శ్లో|| వాజ్ఞాత్ము రుచ్యతే గేయం
ధాతురిత్యభిధీయతే
వాచం గేయంచ కురుతే
యస్య వాగ్గేయకారకః
ఎవడు సుశబ్దాపశబ్దాలను తెలుసుకొని పరిణామ జ్ఞానపూర్వకంగా గానం చేస్తాడో వాడు వాగ్గేయకారుడని, శబ్ద రూపమైన సాహిత్యం మాతృక. స్వరరూపమైన వర్ణపు మెట్టు ధాతు. ఈ రెండితినీ చేసేవాడు వాగ్గేయకారుడని సంగీత రత్నాకరం పేర్కొంటోంది.
“శబ్దాను శాసనజ్ఞాన
మభిదాన ప్రవీణతా
ఛందః ప్రభేద వేదిత్వం
అలంకారేషు కౌశలం”
శబ్దాను శాసన జ్ఞానం కలిగి ఉండాలి. అంటే అది కేవలం వ్యాకరణ జ్ఞానం మాత్రమే కాదు. శబ్దాల సాధ్వసాధువులను నిర్ణయించ గలిగే శాబ్దికాధికారం కలిగి ఉండాలి. కేవలం వ్యాకరణాధారంగా మాత్రమే కాక సప్రమాణంగా నిర్దుష్టంగా ప్రయోగించే పరిజ్ఞానం ఉండాలి. కేవలం వ్యాకరణ శాస్త్రంలో అభినివేశమే కాక –
“రస భావ పరిజ్ఞానం
దేశ స్థితిషు చాతురీ
అశేష భాషా విజ్ఞానం
కలశాస్త్రేషు కౌశలం”
అలంకార శాస్త్రరీత్యా, నవరసాలు, వాటి స్థాయీభావాలు, విభానుభావ సంచారీ భావాలు మొదలగునవి రసపుష్టికి సంబంధించిన పాండిత్యం ఉండాలి.
“తనువగు శబ్దార్థంబులు
ధ్వనిజీవమలంక్రియా వితానము సొమ్ముల్”
అన్న సరస భూపాలీయాన్ని అనుసరించి, శబ్దార్థ జ్ఞానం, ధ్వని శాస్త్రంపై అవగాహన, అలంకారాలపై పట్టు లేకపోతే సృజన రాణించదు. అందుకే ఈ లక్షణాలు వాగ్గేయకారులలో ఉండాలి.