శాస్త్రి, పైడాల గురుమూర్తి శాస్త్రి, మారుమంచి జానకిరామయ్య, దాసు శ్రీరాములు, తుమరాడ సంగమేశ్వర శాస్త్రి, ఓగిరాల వీరరాఘవ శర్మ, ఈమని శంకర శాస్త్రి, హరి నాగభూషణం, ఆదిభట్ల నారాయణదాసు, పరిమళరంగ పదకర్త, తచ్చూరి వారు, భల్లవరపు వారు, శోభనగిరి వారు, నట్టుపల్లి వారు, ఇనుకొండ వారు, శివరామపురం వారు, బొబ్బిలి కేశవయ్య, తూము నరసింహ దాసు, వీణ గురాచార్యులు, దుర్వాసుల సోమయాజులు, వాసా కృష్ణమూర్తి – యింకా ఎందరో పేర్లు తెలియని అజ్ఞాత పదకర్తలు, పేర్లు తెలిసినా వారి రచనలు లభ్యం కాని విద్వాంసులు, రచనలతో పాటు కాలగర్భంలో కలిసిపోయిన అనేకమంది సంగీత శాస్త్ర కోవిదులు, సంగీతజ్ఞులు, వాగ్గేయకారులు కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేశారు.

వీరభద్రయ్య అంటే మేలటూరు వీరభద్రయ్య. 18వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన అనేక సంగీత ప్రక్రియల్లో రచించాడు. స్వరజతి, వర్ణం, రాగమాలిక, తిల్లానా, కీర్తనలు ఈయన రచనల్లో కనిపిస్తాయి. మొట్టమొదట స్వరజతి రచించినవాడు వీరభద్రయ్య.
వర్ణము, తిల్లానా కూడా మొదట రచించింది ఇతడే. సంగీత సంప్రదాయ ప్రదర్శనలో సుబ్బరామ దీక్షితుల వారు వీరభద్రయ్య గురించి ఇలా అన్నారు. “ఈయన త్రైలింగ్య బ్రాహ్మణుడు. తెనుగున మంచి ప్రజ్ఞ గలవాడు…” ఈయన రచనలు దేవి, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి మొదలగు దైవతలపై కనిపిస్తున్నాయి. వీరి రచనలలో ‘ అచ్యుత వరద ‘ అనే ముద్ర కనిపిస్తుంది.

ఆహిరి లో – ఓ మనసా ఏమారక శ్రీరామ నామము
ఖమాస్ లో – నీ నామ కీర్తనలే తారకమయ్యా

అనే రచనలు సుప్రసిద్ధాలు.

సుబ్బరామ దీక్షితుల వారి సంగీత సంప్రదాయ ప్రదర్శనలో,

భైరవి లో – పతిత పావన అనే కీర్తననూ,

కాపీ లో – సేవింపరమ్మా


అనే కీర్తననూ ఉదహరించారు.

ఇతని మోహన స్వరజతి Prof. Raghavan గారు తంజావూరు గ్రంథాలయం నుంచి సంపాదించి Music Academy Journal లో ప్రచురించారు. అది –

మోడిశాయ మేరగాదనీ తోడితేవే నా సామిని
ఈడులేని మరులు చెందినానని

సుబ్బరామ దీక్షితులు ఇతని గురించి రాస్తూ, ‘ నేటి కర్ణాటక సంగీతానికి మార్గదర్శి ‘ అని పేర్కొన్నారు.

ఘనం శీనయ్య (1704-1731)

మధుర రాజైన విజయ రంగ చొక్కనాథుని మంత్రి మన్నారు రంగని భక్తుడై వైష్ణవుడైన ఇతడు, మన్నారు రంగనిపై అనేక పదాలు రాశాడు. కురింజి రాగంలోని ‘ శివ దీక్షా పరురాలనురా ‘ అన్న పదం ఈయనదే! ఇతని పదాలలోని వ్యంగ్యం ఇందులో కనిపిస్తుంది. 

దర్బారులో – ‘ మగవాడని ఆడుదని ఒంటిబడి మనసు నిలుప వశమా ..’ అనే పదం ఒకటి, నీలాంబరిలో – ‘ మగవాడు వలచితేను సుఖము ..’ అనేది సంగీత సర్వార్థ సంగ్రహంలో ఉదహరింపబడ్డాయి. సాహిత్యంలో లోటు రాకుండా సంగీతానికి బిగువు తగ్గకుండా పదాలు రచించవచ్చని నిరూపిస్తాయి ఇతని రచనలు. 

పైడాల గురుమూర్తి శాస్త్రి, వేంకటముఖి తరువాతి కాలంలో గీత రచనలు చేసిన ఒక ప్రముఖ వాగ్గేయకారుడు. ఈయన్ని ‘ వేయి గీతాల గురుమూర్తి ‘ అని పిలిచేవారట. ‘ నలువది వేల రాగాల గురుమూర్తి ‘ అనేవారట. ములకనాడు బ్రాహ్మణుడైన ఈయన అనేక లక్ష్య గీతాలను రచించారు. 72 మేళకర్తలలో రచనలు చేసిన కొద్ది మందిలో ఈయన ఒకడు. ఈయన గీతాల్లో కొన్ని:

ఆనంద భైరవిపాహి శ్రీరామచంద్ర
నాటగాన విద్యా దురంధర
కాంభోజిభువనత్రయ
గౌళశ్రీ రామచంద్ర పురవాస
ధన్యాసిజయ కరుణాసింధో
నీలాంబరిజానకీరమణా
ఆరభిఆరభి రాగలక్షణ

తచ్చూరి సింగరాచార్యులవారు 1927లో ‘ గాయక పారిజాతం ‘లో కొన్నిటిని ప్రచురించారు. 

ఆయన గీతాలలో సప్త తాళాలలోని ధ్రువ, మఠ్య, రూపక, ఝంపె, త్రిపుట తాళాలు ఉపయోగించబడ్డాయి. ఈయన కృతులలో 

ధన్యాసినీరజనయన దనుజ విదళన చరణ
దేవగాంధారిస్ఫురతు తే చరణ చరణన 
మోహనసభాపతిం హృదయాంబుజే

అనేవి సంస్కృతంలో ప్రత్యక్షర రమణీయంగా కనిపిస్తాయి.

తిరుపతి నారాయణస్వామి నాయుడు:

1873-1912 మధ్య తిరుపతిలో నివసించి ఎన్నో పదాలు, జావళీలు రచించిన తిరుపతి నారాయణస్వామి నాయుడు గారిని ఇక్కడ స్మరించుకోవడం ఎంతైనా అవసరం. 

ఆయన పుష్పలతిక కీర్తన “ఇకనైనా” అనేది ఎం. ఎస్. సుబ్బలక్ష్మి గారికి మనసుకు నచ్చిన కీర్తన. మైసూరు చౌడయ్య గారు గ్రామఫోన్ రికార్డ్ ఇచ్చారు. ఆయన చేసిన జావళి ‘ వగలాడి బోధనకు వలచితివో సామి ‘ చాలా ప్రాచుర్యం పొందినది. ఆయన ముద్ర ‘ తిరుపతి పుర వెంకటేశ ‘.

హరికథా కాలక్షేపం కూడా అలవరచుకొన్న  వైణికులు, గాత్ర విద్వాంసులు, వయొలిన్ కళాకారులు వారు. అతని తల్లి కోమలమ్మ గారే ఆయనకు తొలి గురువు. కోమలమ్మ గారు త్యాగరాజ స్వామి వారి శిష్య బృందంలో వాలాజాపేట వారి ఆడబడుచు. నారాయణస్వామిగారు కొన్నకొల్ కూడా చేసేవారు. నారాయణస్వామి నాయుడు గారి రచనల్లో కొన్నే మనకు దొరుకుతాయి. అవి – 

నినువినా ఏగతిశకుంతల
నిర్గుణుడో గుణుడోమలయమారుతం
పరాకేలనాటకురింజి
ఇకనైనాపుష్పలతిక
ఎందుపోదంచుసావేరి
ఇకనెవరితోబలహంస
వినరాదాచక్రవాకం
నొసటివ్రాతశ్రీ రాగం
మోముజూపదర్బారు
మరువకవేగౌళిపంతు
నీ దర్బారురాగమాలిక (ఇందులో చంద్రకళ అనే రాగం కూడా ఉంది)
వగలాడిబేహాగ్
పాయరానిబారిచేకాపీ
బాలరో సామినిఫరజు
నీ దాసుడబేగడ

ఆయన రాసిన వర్ణాలు అసలు లభ్యం కావడం లేదు.

జావళీ రచనలో వారి రచనాపాలనం, సంగీతం మీద వారికున్న మమకారం, అధికారం కనిపిస్తాయి. ఉదాహరణకు –

బాయరాని బాళిచే భామనంపిన రావు
కాయజుని బారికి కరిగి చింతనొంది
బిగి కౌగిట చేర్తునని ప్రీతి యేల తలపవలదే

కర్ణాటక సంగీతానికి తెలుగువారి ప్రాతినిధ్యం గురించి చెప్పాలంటే – ఒక్క త్యాగరాజ స్వామి చాలు! ఈనాడు ఈ సంగీతం ఈ రూపు దాల్చుకుందీ అంటే ఆయన ఒక్కరి చలువ వలనే కదా!

త్యాగరాజు (1767 – 1847)
మొదటిసారి 1908లో వారి కృతులు ముద్రింపబడ్డాయి. 1847లోనే వారు భగవంతునిలో ఐక్యం అయ్యారు. ఏ వాగ్గేయకారునకూ ఆయనకున్నంత శిష్య బృందం ఆనాడు లేదు.

కృతికి నిర్దిష్టమైన ఆకృతిని కల్పించిన వారు త్యాగరాజ స్వామి. కృతిలోని భావానికి ప్రధాన సూత్రం పల్లవి – అనుపల్లవి. త్యాగరాజ స్వామి వారి పల్లవులు ఎంతో చక్కనైనవి. అసలు పల్లవులన్నీ మనసులో చెప్పుకుంటే చాలు ఒక చక్కని అనుభూతి కలుగుతుంది. సంగీతాన్ని ముక్తి మార్గంగా మలచింది త్యాగరాజ స్వామి. నాదోపాసన విషయంలో వారి కీర్తనలు స్మరించదగ్గవి.

బేగడలో – నాదోపాసన
ఆరభిలో – నాదసుధా రసంబును
కల్యాణ వసంతంలో – నాదలోలుడనై
చిత్తరంజనిలో – నాద తనుమనిశం శంకరం

వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ శాస్త్రాలు, తత్వ శాస్త్రాల సారం మనకు వారి కృతులలో కనిపిస్తుంది.
వివిధ క్షేత్రాలలో వీరు చెప్పినవి కూడా అజరామరమైన కృతులు.

తిరువత్తియూరులోని త్రిపుర సుందరి మీద 5 కృతులు, కోవూరు సుందరేశ్వరునిపై 5 కృతులు, నాగలాపురంలో దొంగలబారి నుండి రక్షించమని చెప్పిన దర్బారు రాగంలో ‘ముందు వెనుక ఇరు ప్రక్కల తోడై’ అనే కృతి, తిరుపతిలో ‘తెర తీయగ రాదా’ అనే కృతి గౌళిపంతులో, మధ్యమావతిలో ‘వేంకటేశ నిను సేవింపను పదివేల కన్నులు కావలెనయ్యా’ అనే కృతి, పుత్తూరులో బ్రాహ్మణునికి ప్రాణదానం చేయమని బిలహరిలో ‘నా జీవాధార నా నోముఫలమా’ అనే కృతి, కంచిలో వరదరాజ స్వామిపై స్వరభూషిణి రాగంలో ‘ వరదరాజ నిను కోరి వచ్చితి ‘ – ఇలా ఎన్నో కీర్తనలు సంగీత సాహిత్య ప్రపంచాన్ని మథించి అమృతతుల్యమైన ఆనంద పారవశ్యాన్ని లోకం అనుభవించే మహద్భాగ్యాన్ని కలిగించాయి.

ఆయన కృతులలో సగానికి పైగా రామునికి, రామాయణానికి సంబంధించినవి.

ఆయన 2,400 కృతులు రచించారని కొందరంటారు. 3,600 అని ఆచార్య సాంబమూర్తి గారు అన్నారు. దొరికినవి 700. 72 మేళకర్తలలో రచనలు చేశారు.

బహుదారి, చెంచు కాంభోజి, దీపకం, దేవామృత వర్షిణి, గంభీర వాణి, గరుడ ధ్వని, జనరంజని, కోకిల ధ్వని, మయూర ధ్వని, నభోమణి, నాదరంగిణి, నవరస కన్నడ, ఫల మంజరి, సారమతి, ఉమాభరణం, సుపోషిణి, విజయశ్రీ వంటి అపూర్వ రాగాలలో ఆయన రచనలు చేశారు.

ఇవి ప్రాచీన లక్షణ కర్తలకు కూడా తెలియనివి. కొన్ని త్యాగరాజ స్వామి వారే సృష్టించి ఉండవచ్చు. ఆయన ఘనరాగ పంచరత్నాలను బట్టి ఆయన కేవలం ఒక వాగ్గేయకారుడే కాదు, లక్షణ లక్ష్యాలను తెలిసిన విద్వాంసుడని తెలుస్తోంది.
త్యాగయ్య గారు మొత్తం 200 రాగాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. త్యాగరాజు శత వార్షిక సంచికలో శ్రీమతి కనకమ్మ గారు ఇలా రాశారు.

“ఆనాటికి ప్రచారంలో ఉన్న శంకరాభరణం, తోడి, కల్యాణి, భైరవి మొదలైన రాగాలలో ఒక్కొక్క దానిలో సుమారు 30 కీర్తనలు దొరికాయి.
ధన్యాసి, సావేరి, అసావేరి, రీతిగౌళ, దర్బారు, కేదారగౌళ, అఠాణ, ఆరభి, దేవగాంధారి, బిలహరి, బేగడలలో 10 నుంచి 20 వరకు ఒక్కొక్క రాగానికి కీర్తనలు దొరికాయి. లలితములైన సున్నిత రాగాలలో నాయకి, సారంగి, శహన, హుసేని, జయమనోహరి, శ్రీరంజని, నీలాంబరి, బలహంసలలో ఒక్కొక్క దానికి 5-6 కృతులు కనిపిస్తున్నాయి.” అంటూ త్యాగరాజు గారి సంగీత శాస్త్ర వైదుష్యాన్ని పేర్కొన్నారు.

ఇవికాక ఆనాడు నామమాత్రంగా ఉన్న కొన్ని రాగాలకు త్యాగయ్యగారు జీవం పోసి ప్రచారానికి తెచ్చారు. అవి ముఖ్యంగా ఖరహరప్రియ, హరికాంభోజి. ఈ రాగాలను పెంపొందించి రాగ విస్తరణకు అనుగుణ్యంగా చేసినవారు త్యాగయ్యగారే! ఉదాహరణకు:

కృతి – ఆరంభస్వరం
రామా నీ యెడ – షడ్జమం
రామా నీ సమానమెవరు – షడ్జమం
చక్కని రాజమార్గము – రిషభం
విడెము సేయవే – గాంధారం
రఘువీర రణధీర – మధ్యమం
పక్కల నిలబడి – పంచమం
నడచి నడచి – నిషాదం (మంద్ర స్థాయి)

తాళాలలో కూడా త్యాగరాజ స్వామివారు వైవిధ్యం పాటించారు.

తాళం – రచనలు
ఆది – 310
రూపక – 93
దేశాది – 86
చాపు – 78
జంపె – 33
త్రిపుట – 18
త్రిశ్రలఘు – 8

త్యాగయ్య గారి సంగీత రచనలలో ఎంతో వైవిధ్యం ఉంది. ఆయన కర్ణాటక సంగీతానికి విశ్వరూపమని చెప్పవచ్చు.
వారి సంగీత నాటకాలు తెలుగున తొలి రచనలు. ‘సీతారామ విజయం’ 1868లో ముద్రినంపబడినది. ఇప్పుడది లభించడం లేదు. ‘ప్రహ్లాద భక్తి విజయం’ అనే ఐదు గంటల నాటకం, ‘నౌకా చరిత్రం’ రెండున్నర గంటల నాటకం. వీటిలో రచనలు విలక్షణంగా ఉండి అలరిస్తాయి.

అలాగే ఆయన ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలు. త్యాగరాజ స్వామివారి సంగీతం తరువాతనే ‘ సంగతి ‘ సంగీతంలో చోటు చేసుకుంది. శ్రీరంజనిలో ‘ సొగసుగా మృదంగ తాళము ‘లో కృతి ఎలా రాయాలో చెప్పారు త్యాగరాజ స్వామివారు.

మొట్టమొదట కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య ప్రభావాన్ని తీసుకు వచ్చిన ఘనత కూడా త్యాగరాజ స్వామి వారికే దక్కుతుందని చెప్పవచ్చు. కుంతవరాళిలో ‘శరశర సమరైకశూర ‘ అనేది ఒక ఉదాహరణ. దివ్య నామ సంకీర్తనలతో శంకరాభరణంలో ‘ వరలీల గానలోల ‘ పూర్తిగా ఒక ఆంగ్లేయ స్వర రచనను అనుసరించి, స్వరపరిచినది అని సంగీత శాస్త్రజ్ఞులు చెపుతున్నారు.

నేనింతవరకూ చెప్పిన విషయాలలో తెలుగువారి యక్ష గానాలు గురించి ప్రస్తావించలేదు. అదొక విస్తారమైన విషయం.

అన్నమాచార్యులవారి వేదాంత పదాలను అనుకరించి కాలక్రమంలో ఎందరో తత్త్వాలు వెలయించారు. పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞాన తత్త్వాలు సంగీత కచేరీలకు పనికిరాక పోవచ్చు. కానీ వీటిలో ఎంత సాహిత్యం ఉందో అంత లేకపోయినా, కొంత సంగీతం ఉంది. దూదేకుల సిద్దప్ప రచనలు ఈ కోవకే వస్తాయి. ఆనందభైరవి, నాదనామక్రియ వీరు ఉపయోగించిన రాగాలలో ముఖ్యమైన రాగాలు. ఎడ్ల రామదాసు కీర్తనలు కొన్ని భజన మండలులలో వినిపిస్తాయి.

శ్రీ రాగంలో – ఎన్ని మాయలు నేర్చినాడమ్మా యశోద నీ కొడుకు
మాయామాళవగౌళ రాగంలో – వ్యవసాయము చేసేవారము ఈ అడవిలోన కాపురము
నాదనామక్రియలో – మాయపురంబున నున్నది చూడ మనసు
సావేరిలో – ఏమి జన్మంబేమి జీవనము

అలాగే హరికథా వాఙ్మయంలో సంగీతాన్ని ఒక ప్రత్యేక శైలిలో ఉపయోగించిన వారెందరో ఉన్నారు. ముఖ్యంగా ఆదిభట్ల నారాయణదాసు గారు.

రుక్మిణీకల్యాణంలో – లేజవ్వనంపు పసందు
రామాయణంలో – కన్నవారెంత ధన్యులో (శంకరాభరణం)
మొదలైనవి యీనాడూ వినబడుతున్నాయి.

ఆధునిక వాగ్గేయకారులెందరో ఉన్నారు. హరి నాగభూషణంగారు, పట్రాయని సీతారామ శాస్త్రిగారు మొదలైన వారెందరో! అందరిలో చివరిగా మనం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిని ప్రస్తావించాలి.

1930లో జననం, ఐదేళ్ళ ప్రాయంలోనే కచేరీ. త్యాగరాజ పరంపర. 72 మేళకర్త రాగాలలో ఒక్కొక్క కృతి చొప్పున ‘ జనకరాగ కృతి మంజరి ‘ రచించారు. తిల్లానా రచనలలో ఈ వాగ్గేయకారుడు ఒక ప్రత్యేక శైలిని అనుసరించారు. అటు సంగీత కచేరీలలోను, ఇటు నాట్య వేదికల పైన అవి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.

Leave a comment