6.4 నాయక లక్షణాలు

ప్రాచీన సంప్రదాయ కవిత్వంలో నాయకుని లక్షణాల్ని పర్ణించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సత్ప్రయోజనాన్ని పొందవలసిన కావ్యంలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉండవలసిన నాయకుల లక్షణాల్ని భారతీయ అలంకారికులు ప్రయోజనాత్మికమైన దార్శనిక దృక్పథంతో రూపొందించారు.

నాయకులను పర్ణించే సల్లక్షణాలు అందరికీ పార్గదర్శకం కావాలనేదే ఈ వర్ణనల వెనుక ఉన్న మహదాశయం.

స్వభావాన్ని బట్టి లక్షణాత్మకంగా నాయకులు నాలుగు విధాలుగా విభజింపబడుతున్నారు.

1. ధీరోదాత్తుడు:

ధీరత్వం, ఔదార్య గుణాలు ప్రధానంగా కల లక్షణాలు కల నాయకుడు ధీరోదాత్తుడు.

లక్షణాలు:

  1. తనను తాను పొగడుకోక పోవడం (ఆత్మస్తుతి చేసుకోనివాడు)
  2. సర్వ ప్రాణుల మీదనూ అవ్యాజమయిన దయా రసాన్ని కురిపించేవాడు.
  3. విశేషమైన ధైర్యం కలవాడు
  4. అపారమైన ఓర్పు కలవాడు
  5. సుఖ దుఃఖాల్ని సైతం లెక్క చేయనటువంటి, వేటికి వశం కాని స్వభావం కలవాడు
  6. భయం, క్రోధం, శోకాదుల ప్రభావానికి లోనుకాని లక్షణం కలవాడు
  7. విధేయతచే దాచబడిన గర్వం కలవాడు

ఇలా ధీరోదాత్త లక్షణాల్ని అలంకారికులు పేర్కొని లక్షణ లక్ష్యాత్మకంగా సాధించారు.

2. ధీరోద్ధతుడు:

ఉద్ధతమైన ధీరత కలవాడు ధీరోద్ధతుడు.

లక్షణాలు:

  1. శౌర్యం కలవాడు
  2. డాంబికం, మాయ వంటి లక్షణాలు కలవాడు
  3. కఠినమైన హృదయం కలవాడు
  4. స్థిరత్వం లేక నిత్య చాంచల్యమాన మయిన ఆలోచన కలవాడు

ఈ లక్షణాలు కలవాడు ధీరోద్ధతుడు.

3. ధీరశాంతుడు:

సాత్త్వికమైన లక్షణాలు ధీరత్వంలో మిళితమై ఉండే లక్షణాలు కలవాడు.

లక్షణాలు:

  1. శమదమాది గుణాలకునిలయమై, వాటిని నియ్తం పోషించేవాడు
  2. బ్రాహ్మణ భక్తి హృదయంలో నిత్యం వహించేవాడు

పూర్తిగా ఈ లక్షణాలతో శంతిమయ జీవనాన్ని ఆకాంక్షించేవాడు ధీరశాంతుడు

4. ధీరలలితుడు:

ధీరత్వంతో కూడిన లాలిత్యం, కళా హృదయం కల సున్నిత మనస్కుడు.

లక్షణాలు:

  1. కళాసక్తి కలవాడు
  2. లాలిత్యం కలవాడు
  3. కస్తూరి కర్పూర వీటికాది అనుపమ చందనాగరు వస్త్ర భూషణాలంకార యుతమైన వాడు
  4. సమ్యగ్భోగాసక్తుడు

ఈ లక్షణాలు ధీరలలితునిలో ఉంటాయి.

ఈ లక్షణాలు కల నాయకులే కాక శృంగార నాయకులు కూడా నాలుగు విధాలుగా ఉంటారని భారతీయాలంకార శాస్త్రం పేర్కొంటోంది.

  1. దక్షిణుడు
  2. అనుకూలుడు
  3. ధృష్టుడు
  4. శఠుడు

దక్షిణుడు:

అనేక నాయికలపై మక్కువ కల శృంగార పురుషుడు

లక్షణాలు: ఒక కాంతకు భుజాపరిరంభాన్ని, వేరొక సతికి ముఖాన్ని, మరొక భామినికి కరాన్ని యిచ్చి, అనేక నాయికలతో భోగించి, ఆనందించే లక్షణాలు కల నాయకుడు.

అనుకూలుడు:

ఒక్క కాంతనే వలచి, అనుల్కూల్యంగా ప్రియానురాగాన్ని అనుభవించే నాయకుడు.

లక్షణాలు:
కనకాంబరాల్ని, ఉజ్జ్వలమై, దివ్యమైన రత్నాలతో కూడిన సుందరమైన ఆభరణాలనూ, ఘనసార సుగంధాదులను ఇచ్చి, దంత క్షత, నఖ క్షత, చుంబనాలింగన బంధనాలతో ఒక్క సతితోనే సమాగమించి ఆనందించే లక్షణం కలవాడు.

ధృష్టుడు:

దక్షిణ, అనుకూల నాయకుల కంటే కొంచెం టక్కరి.

లక్షణాలు:
నాయకుడు వేరే కాంతలతో సమాగమించి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆ విషయాన్ని తెలియ జేసే చిహ్నాలున్నప్పటికీ, దానిని అంగీకరించక తప్పించుకొనేవాడు.

శఠుడు:

పరిపూర్ణమైన హృదయాన్ని పంచి ఇవ్వనివాడు.

లక్షణాలు:
ఒక నాయికపై అపేక్ష కలిగి ఉండడం వల్ల వేరొక నాయికను సమాదరించడు. ఇతడు నాయికతో ప్రత్యక్షంగా మాట్లాడతాడు గానీ, అతని దృష్టి అన్యకాంత పైనే ఉంటుంది. కన్నులతో చూస్తాడు, కానీ మనసుతో చూడడు. పైపై మాటలతో మాత్రమే నాయికకు తృప్తిని కలిగిస్తాడు కానీ భావంతో కాదు.

ఇక్కడ పేర్కొన్న ధీరోదాత్త, ధీరోద్ధత, ధీరశాంత, ధీరలలితులనే నాయక లక్షణాల్నీ, దక్షిణ, అనుకూల, ధృష్ట, శఠలనే శృంగార నాయకుల లక్షణాల్నీ జావళీ కర్తలు వాడుకున్నారు.

నాయిక నాయకునిపై గల విరహావస్థను, చెలికి వివరించే సందర్భంలో నాయకుల స్వరూప స్వభావాల్ని, వారి లక్షణాల్ని తలబోస్తూ పేర్కోవడం ఇక్కడ అధికంగా కనిపిస్తుంది. ధీరోదాత్త, ధీరలలితాది లక్షణాలు కల నాయకుల్ని జావళీలలోని నాయికలు ఆకాంక్షించారు.

ధృష్ఠుడు, శఠుడు వంటి శృంగార నాయకుల చేష్టలవల్ల ఎంతగానో బాధపడ్డారు. అనుకూల నాయకుడై, స్వామి నిత్యాం వాళ్ళతో కూడి ఉండాలనే స్త్రీ మానసాన్ని ప్పుంఖానుపుంఖాలుగా భావ బాహుళ్యంలో ప్రదర్శించారు.

జావళీలలోని నాయకులు ప్రేమతో స్వార్థాన్ని నింపుకున్నవారు. స్వార్థం మానవతకు కళంకం. కానీ శృంగారంలోనూ, ప్రేమలోనూ స్వార్థం అతిశయాన్ని తెలియజేస్తుంది. అనేక స్త్రీలతో రమించే నాయక లక్షణాల్ని నాయికలు జీర్ణించుకోలేకపోయారు.

తనను విడిచి నాయకుడు అన్యనాయిక పొందు కోసం వెళ్ళిపోయాడని, ఇంకా రావడం లేదని, వెళ్ళి వెంటనే తీసుకుని రమ్మని చెలిని పంపే ప్రయత్నం చేస్తూ హృదయావేదనను వ్యక్తం చేశారు.

ఇది ప్రాచీన సమాజంలో బహుముఖీనంగా వ్యాపించి ఉన్న వాస్తవ పరిస్థితులకు అక్షర రూపం.

భారత దేశంలో, ముఖ్యంగా రాచరిక వ్యవస్థలో నాయకుడు స్వీయ భోగాపేక్ష కోసం, అనేకులయిన నాయికలని ఉపయోగించడం కనిపిస్తుంది. నాయకునిలో ఉన్న ఈ బహునాయికా పోషణ అనే గుణం ఆనాటి పురుష వ్యవస్థ భోగాలాలసతకు అద్దం పట్టినా, స్వీయ లాభం కోసం స్వేచ్చ లేని స్త్రీ జీవితాలకు జావళీలు యధార్థ సాక్ష్యం.

అంతులేని కోరికెలు తీరే మార్గం లభించక పోవడంతో స్త్రీలు ఊహా మార్గాల్లో విహరించడం, ప్రియుని సమాగమ విషయాల్నే పదే పదే స్మరించుకుంటూ కాలం గడపడం, తనను నిర్లక్ష్యం చేసి, అన్య కాంతాసక్తుడయిన నాయకుని నిందించడం, ఒక్కోసారి ప్రాధేయపడడం, మళ్ళీ మళ్ళీ ఆ సాహచర్యం కోసం పరితపించడం, అందుకోసం మార్గాల్ని అన్వేషించడం… ఇవన్నీ సంక్షోభంలో కూరుకున్న స్త్రీ సమాజపు మానసిక పరిస్థితికి గీటురాయిగా చెప్పవచ్చు.

ఈ లక్షణాలన్నీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే సరిగ్గా సరిఫొవచ్చు. కానీ యథార్థంగా ఉన్న ఝీవితాన్ని సమాజంలో కామ స్వేచ్చ లేని స్త్రీల బాధల్నీ వ్యక్తీకరిస్తూ, అదే సమాజంలో వేరే ప్రవాహంగా సాగిపోయే ఆధ్యాత్మికతకు జంటగా మేళవించి రచించడం ద్వారా అటు సామాజిక పరమైన వ్యక్తీకరణ, అధ్యాత్మిక పరమైన ఆశయాభిలాష, రెండూ జంట ప్రవాహాలుగా సాగిన తీరు జావళీలలో కనిపించడం ఆశ్చర్యకరం.

విశ్లేషాణాత్మకంగా పరిశీలిస్తే సాహిత్యం సమాజం లోతుల్ని పట్టుకొని, ఏ విధంగా నమోదు చేయ గలదనేందుకు ఇంతకంటే సాహితీ సాక్ష్యాలు ఇంకేం కావాలి?

(to be continued… Last edited 6 Jan 2026)