సంగీత మాహాత్మ్యం sangIta mAhAtmyam

గీతేన ప్రీయతే దేవః

సర్వజ్ఞః పార్వతీపతిః |

గోపీపతి రనంతోపి

వంశాధ్వని వశం గతః ||

సామగీతి రతో బ్రహ్మ

వీణాసక్తా సరస్వతి |

కిమన్యే యక్ష గంధర్వ

దేవ దానవ మానవాః ||

అజ్ఞాత విషయో స్వాదో

బాలః పర్యంకికాగతః |

ఋదన్గీతామృతం పీత్వా

హర్షోత్కర్షం ప్రపద్యతే ||

వనేచర స్తృణాహార

శ్చిత్రం మృగ శిశుః పశుః |

లుబ్దోలుబ్దక సంగీతే

గీతేత్యజతి జీవితం ||

తస్య గీతస్య మాహాత్మ్యం

కే ప్రశంసితు మీశతే |

ధర్మార్థ కామ మోక్షాణాం 

ఇదమేవైవ సాధనం || (సంగీత రత్నాకరము)

సర్వజ్ఞుడైన పరమశివుడు సంగీతంలో ప్రీతుడౌతాడు. గోపీనాథుడైన శ్రీ కృష్ణ పరమాత్ముడు కూడా ఆ విధంగా లోనయ్యాడు. అలాగే సామవేదంలో బ్రహ్మ, వీణా గానంలో సరస్వతి పరవశిస్తారు. ఇక యక్ష గంధర్వ దేవదానవ మానవులు సైతం ఈ గాన ప్రభావానికి యుక్తాయుక్త జ్ఞానం లేక ఉయ్యాలలో యేడ్చే బాలుడు కూడా గానాన్ని విని పరవశిస్తారనడంలో ఈ మాత్రమూ సందేహం లేదు. మిక్కిలి సంతోషాన్ని పొందుతున్నాడు. అడవిలో సంచరించే, గడ్డీ పరకల ఆహారంగా తీసుకొను జింక పిల్లలు కిరాతకుని గానానికి ఆశపడి ప్రాణాల్ని సైతం అర్పిస్తున్నాయి. కనుక ఈ గీతం  మాహాత్మ్యం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ధర్మార్థ కామ మోక్షాదులకు ఈ సంగీతమే ముఖ్య సాధనం.

ఋగ్వేదానికి పూర్వం వేద మంత్రాలలో సంగీతం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ వేద మంత్రాల్లో ఉదాత్త, అనుదాత్తాలు లేని ఒకే స్వరంలో దీర్ఘశృతిగా ఉచ్ఛరింపబడేవి. దీనికి ఆర్చిక పద్ధతి లేక ఏకస్వర గాయన పద్ధతి అనే వ్యవహారం ఉండేది.

తదనంతర కాలంలో పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయిలోనూ నారద విరచిత శిక్ష అని వ్యవహరింపబడే సంగీత శాస్త్ర గ్రంథంలోను సంగీత ప్రాశస్త్యం విస్తారంగా ఉంది. సామగానానికి నేటి గమకాలవంటి విన్యాసాలుండేవి. అవి వికార, విశ్లేష, వికర్షణ, అభ్యాస, విరామ, స్తోభాలు.

నాలుగు వేదాలు కాక సామవేదం నుండి బయలుదేరిన సంగీతాన్ని గురించి గాంధర్వ వేదం అనే వేదం బయలుదేరింది. సదాశివుడు, బ్రహ్మ, నారదుడు, తుంబురుడు, కంబళుడు, అశ్వతరుడు, అర్జునుడు, ఆంజనేయుడు మొదలైన పురాణ పురుషుల పేర్ల మీద నాట్య సంగీత శాస్త్రాలపై గ్రంథాలు వెలువడడం ప్రారంభమయింది. అయితే వీరంతా ఆ పురాణ పురుషులేనా? కారా? అనే విషయంలో చరిత్రవేత్తలు సందేహాల్ని ప్రకటించారు. 

సంగీత చరిత్రను పరిశీలిస్తే సామవేద యుగానికి తరువాత కాలాన్ని గాంధర్వ యుగమని, మార్గ యుగమని వ్యవహరించడం కనిపిస్తుంది. ఈ మార్గ సంతీత రచనలకు సంబంధించిన లక్షణాలు, లక్ష్యాలు కూడా సంస్కృత కావ్య పరిభాషలోనే ఆవిర్భవించాయి. ఈ విధమైన మార్గ పద్ధతిలో వెలసిన లక్షణ, లక్ష్య ప్రబంధాలకు కర్తగా బ్రహ్మ ఖ్యాతి వహించాడు. ఇవి శివస్తుతికి సంబంధించినవి. బ్రహ్మ చేత శోధించబడి సంపాదింపబడినవి కాబట్టి వీటిని మార్గ గానాలన్నారు. 

తరువాత కాలంలో క్రీ. పూ. సుమారు 4వ శతాబ్దం నుండి క్రీ. శ. 1వ శతాబ్దానికి చెందిన భరతుడు నాట్య శాస్త్రాన్ని రచించాడు. ఈ మహర్షి తాను రచించిన నాట్య శాస్త్రంలో సంగీత శాస్త్ర సంబంధిత అంశాలను ఆరు అధ్యాయాలలో వివరించాడు. 

భరతుడు పేర్కొన్న ఆరు అధ్యాయాలు:

  • 1. జాతి లక్షణ విధానం
  • 2. ఆతోధ్య జాతి విధానం
  • 3. సుషిరాతోద్యాధికారం
  • 4. తాళ విధానం
  • 5. ధ్రువాధ్యాయం
  • 6. పుష్కర వాద్య విధానం 

వీటిలో మొదటి మూడు అధ్యాయాలలో మూర్చనల ప్రస్తారం ద్వారా జాతులను ఎలా గ్రహింపవచ్చునో, వాటిని ఆయా వాద్యాలపై ఎలా ప్రయోగించాలో వివరించాడు.

భరతుని నాట్య శాస్త్రం తరువాత ప్రసిద్ధ గ్రంథం నారదీయ శిక్ష. దీనిని రచించిన వాడు నారద మహర్షి అని ప్రసిద్ధి. సంగీతం లోని రాగాలకు సంబంధించిన సంక్షిప్త ప్రస్తావన ఈ శిక్షలో కనిపిస్తోంది. షాడవం, పంచమం, సాధారితం, కైశికం, కైశిక మధ్యమం, అనే రాగాలు ఇందులో పేర్కొనబడ్డాయి.
నారదీయ శిక్ష తరువాత ప్రసిద్ధి వహించిన సంగీత లక్షణకర్త మతంగుడు. ఈ మహర్షి రచించిన గ్రంథం పేరు బృహద్దేశి.
తరువాత అనేక నాత్య సంగీత లక్షణ గ్రంథ కర్తలు, ఆ గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాసిన వ్యాఖ్యాతలు ఎందరో కనిపిస్తారు. వీరిలోకావ్య ప్రకాశిక అనే సాహిత్య అలంకార శాస్త్రం రచించిన ఆచార్య మమ్మటుడు సంగీత రత్నమాల అనే లక్షణ గ్రంథాన్ని రచించినట్లు తెలుస్తుంది. క్రీ. శ. 1050 – 1150 మధ్య కాలానికి చెందిన ఈ మమ్మటాచార్యుని సంగీత లక్షణ గ్రంథంలో దేశి రాగాల ప్రశంస కూడా కనిపిస్తోంది.

అలాగే క్రీ. శ. 920 ప్రాంతానికి చెందిన ప్రతాప తైలవుడు రచించిన సంగీత చూడామణి, అన్నమాచార్యుల సంకీర్తన లక్షణం, క్రీ. శ. 1165 ప్రాంతానికి చెందిన పార్శ్వదేవుడనే జైన పండితుడు రచించిన సంగీత సమయసారం, క్రీ. శ. 12వ శతాబ్దికి చెందిన చాళుక్య సోమేశ్వరుడు రచించిన సంగీత రత్నావళి వంటి గ్రంథాలు చారిత్రకంగా సంగీత శాస్త్ర ప్రాధాన్యాన్ని, వికాస పరిణామాల్ని తెలుసుకునేందుకు దోహదం చేసే సంగీత విలువలున్న లక్షణాత్మకమైన చక్కని గ్రంథాలు.
ఇంకా సోమనార్యుడు, జయాప సేనాని, శార్గదేవుడు, సింహ భూపాలుడు, గోపాల నాయకుడు, హరిపాల దేవుడు, విద్యారణ్యుడు, కుమారిగిరి వసంతరాజు, పెదకోమటి వేమారెడ్డి, గోపేంద్ర తిప్పభూపాలుడు, పురందర దాసు, భండారు లక్ష్మీనారాయణ, చెరుకూరి లక్ష్మీధరుడు, రామామాత్యుడు, అహోబిల పండితుడు, సోమనాథుడు, చతుర దామోదరుడు, పుండరీక విఠలుడు, మాధవ భట్టు, తానప్పాచార్యుడు, భావభట్టు, గోవింద దీక్షితుడు, వేంకటముఖి వంటి అనేక సంగీత శాస్త్రప్రవీణులు సంగీతానికి సంబంధించి విశేషాంశాలతో కూడిన రచనలు చేసి సంగీత శాస్త్ర పద్ధతుల్ని వివరించారు.

Leave a comment