వ్యాకరణ పాండిత్యం గలవాడునూ, నిఘంటు పరిజ్ఞానం గలవాడునూ, ఛందశ్శాస్త్ర ప్రావీణ్యం గలవాడునూ, శృంగారాది నవరస పరిజ్ఞానం గలవాడునూ, విభానుభావ సాత్విక సంచారాది భావాల నెరింగిన వాడునూ, దేశ కాల పరిస్థితుల నెరింగినవాడునూ, సమస్త భాషా పరిచయుడునూ, అరవై నాలుగు కళలో కృత పరిచయం గలవాడునూ, గీత వాద్య నృత్యాలలో చతురత గలవాడునూ, మనోహరమైన కంఠధ్వని గలవాడునూ, (శ్రావ్యమైన శారీరం గలవాడునూ) శాస్త్ర శిక్షితమైన తాళజ్ఞానం, హెచ్చు తగ్గు లేని లయ జ్ఞానం, మార్గదేశ్య క్రియలనుపయోగాల నెరింగినవాడునూ, మహా ప్రతిభాశాలి, రాగ ద్వేషాలను పరిత్యజించినవాడునూ, ఆర్ద్ర హృదయం గలవాడునూ, నవీన ప్రబంధ గీత కీర్తనాదుల్ని రచించువాడునూ, పరేంగిత జ్ఞానం గలవాడునూ, ప్రబంధాధ్యాయగత విళంబాదులను సరసంగా నిర్మించువాడునూ, అన్య పదాలయందు పాండిత్యం గలవాడునూ, మంద్ర మధ్య తారమను మూడు స్థాయిలయందునూ గమకాలను ఉపయోగించడంలో నేర్పు గలవాడునూ, ఆలప్తిలో చతుర్విధ రాగ వర్ధనులను, విదారులను నెరింగి గానం జేయువాడు శ్లాఘ్యుడైనవాడే వాగ్గేయకారకుడనిపించుకొంటాడు.
తస్య గీతస్య మాహాత్మ్యం
కే ప్రశంసితుమీ శతే|
ధర్మార్ధకామ మోక్షాణాం
ఇద మేవైక సాధనం || (సంగీత రత్నాకరం)
ధర్మార్ధ కామ మోక్షాలకు ఈ సంగీతమే ముఖ్య సాధనం. కాబట్టి సంగీత విద్య మిగుల మహిమ గలది. ఇంతటి మహిమ గల సంగీత శాస్త్రానికి చెందినది జావళీ.