భారతదేశం కళలకు కాణాచి. హృదయ సంస్కారాన్ని ఆవిష్కరిస్తూ మానవ ప్రయోజనాన్ని ఆకాంక్షించే దిశగా కళల ప్రస్థానం సాగింది. ముఖ్యంగా లలిత కళలలో సంగతి సంగీతం సాహిత్యం ఈ రెండూ జన జీవన భావపూరిత ఉద్వేగాలకు ఆలంబనాలై నిలిచి మానవోద్ధరణను ఆకాంక్షించాయి.
“సంగీతమపి సాహిత్యం
సరస్వత్యాః స్తనద్వయం
ఏకమాపాత మధురం
అన్యదాలోచనామృతం” అని ఆర్యోక్తి.
సరస్వతీ దేవి స్తనద్వయంగా సంగీత, సాహిత్యాలు అలరారుతున్నాయి. వీటిల్లో మొదటిదయిన సంగీతం ఆపాతమధురమైనది. సాహిత్యం ఆలోచించినకొద్దీ అమృత తుల్యమై ఆనందాన్ని పంచెటటువంటిది. తలచినంతనే లభించే భావామృతం. అందుకే భర్తృహరి కూడా
“సాహిత్య సంగీత కళా విహీనః
సాక్షాత్ పశుః పుచ్ఛ విషాణ హీనః
తృణం నఖాదన్నపి జీవమానః
తద్భాగదేయం పరమం పసూనాం”1 అన్నాడు.
సంగీతం, సాహిత్యం వంటి కళలమీద ఆసక్తి లేనివాడు సాక్షాత్తూ పశుతుల్యుడు. అయితే ఈ కళావిహీన పశువుకు తోక, కొమ్ములు ఉండవట. వీడు గడ్డి తినకుండా కూడా జీవిస్తాడట. అయితే అదే పశువుల పాలిట గొప్ప అదృష్టమని చెప్తూ కళల ప్రాధాన్యాన్ని ప్రాముఖ్యాన్ని ప్రస్తావించాడు.
సమాజంలో ఏ కాలంలోనైనా విపరీత ధోరణులుంటాయి. లోకాన్ని పాడుచేసేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. సాత్విక గుణం, రజోగుణం, తమోగుణం అనే మూడు గుణాలుంటాయి. వీటిలో జనులు రజో, తమో గుణాలతో పీడింపబడుతూ, తాము నాశనం అవుతూ, సమాజాన్ని నాశనం చేస్తుంటారు. అటువంటి వారి బారినుండి సమాజాన్ని రక్షించి, జనుల హృదయాల్లో సాత్విక గుణాన్ని పునఃస్థాపితం చేసి లోకశ్రేయస్సును కలిగించేవి రక్షించేవి కళలే.
కాబట్టి కళాభిరుచి, కళాపోషణ, కళలను ప్రోత్సహించడం వంటి పనులను ప్రతి ఒక్కడూ విధిగా నిర్వహించ వలచిన బాధ్యతలు. సాహిత్య పఠనాభిలాష, విద్యాగంధం కలవారిని మాత్రమే అలరిస్తుంది. కానీ సంగీతానికి పండిత-పామర భేదం లేదు. సృష్టిలోని ప్రతి ప్రాణి సంగీతామృత తరంగడోలికలలో ఊగి ఆనంద పారవశ్యాన్ని పొందుతాయని విజ్ఞులు చెప్తున్నారు. పశుపక్ష్యాదుల దగ్గరుండి, చిన్న పిల్లల వరకూ, చివరికి విషం చిమ్మే పాములు సైతం సంగీత మాధుర్యాన్ని ఆస్వాదిస్తాయి. అలా స్పందించిన హృదయంలోనే సంస్కారం అంకురించి, హాని కలిగించే భావ ప్రకంపనాలకు కళ్ళెం వేయడం తటస్థిస్తుంది. ఇటువంటి మహత్ప్రయోజనాలు కలిగి ఉండడం వల్లనే కళలు నేటికీ సమాజంలో నిలిచి ఉండి, వాటి సంస్కరణాత్మకమైన కీలక పాత్రల్ని పోషిస్తూ జనుల్ని జాగృతం చేస్తున్నాయి.
సంగీతామృత పానానికి, కొంత సాహిత్య మాధుర్యం కూడా తోడైతే, అప్పుడు లభించే రసాస్వాదన, ఆనందాతిశయం మాటల్లో చెప్పడానికి వీలులేనిది.
తెలుగులో వెలసిన సంకీర్తనలు బహుళ ప్రాచుర్యం పొంది, ప్రజల జిహ్వాగ్రాలపై నేటికీ నిలిచి ఉండడానికి కారణం ఇదే. ఇదే ప్రయోజనాన్ని జావళీలు కూడా నెరవేరుస్తున్నాయి. జావళీ ప్రాథమికంగా సంగీత శాఖకు చెందినది కావడం వల్ల, భారతీయాలంకారకులు సంగీత విద్వాంసులు గావించిన సంగీత ప్రశంసను ఇక్కడ సంక్షిప్తంగానైనా ఉదహరించడం నా ప్రణాలికకు ఉపయుక్తం అవుతుందని భావిస్తున్నాను.