నా మాట

1963 నాటి సంగతి. మద్రాసులో “సంగీత విద్వాన్” టైటిల్ కోర్సు “సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్” లో చేస్తున్న రోజుల్లో మొట్టమొదటి సారిగా “మరియాద తెలియకనే” అఏ సురటి రాగంలో జావళీ విని చాలా ముగ్ధురాలనయ్యాను. కర్ణాటక సంగీతం అంతా ఒక ఎత్తు, జావళీ ఒక ఎత్తు అనిపించింది. నాకు సంగీతమయినా నేర్చుకోవడం తేలిక అనిపించింది కాని జావళీ నేర్చుకుని పాడలేకపోయాను.

అదే కాలేజీలో గాత్రం నేర్పుతున్న శ్రీమతి టి. బృంద, మా కోర్సులో ఉన్న నాలుగు జావళీలను నేర్పించారు. “ఎంతటి కులుకే”, “సమయమిదె రారా”, “ముట్టవద్దురా”, “పారిపోవలెరా” అనే జావళీలు నన్ను ఎక్కువగా ఆకర్షించాయి. ఆ రెండు సంవత్సరాలు ఎన్ని కీర్తనలు, వర్ణాలు, రాగం పాడడం, స్వరం వేయడం, నెరవల్ పాడడం నేర్చుకున్నా – నాకు జావళీలు నేర్చుకోలేక పోతున్నాననే దుగ్ధ పట్టి పీడించేది. ఆ కోరిక తీరకుండానే విద్వాన్ పూర్తి చేసుకుని మద్రాసు నుండి వచ్చేశాను.

ఆ జావళీలు నేర్చుకోవాలనే నా అభిలాష తీరే అవకాశం 1989-91 సం॥లో లభించింది. ఆంధ్రా యూనివర్సిటీ వారి ప్రకటనను చూచిన నేను “పార్ట్-టైం” పరిశోధన కోసం దరఖాస్తు చేసిన నాకు శ్రీమతి మలయవాసిని గారు పర్యవేక్షకురాలిగా లభించడం నా అదృష్టం కంటే “జావళీ” అదృష్టం అంటే ఎక్కువ ఆనందం నాకు.

నేను సంకోచిస్తూనే “జావళీ” పరిశోధనాంశంగా తీసుకోవచ్చా అని శ్రీమతి మలయవాసిని గారిని అడగ్గానే ఆమె ఎంతో ఆనందంగా అంగీకరించారు. కారణం ఆమెకు గల సంగీత జ్ఞానం, రస హృదయం, జావళీ అంటే గల సదభిప్రాయం, జావళీ వింటూ ఉప్పొంగే హృదయం. ఇలాంటి కళా హృదయం ఆమెక్కు ఉండడమే దానికి కారణాలు. సంగీతంలో “సంగీత విద్వాన్”, తెలుగు సాహిత్యంలో “ఎం.ఏ” పట్టా కలిగిన నేను ఈ “జావళీ” పరిశోధనకి తగిన దాన్నిగా స్వీకరించారు. అర్హతలన్నీ నాకున్నాయని, రాగాలు, తాళాలు, భావ స్ఫూర్తి, పాడగల లలితమైన కంఠం, అన్నీ కలిసిన ప్రక్రియ జావళీ నా చేతిలో న్యాయం పొందుతుందని బహుశః ఆమె భావించి ఉండవచ్చు.

ఆచార్య మలయవాసిని గారు తెలుగు శాఖలో పదవీ విరమణ చేసిన కారణంగా డా॥ కొండపల్లి సుదర్శన రాజు గారి పర్యవేక్షణ నాకు లభించడం నా అదృష్టం. వయసులో నాకన్నా చిన్న వారయినా, పరిశోధనా రంగంలో ఖచ్చితమైన ప్రమాణాలు పాటించే వ్యక్తిగా వారిని నేను గుర్తించడం వల్లనే, వారిని నా పరిశోధనకు పర్యవేక్షకులుగా బ్యవహరించాలని నేను కోరడం, సహృదయంతో వారు స్వీకరించి, తగిన సూచనలు, సలహాలు ఇచ్చి అన్ని విధాలా నన్ను ప్రోత్సహించారు. వారి అండదండలే లేకుండా నా చిరకాల స్వప్నమైన జావళీలపై పరిశోధనను పూర్తి చేయగలిగి ఉండేదాన్ని కాదేమో. అందుకే వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

నా పరిశోధనాంశం నా అభిరుచికీ, నాకున్న అర్హతలకీ, నా పర్యవేక్షకుల అభిమానానికి, అభిరుచికీ కూడా అర్హత సంపాదించుకున్న “జావళీ” గురించి పరిశోధన చాలా క్లిష్టతరమైనదనీ, అసాధ్యమని కూడా ఒక పరిస్థితిలో అనిపించిన సమయాలు కూడా ఉన్నాయి.

నాలుగు జావళీలే పాడగలిగిన నేను పరిశోధనలోకి చాలా ధైర్యంగానే అడుగు పట్టడంలో సాహసం చేశానేమో అనిపించింది. నా పరిశోధన ఎక్కడ ఎలా ప్రారంభించాలో తెలియలేదు. తెలుగు ప్రాంతపు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి వంటి పెద్దలను కలుసుకుంటే, ఎవో నాలుగు పాడటం తెలుసని చెప్పారు. వాటి గురించి ఏమీ చెప్పలేక పోయారు. కొంతమంది అప్పుడే ఆ మాట విన్నట్లుగా, అవును ‘జావళీ’ అంటే అనే ప్రశ్న వేసుకున్నారు.

జావళీ సముద్రంలో అడుగు పెట్టి లోతు, అవతలి ఒడ్డు చుద్దామని ప్రయత్నించడం అత్యాశెమోనని అనిపించింది. అప్పటికే మానసికంగా, ఆర్థికంగా, సమయాన్ని కూడా వ్యయం చేస్తూ కాస్త కూడా ముందుకు వెళ్ళలేక పోయాను.

ఒక సంవత్సరం గడిచిపోయింది. జావళీ గురించి రాయడమేమిటీ పాడాలి, ఆడాలి అనిచాలా మంది అన్నారు. నాకూ అనిపించింది. జావళీ చదవటం, జావళీ గురించి రాయటం కష్టమే. చదివితే అర్థం అయ్యేది కాదు. రస హృదయులకి రసాస్వాదన కలిగించాలంటే, కలగాలంటే …??

తెలుగు ప్రజలలో ‘జావళీ’ 99 శాతానికి తెలియదు. అదేదో “జాలరి” పాటలా అని ఒకరి ప్రశ్న. జానపద గేయాలా? మరొకరి ప్రశ్న. చాలా మంది పరిశోధన చేశారుగా? కొందరి తీర్మానం. కొద్దిమంది నృత్యం, సంగీతాం తెలిసిన వారు మాత్రం అదో శృంగార గీతం కదా అని అన్నారు. నేనెక్కడ ఎవరితో జావళీ గురించి మాట్లాడినా “ఛ అదేం టాపిక్ అండీ, వట్టి పచ్చి శృంగారం పాటలు. సభ్యత, సంస్కారం లేనివి అవి. అందులో పరిశోధన కూడానా?” అని కొందరి ఛీత్కారం. ఎంత పొరపాటు చేశానా? అని బాధ పడుతూనే మద్రాసులో కాలు పెట్టాను. అక్కడ నా అదృష్టం బావుండి, కనీసం భాష, భావం తెలియని తమిళులు జావళీ పేరు చెప్పగానే ఎంతో ఆనందించారు. నా మొదటి అడుగు మద్రాస్ యూనివర్సిటీ సంగీత శాఖ. అక్కడ శ్రీ రాఘవన్ గారు పరిచయం జావళీ పరిశోధనకి నాంది అయింది. ఎలా పరిశోధన ప్రారంభించాలో దారి చూపారు. జావళీ పరిశోధన ప్రారంభించి పి. హెచ్. డి. పట్టా కోసం సిద్ధాంత వ్యాసాన్ని రాయ గలుగుతున్నానంటే ఆయన కట్టుకున్న పుణ్యమే. ఎవరెవరిని కలుసుకోవాలో, ఏయే పుస్తకాలు చదవాలో, శృతి (సంగీతపు పత్రిక) లాంటి పత్రీకలను, మ్యూజిక్ అకాడెమీ పుస్తకాలలోని కొన్ని ఆర్టికల్స్‌నీ, బెంగళూరు లోని కొంతమంది ప్రముఖులనీ, వి.ఎ.కె. రంగారావు గారి వంటీ సంగీత, నృత్య పరిజ్ఞానం కలవారినీ చాలా మంది పేర్లను సమగ్రంగా తయారు చేసి పెట్టారు.

అప్పుడు కాస్త ధైర్యం చిక్కింది. ఆ యూనివర్సిటీలో “జావళీ సమీక్ష” ఎం.ఫిల్. పట్టా కోసం రాసిన వ్యాసాన్ని అరవంలో చదివాను. కాని అది సంగీత పరంగా చేసింది. కాబట్టి అందులో సాహిత్యం గురించి ఏదీ రాయవలసిన అవసరం కలగలేదు. మళ్ళీ నా సమస్య తలెత్తింది. జావళీలు, సాహిత్యం – వీటి గురించి ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? మళ్ళీ అన్నీ ప్రశ్నలే.

అసలు జావళీ అంటే ఏమిటి? టి.ఎస్. పార్థసారథి (మాజీ మ్యూజిక్ అకాడెమీ సెక్రటరీ) గారిని కలుసుకున్నాను. చాలా చిన్నప్పటి నుంచి ఆయన జావళీలు నేర్చుకున్నట్లు, తన దగ్గర చాలా ఉన్నట్లు, నాకు అవి తప్పకుండా ఇస్తానని చెప్పారు. తను యివ్వగలిగిన సహకారం ఇస్తానన్నారు. కొండంత ధైర్యం వచ్చింది. వి.ఎ.కె. రంగారావు గారిని కలుసుకున్నాను, ఆయన దగ్గర పాత గ్రామఫోను రికార్డులలో జావళీలు ఉన్నాయని చెప్పారు. కొన్ని పాడి వినిపించారు. ఆడి చూపించారు. ఎక్కువ జావళీలు దైవాంకితాలే అన్నారు. నా సందేహాలు చాలా తీర్చారు. అవన్నీ నాకు క్యాసెట్ల రూపంలో మార్చి యివ్వడానికి తన వంతు సహకారాన్ని యిస్తానన్నారు. అలాగే చేస్తున్నారు కూడా. రెండో అడుగు ధైర్యంగా వెయ్య గలిగానన్నమాట.

బెంగళూరు వెళ్ళి శ్రీ బి.వి.కె. శాస్త్రి గారిని కలుసుకున్నాను. తెలుగు జావళీలన్నీ సంపాదించి యిస్తే మంచి పుస్తకాన్ని అచ్చు వేయిస్తానన్నారు. నా పరిశోధనకి చాలా ప్రోత్సాహాన్నిచ్చారు. కన్నడ జావళీల గురించి చెప్పారు. యూనివర్సిటీ వారు వేసిన కన్నడ జావళీలు పుస్తకం గురించి చెప్పారు. నా మరిశోధన కాస్త ముందుకు సాగింది. కానీ “జావళీ” అంటే ఏమిటి? అనే ప్రశ్న అలాగే మిగిలి పోయింది. అరవ వాళ్ళు ఎవరూ ఆ పదానికి వ్యుత్పత్తి చెప్పలేక పోయారు. కన్నడం వారు తమ మాటగా చెప్పేసి నిర్ధారణ చేసేశారు. జావడి – జావళి అనేవారు కాని అది కాదని అనిపించింది.

జావళీ పేరుతో గల సాహిత్యం తెలుగు కన్నడ భాషలలో ఉంది. జావళీ సాహిత్యం లాంటి సాహిత్యం అరవంలో కూడా ఉంది. “జావళీ” పేరు ఎవరు ముందు రాశారో అంటే కన్నడం వారా? తెలుగు వారా? అరవ దేసంలో వాళ్ళు కూడా తెలుగులో రాశారా?

మళ్ళీ పరిశోధన ప్రారంభం అయింది. ఏ సమయంలో, ఎవరి పాలనలో ఏ ప్రాంతంలో ఎక్కువగా జావళీలు వచ్చాయి. ఎవరు ముందు రాసి వుంటారో వారే ఈ పేరు పెట్టి వుంటారు. జావడి – కన్నడంలో lewd poetry అన్నారు. మరి తెలుగు వారేమంటారో అని తెలుగులో ఉన్న అన్ని పద కోశాలనీ, వ్యుత్పత్తి కోశాలనీ, నిఘంటువులనీ తిరగేశాను. కానీ అందరూ చాలా అమాయకంగా శృంగార గీతం అని మాత్రమే చెప్పి కప్ప దాటేశారు. తెలుగు సాహిత్య సేవ చేసిన బ్రిటిషు వాడు సి.పి. బ్రౌన్ మాత్రం జావళీ తెలుగు మాట అని తన నిఘంటువులో చెప్పాడు. నాకు చాలా సంతోషం కలిగింది. తెలుగు మాట అని ఆయన చెప్పాడు కాబట్టి నూటికి నూరుపాళ్ళు నమ్మేశాను. ఇంకో తెలుగు వాడంటే నమ్మి ఉండేదాన్ని కాదేమో. ఆ రూపం ఎలా తెలుగులో చెపుతారో అని తెలుగు పండితులని, సంస్కృత పండితులని కలుసుకున్నాను. ఎన్ని రకాలుగా ఆ మాటని లాగి, పీకి విరువగలరో అన్ని రకాలుగా రూపాన్ని సాధించారు. కాని నాకు అవన్నీ తృప్తిని కలిగించ లేదు. మూడక్షరాల మాట ఎవరు మొదట “జావళీ” అని పేరు పెట్టారు?

ఏలూరు వచ్చినపుడు జి.వి. సుబ్రహ్మణ్యం గారిని, తూమాటి దోణప్ప గారిని కలుసుకున్నాను. పాడి వినిపించాను. నా అనుమానాలు అడిగాను. ఆ మాట రూపం చెప్పమన్నాను కాని చెప్పలేక పోయారు. దోణప్ప గారు మాత్రం హైదరాబాదు వెళ్ళి ఉత్తరం రాశారు. చాలా రూపాలు రాశారు. నానీ నాకు అవీ తృప్తి నీయలేదు. ఎన్నో సెమినార్లు జరిపారనీ, కానీ, “జావళీ” ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదనీ దోణప్ప గారు అంటూ ఆశ్చర్య పోయారు. సంగీతలో నిష్ణాతులని అడగమని సాహిత్యం వాళ్ళు తప్పించున్నారు, సాహిత్యవేత్తల నడగమని సంగీతం వాళ్ళు దాటేశారు.

ఎవరిదీ జావళీ? ఎవరికి పుట్టిన బిడ్డ? శ్రీ॥ శ॥ 1450 నుండి 1920 దాకా 500 సంవత్సరాల సాహిత్యం కలిగిన జావళీ ఎలా ఎప్పుడు ఎందుకు పుట్టింది? ఎలా అదృశ్యం అయింది? జావళీలు ఇప్పుడు రాయగలరా? అనుమానమే. సంగీత సాహిత్య అభినయాలు సమ పాళ్ళలో, తాదాత్మ్యంలో జావళీకారులు అల్లిన కవితలు కావాలంటే రాయగలరా?

ఇంకో అడుగు ముందుకు వెయ్యగలిగాను. శృతి మాగజైన్లలోని ఆర్టికల్స్‌నీ, మ్యూజిక్ అకాడెమీ ఆర్టికల్స్‌నీ, ప్రొ॥ సాంబమూర్తి గారు రాసినవీ, మన తెలుగు వారు సంగీతపు పుస్తకాల లోని జావళీ గురించి రాసిన విషయాలు సంపాదించ గలిగాను.

అయినా ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస నన్ను విడిచి పెట్టలేదు. గుప్తా అవార్డ్స్ ఉత్సవ సందర్భంగా శ్రీ ఆరుద్ర గారూ, శ్రీ శ్రీపాద పినాకపాణి గారూ ఏలూరు రావడం నా అదృష్టంగా భావించాను. సంగీత సాహిత్య నిష్ణాతులు ఇరువురినీ కలుసుకున్నాను. ఆరుద్ర గారు జావళీ గురించి అంతకు ముందుగానే శృతి పుస్తకాలలో కొన్ని ఆర్టికల్స్ రాసిన వ్యక్తి. ఆరుద్ర గారు జావళీలలో ముద్రల గురించి మాట్లాడుతూ – ఏదో దైవతములను అడ్డు పెట్టుకుని రాసినవే గానీ, అందులో ఏ భక్తి భావనా లేదని స్పష్టం చేశారు. శ్రీ పినాకపాణి గారు చాలా తీరికగా నా గోడు విన్నారు. సహేతుకంగా చెప్పే విషయాలతో ఏకీభవించారు. జావళీ యెడ నాకు గల సదభిప్రాయాన్ని బలపరిచారు. వెడుతూ వెడుతూ నా ఆలోచనలనూ, చేసే తీరునూ, ధైర్యంగా నేను గత విషయాలని ఖండించడం వంటి విషయాలు ఆయన్నెంతో ఆకర్షించి, నన్ను ప్రోత్సాహ పరిచి జావళీకి గల ఉన్నత స్థానాన్ని అంగీకరించి మరీ వెళ్ళారు. ఆయనతో నా చర్చ నన్నెంతో ఉత్సాహ పరచింది.

రెండు నెలల తరువాత ఏలూరులోనే నృత్యోత్సవాలు జరిగాయి. ఇది నా జావళీ పరిశోధనలో ఇంకొక ముఖ్యమైన మైలు రాయి. శ్రీ నటరాజ రామకృష్ణ గారు, శ్రీ కె. విశ్వనాథ్ గారు, మంజు భార్గవి, స్వప్న సుందరి (ఢిల్లీ), సరిదె మాణిక్యం గారూ, అన్నాబత్తుల సోదరీమణులు, ముమ్మిడివరం నుంది కొందరు దేవదాసీలు అందులో పాల్గొనడం జరిగింది. వారందరితో నా సందేహాలనూ, అనుమానాలనూ చర్చించాను. జావళీ నీచమైన, తుచ్ఛమైన ప్రక్రియ అనే దాన్ని ఖండించడంలో నాతో ఏకీభవించారు. అభినయ యోగ్యమైన జావళీని ఆడి, పాడి చూపించారు. ఈ దేవదాసీలు వయసులో చాలా పెద్దవారు. జావళీని హావభావాలతో అతి చౌకంగా పాడి, ఆడుతుంటే యిప్పటి వరకూ జావళీ గురించిన అందరూ చెప్పిన విషయాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పటికి నా మనసు కాస్త కుదుట పడింది.

“జావళీ”కి గల అపఖ్యాతి, అపవాదులను, చెడ్డ పేరును పోగొట్టుటలో నే చెయ్య గలిగిన ప్రయత్నం చెయ్యడమే నా ధ్యేయం. అందుచేత ఒక కొత్త కోణం లోంచి జావళీ పుట్టు పూర్వోత్తరాలూ, వికాసం, పతనం మొదలైన విషయాలనే సంగ్రహించి, విన్నవీ, కన్నవీ ఒక తాటి మీదికి తెచ్చి సమగ్రమైన జావళీ అవగాహనను కలిగించుటే నా ప్రయత్నం.

నటరాజ రామకృష్ణ గారు గతంలో జావళీ గురించి చెప్పిన వారి గురించి మాట్లాడుతూ, “మామిడి పండు తిని రుచి తెలుసుకోలేని వారు, మామిడి పండు గురించి మాట్లాడినట్లుంది” అనిన మాటల్లో ఎంతో నిజం దాక్కొని ఉంది.

అయిదు వందల సంవత్సరాలు జీవించి, అందరి నోళ్ళలో ఆడి, ఆట పాటలతో, భగవంతుని ఆరాధించి, రసిక హృదయాలని ఆనంద పారవశ్యంలో ముంచ గలిగిన అత్యద్భుత శక్తి గల జావళీ ఒక్కసారిగా పుట్టిందా? ఎప్పుడు ఎలా పుట్టింది? ఎలా వికసించింది? రాసిన జావళీకారులు ఎవరు? ఎందుకు రాశారు? ఎవరి కోసం రాశారు? ఎందుకు అంతరించి పోయింది? జావళీలు ఈ సినిమా రంగంలో ఎలా చోటు చేసుకున్నాయి? ఎలా అంతరించి పోయాయి? మొదలగు విషయాలతో నా పరిశోధన కొంత వరకైనా జరిగితే నా ప్రయత్నం ఫలించినట్లే. విషయం అపారంగా ఉండడం వల్ల పరిశోధక ప్రణాలిక దీర్ఘంగా సాగింది. ఎం. ఫిల్. కోసం చేసిన పరిశోధనలో జావళీలకు సంబంధించిన సమగ్ర సమీక్ష విపులంగా చేయడానికి వీలు కాలేదు. రేఖా మాత్రంగా సాగిన ఎం. ఫిల్. సిద్ధాంత వ్యాసాన్ని విస్తృత పరచి, ఆంధ్ర వాగ్గేయకారుల నేపథ్యాన్ని, వారి రచనా విధానాన్ని స్వీకరించి, సోపపత్తికంగా జావళీల చరిత్రను సాహిత్య లోకానికి తెలియ జేయాలనే నా పరిశోధనను విజ్ఞులు ఆదరిస్తారని నా ఆకాంక్ష.

— మొక్కపాటి లలితాదేవి