8.7 జావళీలు – తాళాలు – పలువురి అభిప్రాయాలు

తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుండీ గేయ సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. జావపద గీతాల్ని, వాటి సంగీత తత్త్వాన్ని, లాక్షణికుల కావ్య ప్రయోగ వశం చేత కవులు నియమవంతం చేసి కృతకం చేశారు.

అందువల్ల పద కవిత పట్ల పండితులలో చులకన ఏర్పడింది. లక్షణవంతమైన, నియమ సహితమైన, పండితైక సాధ్యమయిన ఛందాల్ని గౌరవించే వారికి స్వేచ్ఛా యుతమూ, సహజమూ, సర్వ జన సులభమూ అయిన గేయ ఛందస్సే నిరాదరణకు గురయ్యింది.

అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో అనేక మంది తమ గేయ కావ్యాలలో గేయ ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.

ఏ దేశంలోనైనా, ఏ భాషలోనైనా పద్య రచనకు పూర్వం చాలా కాలం ఈ గేయమే ఉంటుంది. సవరలు మొదలు ఆదివాసులకు ఇంకా పద్యం అలవడలేదు. ఇంకా వారు గేయ రచనా దశలో ఉండడమే దీనికి నిదర్శనం.

కొంత సంస్కృతి వృద్ధి పొందాక, తర్వాత పాడుకోవడానికే కాదు, చదువుకోడానికి కూడా సాహిత్యం కావాలని ఏర్పరుచుకొన్న కారణంగా పద్య సాహిత్యం ఆవిర్భవించింది. తరువాత తత్ఫలితం గానే మళ్ళీ గేయం నిరాదరణకు, నిర్లక్ష్యానికీ గురయ్యింది. సాహిత్యంలో పొందవలసిన ప్రాధాన్యాన్ని కోల్పోవడం వల్ల క్రమేణా పూర్తిగా మృగ్యమయ్యేందుకు అవకాశాలున్నాయి. సరిగ్గా జావళీ విషయం లోనూ ఇదే జరిగింది.

మొట్ట మొదట గేయ సాహిత్యమే అభివ్యక్తికి మూల సంపద. తదుపరి పఠనాసక్తి ప్రారంభమై చదివే రచనలు వచ్చాయి. ఆ తరువాత గేయాత్మకమయిన రచనలు కనుమరుగై పోతాయి.

అలాగే జావళీ ఆవిర్భవించి మళ్ళీ అంతరించి పోయింది. ఎందుకంటే ఇది గేయాత్మకమయిన ప్రక్రియ.

రాగ తాళ సమన్వితమైన జావళీలు సంగీత పరంగా నిర్దిష్ట రాగాలలో, నిర్దిష్ట తాళాల ఆధారంగా రూపొందింప బడతాయి. అయితే ఈ జావళీలు ఉన్న తాళాల విషయంలో పలువురు పండితులు తమ అభిప్రాయాల్ని అనేక విధాలుగా వ్యక్తం చేస్తున్నారు.

ప్రొ॥ పి. సాంబమూర్తి

జావళీలు మధ్యమ కాలంలో ఉంటాయి. సాధారణంగా ఆది, రూపక, చాపు తాళాలలో ఉంటాయి. South Indian Music Book III

‘నీ మాటలేమాయెనురా’ అనే పూర్వి కల్యాణి రాగంలో సాగిన పట్టాభి రామయ్య జావళీ విలోమ చాపులో (4+3) ఉండడం అరుదైన ఉదాహరణ.

డా॥ వి. ఎస్. సంపత్ కుమార్ ఆచార్య

“ఆది, రూపక, చాపు తాళాలలో జావళీలు గలవు” – “కర్ణాటక సంగీత పారిభాషిక శబ్దకోశం

వై. సత్యనారాయణ

వేగ ప్రధానం కలవి. దేశాది, మధ్యాది తాళాలలో సాధారణంగా జావళీలున్నాయి. ఆది తాళంలో లేవు – Music Academy Journal

గోస్వామి

జావళీ నడక మంద గమనంతో పరవళ్ళు తొక్కుతుంది. – The Story of Indian Music

“గానకళా విశారద” శ్రీ అరిపిరాల సత్యనారాయణ మూర్తి

జావళీలు వేగ గమనముగా ఉంటాయి. – సంగీత శబ్దార్థ చంద్రిక

రీతా రాజన్

కొన్ని మధ్యమ కాలం నడక కలిగినవి, కొన్ని వేగవంతము గాను జావళీలున్నవి. “The Javali form in Carnatic Music” – Music Academy Journal

బి. వి. కె. శాస్త్రి (బెంగళూర్)

జావళీ నడక వేగవంతముగా నుండును. “Kannada JavaLis” – Music Academy Journal

విద్వాన్ ఎన్. చెన్నకేశవయ్య

ఆది, ఏక, రూపక, చాపు, దేశాది తాళాలలో జావళీలు గలవు. “Javlalis in Kannada” – Music Academy Journal

వింజమూరి వరాహ నరసింహాచార్యులు

జావళీలు మధ్యమ కాల తాళ వృత్తములలో నుండును. – కర్ణాటక సంగీత పరిణామము

మంగిపూడి రామలింగ శాస్త్రి

మధ్యమ కాలంలో చక్కని లయలో జావళీలుండును. – భారత సంగీత ఇతిహాసము.

ఎన్. ఆర్. జానకిరాం

జావళీలు సాధారణంగా ఆది, రూపక, చాపు తాళాలలోనే ఉండును. అనేక జావళీలు దేశాది తాళాలలో పాడుటకు వీలుగా ఉంటాయి. పూర్వి కల్యాణి రాగంలో గల “నీ మాట లేమాయెనురా” అను జావళీ విలోమ చాపులో అమర్చబడినది. కొన్ని జావళీలు చౌక కాలంలో నున్నవి. – సంగీత శాస్త్ర సారము

ఉ॥ సఖి ప్రాణ సఖుడు – జంఝూటి

కొన్ని జావళీలు ధృత కాలంలో ఉండును.

రాఘవన్

వేగం జావళీల ప్రత్యేక లక్షణం. జావళీలు అన్ని రక్తి రాగాలలోనూ ఉంటాయి. Preface to Javali’s Book, T. Brinda

నటరాజ రామకృష్ణ

మధ్య లయలో పాడబడే శృంగార రచన జావళీ. ఈ జావళీలు త్వరిత గతిలో నుండును. జావళీ తాళాల విషయంలో వలెనే, జావళీల రాగాల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. రాగాల విషయానికి సంబంధించిన వివరాలు పరిశీలింప తగినవి. – దాక్షిణాత్యుల నాట్య కళా చరిత్ర

ఆరుద్ర

ఇంతవరకున్న రాగాలు కాక, నాటకురంజి, కేదారగౌళ, మాండ్, దేవ మనోహరి, ధన్యాసి, హంసధ్వని, పూరి కల్యాణి వంటి రాగాలలో కూడా జావళీ రచనలు ఉన్నాయి. – Music Academy Journal

ఆరుద్ర గారు పరిశీలించిన 120 జావళీలలో 37 రాగాలు చోటు చేసుకున్నాయి (కానీ 108 జావళీలు – 34 రాగాలు మటుకు లెక్కకు వచ్చాయి.)

  1. ఖమాస్ – 18
  2. హిందుస్థాని కాఫి – 13
  3. బేహాగ్ – 11
  4. సురటి – 9
  5. ఫరజ్ – 8
  6. జంఝురుటి – 6
  7. కేదార గౌళ – 4
  8. నాటకురంజి – 3
  9. తోడి – 3
  10. ఆనంద భైరవి – 2
  11. అఠాణా – 2
  12. హమీర్ కల్యాణి – 2
  13. కల్యాణి – 2
  14. కానడ – 2
  15. ఖరహరప్రియ – 2
  16. ముఖారి – 2
  17. నాదనామక్రియ – 2
  18. సావేరి – 2
  19. బేగడ – 1
  20. భైరవి – 1
  21. బిళహరి – 1
  22. దర్బార్ – 1
  23. దేవమనోహరి – 1
  24. దేశీయ తోడి – 1
  25. ధన్యాసి – 1
  26. హిందోళ – 1
  27. కాంభోజి – 1
  28. మాండ్ – 1
  29. మోహన – 1
  30. పూర్వి కల్యాణి – 1
  31. సింధు భైరవి – 1
  32. వసంత – 1
  33. హంసధ్వని – 1
  34. సైంధవి – 1

జావళీ గతి వేగవంతమని కొందరు, మంద గమనంతో పరవళ్ళు తొక్కుతుందని కొందరూ, మధ్యమ కాలం నడకతో కలసి అందంగా ఉంటుందని మరి కొందరు, తమ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు.

ఇక తాళ విషయాన్ని బట్టి, అన్ని గతులలో, అన్ని నడకలలో, జావళీలు పాడబడుతున్నట్లు అర్థమవుతున్నది. వివిధ జావళీకారుల అభిప్రాయాల్ని పరిశీలించగా, జావళీలు రూపక తాళం లోనే అధికంగా ఉన్నాయనీ, ఆది తాళంలో అసలు లేవనే అభిప్రాయం కనిపిస్తోంది.

కానీ, నా పరిశోధనలో సేకరించిన వాటిలో ఆది తాళంలోనే 177 జావళీలు ఉన్నాయి.

417 జావళీలు పరిశీలించగా 19 రకాల తాళాలలో జావళీలు ఉన్నట్లు స్పష్టమైంది.

ఆది – 177
రూపక – 94
అట – 52
మధ్యాది – 39
ఏక – 29
చాపు – 27
మిశ్ర – 18
మిశ్ర చాపు – 7
త్రిపుట – 6
త్రిశ్ర లఘు – 4
దేశాది – 3
త్రిశ్ర ఏక – 2
జంపె – 2
జూల్వా – 2
త్రిశ్ర గతి – 1
విలోమ చాపు – 1
చతురశ్ర లఘు – 1
ధృవ – 1

ఇంతటి ప్రాధాన్యం ఉండడం వల్లనే, ప్రముఖ సంగీతవేత్త లెందరో జావళీల్ని రచించారు. రాగ తాళాన్వితంగా నాట్యాభినయానికి ఎంతో అవకాశం ఉండడం వల్లనే జావళీలకు నాడు అధిక ప్రాచుర్యం లభించింది.

జావళీలలో ధాతువూ, మాతువూ కూడా తేలిక రచనగా ఉండడం వల్ల సాంప్రదాయికమైన జావళీ మహారాష్ట్ర రాజుల ప్రోత్సాహం వల్ల గానీ, తిరువాన్కోర్ రాజైన స్వాతి తిరునాళ్ ప్రొత్సాహం వల్ల గానీ, వారి వారి ఆస్థానాల నుండి బయలు దేరి లోకం లోకి వచ్చిందని డా॥ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు తన ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర అనే గ్రంథం ప్రథమ సంపుటంలో అభిప్రాయ పడ్డారు. (4)

పొన్నయ్య వడివేలు సోదరులు, స్వాతి తిరునాళ్, ధర్మపురి సుబ్బారావు, తిరుప్పనందాళ్ పట్టాభిరామయ్య, తిరుపతి నారాయణ స్వామి, కరూర్ శివరామయ్య, పుబ్బ అయ్యంగార్, రామ్నాడ్ శ్రీనివాసయ్యంగారు, తచ్చూరి సింగరాచార్య సోదరులు మొదలగు వారు ఈ జావళీల్ని రచించి, విస్తృతమైన ప్రాచుర్యాన్ని కలిగించడానికి కృషి చేశారు.

సంగీత సభలలో నేటికీ కొన్ని జావళీలు ప్రసిద్ధంగా ఉన్నాయి.

“స్మర సుందరాంగుని సరి యెవ్వరే” – ఫరజులో ధర్మపురి సుబ్బారావు రచించిన జావళీ, “అది నీపై మరులు కొన్నదిరా” అనే యమన్ కల్యాణిలో ఉన్న మరో సుబ్బారావు గారి రచన, వీనితో పాటుగా స్వాతి తిరునాళ్ రచించిన “ఇటు సాహసము”, “నిరుపమాన సామిని” అనే జావళీలు సుప్రసిద్ధంగా నిలిచి పోయాయి.

ఈ విధంగా ఇరవయ్యో శతాబ్దంలో రాగ తాళ సమన్వితమై సాహిత్య పుష్టి కల జావళీలు సంగీత సభలలో తగిన ప్రాధాన్యాన్ని వహించి, సంగీత సాహిత్య కళోన్నతికి ఇతోధికారంగా నిలిచిందని చెప్పవచ్చు.