భారతీయాలంకార శాస్త్ర ప్రకారంగా సామాన్య నాయికలు –
- ముగ్ధ
- మధ్య
- ప్రౌఢ మొ॥ సామాన్య నాయికా భేదాలే కాక, కన్య, స్వీయ, అన్యోధ వంటి నాయికా భేదాలు కూడా ఉన్నాయి.
- ముగ్ధ: “నవ నవ కామయవ్యనము, అనాథయు నల్ప రతనంబులు గల్గు నవ్వు విదయె ముగ్ధ” అని భట్టు మూర్తి రచించిన నరసభూపాలీయం పేర్కొంటోంది.
నూత్నమైనటువంటి కామమూ, యవ్వనమూ, అల్పరతిలో మాత్రమే ఆసక్తి కలిగిన లక్షణాలు కల నాయిక ముగ్ధ.
ఈ నాయిక మాటలకు జవాబు చెప్పదు. ఆఆయాస పడితే గానీ చూడదు. కైమోది నొక్కితే తాళలేదు. గాఢాలింగనం ఇవ్వదు. అపారమైన సిగ్గు కలిగిన నాయిక. ఈ లక్షణాలు ముగ్ధా నాయికకు సంబంధించినవి.
- మధ్య: సురత క్రీడలో కొప్పు లోంచి జారి పడిన సమజాలం కలిగి రతాంతంలో సమ లజ్జతో నిమీలితాక్షియై పారవశ్యాన్ని అనుభవిస్తుంది.
- ప్రౌఢ: ఈమె శృంగారాన్ని తన హావభావ విన్యాసాల చేత ప్రదర్శిస్తుంటుంది. మధురాలయిన, విశేషాలయిన, కట్టుదిట్టాలయిన పదజాలాలతో సరస సంభాషణాత్మకమైన మాటల్ని రువ్వుతుంది. చలించేటటువంటి ఉన్నతమైన కుచాల్ని కలిగి, గగుర్పాటును పొందడం, పురుషాయితంతో పారవశ్యాన్ని పొందడం మొదలయిన లక్షణాలు కలది.
ఈ ప్రౌఢ నాయిక మళ్ళీ అంతరంగిక స్వభావ లక్షణాల్ని ఆధారంగా చేసుకొని –
- ప్రౌఢధీర
- ప్రౌఢాధీర
- ప్రౌఢధీరాధీర అని విభజించవచ్చు.
ఈ ధీర, అధీర, ధీరాధీర లక్షణ భేదాలు మధ్య నాయికలో కూడా ఉంటాయి.
- కన్య: వలపు కలిగి రమించక విభ్రాంతిని జెంది ఊరికే ఉండే లక్షణాలు కల నాయిక.
- స్వీయ: హావభావాలతో, విలాస శృంగారాలతో సద్గుణైశ్వరాలతో పురుషుని ఆకర్షించి, నాయిక నాయకునికి ప్రీతిని కలిగించే లక్షణాల్ని కలిగి ఉంటుంది.
ఈ లక్షణాలు జావళీల్లో సందర్భవశంగా కనిపిస్తున్నాయి. జావళీలు ప్రధానంగా శృంగార ప్రాధాన్యంతో కూడి ఉండడం వల్ల నాయికా వర్ణనలలో వివిధ నాయికా లక్షణాల్ని వర్ణనాత్మక విశేషాలతో స్వీకరించి, సంప్రదాయ బద్ధంగా అలంకారిక శాస్త్రానుగుణ్యంగా రచన సాగింది. నాయకుని సమాగమం కోసం పరితపించే నాయికల చేష్టల్ని పరిశీలిస్తే ఈ విషయాలు ద్యోతకమవుతాయి.
ఫరజు – ఆది
ఏమనెనే కోమలీ తెలుపవే
నీతో ఏమనెనే కోమలీ
అంగజు బారికి నిలువ దరమటే
మంగళ వార్తలు మరి యేమి నీతో
మోహ పయోధిలో మునిగితి నికనే
యూహాలు సేయుదు నొకసారి నీతో
దాసు శ్రీరామ కవి గీతా సుధా
దాసుడనైన హరి దయ చేసి నీతో
ఇక్కడ నాయకునిపై తనకు గల గాఢానురక్తిని నాయిక రేఖా మాత్రంగా చెలితో ప్రకటిస్తోంది. పై జావళీలో తన ముగ్ధ మనోహరమైన హృదయాకాంక్షనీ, మోహాతిశయాన్ని తెలియజేస్తోంది.
పూరీ కల్యాణీ – మిశ్ర లఘు
నీ మాట లేమాయెనుర సామి బల్కర
ఏమేమో బోధించి నన్నేమార జేసే వల
చక్కని సామి వలె చెక్కిలి నొక్కి రవ మొక్కెర
నీ కిచ్చేనని టక్కులచే సొక్కించిన
మాటిమాటికి మరు మాటలాడ బిల్చుచు
పాటీలు నే పంపేనని తాటోటముతో నీటిన
జాలము సేసి కలిసేలి రతనాల జువికీల జత
పంపేనన్న తాళవన లోల అల
ఇక్కడ నాయిక స్వామితో సమాగమించి పారవశ్యాన్ని పొందాలనే మధ్యా లక్షణాన్ని ద్యోతకం చేసేలా రచించిన ఈ జావళీ, ఆభరణాసక్తి గల స్త్రీ మనోగతాన్ని వ్యక్తం చేస్తోంది.
అలాగే జంఝూటి రాగంలో, రూపక తాళంలో రచించిన ఈ జావళీ పంక్తుల్ని చూడండి.
మోము మోము గదియ విభుడు
ముద్దు పెట్టినంతలో
భావ యేమొ కాని నేను
పరవశయై యుంటినే
అట్టి విభుడు చన్ను దోయి
బట్ట వచ్చి నంతనే
యెట్టి మాయ యేమె నాదు
హృదయ మైక్య మయ్యెనే (5)
అనే ఈ చరణాల్లో ప్రియాపరి రంభ సౌఖ్యంతో పారవశ్యం చెందిన మధ్యానాయిక కనిపిస్తుంది.
మన్మథ బాధకు తాళలేక, సిగ్గు అని కూడా ఎంత మాత్రమూ భావించకుండా, తన మనసు లోని కామేచ్చను తీర్చుకోవడం కోసం నాయిక పరితపిస్తుంది. ఇది ప్రౌఢ నాయిక లక్షణం.
తగు తగు లేర చిన్న దాన
తాళజాలరా నాతోను పంతమేలరా
యింతైన నిలువలేనురా
నను గరుణింప వేర
న్యాయమరసి చూడరా
నా మీద కోపమేలరా
నీ కేల రవ్వ మానరా
కోమలమగు నాదు వయసు
కోన వెన్నెలాయెరా
నా గుట్టు బయలు బెట్టెరా
నా కోరిక లీడేర్చరా
వేసకాడ ముద్దు సామి
వేణు గోప బాలకా శ్రీ
దాసు రామ పాలకా
నా పాలపంచ సాయకా
అందమైన వయసు అడవి కాచిన వెన్నెలవుతోందని భావిస్తూ కోర్కెల్ని ఈడేర్చమని నాయిక ఇక్కడ నాయకునితో ప్రాధేయపడి వేడుకుంటోంది.
హృదయాంతరాళాల్లో గోప్యంగా ఉన్న కామ వికారాల్ని బయట పెట్టకుండా వలపు తలపులకే పరిమితమై తూష్ణీభావం వహించే నాయికా లక్షణాల్ని ఈ జావళీ ప్రదర్శిస్తోంది.
హిందుస్థానీ – అట
సారసాక్షి నీపై మది చాల మరులుకొన్నదిరా
మారుకేళి కూడ రాక మర్మకుల సింధుధీర
కన్నె నీదు వన్నె చిన్నె లన్ని చూచి వలచి మది
యున్న దాని నెనగు బూనకున్న నోర్వజాలదురా
మగువ బొమలు మరుని యిల్లు మధుర వాణి పాలిండ్లు
సొగసు మీరిన పూల చళ్ళు తను జాణర నీకు జెల్లు
వసుధ వెలయు శ్రీ పీఠి వంశోదధి సుధాకర
రసికుడౌ దాని చేకోర రాఘవాచార్య సుధీరా (6)
ప్రియుని గుణగణాలకు ఆకర్షితురాలైన నాయిక తన రూప లావణ్యాలతో ప్రియుని ఆనందపరచాలనే అకాంక్ష కలిగి, ప్రియుని ప్రీతిని పొందే నాయిక స్వీయ. ఈ లక్షణాలు కల ఈ జావళీని చూడండి.
అఠాణ – చాపు
ముద్దుముద్దుగ పిలువనా నా సామిని
ముదుగ ముదుగ పిలువనా నా సామిని
ముద్దుముద్దుగ పిలువ చులకన సేయునేమో
ముదుగు ముదుగు పిలువ బాగని తోచెనే
పాటలు పాడుదునా మంచి ఆటలు ఆడుదునా
దాటమైన గుబ్బ పోటు జాలాడింతునా
గోటి కొన చెక్కిలి మీటుదునా
ఆకు మడుపులిత్తునా మంచి తామి అత్తరుపై బూతునా
తేకువతో జడ త్రిప్పి కొట్టుదునా
మోకమాది చిగురు మోవి గరతునా
కోపగించకు మందునా యేర
వేణు గోపాల రమ్మందునా
శ్రీపూర్ణమగు దాసు శ్రీరాము మనమున ప్రాపై
నివసించి పాలించమందునా
సంభాషణలలో, ఆలోచనలలో, అంతరంగంలో, రూప లావణ్యాదులలో, భావ చేష్టాదులలో, అందంగా ఒలికిస్తూ నాయికలు నాయకుని ఎడల గాఢమైన ప్రేమారక్తిని ప్రదర్శించడాన్ని వర్ణించడమే జావళీల ఆంతర్యం.
ఇలా ఉన్న నాయికలకు సరి సమానంగా సరి జోడున రీతిలో నాయక వర్ణన కూడా కనిపిస్తోంది. స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ నాయక గుణగణాల్ని నాయిక విరహంతో ఆలోచించే తీరులో జావళీకర్తలు నాయక భేదాల్ని, ఆ లక్షణాల్ని, ఈ జావళీలలో పొందు పరిచారు. ఆ లక్షణాల్ని సమన్వయాత్మంగా పరిశోధిస్తే ఆ విషయం ఆవిహ్కృతమౌతుంది.